Nara Lokesh Sensational Comments On TDP Situation In Kurnool, Details Inside - Sakshi
Sakshi News home page

Nara Lokesh: టీడీపీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.. ఏం చేద్దాం?

Published Sat, Aug 20 2022 12:18 PM | Last Updated on Sat, Aug 20 2022 1:43 PM

Nara Lokesh Sensational Comments On Kurnool TDP Situation - Sakshi

సాక్షిప్రతినిధి కర్నూలు: కర్నూలు, నంద్యాల జిల్లాల్లో టీడీపీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తనను కలిసిన కర్నూలు, నంద్యాల జిల్లాల నేతలతో లోకేశ్‌ పూర్తి నిరాశ నిస్పృహతో మాట్లాడారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా టీడీపీకి గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందనే యోచనలో అధిష్టానం ఉందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. నంద్యాల జిల్లాకు చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియతో పాటు గౌరు వెంకటరెడ్డి గురువారం నారా లోకేశ్‌ను కలిశారు. వీరితో పాటు కర్నూలు జిల్లాకు చెందిన  బోయ సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలు కలిశారు. అలాగే శుక్రవారం కర్నూలు, అనంతపురానికి చెందిన కురుబ నేతలు కలిశారు. జెడ్పీ   మాజీ చైర్మన్‌ బత్తిన వెంకట్రాముడు, పత్తికొండ, ఆలూరు, ఆదోని మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌లు శ్రీనివాసులు, జయరాముడు, దేవేంద్రప్పతో పాటు పలువురు నేతలు లోకేశ్‌ను కలిసిన వారిలో ఉన్నారు. రెండురోజుల పాటు జరిగిన చర్చల్లో కర్నూలు, నంద్యాల రాజకీయాలపై లోకేశ్‌ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇవే ఇప్పుడు రెండు జిల్లాల టీడీపీ నేతల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.  

అఖిలకు మూడు నెలల గడువు 
లోకేశ్‌తో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ 15 నిమిషాలు భేటీ అయ్యారు. నియోజకవర్గ పరిస్థితిని వివరించారు. అయితే లోకేశ్‌ మాత్రం సర్వే రిపోర్ట్‌లు చాలా దారుణంగా ఉన్నాయని, జనాల్లో భూమా కుటుంబం లేదన్నారు. హైదరాబాద్‌లో ఉంటూ ఆళ్లగడ్డలో రాజకీయాలు చేయలేవన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి గ్రామాల్లో చురుగ్గా తిరుగుతూ, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారని, వారిని ఢీకొట్టాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అఖిల నాయకత్వం, బలం రెండూ సరిపోవని తమకు రిపోర్టులు ఉన్నాయని లోకేశ్‌ చెప్పారు. మూడు నెలలపాటు గడువు ఇస్తున్నామని, సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు దీటుగా గ్రామాల్లో పర్యటించి, నియోజకవర్గానికి అందుబాటులో ఉంటే టిక్కెట్‌ ఇస్తామని, లేదంటే ఆళ్లగడ్డ బాధ్యతలు మరొకరికి అప్పగించే యోచన చేస్తామని లోకేశ్‌ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అఖిలప్రియ పూర్తిగా డీలాపడ్డారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నంద్యాల, ఆళ్లగడ్డ రెండు టిక్కెట్లు తమకే కావాలని అడిగేందుకు వెళ్లిన అఖిలకు ‘ఆళ్లగడ్డ’పైనే స్పష్టత ఇవ్వకపోవడంతో నంద్యాల ప్రస్తావన లేకుండానే వెనుదిరిగినట్లు తెలిసింది.  

నందికొట్కూరు అడగొద్దు  
పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి భర్త గౌరు వెంకటరెడ్డి కూడా గురువారం లోకేశ్‌ను కలిశారు. పాణ్యంతో పాటు నందికొట్కూరుకు కూడా తాము సూచించిన అభ్యరి్థకి టిక్కెట్‌ ఇవ్వాలని గౌరు విన్నవించారు. పాణ్యం బాధ్యతలు చూసుకోండని, నందికొట్కూరు మీకు సంబంధం లేదని లోకేశ్‌ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. పాణ్యంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అత్యంత బలంగా ఉన్నారని, కనీసం నియోజకవర్గంలో మీరు పర్యటించడం లేదని లోకేశ్‌ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పాణ్యంపై శ్రద్ధపెట్టాలని గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది.  

