తప్పు ఒకరిది.. శిక్ష మరొకరికా..
తప్పు ఒకరిది.. శిక్ష మరొకరికా..
Published Thu, May 11 2017 11:45 PM | Last Updated on Fri, Jun 1 2018 7:37 PM
ఎనలిటికల్ స్కిల్ పరీక్ష రద్దు చేసిన నన్నయఅధికారులు
29న తిరిగి నిర్వహిస్తామని ప్రకటన
ఫీజు చెల్లించాలనడంపై మండిపడుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఈనెల ఒకటిన నిర్వహించిన ఎనలిటికల్ స్కిల్స్ కోర్సుకు సంబంధించిన పరీక్ష రద్దయ్యింది. మోడల్ పేపర్ మారడమే దీనికి కారణమంటూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ టి. మురళీధర్ ప్రకటించారు. అంతేకాదు ఆ పరీక్ష రాసే ప్రతి విద్యార్థి రూ.250 చెల్లించాలనడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఎనలిటికల్ స్కిల్స్ కోర్సుకు సంబంధించిన పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో (మల్టీపుల్ ఛాయిస్) నిర్వహించాల్సి ఉండగా పొరపాటున ప్రశ్నకు జవాబు ఇచ్చే విధానంలో నిర్వహించారు. దీంతో ఎక్కువ శాతం మంది విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఈ పరీక్షను రద్దు చేసి, మరలా నిర్వహించాలని విజ్ఞప్తి చేశాయి. చివరకు వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న యూనివర్సిటీ అధికారులు ఆ పరీక్షను రద్దు చేస్తూ తిరిగి ఈనెల 29న నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. తిరిగి నిర్వహించే పరీక్షకు సంబంధించి ప్రతి విద్యార్థి రూ. 250 ఫీజు చెల్లించాలనడం వివాదాస్పదమవుతోంది. ఒకటిన నిర్వహించిన పరీక్షను ఎందుకు రద్దు చేశారు? దానికి గల కారణాలేంటి? అనే విషయాన్ని పరిశీలిస్తే యూనివర్సిటీతోపాటు కళాశాలల యాజమాన్యాలూ అందుకు బాధ్యులే అవుతారు. అయితే విద్యార్థుల తప్పిదం ఏమిటని వారి తల్లిదండ్రులు, పలువురు అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థిపై ఆర్థిక భారం(రూ.250 ఫీజు) మోపడం ఏ మేరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు.
విద్యార్థులపై పరీక్ష రద్దు భారం తగదు
ఎనలిటికల్ స్కిల్స్ కోర్సుకు సంబంధించిన పరీక్షను రద్దు చేసిన ఆదికవి నన్నయ యూనివర్సిటీయే తిరిగి పరీక్ష నిర్వహించాలి. కానీ ఆ భారాన్ని విద్యార్థులపై మోపుతూ ఒక్కొక్కరి నుంచి రూ.250 ఫీజు వసూలు చేయడం భావ్యంగా లేదు.
–ఎస్. ఉదయ్‌ప్రకాష్‌రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ, వీఎస్ డిగ్రీ కాలేజ్, కాకినాడ
విద్యార్థులకు చేసే మేలు ఇదేనా ?
నన్నయ యూనివర్సిటీ విద్యార్థుల ప్రగతికి, వారి అభ్యున్నతికి తోడ్పాటునందిస్తుందని పదేపదే చెబుతుంటారు. ఎనలిటికల్ స్కిల్స్ పరీక్షను ముందు చెప్పిన మోడల్‌లో నిర్వహించకుండా తప్పుచేసి, ఇప్పుడు మరోసారి నిర్వహిస్తామంటూ, అందుకు ప్రత్యేక ఫీజు చెల్లించాలనడం సరికాదు. ఇదేనా విద్యార్థులకు చేసే మేలు.
–అడపా కొండబాబు, బిఎస్సీ విద్యార్థి, కాకినాడ
Advertisement