NCC cadets
-
యువత ‘కర్పూరి’ బాటన సాగాలి: మోదీ
న్యూఢిల్లీ: ఈసారి గణతంత్ర పరేడ్ మహిళా శక్తికి అద్దం పట్టడం ద్వారా ప్రత్యేకతను చాటనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్సీసీ కేడెట్లు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లతో ఆయన బుధవారం ముచ్చటించారు. ‘‘బిహార్ మాజీ సీఎం దివంగత కర్పూరీ ఠాకూర్ జీవితం గురించి తెలుసుకోండి. ఆయన ఆచరించి చూపిన మానవీయ విలువలను పుణికిపుచ్చుకోండి. ఆయన ఆదర్శాలను జీవితంలో భాగంగా మలచుకోండి. తద్వారా మీ వ్యక్తిత్వం ఆకాశమంత ఎదుగుతుంది’’ అని యువతకు సూచించారు. దేశం ముందనే భావనతో సాగాలని పేర్కొన్నారు. దుర్భర దారిద్య్రంలో జన్మించినా మొక్కవోని కృషి, పట్టుదలతో ఠాకూర్ సీఎం స్థాయికి ఎదిగారని మోదీ చెప్పారు. -
ఎన్సీసీ జూనియర్లపై సీనియర్ దురాగతం..
-
Viral Video: చెప్పినట్టు వినలేదని ఎన్సీసీ జూనియర్లపై సీనియర్ దురాగతం..
ముంబై: ముంబైకి సమీపంలోని థానేకు చెందిన ఓ కాలేజీలో ఓ సీనియర్ ఎన్సీసీ విద్యార్థి జూనియర్ క్యాడెట్లను కర్రతో చితక బాదుతోన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. జూనియర్లను అమానుషంగా కొడుతున్న ఈ వీడియోను చూసి అనేక మంది నెటిజన్లు సీరియస్ అవుతూ ఆ సీనియర్ విద్యార్థిపైనా, కాలేజీ యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసున్నారు. ముంబైకు సమీపంలోని థానే బందొర్కర్ కాలేజీలో జోరువానలో ఓ సీనియర్ ఎన్సీసీ క్యాడెట్ అతను చెప్పిన టాస్క్ చేయలేదన్న నెపంతో ఎనిమిది మంది జూనియర్ క్యాడెట్లను వరుసగా తల బురదనీటిలో ఆనించి వీపు భాగాన్ని పైకి లేపమని కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. ఈ దృశ్యాలను అక్కడి వారెవరో వీడియో తీసి వైరల్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్సీసీ క్యాడెట్లు అంటేనే క్రమశిక్షణకు మారు పేరు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రమశిక్షణతో కూడిన నడవడికతోపాటు సేవాతత్వాన్ని అలవాటు చేసే విశేష కార్యక్రమం ఎన్సీసీ. అనేక మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ మిగతా వారికి మార్గదర్శకంగా నిలుస్తూ ఉంటారు. అలాంటిది తమ కాలేజీలోని ఎన్సీసీ క్యాడెట్లు ఇంతటి దుశ్చర్యకు పాల్పడటంతో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ సుచిత్రా నాయక్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ సీనియర్ విద్యార్థి కూడా ఎన్సీసీ క్యాండిడేటే కాబట్టి అతనిపై తప్పక చర్య తీసుకుంటాము. మా కాలేజీలో 40 ఏళ్లుగా ఎన్సీసీ ట్రైనింగ్ నిర్వహిస్తున్నాము. కానీ ఎన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదన్నారు. శిక్షకుడు లేని సమయంలో ఆ సంఘటన జరిగిందని మానసిక ఆరోగ్యం సరిగ్గా లేనివారే అలా ప్రవర్తిస్తుంటారని ఆమె అన్నారు. ఇది కూడా చదవండి: సీఎం ‘కుర్చీ’లో అజిత్ పవార్.. -
వారు చేసిన పనికి ఆనంద్ మహీంద్రా ఫిదా!