టీడీపీ నేతల్లో గుబులు  
లోకేశ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఒక్కసారిగా నంద్యాల, కర్నూలు జిల్లాల నేతలు ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే కుటుంబానికి ఒక టిక్కెట్‌ ఇస్తామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో కేఈ, కోట్ల, భూమా కుటుంబాలు ఆలోచనలో పడ్డాయి. ఇప్పుడు పనితీరు బాగోలేదని, సామాజికవర్గాల సమీకరణాల పేరుతో అభ్యర్థుల మార్పుపై లోకేశ్‌ వ్యాఖ్యలు చేశారు. లోకేశ్‌ వ్యాఖ్యలను పరిశీలిస్తే నంద్యాల, మంత్రాలయం, ఆదోనిలో కచ్చితంగా మార్పు ఉండే అవకాశం ఉంది. ఆళ్లగడ్డ కూడా స్పష్టత లేదు. కుటుంబానికి ఒక టిక్కెట్‌ కోటాలో ఆలూరులో సుజాతమ్మకు టిక్కెట్‌ ఉండదు.  కేఈ ప్రతాప్, ప్రభాకర్‌దీ అదే పరిస్థితి. సూర్యప్రకాశ్‌రెడ్డి ఎమ్మిగనూరు సీటుపై కన్నేయడంతో జయనాగేశ్వరరెడ్డి పరిస్థితి అగమ్యగోచరమే! ఈ పరిణామాలు చూస్తే ఏ నియోజకవర్గంలో కూడా టీడీపీకి బలమైన నాయకత్వం లేదని, ఏ సీటూ కచ్చితంగా గెలిచే పరిస్థితి లేదని లోకేశ్‌ చెప్పకనే చెప్పినట్లు స్పష్టమవుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరుసగా టీడీపీకి ఘోర ఓటములు ఎదురవుతున్నాయి. లోకేశ్‌ వ్యాఖ్యలు చూస్తే 2019 ఫలితాలు పునరావృతమవుతాయని టీడీపీలోని సీనియర్‌ నేతలు చర్చించుకుంటున్నారు. 

ఆదోని, మంత్రాలయం అభ్యర్థుల మార్పు? 


టీడీపీలో బోయ సామాజికవర్గానికి చెందిన నేతలు గురువారం, కురువ వర్గ నేతలు శుక్రవారం కలిశారు. జిల్లాలో బోయలకు ప్రాతినిధ్యం లేదని, ఈ దఫా ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్‌ ఇవ్వాలని బోయలు అడిగారు. గతంలో రెండు దఫాలు బీటీ నాయుడికి ఎంపీ టిక్కెట్‌ ఇస్తే గెలిపించుకోలేదని, అలాంటప్పుడు బోయ వర్గం టీడీపీతో ఉందని ఎలా చెబుతారని లోకేశ్‌ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాయదుర్గం, పెనుకొండలో బోయ, కురుబ నేతలు కాలవ శ్రీనివాసులు, బీకే పార్థసార«థి ఇద్దరూ ఓడిపోయారని, కానీ వైఎస్సార్‌సీపీలో పెనుకొండ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలుగా, హిందూపురం ఎంపీగా కురుబ నేతలు శంకర్‌నారాయణ, ఉషాశ్రీచరణ్, గోరంట్ల మాధవ్, ‘అనంత’ ఎంపీగా బోయ వర్గానికి చెందిన తలారి రంగయ్య ఎంపీగా గెలిచారన్నారు. దీన్నిబట్టి బోయ, కురువ పూర్తిగా వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉందనే విషయం స్పష్టమవుతోందని లోకేశ్‌ వివరించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కర్నూలు జిల్లాలో కురువ, బోయ వర్గాలకు రానున్న ఎన్నికల్లో టిక్కెట్‌ కచ్చితంగా ఇవ్వాలని అడిగారు. దీంతో మంత్రాలయం నియోజకవర్గంలో బోయలకు టిక్కెట్‌ ఇచ్చే యోచన చేస్తునానమని లోకేశ్‌ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ఆదోనిలో కూడా మీనాక్షి నాయుడు కాకుండా ప్రత్యామ్నాయ యోచనలో పార్టీ ఉందని లోకేశ్‌ చెప్పినట్ల తెలుస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement