వచ్చే నెలలో ‘నన్నయ’లో జాతీయస్థాయి సాహితీ సదస్సు
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జనవరి 28, 29 తేదీలలో 'తెలుగు సాహిత్యం – విశ్వకవి రవీంద్రుని ప్రభావం' అనే అంశంపై జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఏపీ ఉన్నత విద్యామండలి సహకారంతో నన్నయ వర్సిటీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో జరిగే సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎ.నరసింహారావు బుధవారం ఆవిష్కరించారు. అసియా ఖండంలో మొదటి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనా«థ్ ఠాగూర్ ప్రభావం ప్రపంచ సాహిత్యంపై ముఖ్యంగా తెలుగు సాహిత్యంపై విశేషంగా ఉందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. బెజవాడ గోపాలరెడ్డి, రాయప్రోలు సుబ్బారావు వంటి ప్రముఖులు రవీంద్రుని శిష్యులన్నారు. పరిశోధకులు తెలుగు సాహిత్యంపై రవీంద్రుని ప్రభావాన్ని పరిశీలించి, తమ ప్రామాణిక పరిశోధనాపత్రాలను తయారుచేసుకోవాలని సూచించారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ మున్నగు పలు రాష్ట్రాల నుంచి ఆచార్యులు, పరిశోధకులు సదస్సుకు హాజరు కానున్నారన్నారు. కార్యక్రమంలో సదస్సు కన్వీనర్ డాక్టర్ కేవీఎస్‌డీ వరప్రసాద్, సహాయ కన్వీనర్లు డాక్టర్ తలారి వాసు, డాక్టర్ టి.సత్యనారాయణ, డాక్టర్ డి.లక్ష్మీనరసమ్మ తదితరులు పాల్గొన్నారు.