సమయం లేదా మిత్రమా! | bribery for pension sanction | Sakshi
Sakshi News home page

సమయం లేదా మిత్రమా!

Published Mon, Jan 22 2018 11:15 AM | Last Updated on Mon, Jan 22 2018 11:15 AM

bribery for pension sanction

సంక్షేమ పథకాలొస్తే చాలు లబ్ధిదారుల ఆనందానికి అవధులుండవు. ఎప్పుడెప్పుడు చేతికొస్తుందా అని ఎదురు చూస్తుంటారు. వాటి ఫలాలు అందుకోవాలని ఆత్రుతతో ఉంటారు. జిల్లాకు తాజాగా మంజూరైన పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అదే తరహాలో కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఆశగా చూస్తున్నారు. కానీ, జన్మభూమి కమిటీల అవతారమెత్తిన ‘పచ్చ’గెద్దలు వారితో పరిహాసమాడుతున్నాయి. ‘సమయం లేదా మిత్రమా!’ అన్నట్టుగా అధికారం మరెంతో కాలం ఉండదన్న ఉద్దేశంతో డబ్బులు దండుకునే పనిలో పడ్డాయి. సొమ్ములిస్తేనే పింఛన్లు వస్తాయని టీడీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. డీల్‌ కుదిరితేనే ఎంపిక చేస్తామని.. లేదంటే అంతే సంగతులని çసంకేతాలు పంపిస్తున్నారు. ప్రతి సంక్షేమ పథకానికో రేటు కట్టి.. తమ రూటే సెప‘రేట’ని చెబుతున్నారు.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్‌ హయాంలో శాచ్యురేషన్‌ మోడ్‌(సంతృప్తి స్థాయి)లో సంక్షేమ పథకాలు అమలయ్యేవి. అర్హులైన వారందరికీ పథకాలు దక్కేవి. కానీ, టీడీపీ అధికారంలోకి వచ్చాక శాచ్యురేషన్‌కు తిలోదకాలిచ్చేసింది. చిత్తశుద్ధి పక్కన పెట్టి అరకొర కేటాయిం పులతో కాలయాపన చేసుకొస్తోంది. ఇదే టీడీపీ నేతలకు కలిసొచ్చేలా చేస్తోంది. తక్కువ ఉన్నాయన్న పేరుతో డిమాండ్‌ సృష్టించి.. పోటీ పెట్టి.. రేటు కట్టి.. చివరకు అడిగినంత ముట్టజెప్పేవారికే కట్టబెడుతున్నారు. ఇళ్లు కావాలంటే నోట్లు ముట్టజెప్పాలి. పింఛను కావాలంటే ముడుపులు కట్టాలి. ఇలా ప్రతిదానిలో వసూళ్ల పంథానే కొనసాగిస్తున్నారు. రోజురోజుకూ మితిమీరిపోతున్న వీరి ఆగడాలు చూడలేక చివరకు మిత్రపక్షమైన బీజేపీ నేతలు సహితం బాహాటంగా నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది.

మిత్రపక్ష నేతగా భావించి తనకు తెలిసిన అర్హుడైన ఒకాయనకు ఇల్లు మంజూరు చేయించాలని టీడీపీ ఎమ్మెల్యేకొకరికి జిల్లాకు చెందిన బీజేపీ ప్రజాప్రతినిధి సిఫారసు చేశారు. బీజేపీ నేత చెప్పారని సదరు ఆశావహుడు ఎమ్మెల్యే వద్దకు వెళ్లగా.. తొలుత టీడీపీ కండువా వేసుకోవాలని సూచించాడు. ఆయన అనుచరులైతే తమ రూటే సెప‘రేటు’ అని పరోక్ష సంకేతాలిచ్చారు. ఇంకేముంది! సదరు వ్యక్తి అవాక్కయ్యాడు. ఇలాంటివన్నీ చూసి తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘‘హౌస్‌ ఫర్‌ ఆల్‌’’ కింద వచ్చిన ఇళ్లను ముడుపులు తీసుకుని ఇస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య నేరుగా ఆరోపణలు చేశారు.

పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఒక గ్రామంలో అర్హులైన 50 మంది పింఛను కోసం ఎదురు చూస్తున్నారు. ఆ గ్రామానికి ఐదారుగురికి మాత్రమే కొత్తగా ఇచ్చేందుకు పంపకాలు జరిగాయి. ఇంకేముంది! వచ్చిన అరకొర పింఛన్లకు డిమాండ్‌ పెరిగింది. ఓటుకు నోటు మాదిరిగా పింఛన్‌కు రేటు పలికింది. ఒక్క ఆ గ్రామంలోనే కాదు జిల్లావ్యాప్తంగా ఇదే దందా నడుస్తోంది. డిమాండ్‌ మేరకు రేటు పెడుతున్నారు. రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకూ పింఛన్‌ కోసం వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రమైన కాకినాడలో పెద్ద రగడే జరుగుతోంది. అర్హుల్ని పక్కన పెట్టి అనర్హులకు పింఛన్లు కట్టబెడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరెక్కువ ఇస్తే వారికే పింఛను అని బేరం పెడుతున్నారు. అనుకున్నట్టుగా లావాదేవీలు జరిగిన చోట సిఫారసు చేశారు. మిగతాచోట్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వ్యూహాత్మకంగా పక్కన పెట్టేశారు. ఒప్పందాలు కుదిరేవరకూ లబ్ధిదారులను సిఫారసు చేయకూడదని మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారు. దీంతో పింఛన్ల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది.

డబ్బే పరమావధిగా..
నియోజకవర్గానికి 2 వేల చొప్పున జిల్లావ్యాప్తంగా 38 వేల పింఛన్లను కొత్తగా ఇస్తున్నట్టు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇవి జిల్లాకు ఏమాత్రం సరిపోవు. ఈ అరకొర పింఛన్లతో సొమ్ము చేసుకోవడానికి జన్మభూమి కమిటీ సభ్యులు వసూళ్లకు ఉపక్రమించారు. అవి కూడా తెలుగు తమ్ముళ్లకే కట్టబెట్టేందుకు తెరలేపారు. ఈ క్రమంలో ఒప్పందాలు చకచకా జరగకపోవడంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలో 38 వేల పింఛన్ల కోసం ఇప్పటివరకూ కేవలం 6,400 పేర్లను మాత్రమే జన్మభూమి కమిటీలు సిఫారసు చేశాయి. మిగతావి ఇంకా కొలిక్కి రాలేదు. అనుకున్న రేటు పలికే వరకూ ఖరారు చేసేలా కనిపించడం లేదు. ఇక డబ్బులు తీసుకుని సిఫారసు చేసిన దరఖాస్తుల్లో చాలావరకూ అనర్హులుండటంతో ప్రజా సాధికార సర్వేతో సరిపోల్చేసరికి వారి బాగోతం బయటపడుతోంది. అలాంటి దరఖాస్తులన్నింటినీ అధికారులు తిరస్కరిస్తున్నారు. ఈవిధంగా జిల్లాలో ఇప్పటివరకూ జన్మభూమి కమిటీలు సిఫారసు చేసిన 800 మంది దరఖాస్తుల్ని పక్కన పెట్టేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement