పేనుకు పెత్తనం ఇస్తే.. | janmabhoomi comitee pension issue | Sakshi
Sakshi News home page

పేనుకు పెత్తనం ఇస్తే..

Published Mon, Mar 13 2017 11:25 PM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

పేనుకు పెత్తనం ఇస్తే..

పేనుకు పెత్తనం ఇస్తే..

రాజ్యాంగేతర శక్తిగా మారిన జన్మభూమి కమిటీలు 
వాటికి తలవంచిన అధికారులు
రద్దు చేసిన వృద్ధుల పింఛన్లకు న్యాయపోరాటం
మండల లీగల్‌ సెల్‌ అధారిటీ ఆదేశాలు బేఖాతరు 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు తయారుచేసిన జన్మభూమి కమిటీ వ్యవస్థ.. రాజ్యాంగేతర శక్తిగా మారి..అధికారులను నిర్వీర్యం చేస్తోంది. ప్రభుత్వ పథకాల అమల్లో ఈ కమిటీల పెత్తనం.. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తోంది. గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలను జన్మభూమి కమిటీలుగా నియమించి వారి ద్వారా చేస్తున్న పాలన ప్రజాస్వామికవాదులను విస్తుబోయేలా చేస్తోంది. పథకాల అమలు చేయడంలో వారు చెప్పిందే వేదమన్నట్టుగా అధికారులు కూడా వ్యవహరిస్తుండడంతో అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిపోతోంది. ఈ కమిటీ పరిస్థితి.. పేనుకు పెత్తనం ఇస్తే.. అన్న చందంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
-రామచంద్రపురం రూరల్‌ (రామచంద్రపురం)
ఎవరికైనా రుణాలు, సంక్షేమ పథకాలు కావాలంటే జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సిందే. గ్రామ, మండల స్థాయిలో ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను ఈ జన్మభూమి కమిటీలు.. జీరోలు చేస్తున్నాయి. మండలం కాపవరంలో కేవలం దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభిమానులన్న కారణంతో అర్హులైన 9 మంది వృద్ధులకు పింఛన్లను ఈ కమిటీలు తొలగించాయి. వీరిలో ఐదుగురు మహిళలు, నలుగురు బీసీకి చెందిన వారు ఉన్నారు. మండల, జిల్లా గ్రీవెన్స్‌సెల్‌లో వీరు ఎన్నోసార్లు లిఖిత పూర్వకంగా అర్జీలు దాఖలు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో గ్రామంలోని మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు కొల్లూరి వరాహ లక్ష్మీనరసింహశాస్త్రి (విష్ణు) సహకారంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరు పింఛన్లకు అర్హులేనని, ఫిబ్రవరి 4వ తేదీలోగా వీరికి పింఛన్లు పంపిణీ చేయాలని జనవరి 21న మండల లీగల్‌ సెల్‌ అధారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ విషయంలో జన్మభూమి కమిటీని కాదని తానేమీ చేయలేనంటూ ఎంపీడీఓ చేతులెత్తేశారు. దివంగత సీఎం వైఎస్‌ పాలనలో మంజూరు చేసిన పింఛన్లను రెండేళ్లుగా ఇవ్వనందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ఈ పింఛనుదారుల నరాల లోవరాజు, గీసాల మునియ్య, నరాల పాపయ్య, వజ్రపు యల్లారమ్మ, కొల్లపు శ్రీరాములు, పెట్టా సత్యం, నరాల తణుకులు, గీసాల కృష్ణమూర్తి, కొల్లపు చినసూరయ్య ప్రశ్నిస్తున్నారు. జన్మభూమి కమిటీలను ప్రజల నెత్తిన రుద్దిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహిస్తారా? అంటూ నిలదీస్తున్నారు. న్యాయాధికారి ఆదేశించినా పింఛను ఇచ్చేందుకు చర్యలు తీసుకోకుంటే.. న్యాయం కోసం ఎక్కడకి వెళ్లాలని వారు అడుగుతున్నారు
జన్మభూమి కమిటీ శాపంలా దాపురించింది..
అధికారులకు, ఎమ్మెల్యేకు మా బాధలు చెప్పుకున్నాం. న్యాయ శాఖను ఆశ్రయించాం. అయినా మా వేదన అరణ్య రోదన అయింది. జన్మభూమి కమిటీ మా పాలిట శాపంలా దాపురించింది.
- నరాల పాపయ్య 
రెండో పూట గడవని దుస్థితి..
ఒక పూట తింటే రెండో పూట గడవని దుస్థితి నాది. నా పింఛన్‌ను జన్మభూమి కమిటీ వాళ్లు తీసేశారు. మరో దారి లేదు. పింఛన్‌ తిరిగి ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నాను.
- కొల్లపు చిన సూర్యారావు 
అధికారుల తీరు బాధాకరం
వృద్ధుల పింఛన్ల రద్దు విషయంపై న్యాయ వ్యవస్థ ఆదేశించిన తరువాతైనా అధికారులు కళ్లు తెరవకపోవడం బాధాకరం. అధికారులు ఇప్పటికైనా వారికి న్యాయం చేయాలి.
- కొల్లూరి వరాహ లక్ష్మీనరసింహశాస్త్రి (విష్ణు), మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు
ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుంది
మండల లీగల్‌ సెల్‌ అధారిటీ ఆదేశించినా పింఛన్ల మంజూరుకు అధికారులు.. జన్మభూమి కమిటీకే తలొగ్గడం గర్హనీయం. పరిస్థితి ఇలా ఉంటే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతుంది.
- అంగర గోపాలాచార్యులు, హైకోర్టు న్యాయవాది
హైకోర్టు అప్పీలుకు వెళ్లాం
వీరికి పింఛన్లు పంపిణీ చేయమని మండల లీగల్‌ సెల్‌ అధారిటీ ఆదేశించడం వాస్తవమే. అయితే జన్మభూమి కమిటీ సభ్యులు అంగీకరించకుండా ఇచ్చే పరిస్థితి లేదు. దీనిపై హైకోర్టుకు అప్పీలు వెళ్లాం.
- పీవీవీ సత్యనారాయణ, ఎంపీడీఓ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement