comitee
-
‘ఓం’ పై నేపాల్‌కు ఎందుకు ద్వేషం? ‘సనాతనం’పై ఎందుకంత చర్చ?
నేపాల్ ప్రభుత్వం నేపాల్ అధికారిక నిఘంటువు నుండి కొన్ని ప్రత్యేక పదాలను తొలగించడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ పదాలలో ఒకటి ‘ఓం’. ఇది సనాతన ధర్మానికి చిహ్నం. నేపాల్‌లో 20216వ సంవత్సరం నుండి నిఘంటువును మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ అంశంపై నేపాల్ సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నేపాల్ ప్రభుత్వం తీరుపై సనాతన ధర్మాన్ని నమ్ముతున్న అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా నేపాల్ అధికారిక డిక్షనరీ నుంచి ‘ఓం’ పదాన్ని తొలగించే అంశం ఇటీవలిది కాదు. 2012 నుంచి కొనసాగుతోంది. నాడు నేపాల్‌లో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఉంది. అప్పటి విద్యాశాఖ మంత్రి దీనానాథ్ శర్మ ఆదేశాల మేరకు డిక్షనరీలో మార్పులు చేసేందుకు కమిటీని వేశారు. కమిటీ నివేదిక ఆధారంగా బుద్ధుడు, బ్రాహ్మణుడు మొదలైన వాటితో పాటు ఓం, శ్రీ తదితర పదాలన్నింటినీ నిఘంటువు నుండి తొలగించాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వంలోని సంకీర్ణమైన సోషలిస్టు ఫ్రంట్ వ్యతిరేకిస్తోంది. నేపాలీ కాంగ్రెస్ ఎంపీ శంకర్ భండారీ ఈ అంశంపై ప్రభుత్వాన్ని బహిరంగంగా దుయ్యబడుతున్నారు. నేపాల్ అధికారిక డిక్షనరీ నుంచి ‘ఓం’ పదాన్ని తొలగించడం సనాతన సంస్కృతిపై దాడి చేయడం లాంటిదేనని ఆయన ఆరోపించారు. ఇది పాశ్చాత్య దేశాల ప్రభావంతో జరుగుతున్న కుట్రగా ఆయని దీనిని అభివర్ణించారు. సనాతన ధర్మంలో ‘ఓం’ అనే పదాన్ని శివుని చిహ్నంగా పరిగణిస్తారు. ఇది చాలా పవిత్రమైనదని, శక్తివంతమైనదని చెబుతారు. చాలా మంత్రాలు ‘ఓం’ అనే పదంతోనే ప్రారంభమవుతాయి. ఇది కూడా చదవండి: ఆశారాం నుంచి రామ్ రహీం వరకూ ఏం చదువుకున్నారు? -
'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు తొలి నిర్ణయం
Manchu Vishnu Announced Women Empowerment and Grievance Cell: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు తొలి నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మాలో మహిళల భద్రత, సాధికారతను పెంపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారని వెల్లడించారు. విమెన్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్(WEGC)ను ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని, మహిళల సాధికారిత కోసం ఈ కమిటీ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇక ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉంటారని, త్వరలోనే కమిటీ మెంబర్లను ప్రకటిస్తామని వెల్లడించారు. #MAA growing stronger and more accountable! More Power to Women 💪🏽 pic.twitter.com/OSkAQSEUJF — Vishnu Manchu (@iVishnuManchu) October 22, 2021 -
‘ఓజోన్’ ఉచ్చు ఎవరి మెడకు?
సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)లో పెను ప్రకంపనలు సృష్టించిన ఓజోన్ వేలీ కుంభకోణంపై మళ్లీ విచారణ మొదలు కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం వెలుగు చూసిన ఈ అవినీతి బాగోతంలో వుడా ఉన్నతస్థాయి అధికారులతో పాటు దిగువ స్థాయి ఉద్యోగులు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో కొంతమందిపై చర్యలు తీసుకున్నా కీలక సూత్రధారులు, పాత్రధారులూ తమ పలుకుబడి, ప్రాపకంతో తప్పించుకున్నారు. పరదేశిపాలెంలోని ఓజోన్ వేలీ సహా రుషికొండ, మధురవాడ, ఎంవీపీసెక్టార్–1,2,3, కూర్మన్నపాలెం, పెదగంట్యాడ, ఆదిభట్లనగర్, ఎండాడల్లోని పది లేఅవుట్లలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు 2010లోనే తేటతెల్లమైంది. వుడా తొలిసారిగా చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌లో ప్రభుత్వ, జిరాయితీ, డి.పట్టా భూములను సేకరించారు. ఇందులో డి.పట్టా యజమానుల నుంచి సేకరించిన భూముల్లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. అంతకుముందు రూరల్ ఎమ్మార్వోగా పనిచేసి వుడా ఎస్టేట్ అధికారిగా, కార్యదర్శిగా పనిచేసిన జగదీష్ ఈ కుంభకోణంలో కీలకపాత్రధారిగా గుర్తించారు. రూరల్ ఎమ్మార్వో పరిధిలో తనకున్న అనుభవాన్ని లేఅవుట్ల బాగోతంలో రంగరించినట్టు అప్పట్లో తేల్చారు. ల్యాండ్‌పూలింగ్ సంగతిని ముందుగా తెలుసుకున్న ఆయన డి.పట్టాదారులతో మంతనాలు సాగిం చి వారి నుంచి కొంతమంది బినామీల పేరిట జీపీఏ రాయించుకోవడం.. నిబంధనల ప్రకా రం ఎకరానికి 1200 బదులు 1500 గజాలు ఇచ్చేలా జీవో ఇప్పించడం.. కోరుకున్న చోట్ల ఈ జాగాను ఇప్పించడం.. ఆ స్థలాలను రిజిస్ట్రేషన్లు చేసేయడం.. ఈ వ్యవహారంలో సహకరించిన అప్పటి మున్సిపల్ మంత్రికి, 15 వేల గజాలకు బదులు 12 వేలిచ్చినట్టు ఆరోపణలు రావడం.. అందులో తేడాలు రావడంతో ఈ బాగోతం బయటపడింది. వీసీ విష్ణుపై అభియోగాలు.. ఈ అక్రమాలకు అప్పటి వీసీ వీఎన్ విష్ణు సహకారం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఆయన తర్వాత వీసీగా వచ్చిన కోన శశిధర్ ఈ కుంభకోణం లోతుకెళ్లి విచారణ జరిపించాలంటూ ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై 2014లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ లేఅవుట్లలో అక్రమాలు నిజమేనని నిగ్గుతేల్చారు. ఆ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. దీనికి బాధ్యులైన నలుగురు వుడా ఉద్యోగులను, బినామీలను, మరికొందరు బాధ్యులను అరెస్టు చేశారు. ఈ వ్యవహారానికి కీలకపాత్రధారిగా భావిస్తున్న జగదీష్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. వీసీగా పనిచేసిన విష్ణు తెలంగాణ కేడర్‌కు వెళ్లిపోయారు. ఇంకొందరు పదవీ విరమణ చేశారు. ఈ కుంభకోణంలో కీలక వ్యక్తులను వదిలేశారన్న ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. తాజాగా ఇప్పుడు సీసీఎల్ఏ ప్రత్యేక కమిషనర్, విజిలెన్స్ జాయింట్ కమిషనర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వోలతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. సీసీఎల్ఏ జాయింట్ డైరెక్టర్ శారదాదేవి నేతృత్వంలో రెండ్రోజులు (గురు, శుక్రవారాలు) ఈ కమిటీ ఈ లేఅవుట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, రికార్డులను పరిశీలించింది. వివాదాస్పద లేఅవుట్లను త్వరలో స్వయంగా పరిశీలించాలని నిర్ణయించారు. సంబంధిత డాక్యుమెంట్లు, రికార్డులను కమిటీ సభ్యులు పరిశీలనకు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కమిటీ ప్రాథమిక పరిశీలనను ముగించినట్టు తెలుస్తోంది. ఈ కమిటీ తన నివేదికను రెండు నెలల్లో ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. -
నన్నయ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత
యూజీసీ కమిటీ బృందం రాజ రాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ 12బీ గుర్తింపు ఇచ్చేందుకు అవసరమైన సకల సదుపాయాలు కలిగి ఉందని యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. గోదావరి జిల్లాల్లో అతిపెద్ద యూనివర్సిటీ ఉండడం ఉభయ గోదావరి జిల్లావాసుల అదృష్టంగా పేర్కొంటూ దీనిని మరింతగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొంది. యూనివర్సిటీలో కమిటీ చైర్మన్, బిలాస్పూర్ యూనివర్సిటీ వీసీ ఆచార్య జి.డి.శర్మ, సభ్యులు ఆచార్య ఎస్వీఎస్ చౌదరి, ఆచార్య ఎం. శ్యామలాదేవి, డాక్టర్ జి.శ్రీనివాస్‌లు రెండోరోజైన శుక్రవారం కూడా పర్యటించారు. ఇంగ్లిష్, మేనేజ్మెంట్, మ్మాథ్స్, కెమిస్ట్రీ, జువాలజీ, జియాలజీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల విద్యార్థులు, అధ్యాపకుల నుంచి తీసుకున్న సమాచారం, పరిశీలించిన వివిధ అంశాలు ఆధారంగా నివేదికను తయారుచేశారు. క్యాంపస్‌లోని కళాశాలల భవనాలు, కేంద్ర గ్రంధాలయం, హస్టల్స్, హెల్త్ సెంటర్, తదితర భవనాలను, వాటి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకున్నారు. వచ్చిన అవార్డులు, రివార్డులను పరిశీలించారు. అనంతరం యూజీసీ కమిటీ చైర్మన్ ఆచార్య జీడీ శర్మ మాట్లాడుతూ యూనివర్సిటీలో అన్ని విభాగాలను పరిశీలించామన్నారు. ఎన్ఎస్ఎస్ సేవలు ప్రÔశంసనీయమన్నారు. స్వచ్ఛభారత్, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం వంటి పలు కార్యక్రమాలు చేస్తూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. సుంకర వినయ్ పౌండేషన్ ఏర్పాటు చేసిన హెల్త్ సెంటర్ సేవలను ప్రశంసించారు. సమస్యలను ఎదుర్కొంటూనే మంచి ప్రగతిని తక్కువ సమయంలోనే సాధించడంలో ఉపకులపతి ఆచార్య ముత్యాలునాయుడు కృషి హర్షణీయమన్నారు. దీనిపై ఉపకులపతి స్పందిస్తూ సమష్టి సహకారంతోనే దీనిని సాధించామన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎ. నరసింహరావు, డీన్స్ ఆచార్య ఎస్. టేకి, ప్రిన్సిపాల్స్ ఆచార్య పి. సురేష్‌వర్మ, ఆచార్య కెఎస్ రమేష్, డాక్టర్ మట్టారెడ్డి, డాక్టర్ కె. సుబ్బారావు, డాక్టర్ వై. శ్రీనివాసరావు, డాక్టర్ పి. వెంకటేశ్వర్రావు, డాక్టర్ పి. విజయనిర్మల, తదితరులు పాల్గొన్నారు. యూజీసీ కమిటీ సభ్యులను ఆకర్షించిన ‘సాక్షి’ కథనం ఆదికవి నన్నయ యూనివర్సిటీ 2006 ఏప్రిల్‌లో ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటూ సమష్టి సహకారంతో ఎదిగిన విధానంపై ‘సాక్షి’ ‘నన్నయే మిన్నయా’ అనే శీర్షికన శుక్రవారం ప్రచురించిన కథనం యూజీసీ కమిటీ సభ్యులను విశేషంగా ఆకట్టుకుంది. సాక్షి పత్రికను చూసిన కమిటీ సభ్యులు వార్త వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. యూనివర్సిటీ నుంచి తీసుకున్న సమాచారంతో పాటు ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని తమ ఫైల్లో పొందుపర్చుకున్నారు. -
పేనుకు పెత్తనం ఇస్తే..
రాజ్యాంగేతర శక్తిగా మారిన జన్మభూమి కమిటీలు వాటికి తలవంచిన అధికారులు రద్దు చేసిన వృద్ధుల పింఛన్లకు న్యాయపోరాటం మండల లీగల్ సెల్ అధారిటీ ఆదేశాలు బేఖాతరు ముఖ్యమంత్రి చంద్రబాబు తయారుచేసిన జన్మభూమి కమిటీ వ్యవస్థ.. రాజ్యాంగేతర శక్తిగా మారి..అధికారులను నిర్వీర్యం చేస్తోంది. ప్రభుత్వ పథకాల అమల్లో ఈ కమిటీల పెత్తనం.. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తోంది. గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలను జన్మభూమి కమిటీలుగా నియమించి వారి ద్వారా చేస్తున్న పాలన ప్రజాస్వామికవాదులను విస్తుబోయేలా చేస్తోంది. పథకాల అమలు చేయడంలో వారు చెప్పిందే వేదమన్నట్టుగా అధికారులు కూడా వ్యవహరిస్తుండడంతో అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిపోతోంది. ఈ కమిటీ పరిస్థితి.. పేనుకు పెత్తనం ఇస్తే.. అన్న చందంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -రామచంద్రపురం రూరల్ (రామచంద్రపురం) ఎవరికైనా రుణాలు, సంక్షేమ పథకాలు కావాలంటే జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సిందే. గ్రామ, మండల స్థాయిలో ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను ఈ జన్మభూమి కమిటీలు.. జీరోలు చేస్తున్నాయి. మండలం కాపవరంలో కేవలం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులన్న కారణంతో అర్హులైన 9 మంది వృద్ధులకు పింఛన్లను ఈ కమిటీలు తొలగించాయి. వీరిలో ఐదుగురు మహిళలు, నలుగురు బీసీకి చెందిన వారు ఉన్నారు. మండల, జిల్లా గ్రీవెన్స్‌సెల్‌లో వీరు ఎన్నోసార్లు లిఖిత పూర్వకంగా అర్జీలు దాఖలు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో గ్రామంలోని మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు కొల్లూరి వరాహ లక్ష్మీనరసింహశాస్త్రి (విష్ణు) సహకారంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరు పింఛన్లకు అర్హులేనని, ఫిబ్రవరి 4వ తేదీలోగా వీరికి పింఛన్లు పంపిణీ చేయాలని జనవరి 21న మండల లీగల్ సెల్ అధారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ విషయంలో జన్మభూమి కమిటీని కాదని తానేమీ చేయలేనంటూ ఎంపీడీఓ చేతులెత్తేశారు. దివంగత సీఎం వైఎస్ పాలనలో మంజూరు చేసిన పింఛన్లను రెండేళ్లుగా ఇవ్వనందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ఈ పింఛనుదారుల నరాల లోవరాజు, గీసాల మునియ్య, నరాల పాపయ్య, వజ్రపు యల్లారమ్మ, కొల్లపు శ్రీరాములు, పెట్టా సత్యం, నరాల తణుకులు, గీసాల కృష్ణమూర్తి, కొల్లపు చినసూరయ్య ప్రశ్నిస్తున్నారు. జన్మభూమి కమిటీలను ప్రజల నెత్తిన రుద్దిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహిస్తారా? అంటూ నిలదీస్తున్నారు. న్యాయాధికారి ఆదేశించినా పింఛను ఇచ్చేందుకు చర్యలు తీసుకోకుంటే.. న్యాయం కోసం ఎక్కడకి వెళ్లాలని వారు అడుగుతున్నారు జన్మభూమి కమిటీ శాపంలా దాపురించింది.. అధికారులకు, ఎమ్మెల్యేకు మా బాధలు చెప్పుకున్నాం. న్యాయ శాఖను ఆశ్రయించాం. అయినా మా వేదన అరణ్య రోదన అయింది. జన్మభూమి కమిటీ మా పాలిట శాపంలా దాపురించింది. - నరాల పాపయ్య రెండో పూట గడవని దుస్థితి.. ఒక పూట తింటే రెండో పూట గడవని దుస్థితి నాది. నా పింఛన్‌ను జన్మభూమి కమిటీ వాళ్లు తీసేశారు. మరో దారి లేదు. పింఛన్ తిరిగి ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నాను. - కొల్లపు చిన సూర్యారావు అధికారుల తీరు బాధాకరం వృద్ధుల పింఛన్ల రద్దు విషయంపై న్యాయ వ్యవస్థ ఆదేశించిన తరువాతైనా అధికారులు కళ్లు తెరవకపోవడం బాధాకరం. అధికారులు ఇప్పటికైనా వారికి న్యాయం చేయాలి. - కొల్లూరి వరాహ లక్ష్మీనరసింహశాస్త్రి (విష్ణు), మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుంది మండల లీగల్ సెల్ అధారిటీ ఆదేశించినా పింఛన్ల మంజూరుకు అధికారులు.. జన్మభూమి కమిటీకే తలొగ్గడం గర్హనీయం. పరిస్థితి ఇలా ఉంటే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతుంది. - అంగర గోపాలాచార్యులు, హైకోర్టు న్యాయవాది హైకోర్టు అప్పీలుకు వెళ్లాం వీరికి పింఛన్లు పంపిణీ చేయమని మండల లీగల్ సెల్ అధారిటీ ఆదేశించడం వాస్తవమే. అయితే జన్మభూమి కమిటీ సభ్యులు అంగీకరించకుండా ఇచ్చే పరిస్థితి లేదు. దీనిపై హైకోర్టుకు అప్పీలు వెళ్లాం. - పీవీవీ సత్యనారాయణ, ఎంపీడీఓ -
డబ్బు దండుతున్న జన్మభూమి కమిటీలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జన్మభూమి కమిటీ సభ్యులు ప్రజల నుంచి డబ్బు దండుకుంటున్నారని, ప్రభుత్వ పథకాలు అనర్హులకు అందిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ ఆర్అండ్బీ అతిథిగృహంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జన్మభూమి కమిటీ సభ్యులు దళారులుగా తయారయ్యారన్నారు. పిఠాపురంలో పింఛన్లు, కాకినాడ కార్పొరేషన్లో వ్యక్తిగత మరుగుదొడ్లు అనర్హులకు అందించిన విషయం ఇప్పటికే బయట పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో సైతం కమిటీల పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. నిజమైన లబ్ధిదారులకు అందాల్సిన పథకాలు కమిటీల కారణంగా పక్కదోవ పడుతున్నాయన్నారు. కాకినాడలో ఇష్టానుసారంగా కార్పొరేషన్ స్థలాలు ఆక్రమించి భవనాలు నిర్మించుకుంటున్న వారికి అధికారులు అనుమతులు ఇస్తున్నారన్నారు. ఇటీవల రూ.రెండుకోట్ల స్థలం ఆక్రమణకు గురయిందని , కార్పొరేషన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మూడు సంవత్సరాలుగా కార్పొరేషన్ నిధులు పక్కదారి పట్టాయని, కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి అరుణ్‌కుమార్ ఈ విషయంపై విచారణ చేపట్టాలని , వెంటనే బాధ్యుడైన కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడకు కేంద్ర ప్రభుత్వం 4,600 ఇళ్లు మంజూరు చేసిందని, ఇప్పటివరకూ ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేశారో అ«ధికారులు చెప్పడం లేదన్నారు. కార్పొరేషన్లో ప్రతి విభాగంలోను అవినీతి పేరుకుపోయిందన్నారు. వెంటనే విచారణ చేపట్టి అధికారులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే అవినీతికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదన్నారు. బీజేపీ నగర అధ్యక్షుడు పెద్దిరెడ్డి రవికిరణ్, మహిళామోర్చా నాయకురాలు కోరాడ లక్ష్మీతులసి పాల్గొన్నారు. -
పింఛన్లనూ భోంచేస్తున్న ‘పచ్చ’ బకాసురులు
