పారదర్శకం.. శరవేగం.. | This is the objective of the YSRCP Government on Polavaram Project | Sakshi
Sakshi News home page

పారదర్శకం.. శరవేగం..

Published Sun, Aug 4 2019 3:49 AM | Last Updated on Sun, Aug 4 2019 8:18 AM

This is the objective of the YSRCP Government on Polavaram Project - Sakshi

పోలవరం స్పిల్‌ వే వద్ద శనివారం నాటి పరిస్థితి ఇదీ..

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులను పారదర్శకంగా, శరవేగంగా పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే సంకల్పంతో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. టీడీపీ సర్కార్‌ హయాంలో పోలవరం పనుల్లో అంతులేని దోపిడీ జరిగిందని 2018 సెప్టెంబరు 19న కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) పార్లమెంట్‌కు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఇంజనీరింగ్‌ పనుల్లో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ కూడా ‘కాగ్‌’ నివేదికలో అంశాలు అక్షర సత్యమని తేల్చింది. ఈమేరకు జూలై 24న ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పోలవరంలో మిగిలిపోయిన పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నిబంధనలకు విరుద్ధంగా హెడ్‌వర్క్స్‌ పనులను నామినేషన్‌పై దక్కించుకుని తీవ్ర జాప్యం చేస్తున్న నవయుగ, బీకెమ్‌ సంస్థలను ఒప్పందం నుంచి వైదొలగాలని సూచిస్తూ జూలై 29న పోలవరం సీఈ నోటీసులు కూడా ఇచ్చారు. మిగిలిన పనులకు రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా అక్టోబర్‌ నాటికి కొత్త కాంట్రాక్టర్లను ఎంపిక చేయనున్నారు. భారీ ఎత్తున ప్రజాధనాన్ని ఆదా చేయడంతోపాటు నవంబర్‌ 1 నుంచి పనులు ప్రారంభించి 2020 నాటికి పూర్తి చేసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

కమీషన్ల  దాహంతో..
పోలవరం హెడ్‌వర్క్స్‌ పనులను 2013లో ట్రాన్స్‌ట్రాయ్‌ దక్కించుకున్న సమయంలో సత్తా లేని సంస్థకు ఎలా అప్పగిస్తారని అభ్యంతరం తెలిపిన విపక్ష నేత చంద్రబాబు అనంతరం రాయపాటి సాంబశివరావు టీడీపీలో చేరడంతో మాట మార్చారు. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే వంద శాతం పోలవరం వ్యయాన్ని భరించి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి. ఈమేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)తో ఒప్పందం చేసుకోవాలన్న సూచనను కమీషన్ల దాహంతో చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యపెట్టలేదు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పోలవరం నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబరు 7న చంద్రబాబు సర్కారు దక్కించుకుంది. ఆ మరుసటి రోజే నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయాన్ని రూ.1,331.91 కోట్లు పెంచేసి ట్రాన్స్‌ట్రాయ్‌కి లబ్ధి చేకూర్చారు. ఆ సంస్థను అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. 

ఏటీఎంలా మార్చారంటూ బాబుపై ప్రధాని విమర్శలు
పోలవరం జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను 4.83 శాతం ఎక్సెస్‌ ధరకు అంటే రూ.3,220.22 కోట్లకు కోట్‌ చేసిన నవయుగకు 2017 డిసెంబర్‌ 30న గత సర్కారు కట్టబెట్టింది. పోలవరం హెడ్‌ వర్క్స్‌లో జలవిద్యుదుత్పత్తి కేంద్రం పునాది పనులు అంతర్భాగమే. ట్రాన్స్‌ట్రాయ్‌ దివాలా తీయడంతో ఆ పనులనూ నవయుగకే అప్పగించి అటు జలవిద్యుదుత్పత్తి కేంద్రం, ఇటు హెడ్‌వర్క్స్‌లో కమీషన్లు కాజేయడానికి స్కెచ్‌ వేశారు. ట్రాన్స్‌ట్రాయ్‌తో ఈపీసీ (ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండానే 60సీ నిబంధన కింద వేటు వేసి పాత ధరల ముసుగులో రూ.2,914.66 కోట్ల పనులు నవయుగకు, రూ.387.56 కోట్ల విలువైన గేట్ల పనులు బీకెమ్‌కు అప్పగించారు. ఈ వ్యవహారంలో భారీఎత్తున ముడుపులు చేతులు మారాయి. దీన్నే ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రస్తావించిన ప్రధాని నరేంద్ర మోదీ.. పోలవరాన్ని చంద్రబాబు కమీషన్ల కోసం ఏటీఎంలా మార్చుకున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ఆరోపణలు అక్షర సత్యమని పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో కాగ్‌ కూడా తేల్చింది.

ఈ పాపం  ఎవరిది?
పోలవరం హెడ్‌వర్క్స్‌లో రూ.2,914.66 కోట్ల విలువైన పనులను ఎల్‌ఎస్‌ (లంప్సమ్‌)–ఓపెన్‌ పద్ధతిలో నిబంధనలకు విరుద్ధంగా నవయుగకు నామినేషన్‌పై  అప్పగిస్తూ గత సర్కారు మూడు ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇదే రీతిలో గేట్ల పనులను 60 సీ నిబంధన కింద విడదీసి రూ.387.56 కోట్లకు బీకెమ్‌కు నామినేషన్‌పై అప్పగిస్తూ మరో ఒప్పందాన్ని చేసుకుంది. కానీ ఒప్పందం మేరకు పనులు చేయడంలో నవయుగ, బీకెమ్‌ విఫలమయ్యాయి. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనులు పూర్తి చేయకుండానే, నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కాఫర్‌ డ్యామ్‌ పనులు ప్రారంభించారు. వరద ప్రారంభమయ్యేలోగా పునరావాసం, కాఫర్‌ డ్యామ్‌ల పనులు పూర్తి చేయాల్సి ఉన్నా సగం కూడా పూర్తి కాలేదు. గోదావరికి వరదలు వస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేసిన పీపీఏ మే నెలలో ఈ పనులను నిలిపివేసింది. నవయుగ, బీకెమ్, గత సర్కార్‌ ప్రణాళికా లోపం కారణంగానే నవంబర్‌ వరకు పోలవరం పనులు చేయలేని దుస్థితి నెలకొంది. గత సర్కారు నిర్వాకంతో పోలవరం హెడ్‌వర్క్స్‌లో రూ.3,128.31 కోట్లకుపైగా దోచేశారని నిపుణుల కమిటీ నిర్ధారించింది.

నిపుణుల కమిటీ నిగ్గు తేల్చింది ఇదీ..
- పోలవరంలో కాంట్రాక్టు ఒప్పందం గడువు ముగియకుండానే 2015–16 ధరలను వర్తింపజేస్తూ అంచనా వ్యయాన్ని రూ.5,535.91 కోట్లకు పెంచుతూ గత సర్కారు ఉత్తర్వులు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. కాంట్రాక్టర్‌కు రూ.1,331.91 కోట్ల మేరకు ప్రయోజనం చేకూర్చారు. స్పెషల్‌ ఇంప్రెస్ట్‌ అమౌంట్, మొబిలైజేషన్‌లు అడ్వాన్సులు పూర్తిగా వసూలు చేయలేదు. మొత్తానికి హెడ్‌ వర్క్స్‌లోనే రూ.1,559.65 కోట్లను కాంట్రాక్టర్‌కు దోచిపెట్టారు. 

హెడ్‌ వర్క్స్‌ నుంచి 60 సీ నిబంధన కింద ట్రాన్స్‌ట్రాయ్‌ని తొలగించి స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పనులను ఎల్‌ఎస్‌(లంప్సమ్‌)–ఓపెన్‌ విధానంలో రూ.2,914.66 కోట్లకు నవయుగకు నామినేషన్‌పై కట్టబెట్టేశారు. గేట్ల పనులను రూ.387.56 కోట్లకు బీకెమ్‌కు నామినేషన్‌పై అప్పగించేశారు. ట్రాన్స్‌ట్రాయ్‌తో ఈపీసీ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండానే ఎల్‌ఎస్‌–ఓపెన్‌ విధానంలో మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడం నిబంధనలకు విరుద్ధం.  

