ఆశల మగ్గంపై నేతన్న కన్నీరు
జిల్లాలో నష్టాల్లో 39 చేనేత సంఘాలు
సంఘాలకు రుణ మాఫీ లేనట్టేనా!
నేడు జాతీయ చేనేత దినోత్సవం
విదేశీ వస్త్రాలు బహిష్కరించి మగ్గంపై తయారు చేసే ఉత్పత్తులనే ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుతున్నాయి. వ్యవసాయం తర్వాత అతి పెద్ద ఉపాధి రంగమైన చేనేత పరిశ్రమ నేడు మనుగడ సాగించలేని దుస్థితిలో ఉంది. ఉపాధి కరువవ్వడంతో ప్రత్యామ్నాయ మార్గాలవైపు నేతన్నలు వలస పోతున్నారు.
– అమలాపురం రూరల్
ఓవైపు ఆన్‌లైన్ మార్కెటింగ్ అంటూ దూసుకుపోతుంటే, చేనేత రంగం మాత్రం ఆప్కోను నమ్ముకుని నష్టాల్లోకి వెళ్లిపోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆప్కో విభజన ఇంకా జరగకపోవడం చేనేత సంఘాలకు శాపంగా మారింది. జిల్లాలో 50 చేనేత సంఘాల్లో సుమారు రూ.7 కోట్ల విలువైన ఉత్పత్తుల నిల్వలు పేరుకుపోయాయి. కార్మికులకు పనుల్లేక పస్తులుంటుంటే, సంఘాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఇప్పటికే రూ.12 కోట్ల వరకు నష్టాల్లో ఉన్న సంఘాలు, ఆప్కో దెబ్బతో మరింత కుదేలవుతున్నాయి. ప్రభుత్వం బడ్జెట్‌లో ఈ రంగానికి అరకొర నిధులు కేటాయించడంతో దీని మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
ఆప్కో విలీనం జరగలేదు
రాష్ట్ర విడిపోయి రెండేళ్లయినా ఆప్కో విలీనం జరగడం లేదు. ఉమ్మడిగా ఉండడం వల్ల చేనేత సంఘాలకు సహకారం అందడం లేదు. 1976లో చేనేత సంఘాలకు మాతృసంస్థగా ఆప్కో ఆవిర్భావమైంది. చేనేత సంఘాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంతో పాటు ఆర్థికంగా చేయూతనిచ్చేది. నిర్లక్ష్య విధానాలతో ఈ సంస్థ కాలక్రమంలో రూ.130 కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. దీనితో అన్ని జిల్లాల్లోని సంఘాలు నష్టపోయాయి. చేనేత కార్మికుల స్థితిగతులపై హ్యాండ్‌లూమ్ అధికారులు సర్వే చేసి, వారికి చేయూతనివ్వాల్సి ఉంది. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పనుల్లేక చేనేతలు మాస్టర్ వీవర్స్ వద్ద తక్కువ జీతాలకు పనిచేయాల్సి వస్తోంది.
సంఘాలకు రుణమాఫీ హుళక్కేనా!
గత ఎన్నికల సమయంలో చేనేత రుణాలు మాఫీ చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్ల తర్వాత వ్యక్తిగత రుణాలను మాఫీ చేస్తున్నారు. ఆదివారం ధర్మవరం సభలో ముఖ్యమంత్రి రుణమాఫీపై ప్రకటన చేయనున్నారు. జిల్లాలో కార్మికుల వ్యక్తిగత రుణాలు సుమారు రూ.10 కోట్ల వరకు రుణమాఫీ జరగనుంది. ఇప్పటి వరకు చేనేత సంఘాలకు రూ.12 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉంది. కోనసీమలోని 11 సంఘాల్లో కె.జగన్నాథపురం మాత్రమే రూ.7 లక్షల లాభాల్లో ఉంది. మిగిలిన 10 సంఘాలు నష్టాల్లో ఉన్నాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేనేత సంఘాలకు రూ.325 కోట్ల రుణమాఫీ ప్రకటించగా, ఆయన మరణానంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రూ.160 కోట్ల మేర రుణమాఫీ చేసింది. సంఘాలతో పాటు కార్మికుల వ్యక్తిగత రుణాలు కూడా అప్పట్లో మాఫీ అయ్యాయి.
39 శాతం రిబేటు ఏమైంది?
ఎన్నికల ప్రచార సమయంలో పెద్దాపురం నియోజకవర్గంలో జరిగిన సభలో చేనేత వస్త్రాలపై 39 శాతం రిబేటు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికీ ఆ హామీ అమలుకు నోచుకోలేదు. చేనేత సంఘాల్లో పేరుకుపోయిన రూ.7 కోట్ల విలువైన ఉత్పత్తులు అమ్మాలంటే రిబేటు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ పథకం రూ.15 వేల నుంచి రూ.37,500కు పెంచారు. అది అమలుకు నోచుకోలేదు. కార్మికులు అనారోగ్యానికి గురైతే ఈ పథకంలో ఆర్థిక సాయం లభించేది. ఇది అమలులోకి రాకపోవడంతో చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.