పరభాషలో కన్నా.. మాతృభాషలో అధ్యయనమే మిన్న
పరభాషలో కన్నా.. మాతృభాషలో అధ్యయనమే మిన్న
Published Mon, Nov 28 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM
జాతీయస్థాయి సదస్సులో నన్నయ మాజీవీసీ జార్జ్ విక్టర్.
భానుగుడి(కాకినాడ) : మాతృభాషలో అధ్యయనం వల్లే చైనా, జపాన్‌లు అభివృద్ధి చెందాయని నన్నయ్య విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య జార్జివిక్టర్ పేర్కొన్నారు. జాతీయ సమైక్యత–సాంఘీకరణ పోకడలు అనే అంశంపై పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ నాయకులకు, అధికార యంత్రాంగానికి సరైన సామాజిక దృక్పథం కొరవడిందన్నారు. సోమవారం కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ సదస్సులో కుల, వర్ణ వ్యవస్థ, సాంస్కృతిక వైవిధ్యాలు పై విస్తృత స్థాయిలో పరిశోధన జరిగితేనే కుల వ్యవస్థపై అసహనం సమసిపోయి జాతీయ సమైక్యతకు దోహదం చేస్తుందన్నారు. సమావేశంలో డాక్టర్ సుధాకర్‌బాబు మాట్లాడుతూ పంజాబ్‌లోని ఖలిస్థాన్ ఉగ్రవాదులను చెరసాల నుంచి తప్పించడం జాతీయ సమైక్యతకు ముప్పుగా పరిణమించవచ్చన్నారు. సదస్సులో నన్నయ రిజిస్ట్రార్ ఆచార్య నరసింహారావు మాట్లాడుతూ జాతి సంపదను అసమానంగా పంచబడడం, రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, అవిద్య, ఆహార కొరత మొదలైన అంశాలు జాతీయ సమైక్యతకు ముప్పుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చప్పిడి కృష్ణ, కందుల ఆంజనేయులు, యూజీసీ కోఆర్డినేటర్ హరిరామ ప్రసాద్, ఆర్గనైజింగ్ మెంబర్స్ వి.చిట్టిబాబు, కె.నరసింహారావు, స్వామి, పాండురంగారావు, పారేశ్వర సాహు, డాక్టర్ వీపురి సుదర్శన్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు.
Advertisement
Advertisement