పటాన్ చెరు టౌన్ : మండల పరిధిలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బీడీఎల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన మయాంక్ ముకుంద్ పటాన్ చెరులోని నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతనితో పాటు మరో నలుగురు హాస్టల్ గదిలో ఉంటున్నారు. శనివారం రాత్రి స్నేహితులతో సరదాగా గడిపిన ముకుంద్ ఆదివారం తెల్లవారే సరికి విగతజీవిగా పడి ఉన్నాడు. తెల్లవారుజామున ముకుంద్‌ను నిద్రలేపేందుకు వచ్చిన సిబ్బంది గమనించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ముకుంద్ చనిపోరుునట్టు వైద్యులు తెలిపారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని, మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు.
గోప్యంగా ఉంచిన యాజమాన్యం
విద్యార్థి మృతి విషయాన్ని కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచింది. మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆదివారం తెల్లవారుజామున కనీసం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ముకుంద్‌ను గాంధీకి తరలించారు. కళాశాల ప్రాంగణంలోని సిబ్బంది, విద్యార్థులకు ముకుంద్ చనిపోరుున విషయం ఇప్పటికీ తెలియదు. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు వస్తేనే మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని బీడీఎల్ పోలీసులు తెలిపారు. సీఐ కృష్ణకిషోర్ ఈ కేసు వివరాలు తెలిపేందుకు మీడియాకు అందుబాటులోకి రాలేదు. సోమవారం రాత్రి వరకు కేసు నమోదుకాలేదు. ముకుంద్ తండ్రి రాజాముకుంద్ ప్రసాద్ సిన్హా బిహార్‌లో వ్యవసాయదారుడు. మృతుడి మేనమామ మనీష్‌రాజన్ హైదరాబాద్‌లోని ఎస్‌బీహెచ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి మృతదేహాన్ని అప్పగించినట్టు పోలీసులు తెలిపారు.