అనంతపురం సెంట్రల్ : అనంతపురంలోని నారాయణ కళాశాల విద్యార్థి చక్రవర్తి (17) ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి సంఘాలు కూడా మంగళవారం ఆందోళనకు దిగడం ఈ అనుమానాలకు మరింత బలమిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ముంబైలో నేవీలో పనిచేస్తున్న గోపాల్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య, పిల్లలు అనంతపురంలోని హౌసింగ్‌బోర్డులో నివాసం ఉంటున్నారు. పెద్ద కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. చిన్న కుమారుడు చక్రవర్తి స్థానిక సాయినగర్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
గోపాల్ భార్య ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. చక్రవర్తి ప్రథమ సంవత్సరంలో మంచి పార్కులతో ఉత్తీర్ణత సాధించినా.. ద్వితీయ సంవత్సరంలో వెనుకబడ్డాడు. ఈ విషయమై కళాశాల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చినట్లు తెలిసింది. క్లాసులో కూడా అవమానాలు ఎదుర్కొనేవాడని తెలుస్తోంది. సోమవారం కూడా క్లాస్‌లో అవమానం జరగడంతో అర్ధంతరంగా ఇంటికి వెళ్లిపోయాడని సమాచారం. ఆ సమయంలో తల్లి, అన్న కూడా లేకపోవడంతో ఆవేదనకు లోనైన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మంత్రి నారాయణకు చెందిన కళాశాల కావడంతో పోలీసులు ఈ కేసుపట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. వన్‌టౌన్ ఎస్‌ఐ రంగాయాదవ్‌ను వివరణ కోరగా.. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, అసలు విషయాలు దర్యాప్తులో తేలుతాయని చెప్పారు.
‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్యపై అనుమానాలు
Published Wed, Jan 4 2017 12:02 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement