విద్యార్థుల భవితకు.. ‘నవోదయం’
విద్యార్థుల భవితకు.. ‘నవోదయం’
Published Wed, Jul 20 2016 10:30 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
2017–18 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల
ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
సెప్టెంబరు 16 వరకు దరఖాస్తుల స్వీకరణ
వచ్చే ఏడాది జనవరి 8న ప్రవేశ పరీక్ష
జవహర్ నవోదయ విద్యాలయం.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు 1986లో దీనిని ఏర్పాటు చేశారు. ఉత్తమ విలువలతో బోధన.. విద్యా ప్రమాణాల మెరుగు.. క్రీడా ప్రతిభను వెలికి తీయడంతో పాటు సమైక్యతా భావం పెంపొందించడం.. వంటి కార్యక్రమాలు సాధారణంగా ఇక్కడ అమలవుతుంటాయి. దేశవ్యాప్తంగా 598 నవోదయ విద్యాలయాలు ఉండగా.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 15 ఉన్నాయి. 2017–18 విద్యా సంవత్సరానికి ఆరోతరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఇక్కడ ఉచిత విద్యనందిస్తారు. ఈ పరీక్షకు ఎవరు అర్హులు, పరీక్షా విధానం, రిజర్వేషన్ తదితర వివరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – రాయవరం
ఒక్కసారే అవకాశం..
వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే పరీక్షలో అర్హత సాధించిన వారికి విద్యాలయంలోకి ప్రవేశం కల్పిస్తారు. వచ్చే నెల 16వ తేదీ లోపు అన్ని మండల, జిల్లా విద్యాశాఖ కార్యాలయాలతో పాటు నేరుగా పెద్దాపురం నవోదయ విద్యా సంస్థలో దరఖాస్తులు పొందవచ్చు. మొత్తం 80 సీట్లు ఉంటాయి. ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఆయా మండలాల్లో ఐదో తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులు. ఈ ప్రవేశ పరీక్షకు ఒక్కసారి మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది.
అర్హతలు ఇలా..
2016–17 విద్యా సంవత్సరంలో నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరయ్యే బాలబాలికలు 2004 మే ఒకటో తేదీ నుంచి 2008 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన పాఠశాలల్లో 3, 4 తరగతులు ఉత్తీర్ణత సాధించి ఐదో తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు. గతేడాది ప్రవేశ పరీక్షకు హాజరైన వారు అనర్హులు.
రిజర్వేషన్ విధానం..
నవోదయలో ప్రవేశానికి రిజర్వేషన్ విధానం అమలవుతుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయిస్తారు. షెడ్యూల్ కులాలకు 15 శాతం, షెడ్యూల్ తరగతులకు 7.5 శాతం, దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్ ఉంది.
వసతులు..
బాలబాలికలకు ప్రత్యేక వసతి గృహాలు, అర్హత అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారు. శాస్త్ర, సాంకేతికతతో కూడిన విద్య, క్రీడలు, యోగా ద్వారా విద్యార్థికి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కల్పిస్తారు. ఉచిత వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, నోట్సులు, ఇంటర్నెట్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు నామమాత్రపు రుసుం నెలకు రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తులు పొందండిలా..
అన్ని మండలాల్లో మండల విద్యాశాఖాధికారుల వద్ద, సర్వశిక్షాఅభియాన్ కార్యాలయం, జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో లభ్యమవుతాయి. నవోదయ వెబ్‌సైట్ జ్టి్టp://n్చఠిౌఛ్చీy్చజిyఛీ.జౌఠి.జీn, ఠీఠీఠీ.n్చఠిౌఛ్చీy్చ.nజీఛి.జీnలో కూడా దరఖాస్తులు పొంద వచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను సెప్టెంబరు 16లోపు సంబంధిత మండల విద్యాశాఖాధికారులకు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు లేదా పెద్దాపురం నవోదయ విద్యాలయంలో అందజేయవచ్చు.
పరీక్షా విధానమిది..
నవోదయ ప్రవేశ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 8న ఉదయం 11.30గంటలకు జిల్లాలో నిర్దేశించిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షను విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న భాషను(తెలుగు/ఇంగ్లిష్) ఎంచుకొని పరీక్ష రాసే వీలుంది. ప్రవేశ పరీక్షలు 100 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు నిర్వహించే ప్రవేశ పరీక్ష రాసేందుకు రెండు గంటల సమయాన్ని కేటాయిస్తారు. మూడు విభాగాల్లో ప్రశ్నలు కేటాయిస్తారు. మేధాశక్తిపై 50 ప్రశ్నలు, గణితం, తెలుగు భాషపై ఒక్కొక్క విభాగానికి 25 ప్రశ్నలు వంతున 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా పత్రాల రూపకల్పన నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) నిర్వహిస్తుంది. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై ప్రవేశానికి ఎంపికైన వారికి మొదటి రెండు సంవత్సరాలు తెలుగు/ఇంగ్లిష్ భాషల్లో బోధిస్తారు. అనంతరం ఇంగ్లిష్‌లోనే బోధన చేస్తారు.
Advertisement