గ్లోబల్ కంపెనీలకు ఇండియన్లు సీఈవోలుగా అవడాన్ని సీఈవో వైరస్ ఫ్రం ఇండియా అంటూ చమత్కరించిన ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. సమకాలిన సామాజిక అంశాలపై సోషల్ మీడియా వేదికగా నిత్యం స్పందిస్తుంటారు. దేశంలో ఏ మూలన అయినా సరే ఏదైనా మంచి కార్యక్రమం జరిగినట్టు ఆయన దృష్టికి వస్తే చాలు.. ప్రశంసలు కురిపించేందుకు ఏ మాత్రం ఆలస్యం చేయరు. తాజాగా నేషనల్ కేడెట్ కార్ప్ (ఎన్సీసీ) వాలంటీర్లు చేసిన పనిని ఆయన మెచ్చుకున్నారు. ముంబై నగరంలోని ఓ బీచ్‌లో పునీత్ సాగర్ అభియాన్ సంస్థ ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాడెట్లు ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత కార్యక్రమం చేపట్టారు. బీచ్‌లో పేరుకు పోయిన ప్లాస్టిక్ బాటిళ్లు ఇతర వ్యర్థాలను తొలగించారు. ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ సెంటర్లకు పంపించారు. ఈ ఫోటోలను ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ఎన్సీసీ బాధ్యత కలిగిన పౌరులను తయారు చేస్తుందంటూ కొనియాడారు. Even as I participate in a committee to revamp the NCC I’m delighted to see & applaud this initiative. Under the PuneetSagar Abhiyan, the NCC has undertaken the cleaning of beaches & collection of plastic waste for recycling. The NCC produces good Citizens! pic.twitter.com/mvIOibX3cv — anand mahindra (@anandmahindra) December 17, 2021 చదవండి: లీనా నాయర్ సీఈవో ఘనత.. తన శైలిలో మహీంద్రా స్పందన -
దేశంలోనే కడప బెటాలియన్‌కు ప్రత్యేక స్థానం
వైవీయూ: కడప 30 ఆంధ్రా బెటాలియన్‌కు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రత్యేకస్థానం ఉందని తిరుపతి ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ గంగా సతీష్ అన్నారు. గురువారం కడప ఎన్సీసీ నగర్‌లోని 30 ఆంధ్రా బెటాలియన్‌లో ఎన్సీసీ కేడెట్స్ డ్రిల్‌కోసం రూ.54 లక్షల నిధులతో నిర్మించనున్న డ్రిల్ స్క్వేర్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్నల్ గంగా సతీష్ మాట్లాడుతూ కడప నగరంలోని 30 ఆంధ్రా బెటాలియన్ అన్ని సౌకర్యాలతో బాగుందన్నారు. ఎన్సీసీ హబ్‌గా కడపను తీర్చిదిద్దేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆలిండియా ట్రెక్కింగ్ క్యాంపులు, ఏక్‌భారత్.. శ్రేష్ట్భారత్ క్యాంపులను సైతం ఇక్కడే కేటాయించామన్నారు. జాతీయస్థాయిలో తిరుపతి గ్రూప్ పరిధిలోని ఎన్సీసీ కేడెట్స్ ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. కోవిడ్–19 కారణంగా అనుకున్న ప్రణాళికల ప్రకారం పూర్తిస్థాయి అభివృద్ధి సాధ్యం కాలేదని, కోవిడ్ తగ్గిన వెంటనే మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయన్నారు. జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ ఎన్సీసీ బెటాలియన్ అభివృద్ధికి చక్కటి సహకారం అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్సీసీ కేడెట్స్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చక్కటి ప్రోత్సాహం అందిస్తున్నారని పేర్కొన్నారు. జై జవాన్ నుంచి జైకిసాన్కు.. దేశానికి సేవచేసే అవకాశం లభించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తిరుపతి గ్రూప్ కమాండర్ కల్నల్ గంగా సతీష్ అన్నారు. పలు యుద్ధాల్లో పాల్గొని ప్రస్తుతం ఎన్సీసీకి సేవలందించడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటి వరకు జైజవాన్ పాత్రలో ఉన్న నేను మేనెల నుంచి స్వచ్ఛంద పదవీవిరమణ చేసి జైకిసాన్‌గా మారతానన్నారు. 30 ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ దినేష్‌కుమార్ ఝా మాట్లాడుతూ తెలుగువ్యక్తి గ్రూప్ కమాండర్‌గా ఉండటంతో పాటు కడప బెటాలియన్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందించారన్నారు. అనంతరం ఈనెలాఖరున పదవీ విరమణ చేయనున్న కల్నల్ గంగా సతీష్‌ను ఎన్సీసీ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు మేజర్ సి. విజయభాస్కర్, జి. చక్రధర్, పి.వి. సుబ్బారెడ్డి, డా. ఆర్. నీలయ్య, ఎం. వివేకానందరెడ్డి, మహేష్, సూర్యనారాయణరెడ్డి, ఇమాంఖాసీం, జయచంద్ర, ఎన్సీసీ సిబ్బంది శంకర్, శివప్రసాద్, చలమారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఆరుగురి దారుణ హత్య వెనుక కారణలివేనా?! కరోనా: ఒంటరితనం.. ఆపై వెన్నాడిన భయం -
‘పీఎం ట్రోఫీ’ విజేతలకు సీఎం అభినందన
సాక్షి, అమరావతి: రిపబ్లిక్ డే పరేడ్ పీఎం ట్రోఫీ అవార్డును గెలుచుకున్న ఎన్సీసీ కేడెట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వారు సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్సీసీ కేడెట్లు శ్రేయాసి భక్త, ఎ.శ్రీసాయిప్రియ, రొంగలి భార్గవి, చిలకపాటి జ్యోత్స ్న, ఎ.హరిప్రసాద్, బి.భరత్‌నాయక్, డీడీ నాగసురేష్, వి.రామ్‌ప్రశాంత్, పి.సతీష్ కుమార్‌రెడ్డిలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని సీఎం అందజేశారు. 2020–21 సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రైమ్ మినిస్టర్ ఛాంపియన్షిప్ బ్యానర్‌ను ఏపీ, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ గెలుచుకుంది. ఈ సందర్భంగా ఎన్సీసీ కేడెట్లతో పాటు సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో యూత్ సర్వీసెస్ అండ్ స్పోర్ట్స్ ముఖ్య కార్యదర్శి కె.రామ్‌గోపాల్, ఏపీ, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ డీడీజీ ఎయిర్ కమాండర్ టీఎస్ఎస్ కృష్ణన్, డైరెక్టర్ కల్నల్ ఎస్ నాగ్, గ్రూప్ కమాండర్ (కాకినాడ) కల్నల్ కేవీ శ్రీనివాస్, స్టేషన్ కమాండర్ (విజయవాడ) కల్నల్ నితిన్ శర్మ, కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెపె్టన్ పంకజ్ గుప్తా, తదితరులు ఉన్నారు. -
వారం రోజుల్లో మట్టికరిపిస్తాం
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ను మట్టికరిపించడానికి భారత సైనిక దళాలకు వారం, పది రోజుల కన్నా ఎక్కువ సమయం పట్టదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మూడు యుద్ధాల్లో ఓడిపోయినా పాక్ తీరు మారలేదన్నారు. భారత్‌తో పరోక్ష యుద్ధాలకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రతీ ఏటా జరిగే ప్రధానమంత్రి నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్సీసీ) ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మంగళవారం ప్రసంగించారు. పొరుగు దేశాల్లో మతపరమైన మైనారిటీలకు జరిగిన అన్యాయాలను సరిచేసే ప్రయత్నంలో భాగంగానే పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) తీసుకువచ్చామన్నారు. వారికి గతంలో భారత్ ఇచ్చిన హామీని నెరవేర్చేందుకే ఈ చట్టం రూపొందించామని వివరించారు. 1950లో నాటి భారత, పాకిస్తాన్ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, లియాఖత్ అలీల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన సమయంలోనే పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల్లోని మైనారిటీలకు.. వారు కోరుకుంటే భారత్‌కు రావొచ్చని హామీ ఇచ్చామన్నారు. మహాత్మా గాంధీ కోరిక కూడా ఇదేనని, నెహ్రూ–లియాఖత్ ఒప్పందం ఉద్దేశం కూడా ఇదేనని ప్రధాని తెలిపారు. ‘పొరుగు దేశాల్లో మతవిశ్వాసాల కారణంగా వివక్ష ఎదుర్కొన్న వారికి ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత భారత్‌పై ఉంది. వారికి చరిత్రాత్మక అన్యాయం జరిగింది. ఇప్పటికైనా ఆ అన్యాయాన్ని సరిదిద్ది, గతంలో మనమిచ్చిన హామీని నెరవేర్చాల్సి ఉంది. అందుకే సీఏఏను తీసుకువచ్చాం’ అని వివరించారు. అయితే, దీన్ని కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ‘ఎవరి ప్రయోజనాల కోసం వీరు పనిచేస్తున్నారు? పాక్‌లో మైనారిటీలు ఎదుర్కొంటున్న వేధింపులు వీరికి పట్టవా? ఆ మైనారిటీల్లో ఎందరో దళితులు ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. పారిశుద్ధ్య ఉద్యోగాల భర్తీ కోసం పాక్ ఆర్మీ ఇచ్చిన ఒక ప్రకటనను మోదీ ఉటంకించారు. ఆ ప్రకటనలో ఆ ఉద్యోగాలకు ముస్లిమేతరులే అర్హులని పేర్కొనడాన్ని ప్రస్తావించారు. పారిశుద్ధ్య ఉద్యోగాలు ముస్లిమేతరులైన దళితులకే ఇవ్వాలన్నది వారి ఉద్దేశమన్నారు. భారత్‌లో అధికారం చెలాయించిన గత ప్రభుత్వాలు పాక్ పరోక్ష యుద్ధాల కుట్రను కేవలం శాంతి భద్రతల సమస్యగా చూశాయన్నారు. గుణపాఠం చెప్పేందుకు సిద్ధమని మన సైనికదళాలు చెప్పినా.. ఆ ప్రభుత్వాలు వెనకడుగు వేశాయన్నారు. గత ప్రభుత్వాలు, కొన్ని కుటుంబాలు కశ్మీర్ సమస్యను సాగదీసి, ఉగ్రవాద వ్యాప్తికి తోడ్పడ్డాయని ప్రధాని ఆరోపించారు. ఇప్పుడు జమ్మూకశ్మీర్ సహా దేశమంతా ప్రశాంతంగా ఉందన్నారు. గుజరాత్‌పై ప్రశంసలు ఆలుగడ్డల ఉత్పత్తి, ఎగుమతికి గుజరాత్ ప్రధాన కేంద్రంగా మారిందని సొంత రాష్ట్రంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. గాంధీనగర్‌లో జరుగుతున్న ‘గ్లోబల్ పొటాటో కాంక్లేవ్’ను ఉద్దేశించి మంగళవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. గత దశాబ్దంలో దేశవ్యాప్తంగా ఆలుగడ్డల ఉత్పత్తి 20% పెరగగా, గుజరాత్లో 170 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ‘సుజలాం, సుఫలాం’, ‘సౌని యోజన’ తదితర పథకాల వల్ల రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు సైతం నీటి పారుదల సౌకర్యం లభించిందన్నారు. రైతుల కష్టం, ప్రభుత్వ విధానాల కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ కీలక శక్తిగా ఎదిగిందన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
దేశ సేవలోనే తుది శ్వాస
ఒంగోలు: గుండెల నిండా దేశ గాలి పీల్చి జెండాకు సెల్యూట్ చేయాల్సిన ఆ హృదయాలపై జాతీయ పతాకం కప్పాల్సి వచ్చింది. కళ్ల ముందే సిబ్బంది కుప్ప కూలిపోతుంటే ఏం చేయాలో అర్థంకాక ఎన్సీసీ కార్యాలయంలో శిక్షణ ఇస్తున్న సుశిక్షితులైన సైనికులు సైతం దిగ్భ్రాంతి చెందారు. ఒంగోలు సమీపంలోని పెళ్లూరు 34 ఎన్సీసీ బెటాలియన్‌లో ఎన్సీసీ ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్న నేపాల్‌కు చెందిన బసంత్‌రాణా (40, శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మల్లయ్యపేటకు చెందిన గాలి అప్పలనాయుడు(37) విద్యుదాఘాతానికి గురై మంగళవారం అర్ధరాత్రి మరణించారు. ఈ ఘటన పెళ్లూరులో జాతీయ హైవే పక్కన చోటుచేసుకుంది. దీంతో జాతీయ పతాక వేడుకల్లో పాల్గొనేందుకు ముస్తాబైన ఎన్సీసీ బెటాలియన్ మొత్తం స్థానిక రిమ్స్ వద్ద మృతదేహాల కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఏం జరిగిందంటే: బసంత్‌రాణా (40) నేపాలి వాసి. బగ్లంగ్ జిల్లా ధౌలగిరి తాలూకా , సిమ్లాబోట్ –2 ప్రాంతానికి చెందిన వాడు. 15వ గూర్కా రెజిమెంట్‌లో 1998 ఆగస్టు 10న సైన్యంలో చేరారు. 2017 మార్చి 26వ తేదీ నుంచి ఒంగోలు సమీపంలోని పెళ్లూరు 34 ఎన్సీసీ బెటాలియన్‌లో ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నాడు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మల్లయ్యపేటకు చెందిన గాలి అప్పలనాయుడు (37) 2000 ఏప్రిల్ 22న సైన్యంలో చేరారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు 2017 జూన్ 7వ తేదీ నుంచి పెళ్లూరులోని 34వ ఎన్సీసీ బెటాలియన్‌లో శిక్షణ ఇస్తున్నారు. అప్పలనాయుడు గత పదిరోజులుగా గుంటూరులో జనవరి 26న పరేడ్‌లో పాల్గొనే ఎన్సీసీ క్యాడెట్ల ఎంపికకు హాజరయ్యాడు. మంగళవారం మధ్యాహ్నమే ఆయన పెళ్లూరు కార్యాలయంలో రిపోర్టు చేశారు. 72వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునే కార్యక్రమంలో భాగంగా సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. బసంత్‌రాణా, అప్పలనాయుడు జాతీయ జెండా పోల్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే పోల్‌కు తాడు ఏర్పాటు చేసి పైన నిలబెట్టేందుకు యత్నించారు. అయితే కార్యాలయం గేటు ముందు భాగంలోనే ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. దానిపైన తీగల నుంచి విద్యుత్‌షాక్ వచ్చే అవకాశం ఉందని భావించి వాటికి కేబుల్స్ కూడా ఏర్పాటు చేయించారు. కానీ మంగళవారం రాత్రి వర్షం పడుతున్న సమయంలో వీరు పోల్‌ను పైకి లేపేందుకు యత్నిస్తుండగా పోల్ తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. సిబ్బంది వెంటనే విషయాన్ని కమాండ్ ఆఫీసర్ సునీల్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వచ్చి ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. డాక్టర్ పరిశీలించి అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు నిర్ధారించారు. జీర్ణించుకోలేకపోయిన క్యాడెట్లు విషయాన్ని బంధువులకు తెలియడంతో అప్పలనాయుడు రక్త సంబంధీకులు హుటాహుటిన ఒంగోలుకు చేరుకున్నారు. అనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిర్వహించారు. ఎన్సీసీ క్యాడెట్లు పెద్ద ఎత్తున రిమ్స్ వద్దకు చేరుకున్నారు. తమకు శిక్షణ ఇస్తున్న ఇద్దరు అధికారులు విద్యుత్‌షాక్‌తో మరణించారన్న నిజాన్ని వారు జీర్ణించుకోలేక భోరుమంటూ విలపించారు. ఎన్సీసీ అధికారులు, సైనిక అధికారులు అప్పలనాయుడు పార్థివదేహాన్ని ఒక పెట్టెలో ఉంచి దానిపై జాతీయ పతాకాన్ని ఉంచారు. అనంతరం పుష్పగుచ్ఛాలు ఉంచి శోకతప్త హృదయాలతో గౌరవ వందనం చేస్తూ అప్పలనాయుడుకి నివాళులర్పించారు. తెనాలి కమాండ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జమీర్, పెళ్లూరు ఎన్సీసీ కమాండ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ సునీల్ తదితరులున్నారు. తల్లడిల్లిన చిన్నారి అప్పలనాయుడు సతీమణితో నివాళి అర్పించేందుకు బంధువులు యత్నించినా ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. దీంతో అప్పలనాయుడు కుమార్తె ఆరేళ్ల చిన్నారి తండ్రి తలభాగం వద్ద దండం పెట్టుకుని కన్నీటి పర్యంతం అయింది. పాపను మహిళా క్యాడెట్లు దూరంగా తీసుకువస్తున్నా డాడీ ..