nannaya
-
అంకిత భావం
అంకము అంటే గుర్తు, ముద్ర. అంకితం అంటే గుర్తు, లేక ముద్ర కలిగినది. తమ పని ఏదైనా ఏ విధంగా గుర్తించబడాలో సూచించే గుర్తును చెప్పటం అంకితం. మన కవులు అందరు తమ కావ్యాలను అంకితం చేశారు. రచన తమది అయినా ఆ రచనను చదివే వారికి మరొకరు మనసులో మెదులుతారు. అది తమ ఇష్టదైవం కావచ్చు. ఆదరించిన రాజో, మిత్రుడో, ఆత్మీయులో కావచ్చు. అది మరెవరి గుర్తింపు కొరకో తాము చేసే కృషి అని చెప్పటం. కావ్య అవతారికలోనే చెప్పటం సంప్రదాయం. ఆదికవి నన్నయ ఈ ఒరవడి ప్రారంభించినట్టు కనపడుతుంది. తన సహాధ్యాయి, రాజు, పోషకుడు అయిన రాజరాజ నరేంద్రుడి కోరిక మీద ఆయనకి అంకితంగా భారతసంహితా రచనా ధురంధురుడయ్యాడు. ఈ అంకితం కారణంగానే తిక్కనామాత్యులవారు అరణ్యపర్వశేషాన్ని స్పృశించలేదని కొండరు సాహిత్యవిమర్శకుల అభిప్రాయం. నన్నయభట్టు నరాంకితంగా చేసిన దానిలో మిగిలిన భాగాన్ని దైవానికి అంకితం ఇవ్వటం ఇష్టం లేక విరాటపర్వం నుండి ప్రారంభించి ఉంటారని భావన. పైగా ఆయనకి హరిహరనాథుడు స్వప్నంలో కనపడి ఆదేశించాడు కూడా. పోతనామాత్యుల వారి అంకితం కించిత్ ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. శివధ్యానం చేస్తున్న పోతనకి శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చి కృష్ణకథ ప్రధానంగా ఉన్న భాగవతాన్ని తనకి అంకితంగా రచించమని కోరాడు. వాగ్గేయకారులు తమ కీర్తనలలో ప్రతిదానిలోనూ తమ ఇష్టదైవం నామాన్ని గాని ఒక ప్రత్యేకమైన పదాన్ని గాని గుర్తుగా పేర్కొంటారు. దానిని ముద్ర అంటారు. కీర్తనలు వేటికి అవి విడిగా ఉంటాయి. కావ్యంలో లాగా అవతారికలో ఒకసారి పేర్కొంటే సరిపోదు కదా! అందుకని ప్రతి కృతిలోనూ ముద్ర తప్పనిసరి. త్యాగరాజ కృతులలో ప్రతి దానిలోనూ త్యాగరాజనుత అనే ముద్ర కనపడుతుంది. శ్యామశాస్త్రివారి కీర్తనలలో శ్యామకృష్ణ అని, ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తనలలో గురుగుహ అనే ముద్రలు దర్శనమిస్తాయి. ఆ ముద్ర చూడగానే అది ఎవరి రచన అన్నది తెలిసిపోతుంది. నిజానికి వారు మనకి తేలికగా తెలియటం కోసం పెట్టలేదు ముద్రలని. ఆ ముద్ర తనకి, ఎవరిని గురించి పాడుతున్నారో వారికి గుర్తింపు. వాచస్పతి మిశ్రుడు తన రచనకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించకుండా సహకరించిన, అప్పటివరకు ముఖమైనా చూడని ధర్మపత్ని ‘భామతి’ పేరుని తన గ్రంథనామంగా ఉంచాడు. తమకు ఉన్న ప్రేమాభిమానాలను వ్యక్తపరచటానికి రచనాదికాలు చేయలేక పోయినా, తాము చేసిన ఏ ఘనకార్యమైనా అంకితం చేస్తూ ఉంటారు. అందరు ఏదో ఒక ఘనకార్యం చేసి అంకితం ఇవ్వలేక పోవచ్చు. వారు తమ జీవితాన్నే అంకితం చేయటం మనం గమనించ వచ్చు.‘‘నా జీవితం నీకే అంకితం..’’ అంటూ పాడిన పాటలు ఉదాహరణలు. అంటే, తన అస్తిత్వానికి ఒక గుర్తింపు అవసరం లేదు, అస్తిత్వంతో సహా అంతా సమర్పణమే ఇష్టదైవానికో, ఇష్టమైన వ్యక్తికో. చివరికి ఈ అంకిత ప్రక్రియ ఏ స్థాయికి చేరింది అంటే, ఆకాశవాణిలో గాని, దృశ్యశ్రవణ ప్రసార మాధ్యమాలలో గాని ఇష్టమైన పాటలని వేయించి, వాటిని అంకితం చేస్తున్నారు. వీరజవానులు తమ జీవితాలను దేశరక్షణకు అంకితం చేస్తారు. కొందరు దైవానికి తమ జీవితాలని అంకితం చేస్తారు. తన ఉనికి కోసం, గుర్తింపు కోసం తాపత్రయ పడకుండా మరెవరి గుర్తింపుకో నిస్వార్థంగా చేయటం అంకితం. కావ్యాలు, కీర్తనలు మాత్రమే కాదు ఏ సృజనాత్మక సృష్టి అయినా తన గుర్తింపు కోసం కాక ఇతరులకు గుర్తింపు కలగటం కోసం చేసినప్పుడు ఆ ప్రక్రియని అంకితం అంటారు. ఉదాహరణకి నన్నయభట్టు భారతాన్ని ఆంధ్రీకరించాడు. ఆయన పేరుతో పాటు అంకితం పుచ్చుకున్న రాజరాజనరేంద్రుడి పేరు కూడా చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. రాజుగా కన్న ఆంధ్రమహాభారతాన్ని అంకితం పుచ్చుకున్నవాడిగా గుర్తింపు అధికం. శ్రీనాథ కవిసార్వభౌముడి పేరు నిలిచి ఉన్నంత కాలం వీరారెడ్డి, అవచి తిప్పయ్య శెట్టి, పెదకోమటి వేమారెడ్డి మొదలైన వారందరి పేర్లు శాశ్వతం. రచనలు చేయలేదు కాని, కావ్యాలు అంకితం పుచ్చుకున్నారు కనక, ఆ కావ్యాలు ఆదరించబడినంత కాలం వారి పేరు చిరస్థాయిగా ఉంటుంది. – డా. ఎన్. అనంతలక్ష్మి -
తప్పు ఒకరిది.. శిక్ష మరొకరికా..
ఎనలిటికల్ స్కిల్ పరీక్ష రద్దు చేసిన నన్నయఅధికారులు 29న తిరిగి నిర్వహిస్తామని ప్రకటన ఫీజు చెల్లించాలనడంపై మండిపడుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఈనెల ఒకటిన నిర్వహించిన ఎనలిటికల్ స్కిల్స్ కోర్సుకు సంబంధించిన పరీక్ష రద్దయ్యింది. మోడల్ పేపర్ మారడమే దీనికి కారణమంటూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ టి. మురళీధర్ ప్రకటించారు. అంతేకాదు ఆ పరీక్ష రాసే ప్రతి విద్యార్థి రూ.250 చెల్లించాలనడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎనలిటికల్ స్కిల్స్ కోర్సుకు సంబంధించిన పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో (మల్టీపుల్ ఛాయిస్) నిర్వహించాల్సి ఉండగా పొరపాటున ప్రశ్నకు జవాబు ఇచ్చే విధానంలో నిర్వహించారు. దీంతో ఎక్కువ శాతం మంది విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఈ పరీక్షను రద్దు చేసి, మరలా నిర్వహించాలని విజ్ఞప్తి చేశాయి. చివరకు వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న యూనివర్సిటీ అధికారులు ఆ పరీక్షను రద్దు చేస్తూ తిరిగి ఈనెల 29న నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. తిరిగి నిర్వహించే పరీక్షకు సంబంధించి ప్రతి విద్యార్థి రూ. 250 ఫీజు చెల్లించాలనడం వివాదాస్పదమవుతోంది. ఒకటిన నిర్వహించిన పరీక్షను ఎందుకు రద్దు చేశారు? దానికి గల కారణాలేంటి? అనే విషయాన్ని పరిశీలిస్తే యూనివర్సిటీతోపాటు కళాశాలల యాజమాన్యాలూ అందుకు బాధ్యులే అవుతారు. అయితే విద్యార్థుల తప్పిదం ఏమిటని వారి తల్లిదండ్రులు, పలువురు అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థిపై ఆర్థిక భారం(రూ.250 ఫీజు) మోపడం ఏ మేరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులపై పరీక్ష రద్దు భారం తగదు ఎనలిటికల్ స్కిల్స్ కోర్సుకు సంబంధించిన పరీక్షను రద్దు చేసిన ఆదికవి నన్నయ యూనివర్సిటీయే తిరిగి పరీక్ష నిర్వహించాలి. కానీ ఆ భారాన్ని విద్యార్థులపై మోపుతూ ఒక్కొక్కరి నుంచి రూ.250 ఫీజు వసూలు చేయడం భావ్యంగా లేదు. –ఎస్. ఉదయ్ప్రకాష్రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ, వీఎస్ డిగ్రీ కాలేజ్, కాకినాడ విద్యార్థులకు చేసే మేలు ఇదేనా ? నన్నయ యూనివర్సిటీ విద్యార్థుల ప్రగతికి, వారి అభ్యున్నతికి తోడ్పాటునందిస్తుందని పదేపదే చెబుతుంటారు. ఎనలిటికల్ స్కిల్స్ పరీక్షను ముందు చెప్పిన మోడల్లో నిర్వహించకుండా తప్పుచేసి, ఇప్పుడు మరోసారి నిర్వహిస్తామంటూ, అందుకు ప్రత్యేక ఫీజు చెల్లించాలనడం సరికాదు. ఇదేనా విద్యార్థులకు చేసే మేలు. –అడపా కొండబాబు, బిఎస్సీ విద్యార్థి, కాకినాడ -
నన్నయ రిజిస్ట్రార్ రాజీనామా
- ‘నన్నయ’ యూనివర్సిటీలో కళకలం సృష్టిస్తున్న ఆటోమేషన్ టెండర్ - వీసీకి రిజిస్ట్రార్‌కి మధ్య పెరుగుతున్న అంతరం - రిజిస్ట్రార్‌పై చర్యకు దళిత ఉద్యోగుల డిమాండ్ - రాజీనామా చేసిన రిజిస్ట్రార్ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టనున్న ‘ఆటోమేషన్ టెండర్’ ఘటన చినికి చినికి గాలివానగా మారి చివరకు రిజిస్ట్రార్ తన పదవికి రాజీనామా చేసే వరకూ దారితీసింది. యూనివర్సిటీలో విద్యార్థుల పరీక్షలకు సంబంధించి ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ‘ఆటోమేషన్’ విధానాన్ని తీసుకువచ్చేందుకు టెండర్లు పిలవడం, మూడు కంపెనీలు దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. ఈ టెండర్లు ఖరారు విషయమై వీసీకి, రిజిస్టార్‌కి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వీసీ చర్యలను సమర్థిస్తూ ఆటోమేషన్ విధానంపై ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాలేదంటూ ఇటీవల యూనివర్సిటీ ఇద్దరు డీన్స్, ప్రిన్సిపాళ్లు ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపణలను ఖడించారు కూడా. అయినా సమస్య సద్దుమణగలేదు. వీసీ, రిజిస్ట్రార్లు ఎడమెహం, పెడమెహం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రిజస్ట్రార్పై ఫిర్యాదు... గురువారం కొంతమంది దళిత ఉద్యోగులు తమ పట్ల రిజిస్ట్రార్ కులవివక్షత చూపిస్తున్నారని, ఆయన పై చర్య తీసుకోవాలంటూ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలు నాయుడికి నేరుగా ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు తాళ్లూరి బాబురాజేంద్రప్రసాద్, బీసీ ప్రజాసంక్షేమ సంఘం అధ్యక్షుడు మేరపురెడ్డి రామకృష్ణ, రాష్ట్ర ఎస్టీ సంఘం అధ్యక్షుడు కె. నారాయణరావు, రాష్ట్ర ప్రజాసంక్షేమ యువజన సంఘం అధ్యక్షుడు మహ్మద్ ఖాసీం, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ, బీసీ సంఘాల అధ్యక్షుడు పిచ్చుక అనిల్‌కుమార్, దళిత నాయకులు అజ్జరపు వాసు తదితరులు 48 గంటల్లోగా ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనస్థాపంతోనే రాజీనామా విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహరావు తనపై కులముద్ర పడటాన్ని జీర్ణించుకోలేకపోయారు. మనస్థాపంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా గురువారం సాయంత్రం ప్రకటించారు. తాను చదివింది నోబుల్ కాలేజీలోనని, అక్కడ ఎక్కువ శాతం మంది దళితులేనని, వారే తనకు స్నేహితులన్నారు. ఇంతకాలం వారందరి మిత్రత్వంలో ముందుకు వెళ్లిన తనపై కులముద్ర వేయడం తట్టుకోలేకనే రాజీనామా చేస్తున్నానన్నారు. అందరినీ నా వారిగా చూసే తనపై దళిత వ్యతిరేకిననే ముద్ర వేయడాన్ని మానసికంగా తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఈ ఘటన మున్ముందు ఎంతవరకు దారితీస్తుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
‘నన్నయ’ డిగ్రీ ఫైనలియర్ ఫలితాలు విడుదల
-53.59 శాతం ఉత్తీర్ణత రాజానగరం : ఆదికవి నన్నయ యూనివర్సిటీ డిగ్రీ ఫైనలియర్ ఫలితాలను ఉపకులపతి ఆచార్య ఎం. \ముత్యాలునాయుడు బుధవారం విడుదల చేశారు. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని కళాశాలల నుంచి 20,397 మంది విద్యార్థులు పరీక్షలకు హజరుకాగా, వారిలో 10,930 మంది ఉత్తీర్ణులయ్యారు. 53.59 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది సాధించిన 48.64 శాతం ఉత్తీర్ణత కంటే అధికంగా ఫలితాలను సాధించడానికి కారకులైన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని వీసీ అభినందించారు. సమాజానికి ఉత్తమ విద్యార్థులను అందించడమే లక్ష్యంగా తమ యూనివర్సిటీ ముందంజ వేస్తుందన్నారు. మొదటి మూడు స్థానాలు పొందిన విద్యార్థులు : సబ్జెక్టుల వారీగా మొదటి మూడు స్థానాలను అందుకున్న విద్యార్థుల వివరాలను కూడా వీసీ ప్రకటించారు. బీఏ : నీలపు లీలాభవాని, బొచ్చ జానకి, యర్రా మంజుల. బీ ఏ (ఫిలాసఫీ) : పొలిశెట్టి బాలసంతోషి, మద్దాల రవి, సి.పౌలు, బీఎస్సీ : నంబూరి సాయినాగలక్ష్మిప్రసన్న, సూతపల్లి సాయిసుధ, ముత్యాల జయశ్రీ, బీఎస్సీ (హోమ్ సైన్స్) : చల్లా దుర్గాభవాని, అంకంరెడ్డి చంద్రిక, ఉండ్రాజవరపు ప్రియాంక. బీఎస్సీ (ఫుడ్‌టెక్నాలజీ): యు.పావని, కేఎస్ఎస్ హారిక, పరమట దుర్గాతేజస్వి బీకాం : నున్నా రత్నం శిరీషా, రాయి వాసవి, బలభద్రుని ప్రత్యూష. బీకాం (ఒకేషనల్) : సోమిశెట్టి నిఖిల, తణుకు కల్యాణì పద్మనాగరాణి, విద్యాల కృష్ణకుమారి. బీఏఏ : అడుసుమిల్లి మహేశ్వరి, ఏలిశెట్టి అఖిల, తమ్మన అజయ్‌కుమార్. బీవీఎం : మేడపాటి మౌనిక, రుషాలి జైన్, పుల్లేపు సౌజన్యకుమారి. -
నన్నయ సెట్ ఫలితాల విడుదల
- 48 గంటలలోపే ఫలితాలు వెల్లడి - విద్యార్థినుల హవా రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశానికి ఆదికవి నన్నయ యూనివర్సిటీ నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (నన్నయ సెట్) 2017 ఫలితాలను శనివారం విడుదల చేశారు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను కేవలం 48 గంటలలోపే విడుదల చేశామని ఉప కులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు చెప్పారు. ఇది సమష్టి కృషి ఫలితమని పేర్కొంటూ, అందుకు కారకులైన ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఈ పరీక్షలకు విశాఖపట్నంతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసుకున్న 5606 మందిలో 5051 మంది నన్నయ సెట్‌కు హాజరు కాగా వారిలో ఎక్కువమంది విద్యార్థినులే కావడం విశేషమని వీసీ అన్నారు. ఫలితాల్లో కూడా వారి హవా కొనసాగిందన్నారు. ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించిన ర్యాంకులను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని, వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ నెల 16 నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లోని ఆదిత్య కళాశాలలు, ఏలూరులోని సెయింట్ థెరీస్సా కళాశాల, భీమవరంలోని సీఎస్ఎస్ కళాశాల, అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాలల్లో సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్ జరుగుతాయన్నారు. ఎప్పటికప్పుడు యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి వివరాలు తెలుసుకోవచ్చని వీసీ చెప్పారు. నన్నయ సెట్లో సబ్జెక్టుల వారీగా మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలు వరుసగా.. లైఫ్ సైన్స్ : గొల్లపల్లి విజయదుర్గ (వాకతిప్ప) 65 మార్కులు, కాదులూరి పూర్ణశ్రీప్రజ్ఞ్ఞ (ఇసుకపల్లి) 64 మార్కులు, కుసుమ హేమశ్రీ (ముక్కామల) 63 మార్కులు. ఫిజికల్ సైన్స్ : కూచుభొట్ల మహతి (జగ్గయ్యపేట) 74 మార్కులు, నిడదవోలు వెంకట ఆనంద్ (మండపేట) 73 మార్కులు, వంగపండు అనూష (విశాఖపట్నం) 65 మార్కులు. మేథమెటికల్ సైన్స్ : కీర్తి కనకకృష్ణ (తుని) 90 మార్కులు, నందికొట్ల వీరకనకదుర్గ (అంబాజీపేట) 90 మార్కులు, చింతలపూడి హేమ (బిక్కవోలు) 86 మార్కులు. కెమికల్ సైన్స్ : సబ్బారపు రమ్య (రాజమహేంద్రవరం) 88 మార్కులు, మహాదశ లక్ష్మీమేఘన (పాలకొల్లు) 84 మార్కులు, గుండుగొల్లు మోహన వెంకట ఏఆర్‌సీహెచ్ (రాజమహేంద్రవరం) 80 మార్కులు. జియాలజీ : బొర్రా నరేష్ (రాజమహేంద్రవరం) 54 మార్కులు, తాడికొండ సాయి ఉమామహేశ్వరరావు (తాడేపల్లిగూడెం) 54 మార్కులు, జుట్రు హెప్సీ (జువ్వలపాలెం) 48 మార్కులు. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ : మేడపోతుల తమ్మన (జగ్గంపేట) 75 మార్కులు, కొల్లి శ్రీనివాసమహాదేవ (రాజమహేంద్రవరం) 75 మార్కులు, బొరుసు సాల్మన్‌బాబు (కాకినాడ) 72 మార్కులు. ఇంగ్లిష్ : మేడవరపు సీతారామ కనక సుబ్రహ్మణ్యం (మండపేట) 88 మార్కులు, నందేటి అజయ్‌ఘోష్ (నూజివీడు) 85 మార్కులు, దేవరపల్లి నీహారిక (టి.నర్సాపురం) 85 మార్కులు. తెలుగు : దేవరకొండ ప్రవీణ్‌కుమార్ (విశాఖపట్నం) 67 మార్కులు, ఉపాధ్యాయుల ఎన్.శాస్త్రి (విజయనగరం) 66 మార్కులు, చాపల వెంకట్రాజు (కొవ్వూరు) 61 మార్కులు. -
