
అంకము అంటే గుర్తు, ముద్ర. అంకితం అంటే గుర్తు, లేక ముద్ర కలిగినది. తమ పని ఏదైనా ఏ విధంగా గుర్తించబడాలో సూచించే గుర్తును చెప్పటం అంకితం. మన కవులు అందరు తమ కావ్యాలను అంకితం చేశారు. రచన తమది అయినా ఆ రచనను చదివే వారికి మరొకరు మనసులో మెదులుతారు. అది తమ ఇష్టదైవం కావచ్చు. ఆదరించిన రాజో, మిత్రుడో, ఆత్మీయులో కావచ్చు.
అది మరెవరి గుర్తింపు కొరకో తాము చేసే కృషి అని చెప్పటం. కావ్య అవతారికలోనే చెప్పటం సంప్రదాయం. ఆదికవి నన్నయ ఈ ఒరవడి ప్రారంభించినట్టు కనపడుతుంది. తన సహాధ్యాయి, రాజు, పోషకుడు అయిన రాజరాజ నరేంద్రుడి కోరిక మీద ఆయనకి అంకితంగా భారతసంహితా రచనా ధురంధురుడయ్యాడు. ఈ అంకితం కారణంగానే తిక్కనామాత్యులవారు అరణ్యపర్వశేషాన్ని స్పృశించలేదని కొండరు సాహిత్యవిమర్శకుల అభిప్రాయం.
నన్నయభట్టు నరాంకితంగా చేసిన దానిలో మిగిలిన భాగాన్ని దైవానికి అంకితం ఇవ్వటం ఇష్టం లేక విరాటపర్వం నుండి ప్రారంభించి ఉంటారని భావన. పైగా ఆయనకి హరిహరనాథుడు స్వప్నంలో కనపడి ఆదేశించాడు కూడా. పోతనామాత్యుల వారి అంకితం కించిత్ ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. శివధ్యానం చేస్తున్న పోతనకి శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చి కృష్ణకథ ప్రధానంగా ఉన్న భాగవతాన్ని తనకి అంకితంగా రచించమని కోరాడు.
వాగ్గేయకారులు తమ కీర్తనలలో ప్రతిదానిలోనూ తమ ఇష్టదైవం నామాన్ని గాని ఒక ప్రత్యేకమైన పదాన్ని గాని గుర్తుగా పేర్కొంటారు. దానిని ముద్ర అంటారు. కీర్తనలు వేటికి అవి విడిగా ఉంటాయి. కావ్యంలో లాగా అవతారికలో ఒకసారి పేర్కొంటే సరిపోదు కదా! అందుకని ప్రతి కృతిలోనూ ముద్ర తప్పనిసరి. త్యాగరాజ కృతులలో ప్రతి దానిలోనూ త్యాగరాజనుత అనే ముద్ర కనపడుతుంది. శ్యామశాస్త్రివారి కీర్తనలలో శ్యామకృష్ణ అని, ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తనలలో గురుగుహ అనే ముద్రలు దర్శనమిస్తాయి. ఆ ముద్ర చూడగానే అది ఎవరి రచన అన్నది తెలిసిపోతుంది. నిజానికి వారు మనకి తేలికగా తెలియటం కోసం పెట్టలేదు ముద్రలని. ఆ ముద్ర తనకి, ఎవరిని గురించి పాడుతున్నారో వారికి గుర్తింపు.
వాచస్పతి మిశ్రుడు తన రచనకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించకుండా సహకరించిన, అప్పటివరకు ముఖమైనా చూడని ధర్మపత్ని ‘భామతి’ పేరుని తన గ్రంథనామంగా ఉంచాడు.
తమకు ఉన్న ప్రేమాభిమానాలను వ్యక్తపరచటానికి రచనాదికాలు చేయలేక పోయినా, తాము చేసిన ఏ ఘనకార్యమైనా అంకితం చేస్తూ ఉంటారు.
అందరు ఏదో ఒక ఘనకార్యం చేసి అంకితం ఇవ్వలేక పోవచ్చు. వారు తమ జీవితాన్నే అంకితం చేయటం మనం గమనించ వచ్చు.‘‘నా జీవితం నీకే అంకితం..’’ అంటూ పాడిన పాటలు ఉదాహరణలు. అంటే, తన అస్తిత్వానికి ఒక గుర్తింపు అవసరం లేదు, అస్తిత్వంతో సహా అంతా సమర్పణమే ఇష్టదైవానికో, ఇష్టమైన వ్యక్తికో.
చివరికి ఈ అంకిత ప్రక్రియ ఏ స్థాయికి చేరింది అంటే, ఆకాశవాణిలో గాని, దృశ్యశ్రవణ ప్రసార మాధ్యమాలలో గాని ఇష్టమైన పాటలని వేయించి, వాటిని అంకితం చేస్తున్నారు. వీరజవానులు తమ జీవితాలను దేశరక్షణకు అంకితం చేస్తారు. కొందరు దైవానికి తమ జీవితాలని అంకితం చేస్తారు.
తన ఉనికి కోసం, గుర్తింపు కోసం తాపత్రయ పడకుండా మరెవరి గుర్తింపుకో నిస్వార్థంగా చేయటం అంకితం.
కావ్యాలు, కీర్తనలు మాత్రమే కాదు ఏ సృజనాత్మక సృష్టి అయినా తన గుర్తింపు కోసం కాక ఇతరులకు గుర్తింపు కలగటం కోసం చేసినప్పుడు ఆ ప్రక్రియని అంకితం అంటారు. ఉదాహరణకి నన్నయభట్టు భారతాన్ని ఆంధ్రీకరించాడు. ఆయన పేరుతో పాటు అంకితం పుచ్చుకున్న రాజరాజనరేంద్రుడి పేరు కూడా చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. రాజుగా కన్న ఆంధ్రమహాభారతాన్ని అంకితం పుచ్చుకున్నవాడిగా గుర్తింపు అధికం. శ్రీనాథ కవిసార్వభౌముడి పేరు నిలిచి ఉన్నంత కాలం వీరారెడ్డి, అవచి తిప్పయ్య శెట్టి, పెదకోమటి వేమారెడ్డి మొదలైన వారందరి పేర్లు శాశ్వతం. రచనలు చేయలేదు కాని, కావ్యాలు అంకితం పుచ్చుకున్నారు కనక, ఆ కావ్యాలు ఆదరించబడినంత కాలం వారి పేరు చిరస్థాయిగా ఉంటుంది.
– డా. ఎన్. అనంతలక్ష్మి