సాహస హేల
సముద్ర తీరంలో నేవీ డే వేడుకలు
జనాన్ని కదలివ్వకుండా కట్టిపడేసిన విన్యాసాలు
ఆకాశంలో, ఉపరితంలో కళ్లకు కట్టిన యుద్ధ సన్నివేశాలు
ప్రదర్శనలిచ్చిన యుద్ధ నౌకలు, విమానాలు, హెలికాఫ్టర్లు
గగుర్పాటుకు గురిచేసిన మార్కోస్ శక్తి సామర్థ్యాలు
ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు
అమర వీరులకు నివాళులర్పించిన ఈఎన్‌సీ చీఫ్ హెచ్‌సీఎస్ బిస్త్
ప్రశాంత తీరంలో ఒక్కసారిగా అలజడి రేగింది. భీకర శబ్దంతో సముద్రంలో బాంబ్ పేలింది. దాని ధాటికి బంగాళాఖాతం అదిరిపడింది. అల వంద అడుగులకుపైగా ఎగసిపడింది. ఈ షాక్ నుంచి తేరుకోకముందే ఆకాశంలో రంగురంగుల పక్షుల్లా మెరైన్ కమాండోలు స్కై డైవింగ్ చేస్తూ నేలకు దిగారు..యుద్ధ నౌకలు, యుద్ధ హెలికాఫ్టర్లు, చేతక్ హెలికాఫ్టర్లు, క్లోజ్ రేంజ్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఆకాశంలో దూసుకుపోయారుు. ఇలాంటి ఎన్నో..ఎన్నెన్నో అద్భుత విన్యాసాలకు విశాఖ తీరం వేదికై ంది. ఆర్‌కే బీచ్‌లో ఆదివారం జరిగిన నేవీ డే వేడుకల్లో ప్రతి ప్రదర్శన ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రతి విన్యాసం గురించి వ్యాఖ్యాతలు జ్యోతి, షైలీపంథ్, దేష్‌ముఖ్‌లు సవివరంగా ప్రజలకు తెలియజేశారు.
సాక్షి, విశాఖపట్నం : సముద్ర రారాజు భారత నేవీ శక్తి సామర్థ్యాలను ప్రత్యక్షంగా వీక్షించే అదృష్టం నగర వాసులకు దక్కింది. ఏడాది పొడవునా ఈ రోజు కోసం ఎదురుచూసిన ప్రజల జన్మ ధన్యమైందనట్లుగా నేవీ డే వేడుక సాగింది. బంగాళాఖాతంలో యుద్ధ మేఘాలు అలుముకున్నట్లు, తీరంలో మాటువేసిన శత్రు సేనలపై విరుచుకుపడుతున్నట్టు, గగన తలంలో, భూ ఉపరితలంలో, సాగరంలో నేవీ చేసిన విన్యాసాల ప్రదర్శన నభూతో నభవిష్యత్ అనిపించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు సతీసమేతంగా ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తూర్పునావికాదళాధిపతి, వైస్ అడ్మిరల్ హెసీఎస్ బిస్త్ వారికి సాదర స్వాగతం పలికారు. ఆర్‌కె బీచ్‌లో ప్రత్యేకంగా నిర్మించిన వేదికపై అశోక్‌గజపతిరాజు, బిస్త్‌లు సతీసమేతంగా ఆశీనులై విన్యాసాలు వీక్షించారు. తీరం వెంబడి వేలాదిగా తరలివచ్చిన జనం నేవీ విన్యాసాలు చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
వారిని అదుపు చేయడం పోలీసులకు కత్తిమీద సామే అయింది. ఒకానొక సమయంలో వారిపై లాఠీ చార్జి చేయాల్సి వచ్చింది. సముద్రంలోని రాళ్లపై, తీరం వెంబడి భవంతులపై ఎక్కి మరీ ప్రజలు ఈ విన్యాసాలు తిలకించారు. దూరంగా ఉన్న వారికి కనిపించేలా బీచ్‌లో ప్రత్యేకంగా ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేసి విన్యాసాలు లైవ్ టెలికాస్ట్ చేశారు. తీరంలోని కురుసుర సబ్‌మెరైన్‌తో పాటు సముద్రంలోని నౌకలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. బాణసంచా భారీగా కాల్చి విన్యాసాలకు ముగింపు పలికారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా దారులు మళ్లించి సిటీ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. అయితే ట్రాఫిక్ నియంత్రణలోనూ నేవీ సిబ్బంది పాలు పంచుకోవడం విశేషం. బీచ్‌కు వెళ్లే దారుల్లో, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులతో కలిసి నేవీ ఉద్యోగులు కూడా ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.