గెలుపెవరిదో? | narayan khed election votes counting today | Sakshi
Sakshi News home page

గెలుపెవరిదో?

Published Tue, Feb 16 2016 2:58 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

గెలుపెవరిదో? - Sakshi

గెలుపెవరిదో?

♦ ఓటరన్న గుట్టు  వీడేది నేడే
♦ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
♦ ఓటరు తీర్పుపై  నేతల్లో ఉత్కంఠ
♦ ఖేడ్ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్
♦ సీసీ కెమెరాల ఏర్పాటు పట్టణంలో 144 సెక్షన్
♦ 9 చోట్ల పికెట్లు, 300 మందితో బందోబస్తు
♦ నిజాంపేట మీదుగా వాహనాల మళ్లింపు

 
 నారాయణఖేడ్: ఖేడ్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరు గుట్టు మరికొన్ని గంటల్లో వీడనుంది. తీర్పు ఎలా వస్తుందోనని అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఓటరు ఎవరిని కరుణిస్తాడో తెలియక ఆయా పార్టీల నేతల గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఈనెల 13న పోలింగ్ పూర్తికాగానే 286 ఈవీఎంలను నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోగల పాలిటెక్నిక్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూంకు అధికారులు పటిష్టభద్రతను ఏర్పాటు చేశారు. అటువైపు ఎవరినీ అనుమతించడం లేదు. మొత్తం 9 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూం వద్ద 4 సీసీ కెమెరాలు, పాలిటెక్నిక్ కళాశాల, కౌంటింగ్ హాలులో మిగతా కెమెరాలు అమర్చారు.

 ఏర్పాట్లు పూర్తి...
 కౌంటింగ్ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ, స్ట్రాంగ్ రూం పరిసరాలు, కౌంటింగ్ హాల్ సమీపాల్లో పోలీసులు జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ అంతా రిటర్నింగ్ అధికారి ఆధీనంలో ఉంది.

 పటిష్ట బందోబస్తు: డీఎస్పీ
 కౌంటింగ్ సందర్భంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్టు మెదక్ డీఎస్పీ రాజారత్నం తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నారాయణఖేడ్ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే కౌంటింగ్ హాలుతో పాటు పరిసరాలు, పట్టణంలోనూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ బి.సుమతి, అదనపు ఎస్పీలు వెంకన్న, బాబూరావు, ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐ లు, 10 మంది ఎస్‌ఐలు, ఒక కంపెనీ సీఆర్‌పీఎఫ్ బలగాలను మొత్తం 300 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. కౌంటింగ్ సందర్భంగా అన్ని వాహనాలను నిజాంపేట మీదు గా మళ్లిస్తున్నట్టు చెప్పారు. ఖేడ్ వచ్చే క్రమంలో వెంకటాపూర్ క్రాస్ రోడ్డు, అటు నిజాంపేట నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించేది లేదన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో 144 సెక్షన్ విధించినట్టు తెలిపారు. గుర్తింపు కార్డులు లేకుండా ఎవరినీ అనుమతించేది లేదన్నారు. పట్టణంలో తొమ్మిది చోట్ల పోలీసు పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ సందర్భంగా పట్టణంలో అనుమతులు లేనిదే ర్యాలీలు చేపట్టరాదన్నారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా అన్ని పార్టీల నేతలు సహకరించాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement