నావికా దీప్తి.. నవదళానికి స్ఫూర్తి
-
కాకినాడలో ఎన్‌సీసీ కేడెట్ల ‘ఎ డే ఎట్ సీ’
-
విశాఖ నుంచి వచ్చి యుద్ధనౌక ‘ఘరియాల్’
-
ఉత్తేజభరితంగా నావికాదళ కదన విన్యాసాలు
కాకినాడ రూరల్ :
కడలిలో.. కదిలే అలలపై కట్టిన కోటలాంటిది నావికాదళం. దేశ రక్షణలో ఆ బలగాల భాగస్వామ్యం గణనీయమైనది. శత్రుదేశాలతో సమరం సాగించే సందర్భాల్లో కాక.. ప్రకృతి వైపరీత్యాల్లో ప్రజలను ఆదుకునే కృషిలోనూ వారి పాత్ర కీలకమైనది. ఆదివారంపెద్దాపురంలో 12 రోజుల పాటు నిర్వహించే ఎన్‌సీసీ శిక్షణా కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 320 మంది విద్యార్థులు.. ‘ఎ డే ఎట్‌సీ’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆదివారం కాకినాడ తీరాన నావికాదళం కృషిని తెలుసుకున్నారు. విద్యార్థులంతా ఉదయమే కాకినాడ సీ పోర్టుకు చేరుకొన్నారు. తమ కోసం విశాఖపట్నం నుంచి వచ్చిన ఐఎన్‌ఎస్ ఘరియాల్ యుద్ధ నౌకపై సముద్రంలో విహరించారు. నేవీ అధికారులు తమ విభాగం దేశానికి అందించే సేవలు, ఆపదల్లో, ప్రకృతి వైపరీత్యాల్లో చేసే సహాయ కార్యక్రమాలను వివరించారు. వారు అందజేస్తున్న సేవలను విద్యార్థులకు వివరించారు. యుద్ధ సమయాల్లో ఒక ఓడ నుంచి మరో ఓడకు చేరి శత్రువులను దెబ్బతీసే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపారు. నావికాదళం దైనందిన కార్యకలాపాలు, వారికి ఇచ్చే శిక్షణ, దళం నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్న వారిని కాపాడేందుకు చూపే తెగింపు, శత్రువుల దాడిని తిప్పికొట్టడంలో ప్రదర్శించే పోరాటపాటవం వంటి విన్యాసాలు విద్యార్థులను ఉత్తేజపరిచాయి. విద్యార్థులు కూడా తమ నందేహాల్ని, కుతూహలాన్నీ నావికా సిబ్బందిని అడిగి తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎన్‌సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ ఎల్‌సీఎస్ నాయుడు విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ఎన్‌సీసీ విద్యార్థులకు నావెల్, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ సేవలు తెలుసుకోవల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇటువంటి సందర్శన వారికి ఎంతో ప్రేరణనిస్తుందని, త్రివిధదళాల్లో చేరాలన్న భావనను కలిగిస్తుందని అన్నారు. ఐఎన్‌ఎస్ ఘరియాల్ యుద్ధనౌక కెప్టెన్ ఎస్‌కే సింగ్ విద్యార్థులకు నావికాదళం విశిష్టతను, వారు చేస్తున్న సేవలను వివరించారు. ప్రతి రెండేళ్లకోసారి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తామని కెప్టెన్ జి.వివేకానంద వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ (9) గ్రూప్ కెప్టెన్ సుధాంశ తదితరులు పాల్గొన్నారు.