హఠాత్తుగా ‘అమీర్’ను చేశారు..!
‘ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐసిస్) తరఫున పని చేయాలనే ఆసక్తి ఉంది. అందుకే ఇబ్రహీంతో కలిసి ముఠాలో చేరా. అయితే నేను చేసిందేమీ లేదు’ అంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారుల విచారణలో నైమతుల్లా హుస్సేనీ అలియాస్ యాసిర్ వెల్లడించాడు. కోర్టు అనుమతితో వారం క్రితం కస్టడీలోకి తీసుకున్న నలుగురు ఉగ్రవాదుల్నీ ఎన్‌ఐఏ మంగళవారం నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచింది.
హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ఐసిస్ అనుబంధ సంస్థ ‘జుందుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ అల్ హింద్’ (జేకేబీహెచ్) మాడ్యుల్ కుట్రను ఎన్‌ఐఏ అధికారులు గత నెల 29న భగ్నం చేసి, రెండు దఫాల్లో ఏడుగురిని అరెస్టు చేసిన విషయం విదితమే. వీరిలో మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, మహ్మద్ ఇలియాస్ యజ్దానీలతో పాటు సయ్యద్ నైమతుల్లా హుస్సేనీ అలియాస్ యాసిర్, మహ్మద్ అథ ఉర్ రెహ్మాన్‌లను కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఇబ్రహీం తన ఇంట్లో అథ ఉర్ రెహ్మాన్ ద్వారా నిర్వహించిన అరబిక్ క్లాసులకు హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో ఇతడికి ఇబ్రహీంతో పరిచయం ఏర్పడింది.
ఉగ్రవాద భావజాలం ఉండటంతో జేకేబీహెచ్ మాడ్యుల్‌లో చేరాడు. హ్యాండ్లర్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ విధ్వంసాలకు కుట్రపన్నుతున్నామని ఇబ్రహీం చెప్పాడని, అప్పటికే ఆసక్తి ఉండటంతో కలిసి పని చేయడానికి అంగీకరించారని ఎన్‌ఐఏ ఎదుట చెప్పుకొచ్చాడు. తాము తరచుగా సమావేశమయ్యే వారమని, ఓ రోజు హఠాత్తుగా మాడ్యుల్ చీఫ్‌గా (అమీర్) ప్రకటించారని వివరించాడు. నాందేడ్, అజ్మీర్, అనంతపురం సహా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన విషయాన్ని ఆ తర్వాతే తనకు చెప్పారని, నిధుల సమీకరణలో మాత్రం కీలకపాత్ర పోషించానని వెల్లడించాడు.
అత్యంత వేగంగా విస్తరించింది: ఎన్‌ఐఏ
ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన ఈ మాడ్యుల్ అత్యంత వేగంగా విస్తరించిందని ఎన్‌ఐఏ నిర్థారించింది. అంతా కలిసి ఓ ముఠాగా ఏర్పడిన ఆరు నెలల్లోనే హోదాలు ఇచ్చుకోవడం, పేలుడు పదర్థాలు, ఆయుధాల సమీకరణతో పాటు టార్గెట్ల ఎంపిక, రెక్కీల వరకు చకచకా చేసుకుపోయిందని ఆధారాలు సేకరించింది. దీని గుట్టు రట్టు చేయకపోయి ఉంటే భారీ విధ్వంసాలకు దిగేదని, మాడ్యుల్‌లోని సభ్యులందరూ అదే భావజాలం, మానసిక స్థితిలో ఉన్నారని అధికారులు చెప్తున్నారు.
గత మంగళవారం కస్టడీలోకి తీసుకున్న మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, ఇతడి సోదరుడు మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, రెహ్మాన్, యాసిర్‌ల కస్టడీకి గడువు ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీరిలో రెహ్మాన్ నుంచి అదనపు సమాచారం రాబట్టాల్సి ఉండటంతో కస్టడీ పొడిగించాల్సిందిగా కోరారు.
దీనికి అంగీకరించిన కోర్టు రెహ్మాన్‌ను మరో వారం ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ, మిగిలిన ముగ్గురికీ జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెహ్మాన్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఏ (ఇంగ్లీష్) పూర్తి చేశాడు. ఆ భాష పైనా పట్టు ఉండటంతో స్థానికంగా ఇంగ్లీషు ట్యూషన్లు చెప్పడంతో పాటు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని భావించే వారికి నిర్వహించే ‘టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫారెన్ లాంగ్వెజ్’ (టోఫెల్) పరీక్షలపై విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేవాడు. గత ఏడాది ఇబ్రహీం ఇంట్లో అరబిక్ క్లాసులు చెప్పడానికి వచ్చిన నేపథ్యంలో అతడితో పరిచయమైంది.