అడవిలో అలజడి
-
రేపు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వేడుకలు
-
∙సరిహద్దు ప్రాంతాలకు తరలిన పోలీసు బలగాలు
చర్ల: మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వేడుకలను ఈ నెల 21వ తేదీన నిర్వహిస్తామని ఆ పార్టీ బాధ్యులు పిలుపునిచ్చిన నేపథ్యంలో వెంకటాపురం సర్కిల్‌లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే చర్ల మండలంలోని పలు ప్రాంతాల్లో మావోల పోస్టర్లు వెలవడంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. సీఆర్‌పీఎఫ్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్, కోబ్రా బలగాలను రంగంలోకి దించుతున్నారు. గ్రామాల్లో పోలీసు బలగాలు గస్తీ తిరుగుతున్నాయి. సరిహద్దు ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారుల్లో ప్రత్యేక నిఘాను పెంచారు. సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోకి వెళ్లే మార్గాల్లో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలు గుర్తిస్తున్నారు. మాజీ మిలిటెంట్లు, మిలీషియా సభ్యులు, సానుభూతిపరులను అదుపులోకి తీసుకుంటున్నారు. మావోయిస్టుల కదలికలను పోలీసులు తెలుసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేష¯ŒS చేపట్టేందుకు సంసిద్ధులవుతున్నారు. మావోయిస్టులు విధ్వంసకర ఘటనలకు పాల్పడకుండా గట్టి భద్రతా చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే..అటు పోలీసులు, ఇటు మావోయిస్టుల మధ్య అడవిబిడ్డలైన ఆదివాసీలు వణికిపోతున్నారు. ఉనికిని చాటుకునేందుకు చేసే చర్యలతో ఎలాంటి ఆపదను ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడుతున్నారు.