డబ్బు దండుతున్న జన్మభూమి కమిటీలు
డబ్బు దండుతున్న జన్మభూమి కమిటీలు
Published Tue, Feb 21 2017 10:59 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జన్మభూమి కమిటీ సభ్యులు ప్రజల నుంచి డబ్బు దండుకుంటున్నారని, ప్రభుత్వ పథకాలు అనర్హులకు అందిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జన్మభూమి కమిటీ సభ్యులు దళారులుగా తయారయ్యారన్నారు. పిఠాపురంలో పింఛన్లు, కాకినాడ కార్పొరేషన్‌లో వ్యక్తిగత మరుగుదొడ్లు అనర్హులకు అందించిన విషయం ఇప్పటికే బయట పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో సైతం కమిటీల పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. నిజమైన లబ్ధిదారులకు అందాల్సిన పథకాలు కమిటీల కారణంగా పక్కదోవ పడుతున్నాయన్నారు. కాకినాడలో ఇష్టానుసారంగా కార్పొరేషన్ స్థలాలు ఆక్రమించి భవనాలు నిర్మించుకుంటున్న వారికి అధికారులు అనుమతులు ఇస్తున్నారన్నారు. ఇటీవల రూ.రెండుకోట్ల స్థలం ఆక్రమణకు గురయిందని , కార్పొరేషన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మూడు సంవత్సరాలుగా కార్పొరేషన్ నిధులు పక్కదారి పట్టాయని, కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి అరుణ్‌కుమార్ ఈ విషయంపై విచారణ చేపట్టాలని , వెంటనే బాధ్యుడైన కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడకు కేంద్ర ప్రభుత్వం 4,600 ఇళ్లు మంజూరు చేసిందని, ఇప్పటివరకూ ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేశారో అ«ధికారులు చెప్పడం లేదన్నారు. కార్పొరేషన్‌లో ప్రతి విభాగంలోను అవినీతి పేరుకుపోయిందన్నారు. వెంటనే విచారణ చేపట్టి అధికారులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే అవినీతికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదన్నారు. బీజేపీ నగర అధ్యక్షుడు పెద్దిరెడ్డి రవికిరణ్, మహిళామోర్చా నాయకురాలు కోరాడ లక్ష్మీతులసి పాల్గొన్నారు.
Advertisement