నిలువునా మోసం
► ఎన్నికల సమయంలో సాధ్యం కాని హామీలు ఇచ్చారు
► గెలిచి రెండేళ్లు దాటినా ఒక్కటీ నెరవేర్చిన పాపాన పోలేదు
► చౌళూరు బహిరంగసభలో చంద్రబాబుపై నవీన్‌నిశ్చల్ ధ్వజం
హిందూపురం అర్బన్ : ‘ఎన్నికల సమయంలో నోటికి అడ్డూ అదుపు లేకుండా హామీలు గుప్పించారు. ముఖ్యమంత్రి పదవి స్వీకరించి రెండేళ్లు దాటినా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. నమ్మి ఓట్లేసిన ప్రజలను నిలువునా మోసం చేశారు’ అని సీఎం చంద్రబాబుపై హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం హిందూపురం మండలంలోని చౌళూరు గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ 10 రోజులుగా గడపగడపకూ వెళ్తున్నాం. ఏ గ్రామంలోని ప్రజలను అడిగినా చంద్రబాబు మాటలను నమ్మి మోసపోయామని చెబుతున్నారు. కనీస సదుపాయాలు తీర్చే వారు కరువయ్యారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో ‘‘ఏరు దాటే వరకు ఏరుమల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య’’ అన్న చందంగా ప్రజలను నిలువునా మోసం చేశారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించి మద్దతుగా నిలవండి. రాజన్న పాలన తిరిగి వస్తున్నాం. గత ఎన్నికల్లో రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని జగన్ ఒక్క అబద్ధం ఆడి ఉంటే అధికారంలోకి వచ్చేవారు. కానీ ఆయన మాట తప్పని మనిషి. అందుకే సాధ్యం కాని హామీలు ఇవ్వలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ధ్రుతరాష్ట్రుడి పాలన సాగుతోంది. పోరాటంతో ప్రభుత్వం మెడలు వచ్చి సమస్యలు పరిష్కరించుకుందాం’ అని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే పదవి అలంకారం కాదు
అలాగే ఎమ్మెల్యే పదవీ అలంకారం కాదని బాలకృష్ణపై మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేనంటూ పోలీసు బందోబస్తుతో కాన్వాయ్‌లో వెళ్లడం మాని ప్రజలు కష్టాలు తెలుసుకోవాలని బాలకృష్ణకు సూచించారు. ఎన్నికల సమయంలో బాలకృష్ణ ఇచ్చిన హామీలు ఇంతవరకు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ బసిరెడ్డి, ఏ,బీ బ్లాక్ కన్వీనర్లు ఈర్షద్, మల్లికార్జున, కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు శివ, కౌన్సిలర్ ఆసీఫ్‌వుల్లా, నాయకులు సమద్, శ్రీన, రియాజ్, చంద్రశేఖర్, మండల మహిళా కన్వీనర్ షామింతాజ్, బీసీ సెల్ నాయకులు రాము, మండల నాయకులు శ్రీరాంరెడ్డి, ధనుంజయరెడ్డి, చాంద్‌బాషా, ఎంపీటీసీ సభ్యుడు కృష్ణ, సురేష్, గంగాధరప్ప, నరసింహప్ప, మురళీ, కిరణ్, హనుమంతు, మంజు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.