జన్మభూమి కమిటీలదే లబ్ధిదారుల ఎంపిక వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజా రాజానగరం : ఏ ఆశ్రయం లేని వారికి ప్రభుత్వం అందించే పింఛన్లను సైతం అర్హులకు అందకుండా అధికార పార్టీ పెద్దలే గెద్దల్లా తన్నుకుపోతున్నారని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో అమలు చేస్తున్న పథకంలో లబ్ధిదారుల ఎంపికలో అధికారులను పక్కకు నెట్టి జన్మభూమి కమిటీలతో చేయిస్తూ పచ్చ చొక్కాలు చక్రం తిప్పుతున్నాయన్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు బకాసురుల్లా గోదావరిలో ఇసుక, కొండలను, చెరువులను భోంచేస్తూ వస్తున్న అధికార పార్టీ పెద్దలు ఇప్పుడు పింఛన్లను కూడా స్వాహా చేస్తున్నారని విమర్శించారు. రాజానగరం మండలం కొండగుంటూరులో శనివారం పర్యటించిన ఆయనకు అనేక మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తమకు పింఛన్లు ఇవ్వడం లేదంటూ గత రెండున్నరేళ్లుగా వాటి కోసం తాము పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. దానిపై ఆయన స్పందిస్తూ, గతంలో నెలకు రూ.200 చొప్పున పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ పింఛన్లను అందజేసిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనన్నారు. ఈ మొత్తాన్ని రూ.వెయ్యి, రూ.1500 లకు పెంచుతామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలను ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారన్నారు. కాని అధికారంలోకి వచ్చాక పింఛను సొమ్మును పెంచినా వడపోత పేరుతో తమ పార్టీ కాని వారందరి పింఛన్లను రద్దు చేశారని విమర్శించారు. అంతటితో ఆగకుండా కొత్తగా మంజూరైన పింఛన్లకు లబ్ధిదారులుగా కూడా తమ పార్టీకి చెందిన వారినే ఎంపిక చేస్తూ రాజకీయం చేయడం విచారకరమన్నారు. తాజా పింఛన్లలోనూ ఇదే అన్యాయం జన్మభూమి – మన ఊరు గ్రామసభలలో దరఖాస్తు చేసుకున్న వారిని ప్రాధాన్యతల ప్రకారం లబ్ధిదారులుగా ఎంపిక చేయవలసి ఉండగా టీడీపీకి చెందిన వారా, కాదా, అంటూ పరిశీలించి ఎంపిక చేయడం హేయమని రాజా అన్నారు. తాజాగా నియోజకవర్గానికి రెండు వేల చొప్పున మంజూరైన పింఛన్లకు లబ్ధిదారుల ఎంపికలోను ఇదే పంథాను అనుసరిస్తున్నారన్నారు. రాజానగరం నియోజవర్గంలో ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జన్మభూమి కమిటీ సభ్యులు రాత్రికి రాత్రి తమ అనుయాయులను లబ్ధిదారులుగా ఎంపిక చేసి, ఆన్లైన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారని ఆరోపించారు. ఈ విషయంలో ఎంపీడీఓలకు కూడా ప్రమేయం లేకుండా చేస్తున్నారంటే అధికార పార్టీ అరాచకాలు ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇకనైనా వీరి ఆగడాలకు చెక్ పెట్టేందుకు ప్రజల్లో తిరుగుబాటు రావాలన్నారు. పాలకుల అకృత్యాలను, అరాచకాలను తెలియజేస్తూ, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే తమ పార్టీ గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. పింఛన్ల బాగోతంపై సీతానగరంలో సోమవారం బహిరంగ సమావేశం నిర్వహించనున్నామన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మండారపు వీర్రాజు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు అనదాసు సాయిరామ్, పేపకాయల విష్ణుమూర్తి, వేమగిరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.