వీసీగా నాలుగు లక్ష్యాలను ఎంచుకున్నా
మూడు పూర్తయ్యాయి అనూర్ వార్షికోత్సవ సభలో వీసీ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన నాడే నాలుగు లక్ష్యాలను ఎంచుకున్నట్టు ఆచార్య ఎం. ముత్యాలునాయుడు తెలిపారు. వాటిని సాధించడంలో నన్నయ యూనివర్సిటీ సిబ్బంది అంతా ఒకే కుటుంబంలా త్రికరణశుద్ధితో పనిచేశారంటూ అభినందించారు. యూనివర్సిటీ ఆవిర్భావ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా వీసీ మాట్లాడుతూ నాలుగు లక్ష్యాలలో మొదటిది తెలుగు రాష్ట్రాలలోనే అతిపెద్ద యూనివర్సిటీగా అనూర్ అందరికీ తెలిసేలా చేయడం, రెండోది యూనివర్సిటీకి నిధులు సమీకరించడం, మూడోది అనూర్ పరిధిలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ కళాశాలలను బదిలీ చేయడం అని తెలిపారు. ఈ మూడు లక్షా ్యలు పూర్తయ్యాయన్నారు. నాల్గో లక్ష్యంగా ఎంచుకున్న 12 బీ గుర్తింపు కోసం ప్రయత్నించామని, గురు, శుక్రవారాలలో యూజీసీ కమిటీ సభ్యులు కూడా ఇక్కడకు వచ్చి, యూనివర్సిటీ పరిస్థితులను, సాధించిన ప్రగతిని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. శ్రీకృష్ణదేవరాయులు యూనివర్సిటీ అధ్యాపకులు ఆచార్య పీఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ సమష్టి కృషితో ఏదైనా సాధించవచ్చని నన్నయ యూనివర్సిటీ సిబ్బంది నిరూపించారన్నారు. 2006 ఏప్రిల్‌లో ప్రారంభమైన నన్నయ యూనివర్సిటీ నేటి వరకు ఎదుర్కొన్న వివిధ సమస్యలు, సాధించిన విజయాలను పలువురు వక్తలు ప్రస్తావించారు. మొక్కలు నాటారు.. అనూర్ ఆవిర్భావ దినోత్సవంతోపాటు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం కూడా కావడంతో ఉపకులపతి ఆచార్య ముత్యాలునాయుడు యూనివర్సిటీ ఆవరణలో మొక్కలు నాటారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహరావు, డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్. లింగారెడ్డి, డీన్ ఆచార్య ఎస్. టేకి, ప్రిన్సిపాల్స్ ఆచార్య కేఎస్ రమేష్, ఆచార్య పి. సురేష్‌వర్మ, డాక్టర్ ఎ. మట్టారెడ్డి, డాక్టర్ వై. శ్రీనివాసరావు, డాక్టర్ పి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నన్నయ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత
యూజీసీ కమిటీ బృందం రాజ రాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ 12బీ గుర్తింపు ఇచ్చేందుకు అవసరమైన సకల సదుపాయాలు కలిగి ఉందని యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. గోదావరి జిల్లాల్లో అతిపెద్ద యూనివర్సిటీ ఉండడం ఉభయ గోదావరి జిల్లావాసుల అదృష్టంగా పేర్కొంటూ దీనిని మరింతగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొంది. యూనివర్సిటీలో కమిటీ చైర్మన్, బిలాస్పూర్ యూనివర్సిటీ వీసీ ఆచార్య జి.డి.శర్మ, సభ్యులు ఆచార్య ఎస్వీఎస్ చౌదరి, ఆచార్య ఎం. శ్యామలాదేవి, డాక్టర్ జి.శ్రీనివాస్‌లు రెండోరోజైన శుక్రవారం కూడా పర్యటించారు. ఇంగ్లిష్, మేనేజ్మెంట్, మ్మాథ్స్, కెమిస్ట్రీ, జువాలజీ, జియాలజీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల విద్యార్థులు, అధ్యాపకుల నుంచి తీసుకున్న సమాచారం, పరిశీలించిన వివిధ అంశాలు ఆధారంగా నివేదికను తయారుచేశారు. క్యాంపస్‌లోని కళాశాలల భవనాలు, కేంద్ర గ్రంధాలయం, హస్టల్స్, హెల్త్ సెంటర్, తదితర భవనాలను, వాటి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకున్నారు. వచ్చిన అవార్డులు, రివార్డులను పరిశీలించారు. అనంతరం యూజీసీ కమిటీ చైర్మన్ ఆచార్య జీడీ శర్మ మాట్లాడుతూ యూనివర్సిటీలో అన్ని విభాగాలను పరిశీలించామన్నారు. ఎన్ఎస్ఎస్ సేవలు ప్రÔశంసనీయమన్నారు. స్వచ్ఛభారత్, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం వంటి పలు కార్యక్రమాలు చేస్తూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. సుంకర వినయ్ పౌండేషన్ ఏర్పాటు చేసిన హెల్త్ సెంటర్ సేవలను ప్రశంసించారు. సమస్యలను ఎదుర్కొంటూనే మంచి ప్రగతిని తక్కువ సమయంలోనే సాధించడంలో ఉపకులపతి ఆచార్య ముత్యాలునాయుడు కృషి హర్షణీయమన్నారు. దీనిపై ఉపకులపతి స్పందిస్తూ సమష్టి సహకారంతోనే దీనిని సాధించామన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహరావు, డీన్స్ ఆచార్య ఎస్. టేకి, ప్రిన్సిపాల్స్ ఆచార్య పి. సురేష్‌వర్మ, ఆచార్య కెఎస్ రమేష్, డాక్టర్ మట్టారెడ్డి, డాక్టర్ కె. సుబ్బారావు, డాక్టర్ వై. శ్రీనివాసరావు, డాక్టర్ పి. వెంకటేశ్వర్రావు, డాక్టర్ పి. విజయనిర్మల, తదితరులు పాల్గొన్నారు. యూజీసీ కమిటీ సభ్యులను ఆకర్షించిన ‘సాక్షి’ కథనం ఆదికవి నన్నయ యూనివర్సిటీ 2006 ఏప్రిల్‌లో ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటూ సమష్టి సహకారంతో ఎదిగిన విధానంపై ‘సాక్షి’ ‘నన్నయే మిన్నయా’ అనే శీర్షికన శుక్రవారం ప్రచురించిన కథనం యూజీసీ కమిటీ సభ్యులను విశేషంగా ఆకట్టుకుంది. సాక్షి పత్రికను చూసిన కమిటీ సభ్యులు వార్త వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. యూనివర్సిటీ నుంచి తీసుకున్న సమాచారంతో పాటు ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని తమ ఫైల్లో పొందుపర్చుకున్నారు. -
పెంచిన డిగ్రీ ఫీజులను తక్షణమే తగ్గించాలి
జాతీయ రహదారిపై నన్నయ’ విద్యార్థుల రాస్తారోకో రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : యూనివర్సిటీ పరిధిలో ఉభయ గోదావరి జిల్లాల్లోని డిగ్రీ కళాశాలల్లో పెంచిన డిగ్రీ ఫీజులను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదికవి నన్నయ యూనిర్సిటీ విద్యార్థులు రోడెక్కారు. వర్సిటీకి ఎదురుగా ఉన్న 16వ నంబరు జాతీయ రహదారి పై రాస్తారోకో నిర్వహించి, అనంతరం వర్సిటీ భవనం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు ఎ. రవిచంద్ర, ప్రధాన కార్యదర్శి ఎస్.రామ్మోహన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సెమిస్టర్ విధానంతో ఇప్పటికే రెండు పర్యాయాలు ఫీజులు చెల్లించాల్సిన వస్తున్న సమయంలో వాటిని మరింత పెంచడం అన్యాయన్నారు. రెండు సెమిస్టర్లకు బీఏలో రూ.1610, బీఎస్సీలో రూ. 1810 చొప్పున వసూలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ ఇతర విద్యాలయంలోను ఇంతభారీగా ఫీజులు లేవన్నారు. సప్లిమెంటరీ పరీక్ష ఫీజుల నెపంతో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయడం సరికాదన్నారు. తక్షణమే వీటిపై ప్రభుత్వం పునరాలోచించి, పెంచిన ఫీజులను తగ్గించాలన్నారు. ప్రతి డివిజన్ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని, అనుబంధ హాస్టల్స్‌ని నెలకొల్పాలని కోరారు. ధర్నా అనంతరం వీసీ ఆచార్య ముత్యాలునాయుడికి వినతిపత్రం అందజేశారు. ఉభయ గోదావరి జిల్లాల పీడీఎస్‌యూ అధ్యక్ష, కార్యదర్శులు బి.సిద్దూ, ఆర్.తిరుపతిరావు, కె.నాని, ఈ. భూషణం, తదితరులు పాల్గొన్నారు. -
16, 17లో 'నన్నయ' ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
పరీక్షలను వాయిదా వేసిన నన్నయ వర్సిటీ వీసీ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 16, 17 తేదీల్లో రాజమహేంద్రవరంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నామని ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే దీనిని భారీ జాబ్ మేళాగా పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వికాస్, ఎన్టీఆర్ ట్రస్టులతో కలసి నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో విప్రో, ఇన్ఫోసిస్ వంటి వంద కంపెనీలు పాల్గొంటాయన్నారు. సుమారు ఆరు వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయన్నారు. ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలలో మూడు నెలలుగా శిక్షణ ఇస్తున్నామన్నారు. అయితే శిక్షణ పొందని వారు కూడా హాజరుకావొచ్చన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, నర్సింగ్, బీటెక్, ఎంటెక్, తదితర అర్హతలున్న వారంతా హాజరుకావొచ్చన్నారు. సుమారు వంద కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు వస్తున్నందున ఉభయ గోదావరి జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 'నన్నయ' లో పరీక్షలు వాయిదా రాజమహేంద్రవరంలో జరగనున్న మెగా జాబ్ మేళాకు తమ యూనివర్సిటీ పరిధిలోని అర్హత ఉన్న విద్యార్థులు కూడా హాజరయ్యేందుకు వీలుగా గురువారం (15వ తేదీ) నుంచి వరుసగా మూడు రోజులపాటు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశామన్నారు. ఆ పరీక్షలు తిరిగి 19వ తేదీ నుంచి జరుగుతాయని వీసీ తెలిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆదేశాలను జారీ చేశామన్నారు. -
వచ్చే నెలలో ‘నన్నయ’లో జాతీయస్థాయి సాహితీ సదస్సు
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జనవరి 28, 29 తేదీలలో 'తెలుగు సాహిత్యం – విశ్వకవి రవీంద్రుని ప్రభావం' అనే అంశంపై జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఏపీ ఉన్నత విద్యామండలి సహకారంతో నన్నయ వర్సిటీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో జరిగే సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహారావు బుధవారం ఆవిష్కరించారు. అసియా ఖండంలో మొదటి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనా«థ్ ఠాగూర్ ప్రభావం ప్రపంచ సాహిత్యంపై ముఖ్యంగా తెలుగు సాహిత్యంపై విశేషంగా ఉందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. బెజవాడ గోపాలరెడ్డి, రాయప్రోలు సుబ్బారావు వంటి ప్రముఖులు రవీంద్రుని శిష్యులన్నారు. పరిశోధకులు తెలుగు సాహిత్యంపై రవీంద్రుని ప్రభావాన్ని పరిశీలించి, తమ ప్రామాణిక పరిశోధనాపత్రాలను తయారుచేసుకోవాలని సూచించారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ మున్నగు పలు రాష్ట్రాల నుంచి ఆచార్యులు, పరిశోధకులు సదస్సుకు హాజరు కానున్నారన్నారు. కార్యక్రమంలో సదస్సు కన్వీనర్ డాక్టర్ కేవీఎస్డీ వరప్రసాద్, సహాయ కన్వీనర్లు డాక్టర్ తలారి వాసు, డాక్టర్ టి.సత్యనారాయణ, డాక్టర్ డి.లక్ష్మీనరసమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పరభాషలో కన్నా.. మాతృభాషలో అధ్యయనమే మిన్న
జాతీయస్థాయి సదస్సులో నన్నయ మాజీవీసీ జార్జ్ విక్టర్. భానుగుడి(కాకినాడ) : మాతృభాషలో అధ్యయనం వల్లే చైనా, జపాన్‌లు అభివృద్ధి చెందాయని నన్నయ్య విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య జార్జివిక్టర్ పేర్కొన్నారు. జాతీయ సమైక్యత–సాంఘీకరణ పోకడలు అనే అంశంపై పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ నాయకులకు, అధికార యంత్రాంగానికి సరైన సామాజిక దృక్పథం కొరవడిందన్నారు. సోమవారం కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ సదస్సులో కుల, వర్ణ వ్యవస్థ, సాంస్కృతిక వైవిధ్యాలు పై విస్తృత స్థాయిలో పరిశోధన జరిగితేనే కుల వ్యవస్థపై అసహనం సమసిపోయి జాతీయ సమైక్యతకు దోహదం చేస్తుందన్నారు. సమావేశంలో డాక్టర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ పంజాబ్‌లోని ఖలిస్థాన్ ఉగ్రవాదులను చెరసాల నుంచి తప్పించడం జాతీయ సమైక్యతకు ముప్పుగా పరిణమించవచ్చన్నారు. సదస్సులో నన్నయ రిజిస్ట్రార్ ఆచార్య నరసింహారావు మాట్లాడుతూ జాతి సంపదను అసమానంగా పంచబడడం, రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, అవిద్య, ఆహార కొరత మొదలైన అంశాలు జాతీయ సమైక్యతకు ముప్పుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చప్పిడి కృష్ణ, కందుల ఆంజనేయులు, యూజీసీ కోఆర్డినేటర్ హరిరామ ప్రసాద్, ఆర్గనైజింగ్ మెంబర్స్ వి.చిట్టిబాబు, కె.నరసింహారావు, స్వామి, పాండురంగారావు, పారేశ్వర సాహు, డాక్టర్ వీపురి సుదర్శన్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. -
బాలమురళి కారణజన్ముడు
నన్నయ వీసీ ముత్యాలునాయుడు పుస్తక సంబరాల్లో ‘స్వర నివాళి’ రాజమహేంద్రవరం కల్చరల్ : గానగంధర్వుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కారణజన్ముడని నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ముత్యాలునాయుడు అన్నారు. ప్రభుత్వ అటానస్ కళాశాలలో జరుగుతున్న నవ్యాంధ్ర పుస్తక సంబరాల వేదికపై బుధవారం బాలమురళీకృష్ణకు స్వరనివాళి సమర్పించారు. వీసీ మాట్లాడుతూ తెలుగు నేలకు, సంగీతానికి అంతర్జాతీయ ఖ్యాతిని చేకూర్చిన మంగళంపల్లి లేని లోటు తీరనిదని అన్నారు. విజయశంకర ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల కూచిపూడి అధ్యాపకుడు పసుమర్తి శ్రీనివాసశర్మ మాట్లాడుతూ బాలమురళి స్వరం మధురం, వాక్కు చమత్కారభరితమన్నారు. సాహితీవేత్త రెంటాల శ్రీవెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎవరూ ప్రశ్నించలేని స్థాయిలో తెలుగు గాయకులకు బాలమురళి కంఠం గుర్తింపు తెచ్చిందన్నారు. రాజ్యలక్ష్మి మహిళా కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ అద్దేపల్లి సుగుణ మాట్లాడుతూ ఎన్నో జీవిత సత్యాలు, తత్వాలను బాలమురళి ఆలపించారన్నారు. గాయని ఎం.పార్వతి బాలమురళి గానం చేసిన ‘ఏమి సేతురా లింగా’, ‘ఊగుమా ఊయల’ తదితర గీతాలను ఆలపించారు. వయొలి¯ŒS విద్వాంసుడు కొక్కొండç సూర్యసుబ్రహ్మణ్యం బాలమురళి గానం చేసిన ‘వస్తా వట్టిదే–పోతా వట్టిదే–ఆశ ఎందుకంటా–చేసిన ధర్మము–చెడని పదార్థము’ అన్న గేయాన్ని ఆలపించారు. ముందుగా వీసీ బాలమురళి చిత్రపటం వద్ద జ్యోతిప్రజ్వలన చేసి, పుష్పాంజలి ఘటించారు. నన్నయ వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ టి.సత్యనారాయణ, విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్యపాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.వి.ప్రసన్నకుమారి పాల్గొన్నారు. -
ప్రతిభలో సెంచరీ చేద్దాం
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : పరీక్షలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం అందజేస్తున్న ప్రతిభా అవార్డులను గత విద్యా సంవత్సరంలో తమ యూనివర్సిటీ పరిధిలో 61 మంది సాధించారని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం. ముత్యాలునాయుడు అన్నారు. ఈ సంఖ్యను ఈ విద్యా సంవత్సరంలో వందకు పెంచేందుకు కృషి చేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ప్రతిభా అవార్డులు సాధించిన ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 61 మంది విద్యార్థులకు యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ధ్రువీకరణ పత్రంతోపాటు గోల్డ్ మెడల్, ట్యాబ్, రూ. 20 వేల నగదు (చెక్కు రూపంలో) అందజేశారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహరావు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్‌వర్మ, డాక్టర్ ఎస్. టేకి, డాక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆదికవి నన్నయలో స్పాట్ అడ్మిషన్లు
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి స్మాట్ అడ్మిషన్లు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి రిజిస్టార్ ఆచార్య ఎ. నరసింహరావు మంగళవారం తెలిపిన వివరాలు ఉన్నాయి. రెండేళ్ల కాలవ్యవధితో కూడిన బీఈడీ కోర్సులో చేరదలచుకున్న అర్హత గల విద్యార్థులు ఈ నెల ఐదులోగా తమ దరఖాస్తులను అందజేయవలసి ఉంది. అలాగే బీఏ, బికాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీటెక్ మున్నగు డిగ్రీలలో కూడా ప్రవేశాలు తీసుకుంటున్నారు. బీసీ విద్యార్థులు ఇంటర్లో 40 శాతం, ఇతరులు 50 శాతం మార్కులతోను, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది. ప్రవేశ పరీక్ష రాయకపోయినా బీటెక్‌లో చేరేందుకు ప్రస్తుతం అవకాశం కల్పించారు. ఆసక్తి ఉండి తగిన అర్హతలు ఉన్న విద్యార్థులు ఈ నెల ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు (ఒరిజనల్, నకలుతో సహా) తీసుకుని ప్రభుత్వం నిర్ణయించి రూ.16,500 ప్రవేశ రుసుంతో యూనివర్సిటీలోని డీఓఏ కేంద్రంలో డాక్టర్ మట్టారెడ్డిని కలవాలన్నారు. నేడు నన్నయలో ప్రారంభం కానున్న ‘వికాస్’ శిక్షణ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం): ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ’వికాస్’ సంస్థ ద్వారా చేపట్టే శిక్షణ కార్యక్రమాలను ఆ సంస్థ చైర్మన్, జిల్లా కలెక్టరు హెచ్. అరుణ్‌కుమార్ బుధవారం ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో నన్నయ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్టార్ ఆచార్య ఎ. నరసింహరావు, తదితరులు పాల్గొంటారని యూనివర్సిటీ పీఆర్వో మంగళవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. -
