బాబు, కేసీఆర్ విలువల్ని పతనం చేశారు
వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు నల్లా సూర్యప్రకాశ్
శాలిగౌరారం: ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ కలసి రాజకీయ విలువలను పూర్తిగా పతనం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం అంబారిపేటలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. రాజకీయ స్వార్థం కోసం ప్రతిపక్షం లేకుండా చేసేందుకు దిగజారుడుతనానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాప్రతినిధులు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా పార్టీలు మారడం సరికాదని, పదవికి, పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీలలో చేరాలన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానని హామీ ఇచ్చారని, అధికారం చేతికందగానే ఆ హామీని విస్మరించారన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు మూడు ఎకరాల భూమి పంపిణీ, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం తదితర పథకాలపై ఆచరణ తక్కువ.. ప్రచారం ఎక్కువ అన్న చందంగా మారిందన్నారు. పాలేరు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ స్వార్ధ రాజకీయాన్ని తిప్పికొట్టి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని గెలిపించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని పాలేరు ప్రజలకు పిలుపునిచ్చారు.