ప్రాణం తీసిన ‘నానో’ వివాదం | nano allegation take life | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ‘నానో’ వివాదం

Published Fri, Sep 30 2016 12:53 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

ప్రాణం తీసిన ‘నానో’ వివాదం

ప్రాణం తీసిన ‘నానో’ వివాదం

– కొండజూటూరులో మహిళ ఆత్మహత్య
– మతదేహంతో జాతీయ రహదారిపై గ్రామస్తుల ధర్నా
– ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మతురాలి భర్త పోరాటం
– మతికి ఫ్యాక్టరీ మద్దతుదారుల బెదిరింపులే కారణమని ప్రజల ఆరోపణ


పాణ్యం: శాంతిరామ్‌ నానో కెమికల్‌ ఫ్యాక్టరీ వివాదం రగులుతోంది. ఇప్పటికే కొండజూటూరు గ్రామంలో చిచ్చురేపిన ఫ్యాక్టరీ యాజమాన్యం ఓ మహిళ ఆత్మహత్యకు కారణమైంది. గ్రామానికి చెందిన సురేఖ (28) గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు ఫ్యాక్టరీ మద్దతుదారులు, పోలీసుల వేధింపులే కారణమని గ్రామస్తులు మృతదేహంతో పాణ్యం పోలీసు స్టేషన్‌ ఎదురుగా నంద్యాల – కర్నూలు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమైన ధర్నా సాయంత్రం 5.20 గంటల వరకు కొనసాగింది. భారీ ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ అయింది. సమాచారం అందుకున్న నంద్యాల డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, అడిషినల్‌ ఎస్పీ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు అక్కడికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు. చివరకు గ్రామస్తుల ఫిర్యాదు మేరకు 11 మందిపై కేసు నమోదు, ఎస్‌ఐపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  
 
అసలేమి జరిగిందంటే:
కొంటూజూటూరు గ్రామ సమీపంలో శాంతిరాముడు నిర్మించ తల పెట్టిన నానో కెమికల్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా గ్రామస్తులు పోరాడుతున్నారు. యాజమాన్యం తమ అనుచర మద్దతుదారులతో గ్రామంలో కొందరిని డబ్బు ముట్టజెప్పి గొంతునొక్కే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గ్రామస్తుల మధ్య చిచ్చురేగింది. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీన ప్రజా నివేదిక అంటూ గ్రామంలో సభ నిర్వహించారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పరిశ్రమకు మద్దతుదారులుగా ఉన్న సాలమ్మ, లక్ష్మీదేవి గ్రామానికి చెందిన  చంద్రకళ, ఫయాజిన్,సురేఖ, ఉమాదేవిలపై 323,324 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. సురేఖ భర్త బాలప్ప గ్రామం కోసం పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అయితే యాజమాన్యం మద్దతు దారులు, పోలీస్‌లు తరచూ ఆయనను వేధిస్తున్నారు. ఇదే సమయంలో ఫ్యాక్టరీ నిర్మాణంపై బాలప్ప కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

పిటిషన్‌ను వెంటనే వెనక్కు తీసుకోవాలని లేని పక్షంలో చంపుతామని బెదిరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో వేధింపులు భరించలేక అతడి భార్య సురేఖ బుధవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె మృతికి పోలీసులు, శాంతిరాముడు కారణమని గ్రామస్తులు ఆందోళన చేశారు. భారీ ఎత్తున ప్రజలు రహదారిపైకి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 100 మంది కానిస్టేబుళ్లు, ఆరుగురు సీఐలు, ఎనిమిది మంది ఎస్‌ఐలు, 50 మంది స్పెషల్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు స్టేషన్‌లోకి రాకుండా బారికేడ్లు అడ్డం పెట్టారు. ఫ్యాక్టరీ యాజమాన్యంపై, ఫాక్టరీ మద్దతుదారులపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే సురేఖ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మృతురాలు కుటుంబానికి న్యాయం చేస్తామని నంద్యాల డీఎస్పీ హరినాథ్‌రెడ్డి హామీ మేరకు గ్రామస్తులు సాయంత్రం 5.20 గంటలకు ఆందోళన విరమించారు.
   
గ్రామంలో ఉద్రిక్తత:
ఆందోళన విరమణ అనంతరం మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకెళ్లారు. అయితే అంత్యక్రియలను ఫ్యాక్టరీకి కేటాయించిన స్థలంలో చేయాలని గ్రామస్తులు పట్టుబడ్డారు. అప్పటికే దాదాపు 100 మంది పోలీసులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. శ్మశానంలోనే చేయాలని సూచించడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
 
వాహనాల దారి మళ్లింపు:   
పాణ్యం పోలీసు స్టేషన్‌ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై ఆందోళన చేయడంతో కర్నూలు వైపు దాదాపుగా మూడు కిలో మీటర్లు, నంద్యాల వైపు ఎనిమిది కిలో మీటర్లు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు నంద్యాల వైపు వస్తున్న వాహనాలను సోమయాజులపల్లె వద్ద బేతంచెర్ల మీదుగా దారి మళ్లించారు. అలాగే కర్నూలు వైపు వెళ్తున్న వాహనాలను అడ్డరోడ్డు వద్ద గడివేముల మీదుగా దారి మళ్లించారు. ధర్నా ముగిశాక దాదాపుగా వాహనాలను నియంత్రించేందుకు పోలీసులకు మూడు గంటలు పట్టింది.
 
ఎమ్మెల్యే పరామర్శ:
కొండజూటూరు గ్రామస్తుల ఆందోళన సమాచారం తెలుసుకున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. సురేఖ ఆత్మహత్యకు కారణాలు తెలుసుకున్నారు. మృతురాలు భర్త బాలప్పను పరామర్శించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం మొండివైఖరితో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని విమర్శించారు. మహిళ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement