– జిల్లా కలెక్టర్ విజయమోహన్
– పట్టణంలో విస్తృతంగా పర్యటన
నంద్యాల: పట్టణాన్ని నందనవనం చేస్తామని జిల్లా కలెక్టర్ విజయమోహన్ చెప్పారు. శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని, ప్రజలు సహకరించాలని కోరారు. రోడ్లపై ఆటోలు, బైక్‌లు ఉన్నాయని, దీని వల్ల ట్రాఫిక్ స్తంభిస్తోందన్నారు. ఆర్‌టీఓ, ఆర్‌డీఓ, కమిషనర్, పోలీస్ అధికారులు తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై తోపుడు బండ్లను తొలగించి, వారికి ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని చూపించాలన్నారు.
టీపీఓపై ఆగ్రహం...
పట్టణంలో రోడ్లు ఆక్రమించి తోపుడుబండ్లు, బంకులు కళ్లెదుటే కనపడుతున్న టౌన్‌ప్లానింగ్ అధికారి సామాన్యుడిలా పట్టించుకోకుండా ఉన్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్రమణలను తొలగించాలనే బాధ్యతను విస్మరించారని, ఇప్పుడైనా బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే చర్యలు తప్పవన్నారు.
ప్రణాళిక బద్ధంగా రోడ్ల విస్తరణ...
పట్టణంలో రోడ్ల విస్తరణను ప్రణాళిక బద్ధంగా నిర్వహిస్తామని, కలెక్టర్ విజయమోహన్ చెప్పారు. వెంటనే సర్వే చేయించి నివేదికను పంపాలని, అవసరమైతే మండల స్థాయిలో ఉన్న సర్వేయర్ల సహాయాన్ని తీసుకోవాలన్నారు. టూరిజం శాఖ అధికారులు సరైన నివేదికలతో రాకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగమేశ్వరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తిగా ఉన్నారని, కాని పర్యాటక శాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారని అన్నారు.
కలెక్టర్ విస్తృత పర్యటన...
జిల్లా కలెక్టర్ విజయమోహన్, ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్ ఉదయం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ నుండి బయల్దేరి పెద్దకొట్టాల చేరుకొని బైపాస్ రోడ్డు నిర్మాణం ప్లాన్‌ను పరిశీలించారు. తర్వాత చిన్న చెరువు కట్టను ఆధునీకరించే ప్రతిపాదనను పరిశీలించి, గాంధీచౌక్ సందర్శించి ఇరుకైన రోడ్లను చూశారు. అక్కడి నుంచి ఎస్‌బీఐ కాలనీ, శ్యాంనగర్ ప్రాంతాలను సందర్శించి శ్యామకాల్వపై ఉన్న వంతెనలను పరిశీలించారు. పర్యటనలో వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్, ఆర్‌డీఓ సుధాకర్‌రెడ్డి, కమిషనర్ విజయభాస్కరనాయుడు, తహసీల్దార్ శివరామిరెడ్డి, హౌసింగ్ ఈఈ సుధాకర్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ సుబ్బారెడ్డి, కౌన్సిలర్లు శివశంకర్, కొండారెడ్డి, కృపాకర్, ముర్తుజా, దిలీప్‌కుమార్‌లు పాల్గొన్నారు.