రా డాడీ అంటూ ఆ చిన్నారి పెట్టిన ఆక్రందన ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేసింది. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో అప్పలనాయుడు పార్థివదేహాన్ని శ్రీకాకుళం తీసుకువెళ్లారు. గురువారం అప్పలనాయుడు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బసంత్‌రాణా మృత దేహాన్ని నేపాల్ పంపించే విషయంపై అధికారులు గురువారం నిర్ణయం తీసుకోనున్నారు. -
అబ్బురపరచిన విన్యాసాలు
-
నావికా దీప్తి.. నవదళానికి స్ఫూర్తి
కాకినాడలో ఎన్సీసీ కేడెట్ల ‘ఎ డే ఎట్ సీ’ విశాఖ నుంచి వచ్చి యుద్ధనౌక ‘ఘరియాల్’ ఉత్తేజభరితంగా నావికాదళ కదన విన్యాసాలు కాకినాడ రూరల్ : కడలిలో.. కదిలే అలలపై కట్టిన కోటలాంటిది నావికాదళం. దేశ రక్షణలో ఆ బలగాల భాగస్వామ్యం గణనీయమైనది. శత్రుదేశాలతో సమరం సాగించే సందర్భాల్లో కాక.. ప్రకృతి వైపరీత్యాల్లో ప్రజలను ఆదుకునే కృషిలోనూ వారి పాత్ర కీలకమైనది. ఆదివారంపెద్దాపురంలో 12 రోజుల పాటు నిర్వహించే ఎన్సీసీ శిక్షణా కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 320 మంది విద్యార్థులు.. ‘ఎ డే ఎట్సీ’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆదివారం కాకినాడ తీరాన నావికాదళం కృషిని తెలుసుకున్నారు. విద్యార్థులంతా ఉదయమే కాకినాడ సీ పోర్టుకు చేరుకొన్నారు. తమ కోసం విశాఖపట్నం నుంచి వచ్చిన ఐఎన్ఎస్ ఘరియాల్ యుద్ధ నౌకపై సముద్రంలో విహరించారు. నేవీ అధికారులు తమ విభాగం దేశానికి అందించే సేవలు, ఆపదల్లో, ప్రకృతి వైపరీత్యాల్లో చేసే సహాయ కార్యక్రమాలను వివరించారు. వారు అందజేస్తున్న సేవలను విద్యార్థులకు వివరించారు. యుద్ధ సమయాల్లో ఒక ఓడ నుంచి మరో ఓడకు చేరి శత్రువులను దెబ్బతీసే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపారు. నావికాదళం దైనందిన కార్యకలాపాలు, వారికి ఇచ్చే శిక్షణ, దళం నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్న వారిని కాపాడేందుకు చూపే తెగింపు, శత్రువుల దాడిని తిప్పికొట్టడంలో ప్రదర్శించే పోరాటపాటవం వంటి విన్యాసాలు విద్యార్థులను ఉత్తేజపరిచాయి. విద్యార్థులు కూడా తమ నందేహాల్ని, కుతూహలాన్నీ నావికా సిబ్బందిని అడిగి తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ ఎల్సీఎస్ నాయుడు విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ఎన్సీసీ విద్యార్థులకు నావెల్, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ సేవలు తెలుసుకోవల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇటువంటి సందర్శన వారికి ఎంతో ప్రేరణనిస్తుందని, త్రివిధదళాల్లో చేరాలన్న భావనను కలిగిస్తుందని అన్నారు. ఐఎన్ఎస్ ఘరియాల్ యుద్ధనౌక కెప్టెన్ ఎస్కే సింగ్ విద్యార్థులకు నావికాదళం విశిష్టతను, వారు చేస్తున్న సేవలను వివరించారు. ప్రతి రెండేళ్లకోసారి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తామని కెప్టెన్ జి.వివేకానంద వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ (9) గ్రూప్ కెప్టెన్ సుధాంశ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్సీసీ క్యాడెట్లు అభినందన
నెల్లూరు(బృందావనం): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంయుక్తంగా విశాఖపట్టణంలో ఎన్సీసీ నావల్ వింగ్ ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్స్‌లో ప్రతిభచాటిన నెల్లూరు కేడెట్లకు అభినందనసభ నిర్వహించారు. స్ధానిక వీఆర్ కళాశాలలో శనివారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీవీఎస్ భాస్కర్ హాజరయ్యారు. తొమ్మిదేళ్ల తరువాత 10(ఎ) నావల్యూనిట్ నుంచి తొమ్మిదిమంది కేడెట్స్ అఖిలభారత స్థాయిలో నవసైనిక్ క్యాంప్‌కు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. వీరికి రెండు నెలలపాటు శిక్షణ అందించిన స్థానిక పీఐ స్టాఫ్, ఏఎన్ఓలను డాక్టర్ భాస్కర్ ప్రశంసించారు. లెఫ్ట్‌నెంట్ కమాండర్ డాక్టర్ సీవీ సురేష్, లెఫ్ట్‌నెంట్ ఎన్.ప్రభాకర్, ఎస్ఎంఐ ఎస్.వి.రమణ్, పీఐ స్టాఫ్ పీఓ ఎస్.దుర్గాప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ విశాఖపట్టణంలో ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 7వ తేదీ వరకు జరిగిన సీమెన్షిప్ ప్రాక్టికల్స్‌లో కె.యుగేష్ బంగారు పతకం, ఏవీ సుబ్బారెడ్డి, ఎ.శేఖర్, ఆర్.మహేష్, ఎన్.సాయిశంకరి, ఏ.కామాక్షీ, పి.అనూష సంయుక్తంగా సంయుక్తంగా 10(ఎ) నావల్ యూనిట్ ఎన్సీసీ తరుపున ప్రధమస్థానంలో నిలవడం హర్షణీయమన్నారు. షిప్ మోడలింగ్‌లో పాల్గొన్న జి.మహేంద్ర, కె.సుందర్‌సాయి, ఐ.శ్రీకళ, ఎ.సునంద ద్వితీయ స్ధానం సాధించడం ప్రశంసనీయమన్నారు. బెస్ట్ కాడెట్‌గా జి.అజిత్ పూర్తిస్థాయిలో ప్రతిభచాటి తృతీయస్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. -
ఆర్మీ, ఎన్సీసీ విభాగాల్లో ఆరోగ్యం కీలకపాత్ర
కమాండెంట్ కల్నల్ మోనీష్‌గౌర్ తుని రూరల్ : ఆర్మీ విభాగంలో ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఉందని 18వ ఆంధ్రా బెటాలియన్ ఎన్సీసీ కమాండెంట్ కల్నల్ మోనీష్‌గౌర్ అన్నారు. తుని మండలం రాజుపేట శ్రీప్రకాష్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల సంయుక్త వార్షిక శిక్షణ శిబిరంలో శుక్రవారం ఎన్.సూరవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కల్నల్ మోనీష్‌గౌర్ మాట్లాడుతూ ఎన్సీసీ శిక్షణలో కేడెట్లకు తరుచూ గాయాలవుతాయన్నారు. ఆరోగ్యవంతంగా ఉన్న కేడెట్లు సమర్థంగా విధులు నిర్వర్తించగలరన్నారు. దేశ రక్షణలో నిరంతరం సేవలు అందించే ఆర్మీ విభాగంలో పని చేసేవారందరు ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యమన్నారు. ఆర్మీ ఉద్యోగాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ కీలకపాత్ర వహిస్తుందన్నారు. ఎన్సీసీ విద్యార్థులకు ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్ రాజశేఖర్, మండల వైద్య విస్తరణ అధికారి శ్రీనివాస్, ఇతర వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు. ఆరువందల మందికి వైద్య పరీక్షలు చేసినట్టు డాక్టర్ తెలిపారు. శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ ఎన్సీసీ థర్డ్ ఆఫీసర్ ఎం.సతీష్, క్యాంపు డిప్యూటీ కమాండెంట్ ఎం.ఎస్.రావత్, ట్రైనింగ్ ఆఫీసర్ లెఫె్టనెంట్ ఎం.కృష్ణారావు, బీహెచ్ఆర్ఎం నాగర్కోటి, రమణమూర్తి, చీఫ్ ఆఫీసర్ యు.మాచిరాజు, సూపరింటెండెంట్ గుమ్మడి అనిల్ కుమార్, సుబేదర్లు జోగిందర్‌సింగ్, రాంకుమార్, రెడ్డి, కెప్టెన్ ఎం.వి.చౌదరి, లెఫె్టనెంట్ రమణబాబు పాల్గొన్నారు. -
పుష్కరాలకు విపత్తుల నిర్వహణ బందం
కావలిఅర్బన్ : ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కష్ణా పుష్కరాలకు కావలి నుంచి విపత్తుల నిర్వహణ బందం తరలివెళ్లింది. స్థానిక రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో అంబులెన్స్‌తో పాటు 5 మంది సభ్యులతో కూడిన బందం బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుంచి బయలుదేరింది. ఈ వాహనాన్ని ఆర్డీఓ లక్ష్మీనరసింహం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ అధ్యక్షుడు, ఆర్డీఓ మాట్లాడుతూ ఈ బందం సభ్యులు ప్రాథమిక చికిత్స, విపత్తుల నిర్వహణలో శిక్షణ పొందినవారని తెలిపారు. వీరు రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్నారన్నారు. బందంలో బీద లక్ష్మీనంద, మొగళ్లపల్లి సాయిగుప్త, డి.నబికేత్, కాకుమాని ప్రీతమ్‌శెట్టి, డాకారపు పుశ్యమిత్రలున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ కార్యదర్శి డి.రవిప్రకాష్, సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ డి.సుధీర్‌నాయుడు పాల్గొన్నారు. -
పంద్రాగస్టు పరేడ్‌కు ఎన్సీసీ క్యాడెట్ల ఎంపిక
పోచమ్మమైదాన్ : హైదారాబాద్‌లో జరిగే స్వాతంత్య్ర దిన వేడుకల్లో పరేడ్‌కు వరంగల్‌లోని లాల్ బహుదుర్ కళాశాలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు సందీప్, రాజేష్, సురేష్ ఎంపికయ్యారు. వీరిని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సత్య పరమేశ్వర్ సోమవారం అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ కళాశాల నుంచి పరేడ్‌కు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఎన్సీసీ వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి డాక్టర్ మొండ్రాతి సదానందం, అండర్ ఆఫీసర్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దేశ రక్షణలో ఎన్సీసీ పాత్ర కీలకం
ఆదిలాబాద్ స్పోర్ట్స్ : దేశ రక్షణలో ఎన్సీసీ కేడెట్ల పాత్ర కీలకమని, దేశ రక్షణలో అత్యధికంగా ఎన్సీసీ కేడెట్లే ఉన్నారని 32వ ఆంధ్ర బెటాలియన్ నిజామాబాద్ గ్రూప్ కమాండర్ బీఎస్ గోకుల అన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని సీసీఐ టౌన్షిప్లో ఎన్సీసీ కేడెట్లకు ఇస్తున్న శిక్షణ తరగతులు శనివారం ఎనిమిదో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేడెట్లు తమ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలన్నారు. ఇందులో కేడెట్లు తలసేన క్యాంపు కఠిన శిక్షణ తీసుకున్నారు. వీటితోపాటే నేలపై పాకడం.. మ్యాప్ రీడింగ్.. తాడుతో సాహసాలు, ఫీల్డ్ సిగ్నల్స్, ఫైర్ ఆర్డర్స్, రిటన్ టెస్ట్‌లో మెళకువలు నేర్చుకున్నారు. వివిధ రాష్ట్రాల మధ్య జరిగే తలసేన క్యాంపులో నిజామాబాద్ గ్రూప్ నుంచి ఎక్కువ సంఖ్యలో స్థానాలు సాధించాలని కోరారు. అనంతరం పాటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్సీసీ 32 ఆంధ్ర బెటాలియన్ ఆదిలాబాద్ కమాండెంట్ రవిచందర్, ఎన్సీసీ అధికారులు శివప్రసాద్, జగ్రాం, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, నరేందర్, విజయ్‌కుమార్, రాజమౌళి, రాజేశ్వరి, స్వరూపరాణి, టీకే ప్రసన్న, సబేధర్ మేజర్ ధారాసింగ్ తదితరులు పాల్గొన్నారు.