ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు
- పయ్యావుల సోదరుల కనుసన్నల్లో జూద కేంద్రం
- నంద్యాలలో టీడీపీ అప్రజాస్వామిక గెలుపు
- జగనన్న వస్తున్నాడని ప్రతి ఒక్కరికీ చెప్పండి
- నవరత్నాల సభలో వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపు
ఉరవకొండ: తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై బూత్‌లెవల్ కార్యకర్తలు ప్రతి గడపకూ వెళ్లి ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఉరవకొండలోని శ్రీ వీరశైవ కల్యాణమండపంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యాన ‘నవరత్నాల’ సభ నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు భారీగా తరలివచ్చారు. వజ్రకరూర్ మండల కన్వీనర్ జయేంద్రరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. అధికారంలోకి రావడానికి గత ఎన్నికల్లో చంద్రబాబు 600 హమీలు ఇచ్చారని, ఇందులో ఒక్కటీ నేరవేర్చలేక పోయారని మండిపడ్డారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. హంద్రీ- నీవా ఆయకట్టు ద్వారా ఉరవకొండ నియోజకవర్గంలోని లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉందన్నారు. అయితే చంద్రబాబు అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తయినా ఒక్క ఎకరాకు కుడా సాగునీరు ఇవ్వలేదన్నారు.
నియోజకవర్గంలో పేదలకు ఇంటి పట్టాల కోసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. కూడేరు మండలం కొర్రకోడు డ్యాం వద్ద ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఆయన సోదరుడు శీనప్పల అండదండలతో జూద కేంద్రం నడుస్తోందన్నారు. జూదకేంద్రం వద్దే మద్యం కూడా అందుబాటులో ఉంచారని, ఇక్కడ ఒక ఎస్‌ఐ కూడా కాపలా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూద కేంద్రం ద్వారా వచ్చే ఆదాయంలో పయ్యావుల సోదరులకు మామూళ్లు ముట్టజెబుతున్నారని ఆరోపించారు. గతంలో తాడిపత్రికి చెందిన ఒక వ్యక్తి జూదంలో రూ.లక్షలు పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ సభ్యులను హతమార్చి, చివరకు తనూ ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. నియోజకవర్గంలో పయ్యావుల సోదరులు జూదం, మద్యం మాఫియాను పెంచిపోషిస్తున్నారని తెలిపారు.
నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలపై కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తు కోట్లాది రూపాయలు గుమ్మరించి టీడీపీ అక్కడ గెలిచిందన్నారు. ఓటర్లను బెదిరించి, ప్రలోభ పెట్టి గెలవడం గొప్ప విషయం కాదన్నారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కోట్లాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన 20 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి.. ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. టీడీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. రాజన్న రాజ్యం కోసం వైఎస్సార్‌సీపీ ప్లీనరీ వేదికగా ప్రకటించిన నవరత్నాల్లాంటి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని, జగనన్న వస్తున్నాడని ఊరూవాడా చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు యువనేత వై.ప్రణయ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అశోక్, తేజోనాథ్, మాన్యం ప్రకాష్, కాకర్ల నాగేశ్వరావు, బసవరాజు, జెడ్పీటీసీ సభ్యులు తిప్పయ్య, లలితమ్మ, నిర్మలమ్మ, ఎంపీపీ కొర్రా వెంకటమ్మ, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, చేనేత విభాగం జిల్లా కమిటీ సభ్యులు ఎంసీ నాగభూషణం, చెంగల మహేశ్వర తదితరులు పాల్గొన్నారు.