నన్నయ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత
నన్నయ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత
Published Fri, Apr 21 2017 10:23 PM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM
యూజీసీ కమిటీ బృందం
రాజ రాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ 12బీ గుర్తింపు ఇచ్చేందుకు అవసరమైన సకల సదుపాయాలు కలిగి ఉందని యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. గోదావరి జిల్లాల్లో అతిపెద్ద యూనివర్సిటీ ఉండడం ఉభయ గోదావరి జిల్లావాసుల అదృష్టంగా పేర్కొంటూ దీనిని మరింతగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొంది. యూనివర్సిటీలో కమిటీ చైర్మన్, బిలాస్‌పూర్ యూనివర్సిటీ వీసీ ఆచార్య జి.డి.శర్మ, సభ్యులు ఆచార్య ఎస్‌వీఎస్ చౌదరి, ఆచార్య ఎం. శ్యామలాదేవి, డాక్టర్ జి.శ్రీనివాస్‌లు రెండోరోజైన శుక్రవారం కూడా పర్యటించారు. ఇంగ్లిష్, మేనేజ్‌మెంట్, మ్మాథ్స్, కెమిస్ట్రీ, జువాలజీ, జియాలజీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల విద్యార్థులు, అధ్యాపకుల నుంచి తీసుకున్న సమాచారం, పరిశీలించిన వివిధ అంశాలు ఆధారంగా నివేదికను తయారుచేశారు. క్యాంపస్‌లోని కళాశాలల భవనాలు, కేంద్ర గ్రంధాలయం, హస్టల్స్, హెల్త్ సెంటర్, తదితర భవనాలను, వాటి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకున్నారు. వచ్చిన అవార్డులు, రివార్డులను పరిశీలించారు. అనంతరం యూజీసీ కమిటీ చైర్మన్ ఆచార్య జీడీ శర్మ మాట్లాడుతూ యూనివర్సిటీలో అన్ని విభాగాలను పరిశీలించామన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ సేవలు ప్రÔశంసనీయమన్నారు. స్వచ్ఛభారత్, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం వంటి పలు కార్యక్రమాలు చేస్తూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. సుంకర వినయ్ పౌండేషన్ ఏర్పాటు చేసిన హెల్త్ సెంటర్ సేవలను ప్రశంసించారు. సమస్యలను ఎదుర్కొంటూనే మంచి ప్రగతిని తక్కువ సమయంలోనే సాధించడంలో ఉపకులపతి ఆచార్య ముత్యాలునాయుడు కృషి హర్షణీయమన్నారు. దీనిపై ఉపకులపతి స్పందిస్తూ సమష్టి సహకారంతోనే దీనిని సాధించామన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహరావు, డీన్స్ ఆచార్య ఎస్. టేకి, ప్రిన్సిపాల్స్ ఆచార్య పి. సురేష్‌వర్మ, ఆచార్య కెఎస్ రమేష్, డాక్టర్ మట్టారెడ్డి, డాక్టర్ కె. సుబ్బారావు, డాక్టర్ వై. శ్రీనివాసరావు, డాక్టర్ పి. వెంకటేశ్వర్రావు, డాక్టర్ పి. విజయనిర్మల, తదితరులు పాల్గొన్నారు.
యూజీసీ కమిటీ సభ్యులను ఆకర్షించిన ‘సాక్షి’ కథనం
ఆదికవి నన్నయ యూనివర్సిటీ 2006 ఏప్రిల్‌లో ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటూ సమష్టి సహకారంతో ఎదిగిన విధానంపై ‘సాక్షి’ ‘నన్నయే మిన్నయా’ అనే శీర్షికన శుక్రవారం ప్రచురించిన కథనం యూజీసీ కమిటీ సభ్యులను విశేషంగా ఆకట్టుకుంది. సాక్షి పత్రికను చూసిన కమిటీ సభ్యులు వార్త వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. యూనివర్సిటీ నుంచి తీసుకున్న సమాచారంతో పాటు ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని తమ ఫైల్‌లో పొందుపర్చుకున్నారు.
Advertisement
Advertisement