పింఛన్లనూ భోంచేస్తున్న ‘పచ్చ’ బకాసురులు
పింఛన్లనూ భోంచేస్తున్న ‘పచ్చ’ బకాసురులు
Published Sat, Jan 21 2017 11:00 PM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM
జన్మభూమి కమిటీలదే లబ్ధిదారుల ఎంపిక
వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజా
రాజానగరం : ఏ ఆశ్రయం లేని వారికి ప్రభుత్వం అందించే పింఛన్లను సైతం అర్హులకు అందకుండా అధికార పార్టీ పెద్దలే గెద్దల్లా తన్నుకుపోతున్నారని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో అమలు చేస్తున్న పథకంలో లబ్ధిదారుల ఎంపికలో అధికారులను పక్కకు నెట్టి జన్మభూమి కమిటీలతో చేయిస్తూ పచ్చ చొక్కాలు చక్రం తిప్పుతున్నాయన్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు బకాసురుల్లా గోదావరిలో ఇసుక, కొండలను, చెరువులను భోంచేస్తూ వస్తున్న అధికార పార్టీ పెద్దలు ఇప్పుడు పింఛన్లను కూడా స్వాహా చేస్తున్నారని విమర్శించారు. రాజానగరం మండలం కొండగుంటూరులో శనివారం పర్యటించిన ఆయనకు అనేక మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తమకు పింఛన్లు ఇవ్వడం లేదంటూ గత రెండున్నరేళ్లుగా వాటి కోసం తాము పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. దానిపై ఆయన స్పందిస్తూ, గతంలో నెలకు రూ.200 చొప్పున పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ పింఛన్లను అందజేసిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనన్నారు. ఈ మొత్తాన్ని రూ.వెయ్యి, రూ.1500 లకు పెంచుతామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలను ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారన్నారు. కాని అధికారంలోకి వచ్చాక పింఛను సొమ్మును పెంచినా వడపోత పేరుతో తమ పార్టీ కాని వారందరి పింఛన్లను రద్దు చేశారని విమర్శించారు. అంతటితో ఆగకుండా కొత్తగా మంజూరైన పింఛన్లకు లబ్ధిదారులుగా కూడా తమ పార్టీకి చెందిన వారినే ఎంపిక చేస్తూ రాజకీయం చేయడం విచారకరమన్నారు.
తాజా పింఛన్లలోనూ ఇదే అన్యాయం
జన్మభూమి – మన ఊరు గ్రామసభలలో దరఖాస్తు చేసుకున్న వారిని ప్రాధాన్యతల ప్రకారం లబ్ధిదారులుగా ఎంపిక చేయవలసి ఉండగా టీడీపీకి చెందిన వారా, కాదా, అంటూ పరిశీలించి ఎంపిక చేయడం హేయమని రాజా అన్నారు. తాజాగా నియోజకవర్గానికి రెండు వేల చొప్పున మంజూరైన పింఛన్లకు లబ్ధిదారుల ఎంపికలోను ఇదే పంథాను అనుసరిస్తున్నారన్నారు. రాజానగరం నియోజవర్గంలో ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జన్మభూమి కమిటీ సభ్యులు రాత్రికి రాత్రి తమ అనుయాయులను లబ్ధిదారులుగా ఎంపిక చేసి, ఆన్‌లైన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారని ఆరోపించారు. ఈ విషయంలో ఎంపీడీఓలకు కూడా ప్రమేయం లేకుండా చేస్తున్నారంటే అధికార పార్టీ అరాచకాలు ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇకనైనా వీరి ఆగడాలకు చెక్ పెట్టేందుకు ప్రజల్లో తిరుగుబాటు రావాలన్నారు. పాలకుల అకృత్యాలను, అరాచకాలను తెలియజేస్తూ, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే తమ పార్టీ గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. పింఛన్ల బాగోతంపై సీతానగరంలో సోమవారం బహిరంగ సమావేశం నిర్వహించనున్నామన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మండారపు వీర్రాజు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు అనదాసు సాయిరామ్, పేపకాయల విష్ణుమూర్తి, వేమగిరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement