నన్నయ రిజిస్ట్రార్ రాజీనామా
నన్నయ రిజిస్ట్రార్ రాజీనామా
Published Thu, May 11 2017 11:26 PM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM
- ‘నన్నయ’ యూనివర్సిటీలో కళకలం సృష్టిస్తున్న ఆటోమేషన్ టెండర్
- వీసీకి రిజిస్ట్రార్‌కి మధ్య పెరుగుతున్న అంతరం
- రిజిస్ట్రార్‌పై చర్యకు దళిత ఉద్యోగుల డిమాండ్
- రాజీనామా చేసిన రిజిస్ట్రార్
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టనున్న ‘ఆటోమేషన్ టెండర్’ ఘటన చినికి చినికి గాలివానగా మారి చివరకు రిజిస్ట్రార్ తన పదవికి రాజీనామా చేసే వరకూ దారితీసింది. యూనివర్సిటీలో విద్యార్థుల పరీక్షలకు సంబంధించి ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ‘ఆటోమేషన్’ విధానాన్ని తీసుకువచ్చేందుకు టెండర్లు పిలవడం, మూడు కంపెనీలు దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. ఈ టెండర్లు ఖరారు విషయమై వీసీకి, రిజిస్టార్‌కి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వీసీ చర్యలను సమర్థిస్తూ ఆటోమేషన్ విధానంపై ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాలేదంటూ ఇటీవల యూనివర్సిటీ ఇద్దరు డీన్స్, ప్రిన్సిపాళ్లు ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపణలను ఖడించారు కూడా. అయినా సమస్య సద్దుమణగలేదు. వీసీ, రిజిస్ట్రార్లు ఎడమెహం, పెడమెహం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
రిజస్ట్రార్‌పై ఫిర్యాదు...
గురువారం కొంతమంది దళిత ఉద్యోగులు తమ పట్ల రిజిస్ట్రార్ కులవివక్షత చూపిస్తున్నారని, ఆయన పై చర్య తీసుకోవాలంటూ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలు నాయుడికి నేరుగా ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు తాళ్లూరి బాబురాజేంద్రప్రసాద్, బీసీ ప్రజాసంక్షేమ సంఘం అధ్యక్షుడు మేరపురెడ్డి రామకృష్ణ, రాష్ట్ర ఎస్టీ సంఘం అధ్యక్షుడు కె. నారాయణరావు, రాష్ట్ర ప్రజాసంక్షేమ యువజన సంఘం అధ్యక్షుడు మహ్మద్ ఖాసీం, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ, బీసీ సంఘాల అధ్యక్షుడు పిచ్చుక అనిల్‌కుమార్, దళిత నాయకులు అజ్జరపు వాసు తదితరులు 48 గంటల్లోగా ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మనస్థాపంతోనే రాజీనామా
విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహరావు తనపై కులముద్ర పడటాన్ని జీర్ణించుకోలేకపోయారు. మనస్థాపంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా గురువారం సాయంత్రం ప్రకటించారు. తాను చదివింది నోబుల్ కాలేజీలోనని, అక్కడ ఎక్కువ శాతం మంది దళితులేనని, వారే తనకు స్నేహితులన్నారు. ఇంతకాలం వారందరి మిత్రత్వంలో ముందుకు వెళ్లిన తనపై కులముద్ర వేయడం తట్టుకోలేకనే రాజీనామా చేస్తున్నానన్నారు. అందరినీ నా వారిగా చూసే తనపై దళిత వ్యతిరేకిననే ముద్ర వేయడాన్ని మానసికంగా తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఈ ఘటన మున్ముందు ఎంతవరకు దారితీస్తుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
Advertisement
Advertisement