టీడీపీ సర్కారు నిర్వాకాలపై   ‘కాగ్‌’ ఏమన్నదంటే..? 
పోలవరం హెడ్‌వర్క్స్‌ను ఒప్పందం ప్రకారం పూర్తి చేయటంలో విఫలమైన కాంట్రాక్టర్‌కు నిబంధనల మేరకు జరిమానా విధించకుండా అంచనా వ్యయాన్ని రూ.1,331.91 కోట్లు పెంచడం ఆయాచితంగా లబ్ధి చేకూర్చడం కాదా?
హెడ్‌వర్క్స్‌ అంచనా వ్యయాన్ని పెంచిన నేపథ్యంలో కాంట్రాక్టర్‌ నుంచి ఫెర్ఫార్మెన్స్‌ సెక్యూరిటీ కింద రాబట్టాల్సిన రూ.66.59 కోట్లను వసూలు చేయలేదు.
నిబంధనలకు విరుద్ధంగా రూ.25.37 కోట్ల స్టీలును కొనుగోలు చేసి హెడ్‌ వర్క్స్‌ కాంట్రాక్టర్‌కు సరఫరా చేసింది. యంత్రాలపై రూ.5.72 కోట్ల దిగుమతి సుంకాన్ని కూడా కాంట్రాక్టర్‌కు బదులుగా ప్రభుత్వమే చెల్లించింది. నిబంధనలు ఉల్లంఘించి కాంట్రాక్టర్‌కు టీడీపీ సర్కార్‌ భారీ ప్రయోజనం చేకూర్చినా పనుల్లో ఏమాత్రం పురోగతి లేదు. 2017 జూన్‌ నాటికి 76 శాతం పనులు పూర్తి కావాల్సి ఉండగా కేవలం 31 శాతం పనులు మాత్రమే పురోగతిలో ఉన్నాయి.

రెండేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో..
పోలవరాన్ని 2020 నాటికి పూర్తి చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పనులు చేయని బీకెమ్, నవయుగలకు కాంట్రాక్టుఒప్పందం 89.3 క్లాజ్‌ ప్రకారం వైదొలగాలంటూ ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. హెడ్‌ వర్క్స్‌లో మిగిలిన పనులతోపాటు జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద టెండర్‌ పిలిచేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందుకు పీపీఏ, కేంద్ర జల్‌ శక్తి శాఖల అనుమతి అవసరం. ఈ క్రమంలో కేంద్రం, పీపీఏ అనుమతి తీసుకుని ఆ పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. దీనివల్ల భారీగా ప్రజాధనం ఆదా కావడంతోపాటు రెండు పనులను ఒకే కాంట్రాక్టర్‌ చేయడం వల్ల సమన్వయం ఉంటుంది. రెండేళ్లలో పూర్తి కావడానికి దోహదపడుతుంది.

నవంబర్‌ 1 నుంచి పోలవరం పనులు
జలవనరుల మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ 
పోలవరం పనులు నవంబర్‌ 1వ తేదీ నుంచి పునఃప్రారంభమవుతాయని జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ సృష్టం చేశారు. శనివారం నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలోని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్దేశించిన ప్రకారం సకాలంలోనే ప్రాజెక్ట్‌ పూర్తి అవుతుందని చెప్పారు. గోదావరికి వరదల నేపథ్యంలో జూన్‌ నుంచి నవంబర్‌ వరకు పనులు నిలిపివేశామని తెలిపారు. కాంట్రాక్టర్‌ను మాత్రమే మారుస్తున్నామని, ఇదే విషయాన్ని తాము అనేక సార్లు చెప్పామని గుర్తు చేశారు. సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి రివర్స్‌ టెండరింగ్‌ ప్రకియను పూర్తి చేసి కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తామన్నారు. నవంబర్‌ 1న కొత్త కాంట్రాక్టర్‌తో పనులు కచ్చితంగా మొదలుపెట్టి 2021 చివరి నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గత సర్కారు హయాంలో చేపట్టిన పనుల్లో దాదాపు రూ.రెండు వేల కోట్ల మేర అవినీతి జరిగిందని నిపుణుల కమిటీ నిర్థారించిందన్నారు. అక్రమాలను నిర్మూలించి పారదర్శక విధానం ద్వారా పనులు అప్పగిస్తామని చెప్పారు. గత ఐదేళ్లుగా పనులు సక్రమంగా చేపడితే పోలవరం ఇప్పటికే పూర్తయ్యేదన్నారు.

ఆందోళన అనవసరం..
పోలవరంపై కేంద్ర ప్రభుత్వం ఏమీ కంగారు, హడావుడి పడటం లేదని, తమ శాఖ ఉన్నతాధికారులు ప్రాజెక్టు స్థితిగతుల్ని వివరించారని చెప్పారు. పోలవరంపై ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. విపక్షాలు తమ అనుకూల మీడియా ద్వారా పోలవరంపై సందేహాలు రేకెత్తిస్తున్నాయని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం రెండు నెలల్లో పోలవరం అవకతవకలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తుంటే అడ్డుపడుతున్నారని విమర్శించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement