ఓటు హక్కు ఔన్నత్యాన్ని చాటుదాం
జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఈ నెల 25న పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ పీహెచ్ విజయమోహన్ పిలుపు
- జాతీయ ఓటరు దినోత్సవ నిర్వహణపై సమీక్ష
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఈ నెల 25న పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా కార్యక్రమాలుండాలన్నారు. శనివారం సాయంత్రం 7వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహణపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఓటు హక్కు విలువపై ప్రజలకు అవగాహన ఏర్పడేలా జూనియర్ కాలేజీ విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు పరీక్షలున్నట్లు ఆర్‌ఐఓ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఉదయం పూట ఉన్న పరీక్షను సాయంత్రానికి వాయిదా వేయిస్తే ర్యాలీకి వచ్చే అవకాశం ఉందన్నారు.
దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ మేరకు నోట్స్ పంపాలని, దాని ఆధారంగా ఆర్‌జేడీతో మాట్లాడుతానని తెలిపారు. పరీక్షలున్న కారణంగా సమావేశానికి వచ్చిన కళాశాల ప్రిన్సిపాళ్లను బయటికి పంపారు. కేవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ సమావేశానికి గైర్హాజరు కాడంపై ఆగ్రహించిన కలెక్టర్ షోకాజ్ నోటీసు ఇవ్వాలని డీఆర్‌ఓను ఆదేశించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పోలింగ్ కేంద్రం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయిలో కర్నూలు పోలీస్ పరేడ్ గ్రౌండులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ ఆకే రవికృష్ణ, జేసీ హరికిరణ్, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, ఆర్‌ఐఓ పరమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.