పుష్కర విజయం సమష్టి కృషి ఫలితం
అభినందన సభలో సీఎం
సాక్షి, రాజమండ్రి, రాజానగరం: ప్రభుత్వంలోని అన్ని విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల సమష్టి కృషితోనే గోదావరి పుష్కరాలు విజయవంతమయ్యూయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సిబ్బందిలో ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు పోటీపడి ఈ క్రతువును జయప్రదం చేశారన్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన ఉద్యోగుల అభినందన సభలో ఆయన మాట్లాడారు. పుష్కరాల్లో సేవలందించిన ఉద్యోగులకు సోమవారం నుంచి రెండు రోజులను సెలవులుగా ప్రకటించారు.
ఆ కుటుంబాలను ఆదుకుంటాం..
పుష్కరాల ప్రారంభం రోజున రాజమండ్రి పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన 29 మంది కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం చెప్పారు. అనంతరం పుష్కరాల్లో సేవలందించిన అధికారులకు జ్ఞాపికలు అందజేశారు.
మీడియాపై చిందులు...
అభినందన సభలో మీడియాపై సీఎం చిందులేశారు. ‘వెళ్లిపోతే శాశ్వతంగా వెళ్లిపోండి. నోబడీ కెన్ డిక్టేట్. ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు. గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారు...’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. వాస్తవానికి సభలో మీడియాకు ప్రత్యేకంగా గ్యాలరీ కేటాయించినప్పటికీ ఇతరులు కూర్చుండిపోవడంతో పాత్రికేయులు, వీడియోగ్రాఫర్లు వీఐపీ గ్యాలరీ వెనుక నిలబడి చిత్రీకరిస్తుండగా వెనుకనున్న ఉద్యోగులు తమకు వేదిక కనబడలేదంటూ గొడవ చేశారు.
దీంతో వేదికపై నుంచి సీఎం కలగజేసుకుంటూ ఫొటోగ్రాఫర్లంతా పక్కకు వచ్చేయాలన్నారు. తామెలా తీయాలంటూ వారంతా అనడంతో.. కెమెరాలు వేదికవైపు సెట్ చేసి కింద కూర్చోవాలని, లేదంటే అక్కడి నుంచి తప్పుకోవాలని చెప్పారు. దీనికి నిరసనగా కొంతమంది పాత్రికేయులు సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో సీఎం మీడియాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తర్వాత సర్దుకొన్న ఆయన.. పుష్కరాలు విజయవంతంలో మీడియా కృషి మరువలేనిదంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
మహాపుష్కర వనానికి శంకుస్థాపన
రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం అన్నారు. రాజమండ్రి సమీపంలోని దివాన్‌చెరువు రిజర్వు ఫారెస్టు ఏరియాలో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న గోదావరి మహాపుష్కర వనానికి సీఎం శంకుస్థాపన చేశారు. గోదావరి మహాపుష్కరాల పైలాన్‌ని ఆవిష్కరించారు.
2015 పుష్కరాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని, కోట్లాది మంది భక్తజనం పుణ్యస్నానాలు ఆచరించి తరించారన్నారు. సీఎం వెంట మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి, మేయర్ పంతం రజనీశేషసాయి, కలెక్టర్ హెచ్ అరుణకుమార్ తదితరులు ఉన్నారు.