నన్నయ వీసీకి విద్యాభూషణ్ అవార్డు ప్రదానం
రాజరాజనరేంద్రనగర్ (రాజాన గరం): ప్రపంచ ఉపాధ్యాయదినోత్సవం సందర్భంగా ‘మేజిక్ ఫర్ సోషల్ సర్వీస్’ స్వచ్ఛంద సంస్థ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సేవలందించిన విశిష్ట వ్యక్తులకు ఏటా ఇస్తున్న విద్యాభూషణ్ అవార్డును ఈ ఏడాది నన్నయ వర్సిటీ వీసీ ఆచార్య ముత్యాలు నాయుడికి అందజేసింరు. ఈ సందర్భంగా ఆయనను బుధవారం యూనివర్సిటీలో ఆ సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ అవార్డును సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ చింతా శ్యామ్, జ్యూరీ సభ్యులు ఆయనకు అందజేశారు. వీసీ ముత్యాలునాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహారావు, అధ్యాపకులు డాక్టర్ టి. సత్యనారాయణ, డాక్టర్ ఎస్. టేకి తదతరులు పాల్గొన్నారు. -
కష్టపడి కాదు.. ఇష్టపడి చదవండి
వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ప్రతి విద్యార్థి తాను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే దిశగా సరైన ప్రణాళికతో సాధన చేయాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ అన్నారు. కష్టపడి చదివేస్తున్నామనే భావాన్ని తొలగించుకుని, ఇష్టపడి చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. అలాగే నెగెటివ్ దృ క్పథాన్ని విడనాడి పాజిటివ్ దృ క్పథంతో ఆలోచించాలన్నారు. వ్యక్తిత్వ వికాసంపై ఆదికవి నన్నయ యూనివర్సిటీలో సోమవారం శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను కూడా భాగస్వాములను చేస్తూ, ప్రతిభ కనబర్చినవారికి ప్రోత్సాహక బహుమతులు కూడా అందజేశారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ, విద్యతోపాటు సరైన నైపుణ్యాలుంటే ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకునే దిశగా నిరంతరం ప్రయత్నం చేయండి అంటూ ఏబీసీడీఈఎఫ్జీ వంటి టñ క్నిక్లను ఉదాహరణలతో వివరించారు. విజయం సాధించాలంటే ప్యాకేజ్ అవసరమంటూ ‘ప్యాకేజ్’లోని అక్షరాలను తెలియజేశారు. ఎవరిలాగానో ఉండాలనుకోవడం సరికాదన్నారు. ప్రతి మనిషిలోనూ ఏవో కొన్ని లోపాలు కూడా ఉంటాయన్నారు. లోపాలను గుర్తు చేసుకుంటూ కుంగిపోకుండా ఉన్న వాటితోనే ముందుకు వెళ్లాలనే దృ క్పథంతో పయనించాలన్నారు. నేడు ప్రపంచంలో గొప్పవాళ్లుగా చెప్పుకుంటున్న ఎంతోమంది ఒకప్పుడు సామాన్యులేనంటూ మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలామ్‌ని ఉదహరించారు. విజయం సాధించాలంటే ప్లేస్‌ని వదిలేయాలన్నారు. అమెరికాలో 38 శాతం వైద్యులు, 36 శాతం నాసాలోని శాస్త్రవేత్తలు, 29 శాతం ఆచార్యులు భారతీయులేననే విషయాన్ని గ్రహించాలన్నారు. వీరందరినీ ఆదర్శంగా తీసుకుని విజయం వైపు పయనించాలన్నారు. సుమారు మూడు గంటలపాటు జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంలో స్వతహాగా మెజీషియన్ అయిన ఆయన మధ్యమధ్యలో కొన్ని మ్యాజిక్‌లు చేస్తూ విద్యార్థులను ఆద్యంతం ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఆంగ్లం నేర్చుకోవడానికి భయపడవలసిన పని లేదని, డాక్టర్ పట్టాభిరామ్ ఉపన్యాసం వింటే కొండంత ధైర్యం వస్తుందని యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు అన్నారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్‌ను దుశ్శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహుకరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహరావు, ప్రిన్సిపాల్స్ డాక్టర్ కేఎస్ రమేష్, డాక్టర్ పి.సురేష్‌వర్మ, డాక్టర్ మట్టారెడ్డి, స్టూడెంట్ అఫైర్స్ డీన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘నన్నయ’ 12బి స్టేటస్‌కు కృషి చేస్తా
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీ ముంపు మండలాల్లో వర్సిటీ సమాచారం ప్రచారం చేయాలని సూచన రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీకి 12బి స్థాయిని సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. వర్సిటీని సోమవారం సందర్శించిన ఆయన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేస్తున్న తీరుపై సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించి రోస్టర్‌ను పాటిస్తూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని సూచించారు. సం» ంధిత రిజిస్టర్‌ను టా సోషల్ ఆడిట్ చేయించాలని, వర్సిటీలో బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, విద్యార్థుల కోసం ఒక లైజానింగ్ అధికారిని నియమించాలన్నారు. వర్సిటీ సమాచారాన్ని పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల వారికి కూడా తెలియజేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్, హ్యూమన్ రీసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా విద్యార్థులందరికీ ఉపకార వేతనాలు, ట్యూషన్ ఫీజులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కుల వివక్ష చూపిన వారిని, ర్యాగింగ్‌కి పాల్పడిన వారిని ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలన్నారు. సాహిత్య పీఠాలను ఏర్పాటు చేయాలి జిల్లాకు చెందిన మహాకవులు బోయి భీమన్న, కుసుమ ధర్మన్నల సాహిత్య పీఠాలను ఏర్పాటుచేయాలని శివాజీ సూచించారు. తక్కువ వయసులోనే లోక్‌సభ స్పీకర్ అయిన జీఎంసీ బాలయోగి గురించి పరిశోధన జరగాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. యూనివర్సిటీ అభివృద్ది విషయమై ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహరావు శివాజీతో చర్చించారు. 12 బి స్టేటస్ వస్తే అభివృద్ధి మరింత వేగంగా జరగడానికి వీలుంటుందన్నారు. దీనిని సాధించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలిపారు. ఆ స్టేటస్‌ని సాధించడంలో తన వంతు కృషి చేస్తానని శివాజీ హామీ ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలకు మణిహారంగా ఉన్న నన్నయ వర్సిటీ అభివృద్ధికి, పీజీ, ఫార్మసీ తదితర కళాశాలల విలీనానికి సీఎం, విద్యా శాఖ మంత్రులను ఒప్పించే ప్రయత్నం చేస్తానన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్.లింగారెడ్డి, ప్రిన్సిపాళ్లు డాక్టర్ పి.సురేష్‌వర్మ, డాక్టర్ కేఎస్ రమేష్, డాక్టర్ ఎ.మట్టారెడ్డి, డాక్టర్ కె.సుబ్బారావు, డీన్లు డాక్టర్ ఎస్.టేకి, డాక్టర్ వెంకటేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్ డాక్టర్ కల్యాణి, ఫైనాన్స్ అధికారి కె.శ్యామల తదితరులు పాల్గొన్నారు. -
అలనాటి ఆటపాటలు
ఆదికవి నన్నయ ఆంధ్ర మహాభారతం ఆదిపర్వంలో మేనమరదలితో పెళ్లి ప్రస్తావించాడు. మేనరికాలు తెలుగువారిలో అనాది నుండి వస్తున్న ఆచారం. అదే గ్రంథంలో తిక్కన నాలుగు రోజుల పెళ్లిసంబరాల గురించి చెప్పాడు. ఈ రెండూ సంస్కృత మూలంలో లేవు. తెలుగువారి ఆచారాలే. ఇక తెలుగువాళ్ల పెళ్లిపండగ వర్ణన మొట్టమొదటిసారిగా కుమార సంభవంలో కనిపిస్తుంది. నన్నెచోడుడి కుమారసంభవంలో పార్వతీశివుల కల్యాణం వర్ణన ఇప్పటికి వెయ్యేళ్ల క్రితమే నాగవల్లి కుండలు, పాలకొమ్మతో రాటువేయడం, పసుపులు దంచడం, తలపై పేలాలు పెట్టడం, తెరపట్టడం, జీలకర్ర కలిపిన బియ్యం జల్లుకోవడం, ఊరేగింపు, వసంతాలు, బంతులాట మొదలైన మన పెళ్లి సంబరాలకి అద్దం పడుతుంది. అప్పటి పెళ్లిమంటపం డెకరేషన్ గురించి ఎన్నో విశేషాలు తెలుస్తాయి. మచ్చుకి కరెంట్ లేని రోజుల్లో బయట ఎండలో అద్దాలు పెట్టి ఆ వెలుతురు పందిరి లోపల మంటపంలో పడేలా చేశారట! తొలి చాళుక్యుల కాలంనాటి సాంఘిక పరిస్థితుల గురించి మహాభారతం, కుమార సంభవం, చాళుక్యసోమేశ్వరునిఅభిలాషితార్థచింతామణి, పండితారాధ్యుని బసవపురాణం మనకి ఎన్నో విషయాలు తెలుపుతాయి. నాచనసోముని ఉత్తరహరివంశంలో సత్యభామాకృష్ణుల నెత్తపుటాల(పాచికలు), ఆ ఆటకి సంబంధించిన పందేలూ, పంతాలు వర్ణిస్తుంది. పాచికలాట ఈనాటిది కాదు. అక్షక్రీడ ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది. భారతయుద్ధానికి ముఖ్యకారణం పాచికలే. రాజసూయయాగం పాచికలాటతోగానీ పరిసమాప్తమవదు. ఆడవాళ్లు జోగిణి దేవతకి మొక్కి ఆట మొదలెట్టేవారని నాచన సోముడు చెప్పాడు. పూర్వం జైన విద్యాలయాల్లో ఎక్కాలు, లెక్కలు నేర్పేందుకు ఈ ఆటని ఉపయోగించారు. ప్రహేళికలు, అంత్యాక్షరివంటివి వయసొచ్చిన ఆడపిల్లలు ఆడేవారని కుమార సంభవం చెబుతుంది. వాళ్ల ఆటల్లో పెద్ద సంబరంగా జరుపుకునేవి బొమ్మలపెళ్లి, గుజ్జనగూళ్లు, స్నేహితురాళ్లని ఒకచోట పోగేసి అట్టహాసంగా బొమ్మలకి పెళ్లి చేయటం, పిడతల్లో తాహత్తుకు తగినట్లు వంట చేసి పంచుకోవటం. ఇక బొమ్మల్లో ఎన్నో రకాలు ఆనాటి సాహిత్యంలో కనిపిస్తాయి. కుమార సంభవంలో దంతపుబొమ్మలు, మేలిగాజు బన్నరుల గురించి చెబితే నాచన సోముడు పుత్తడి లత్తుక బొమ్మలని గురించి చెప్పాడు. అచ్చనగుండ్లు, పికిలిపిట్లు, గీరనగింజలు, తన్నుబిళ్ల, కుచ్చెళ్లు, దాగిలిమూతలు, స్తంభాలాట, కుందుళ్లు లాంటివి ఇంట్లో ఆడితే, వీధిలో బొంగరాలు, బిళ్లంగోడు, చిడుగుడూ, కోలకోతులు ఆడేవాళ్లు. అన్నింటిలో ముఖ్యమైనది మన తెలుగువారి క్రికెట్ ఆట. బిళ్లంగోడు, గిల్లీదండా, దండుగనీ, చిల్లగోడె, చిర్రాగోనె, ఇలా చాలా పేర్లున్నాయి. ఇప్పటికీ పల్నాడులో ఈ ఆట ఆడే పిల్లలు, ఏక్కా దుగా, తిక్కా అని ఒంట్లు లెక్కపెడతారు. అంటే బౌద్ధుల కాలానికే ఈ ఆట కోస్తాంధ్రలో ఆడేవారు. ఇక్కడ నుండే ఈ గిల్లీదండా ఇతర రాష్ట్రాలకి ఎగుమతి అయింది. మహారాష్ట్రలో ఈ ఆటని విటిదండు అంటారు. అక్కడ ఒంట్లు ఒకటీ, రెండూ, మూడు అని తెలుగుతో లెక్కబెడతారు. అందుకేనేమో మనవాళ్లకి క్రికెట్ ఆట అంత సులభంగా అలవడింది. ఇండియాకి మొట్టమొదటి క్రికెట్ కెప్టెన్ మన తెలుగువాడే.. సి.కె.నాయుడు అనే కఠారి కనకయ్య నాయుడు. వేదవ్యాసుడి సంస్కృత భారతంలో కౌరవపాండవులతో ఆడించిన ఆట బంతాట కాదు. దానిని వీటాఖేలనం అన్నాడు. ‘వీటయాయవా తారేణ ప్రాదేశ మాత్రకాష్ఠేనయత్, హస్తమాత్ర దండేన ఉపర్యుపరి కుమారా ప్రాక్షిపంతి’ అంటే, మూరెడు కర్రతో జానెడు బిళ్లని కొట్టే ఆట అని చెప్పాడు. కానీ ఎందుకో మన నన్నయ తెలుగు భారతంలో ఆ సన్నివేశాన్ని బంతాటగా మార్చాడు. పాపం, రాజమండ్రి వీధుల్లో కుర్రాళ్లు చేసే గోలకి గిల్లీదండా అంటే కోపమొచ్చిందేమో?