‘చుక్క’ల అంగళ్లపై.. సొంత సుంకం | demanding money wine shops | Sakshi
Sakshi News home page

‘చుక్క’ల అంగళ్లపై.. సొంత సుంకం

Published Wed, Nov 2 2016 11:59 PM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM

‘చుక్క’ల అంగళ్లపై.. సొంత సుంకం - Sakshi

‘చుక్క’ల అంగళ్లపై.. సొంత సుంకం

బ్రాందీ షాపులతో ప్రజాప్రతినిధుల దందా   
ప్రతి దుకాణం నుంచీ రూ.లక్షలు వసూలు
‘సీనియర్, జూనియర్‌’ తేడా లేకుండా దండుడు 
విరాళాల మాటున రసీదులూ ఇచ్చిన ఓ నేత 
వాటాల కోసం ‘అనాయాస’ నేతల ఆరాటం 
‘ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకు’లా నిషాజీవులపై భారం
సాక్షి, రాజమహేంద్రవరం : ‘కాదేదీ కవితకు అనర్హం’ అని కవి అంటే మన ప్రజా ప్రతినిధులు దానికి కొంచెం మార్చి ‘కాదేదీ కలెక్షన్‌ కు అనర్హం’ అంటున్నారు.  కాంట్రాక్టులు, ఇసుక రవాణా, మద్యం వ్యాపారం.. ఇలా ప్రతి దాంట్లో తమ మామూళ్లు దండుకుంటున్నారు. ఇవ్వకుంటే ఎక్కడ తమ పని, వ్యాపారం సక్రమంగా జరగనివ్వరోనన్న భయంతో వ్యాపారులు కిమ్మనకుండా అడిగినంతా సమర్పించుకుంటున్నారు. రాజమహేంద్రవరం నగర, రూరల్‌ నియోజకవర్గాల్లో కొందరు ప్రజా ప్రతినిధులు తమ నుంచి లక్షలకు లక్షలు గుంజినట్టు మద్యం వ్యాపారులు చెపుతున్నారు.  ‘ఎన్నికల్లో రూ. 15 కోట్లు ఖర్చయింది. అదంతా రాబట్టుకోవాలి కదా’ అంటూ ఓ సీనియర్‌ నేత మామూళ్ల వసూళ్లకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆయన ఇసుక రవాణాలో ప్రత్యేక ‘రుసుము’ వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తమ పార్టీ ‘ముఖ్యనేత’ కంటే సీనియర్‌ననే ఆ నేత మామూళ్ల వసూళ్లలో కూడా ముఖ్యనేతను మించిపోయారని అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. నగర, రూరల్‌ నియోజకవర్గాల్లో 15 బార్లు, 23 మద్యం దుకాణాలు  ఉన్నాయి. ఒక్కో దుకాణం నుంచి సదరు సీనియర్‌ నేతకు రూ. లక్ష చొప్పున చేరినట్లు సమాచారం. ఈ మధ్య ఇసుక దందాపై ఆ నేతను ముఖ్యనేత పిలిచి ‘క్లాస్‌’ తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయినా ముఖ్యనేతే రూ. వందల కోట్లలో ముడుపులు తీసుకుంటున్నప్పుడు తాను రూ. లక్షల్లో తీసుకుంటే తప్పేంటన్నట్లుగా ఆ ‘సీనియర్‌ నేత’ తన దారిలో ‘ముందుకు’ పోతూనే ఉన్నారంటున్నారు.
కొత్త అయినా.. సరికొత్త పంథాలో..
కొత్తగా ఎన్నికైన మరో నేత మామూళ్ల వసూళ్లలో సరికొత్తగా వ్యవహరిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ప్రజా ప్రతినిధిగా అన్ని వ్యవహారాలనూ వ్యాపార పంథాలోనే ‘చక్క’బెడుతూ సీనియర్‌ నేతలకే పాఠాలు చెప్పగలనంటున్నారు.  స్వచ్ఛంద సంస్థను స్థాపించి మరీ ‘విరాళాలు’ వసూలు చేస్తున్నారు. ఎవరైనా తనను అభినందిస్తూ ఇచ్చే విరాళాలు ఆ సంస్థ ఖాతాలో జమ చేస్తున్నారు. ‘విరాళాలు’ ఇచ్చిన వారికి ప్రత్యేకంగా రసీదులు కూడా ఇస్తున్నారు. అసలు మొదట మద్యం వ్యాపారుల నుంచి మామూళ్లు ఈ నేతే డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఆ నేతకు దుకాణాల వారీగా ‘విరాళాలు’ వెళ్లడంతోనే సీనియర్‌ నేత రంగంలోకి దిగారని, ’ఉభయ నియోజకవర్గాల్లోనూ నాదే ముఖ్య భూమిక’ అంటూ కన్నెర్ర జేశారని సమాచారం.     
స్టంట్లు చేస్తున్న అనాయాస నేతలు.. 
ఇద్దరు నేతలకూ మద్యం వ్యాపారుల నుంచి ముడుపు లు వెళ్లడంతో తామే తీసిపోయామా అని ‘అనాయాసం’ గా ప్రజాప్రతినిధులైన వారు వారి వాటా ల కోసం రం గంలోకి దిగారు. ‘ప్రత్యక్ష’ నేతలకే తప్ప మాకు ముడుపు లు ఇవ్వరా’ అంటూ రాయ‘బేరాలు’ నడిపారు. అప్పటికే రెండు నెలల ఆదాయాన్ని కోల్పోయిన మ ద్యం వ్యా పారులు ఇచ్చుకోలేమనడంతో తమ ధనాశకు జనప్రయోజనం ముసుగు తొడిగారు. వీరిలో ఒకరు మ ద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ, అరికట్టాలని పై అధికారులకు లేఖ రాస్తే మరొకరు ఎక్సైజ్‌ కార్యాల యం వద్ద  ఏకంగా ఆందోళనే చేశారు. సదరు నేతలి ద్దరూ ఆ తర్వాత ఈ విషయాన్నే విస్మరించడానికి కా రణం.. వారి వాటాలు వారికి ముట్టడమేనంటున్నారు.
ధర పెంచకతప్పదు..
ప్రజాప్రతినిధులు ఇలా ముడుపులు దండుకోవడంతో మద్యం వ్యాపారులు ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఒక్కొక్క బాటిల్‌పై రూ.10 చొప్పన అధికంగా తీసుకుంటున్నారు. ‘నేతలకు ముడుపులు ఇవ్వడంతో మూడు నెలల ఆదాయం కోల్పోయాం. ఇక నెలవారీగా అధికారులకు ఇచ్చే మామూళ్లు సరేసరి. ఇవన్నీ తట్టుకుని వ్యాపారం చేయాలంటే సరుకు ధర పెంచకుండా సాధ్యం కాదు’ అని ఓ మద్యం వ్యాపారి చెప్పారు. చేతనైతే జనం కన్నీరు తుడిచి, వారి జీవితాల్లో వెలుగు నింపాల్సిన వారు.. తమ స్వార్థం కోసం చివరికి ఇలా.. ఇల్లూ, ఒళ్లూ గుల్ల చేసుకుని, కుటుంబాలకు కటికచీకటిని మిగిల్చే నిషాజీవుల జేబులపై అదనపు భారం పడడానికి కారకులవడం ఎంత నీచం!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement