చిచ్చు రేపిన లోకేష్
♦ వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఎస్.కోట సీటు
♦ మంత్రి మాటలతో భగ్గుమన్న వైరి వర్గం
శృంగవరపుకోట : రాజుకుంటున్న కుంపటిలా ఉన్న ‘కోట’ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్. ఎస్.కోటలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి మంగళవారం వచ్చిన మంత్రి సభావేదికపై స్థానిక ఎమ్మెల్యే లలితకుమారి పనితీరును మెచ్చుకుంటూ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మరోమారు లలితకుమారిని గెలిపించాలని ప్రజలను కోరారు. మంత్రి అన్న ఈ మాటలతో ఇటు ప్రజల్లోనూ, అటు పార్టీ శ్రేణుల్లోనూ ఒక్కసారిగా కలకలం రేగింది. 2019ఎన్నికల్లో పార్టీ టికెట్ లలితకుమారికే దక్కుతుందని చినబాబు స్పష్టంగా చెప్పడంతో వైరి వర్గం భగ్గుమంది.
వైరి వర్గాల పయనం ఎటు?
కొంత కాలంగా మాజీ ఎమ్మెల్యే హైమావతి, సిట్టింగ్ ఎమ్మెల్యే లలితకుమారిల మధ్య నడుస్తున్న విభేదాలు జనమెరిగిన సత్యం. వీరిద్దరి మధ్య విభేదాలు చాపకింద నీరులా పెరుగుతూనే ఉన్నాయి. ఐదు మండలాల్లో ఇప్పటికే దేశం శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోయాయి. తమ వర్గాల్ని నిలుపుకోవాలని, పార్టీ శ్రేణులపై పట్టు సాధించాలని వీరిద్దరూ రాజకీయ మంత్రాంగం నడుపుతున్నారు. జామి, ఎస్.కోట మండలాధ్యక్షుల మార్పులో నెలకొన్న స్తబ్ధత ఇందుకు నిదర్శనం.
సిట్టింగ్ ఎంపీపీలచే రాజీనామా చేయించి జెంటిల్మెన్ ఒప్పందాన్ని అమలు చేయాలని ఒకరు, సిట్టింగ్‌లనే కొనసాగించాలని మరొకరు పట్టుబట్టటం, దీనిపై ఇప్పటికే మంత్రుల సమక్షంలో పలు దఫాలు చర్చలు నడిపినా ఫలితం లేకుండా పోయిన విషయం విధితమే. ఈ తరుణంలో మంత్రి లోకేష్ చేసిన ప్రకటనతో పార్టీలో వర్గవిభేదాలు మరింతగా ముదిరే అవకాశం ఉంది. తాజా పరిణామంతో హైమావతి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ జనంలో అప్పుడే మొదలైంది.