rajaraja narendrudu
-
అంకిత భావం
అంకము అంటే గుర్తు, ముద్ర. అంకితం అంటే గుర్తు, లేక ముద్ర కలిగినది. తమ పని ఏదైనా ఏ విధంగా గుర్తించబడాలో సూచించే గుర్తును చెప్పటం అంకితం. మన కవులు అందరు తమ కావ్యాలను అంకితం చేశారు. రచన తమది అయినా ఆ రచనను చదివే వారికి మరొకరు మనసులో మెదులుతారు. అది తమ ఇష్టదైవం కావచ్చు. ఆదరించిన రాజో, మిత్రుడో, ఆత్మీయులో కావచ్చు. అది మరెవరి గుర్తింపు కొరకో తాము చేసే కృషి అని చెప్పటం. కావ్య అవతారికలోనే చెప్పటం సంప్రదాయం. ఆదికవి నన్నయ ఈ ఒరవడి ప్రారంభించినట్టు కనపడుతుంది. తన సహాధ్యాయి, రాజు, పోషకుడు అయిన రాజరాజ నరేంద్రుడి కోరిక మీద ఆయనకి అంకితంగా భారతసంహితా రచనా ధురంధురుడయ్యాడు. ఈ అంకితం కారణంగానే తిక్కనామాత్యులవారు అరణ్యపర్వశేషాన్ని స్పృశించలేదని కొండరు సాహిత్యవిమర్శకుల అభిప్రాయం. నన్నయభట్టు నరాంకితంగా చేసిన దానిలో మిగిలిన భాగాన్ని దైవానికి అంకితం ఇవ్వటం ఇష్టం లేక విరాటపర్వం నుండి ప్రారంభించి ఉంటారని భావన. పైగా ఆయనకి హరిహరనాథుడు స్వప్నంలో కనపడి ఆదేశించాడు కూడా. పోతనామాత్యుల వారి అంకితం కించిత్ ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. శివధ్యానం చేస్తున్న పోతనకి శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చి కృష్ణకథ ప్రధానంగా ఉన్న భాగవతాన్ని తనకి అంకితంగా రచించమని కోరాడు. వాగ్గేయకారులు తమ కీర్తనలలో ప్రతిదానిలోనూ తమ ఇష్టదైవం నామాన్ని గాని ఒక ప్రత్యేకమైన పదాన్ని గాని గుర్తుగా పేర్కొంటారు. దానిని ముద్ర అంటారు. కీర్తనలు వేటికి అవి విడిగా ఉంటాయి. కావ్యంలో లాగా అవతారికలో ఒకసారి పేర్కొంటే సరిపోదు కదా! అందుకని ప్రతి కృతిలోనూ ముద్ర తప్పనిసరి. త్యాగరాజ కృతులలో ప్రతి దానిలోనూ త్యాగరాజనుత అనే ముద్ర కనపడుతుంది. శ్యామశాస్త్రివారి కీర్తనలలో శ్యామకృష్ణ అని, ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తనలలో గురుగుహ అనే ముద్రలు దర్శనమిస్తాయి. ఆ ముద్ర చూడగానే అది ఎవరి రచన అన్నది తెలిసిపోతుంది. నిజానికి వారు మనకి తేలికగా తెలియటం కోసం పెట్టలేదు ముద్రలని. ఆ ముద్ర తనకి, ఎవరిని గురించి పాడుతున్నారో వారికి గుర్తింపు. వాచస్పతి మిశ్రుడు తన రచనకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించకుండా సహకరించిన, అప్పటివరకు ముఖమైనా చూడని ధర్మపత్ని ‘భామతి’ పేరుని తన గ్రంథనామంగా ఉంచాడు. తమకు ఉన్న ప్రేమాభిమానాలను వ్యక్తపరచటానికి రచనాదికాలు చేయలేక పోయినా, తాము చేసిన ఏ ఘనకార్యమైనా అంకితం చేస్తూ ఉంటారు. అందరు ఏదో ఒక ఘనకార్యం చేసి అంకితం ఇవ్వలేక పోవచ్చు. వారు తమ జీవితాన్నే అంకితం చేయటం మనం గమనించ వచ్చు.‘‘నా జీవితం నీకే అంకితం..’’ అంటూ పాడిన పాటలు ఉదాహరణలు. అంటే, తన అస్తిత్వానికి ఒక గుర్తింపు అవసరం లేదు, అస్తిత్వంతో సహా అంతా సమర్పణమే ఇష్టదైవానికో, ఇష్టమైన వ్యక్తికో. చివరికి ఈ అంకిత ప్రక్రియ ఏ స్థాయికి చేరింది అంటే, ఆకాశవాణిలో గాని, దృశ్యశ్రవణ ప్రసార మాధ్యమాలలో గాని ఇష్టమైన పాటలని వేయించి, వాటిని అంకితం చేస్తున్నారు. వీరజవానులు తమ జీవితాలను దేశరక్షణకు అంకితం చేస్తారు. కొందరు దైవానికి తమ జీవితాలని అంకితం చేస్తారు. తన ఉనికి కోసం, గుర్తింపు కోసం తాపత్రయ పడకుండా మరెవరి గుర్తింపుకో నిస్వార్థంగా చేయటం అంకితం. కావ్యాలు, కీర్తనలు మాత్రమే కాదు ఏ సృజనాత్మక సృష్టి అయినా తన గుర్తింపు కోసం కాక ఇతరులకు గుర్తింపు కలగటం కోసం చేసినప్పుడు ఆ ప్రక్రియని అంకితం అంటారు. ఉదాహరణకి నన్నయభట్టు భారతాన్ని ఆంధ్రీకరించాడు. ఆయన పేరుతో పాటు అంకితం పుచ్చుకున్న రాజరాజనరేంద్రుడి పేరు కూడా చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. రాజుగా కన్న ఆంధ్రమహాభారతాన్ని అంకితం పుచ్చుకున్నవాడిగా గుర్తింపు అధికం. శ్రీనాథ కవిసార్వభౌముడి పేరు నిలిచి ఉన్నంత కాలం వీరారెడ్డి, అవచి తిప్పయ్య శెట్టి, పెదకోమటి వేమారెడ్డి మొదలైన వారందరి పేర్లు శాశ్వతం. రచనలు చేయలేదు కాని, కావ్యాలు అంకితం పుచ్చుకున్నారు కనక, ఆ కావ్యాలు ఆదరించబడినంత కాలం వారి పేరు చిరస్థాయిగా ఉంటుంది. – డా. ఎన్. అనంతలక్ష్మి -
రాజరాజా.. ఎన్నాళ్లీ వివాదం!
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): తెలుగువారికి మహాభారతాన్ని సునాయాసంగా చదువుకునే అవకాశం కల్పించిన సాహితీ చక్రవర్తి రాజరాజనరేంద్రుడు. రాజమహేంద్రవరాన్ని కేంద్రంగా చేసుకుని క్రీ.శ.1022 నుంచి 32 ఏళ్లు పాలించిన ఆయన చరిత్ర వెయ్యేళ్లుగా తెలుగు ప్రజల హృదయాల్లో చెక్కుచెదరకుండా ఉంది. అయితే, గోదావరి తీరంలో రాజరాజనరేంద్రుని పట్టాభిషేకంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత కొరవడింది. కొందరు ఆగస్టు 16న పట్టాభిషేకం చేశారని, మరికొందరు ఆగస్టు 22న పట్టాభిషిక్తులయ్యారని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇతిహాసిక మండలి ఆధ్వర్యాన ప్రముఖ చరిత్ర పరిశోధకుడు భావరాజు వేంకట కృష్ణారావు సంపాదకత్వంలో వెలువడిన ‘శ్రీరాజరాజ నరేంద్ర పట్టాభిషేక సంచిక’లో రాజరాజ నరేంద్రుడు ఆగస్టు 16వ తేదీన పట్టాభిషిక్తుడయ్యారని ఉంది. ఈ సంచిక నేటికీ రాజమహేంద్రవరంలోని గౌతమి గ్రంథాలయంలో ఉంది. విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ రేజేటి వేణుగోపాలాచార్యులు, చరిత్ర పరిశోధకుడు వైఎస్ నరసింహారావు కూడా ఆగస్టు 16వ తేదీని బలపరిచారు. అయితే, ఆగస్టు 22న పట్టాభిషేకం చేసినట్లు కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఎస్ మూర్తి ప్రకటించారు. ఇందుకు కొన్ని ఆధారాలను చెబుతున్నారు. సాహితీప్రియులు మాత్రం రాజరాజనరేంద్రుని పట్టాభిషేక ఉత్సవాలను వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా సహస్రాబ్ది ఉత్సవాలను రెండుసార్లు నిర్వహించారు. దీంతో అసలు పట్టాభిషేకం ఎప్పుడు చేశారనేది ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మద్రాసు మ్యూజియంలో ఉన్న రాగిరేకుల శాసనాలు ఆగస్టు 16వ తేదీన పట్టాభిషిక్తుడయ్యారు ‘రాజరాజనరేంద్రుడు వేయించిన ఐదు రాగిరేకుల శాసనాన్ని గోదావరి జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఎపిగ్రఫిస్టు డాక్టర్ హల్జస్కు ఇవ్వగా, ఆయన దానిని మద్రాస్ మ్యూజియంలో ఉంచారు. ఆ తర్వాత డాక్టర్ కీల్హారన్ 1895లో ఈ శాసనాన్ని తెలుగులోకి అనువదించారు. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక సంపాదకుడు జయంతి రామయ్య 1912లో తన సంచికలో వాటి వివరాలను, రాగిరేకుల ఫొటోలను ముద్రించారు. దాని ప్రకారం రాజరాజుఆగస్టు 16వ తేదీన పట్టాభిషిక్తుడయ్యారు.’ – డాక్టర్ ఆర్వీవీ గోపాలాచార్యులు, విశ్రాంత ఆచార్యులు, రాజమహేంద్రవరం ఆగస్టు 22నే పట్టాభిషేకం ‘తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన ఆంధ్రమహాభారతం, ఆదిపర్వానికి ముందుమాటలో రాజరాజుకు ఆగస్టు 22వ తేదీన పట్టాభిషేకం చేశారని సంపాదకులు పేర్కొన్నారు. ఏటా ఆగస్టు 22వ తేదీన తెలుగు భాషాభివృద్ధి సంస్థ, కళాగౌతమి ఆధ్వర్యంలో రాజరాజ నరేంద్రుని పట్టాభిషేకం మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాం.’ – డాక్టర్ బీవీఎస్ మూర్తి, కళాగౌతమి సంస్థ వ్యవస్థాపకుడు -
పుష్కర విజయం సమష్టి కృషి ఫలితం
అభినందన సభలో సీఎం సాక్షి, రాజమండ్రి, రాజానగరం: ప్రభుత్వంలోని అన్ని విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల సమష్టి కృషితోనే గోదావరి పుష్కరాలు విజయవంతమయ్యూయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సిబ్బందిలో ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు పోటీపడి ఈ క్రతువును జయప్రదం చేశారన్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన ఉద్యోగుల అభినందన సభలో ఆయన మాట్లాడారు. పుష్కరాల్లో సేవలందించిన ఉద్యోగులకు సోమవారం నుంచి రెండు రోజులను సెలవులుగా ప్రకటించారు. ఆ కుటుంబాలను ఆదుకుంటాం.. పుష్కరాల ప్రారంభం రోజున రాజమండ్రి పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన 29 మంది కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం చెప్పారు. అనంతరం పుష్కరాల్లో సేవలందించిన అధికారులకు జ్ఞాపికలు అందజేశారు. మీడియాపై చిందులు... అభినందన సభలో మీడియాపై సీఎం చిందులేశారు. ‘వెళ్లిపోతే శాశ్వతంగా వెళ్లిపోండి. నోబడీ కెన్ డిక్టేట్. ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు. గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారు...’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. వాస్తవానికి సభలో మీడియాకు ప్రత్యేకంగా గ్యాలరీ కేటాయించినప్పటికీ ఇతరులు కూర్చుండిపోవడంతో పాత్రికేయులు, వీడియోగ్రాఫర్లు వీఐపీ గ్యాలరీ వెనుక నిలబడి చిత్రీకరిస్తుండగా వెనుకనున్న ఉద్యోగులు తమకు వేదిక కనబడలేదంటూ గొడవ చేశారు. దీంతో వేదికపై నుంచి సీఎం కలగజేసుకుంటూ ఫొటోగ్రాఫర్లంతా పక్కకు వచ్చేయాలన్నారు. తామెలా తీయాలంటూ వారంతా అనడంతో.. కెమెరాలు వేదికవైపు సెట్ చేసి కింద కూర్చోవాలని, లేదంటే అక్కడి నుంచి తప్పుకోవాలని చెప్పారు. దీనికి నిరసనగా కొంతమంది పాత్రికేయులు సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో సీఎం మీడియాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తర్వాత సర్దుకొన్న ఆయన.. పుష్కరాలు విజయవంతంలో మీడియా కృషి మరువలేనిదంటూ ప్రశంసల వర్షం కురిపించారు. మహాపుష్కర వనానికి శంకుస్థాపన రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం అన్నారు. రాజమండ్రి సమీపంలోని దివాన్‌చెరువు రిజర్వు ఫారెస్టు ఏరియాలో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న గోదావరి మహాపుష్కర వనానికి సీఎం శంకుస్థాపన చేశారు. గోదావరి మహాపుష్కరాల పైలాన్‌ని ఆవిష్కరించారు. 2015 పుష్కరాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని, కోట్లాది మంది భక్తజనం పుణ్యస్నానాలు ఆచరించి తరించారన్నారు. సీఎం వెంట మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి, మేయర్ పంతం రజనీశేషసాయి, కలెక్టర్ హెచ్ అరుణకుమార్ తదితరులు ఉన్నారు.