దేశ సేవలోనే తుది శ్వాస | NCC Cadets Died With Power Shock In Prakasam | Sakshi
Sakshi News home page

దేశ సేవలోనే తుది శ్వాస

Published Thu, Aug 16 2018 1:51 PM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

NCC Cadets Died With Power Shock In Prakasam - Sakshi

తండ్రి మృతదేహానికి నమస్కరించి విలపిస్తున్న అప్పలనాయుడు కుమార్తెబసంత్‌రాణా (నేపాల్‌) అప్పలనాయుడు (శ్రీకాకుళం)

ఒంగోలు: గుండెల నిండా దేశ గాలి పీల్చి జెండాకు సెల్యూట్‌ చేయాల్సిన ఆ హృదయాలపై జాతీయ పతాకం కప్పాల్సి వచ్చింది. కళ్ల ముందే సిబ్బంది కుప్ప కూలిపోతుంటే ఏం చేయాలో అర్థంకాక ఎన్‌సీసీ కార్యాలయంలో శిక్షణ ఇస్తున్న సుశిక్షితులైన సైనికులు సైతం దిగ్భ్రాంతి చెందారు. ఒంగోలు సమీపంలోని పెళ్లూరు 34 ఎన్‌సీసీ బెటాలియన్‌లో ఎన్‌సీసీ ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్న నేపాల్‌కు చెందిన బసంత్‌రాణా (40,  శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మల్లయ్యపేటకు చెందిన గాలి అప్పలనాయుడు(37) విద్యుదాఘాతానికి గురై మంగళవారం అర్ధరాత్రి మరణించారు. ఈ ఘటన పెళ్లూరులో జాతీయ హైవే పక్కన చోటుచేసుకుంది. దీంతో జాతీయ పతాక వేడుకల్లో పాల్గొనేందుకు ముస్తాబైన ఎన్‌సీసీ బెటాలియన్‌ మొత్తం స్థానిక రిమ్స్‌ వద్ద మృతదేహాల కోసం వేచి చూడాల్సి వచ్చింది.

ఏం జరిగిందంటే: బసంత్‌రాణా (40) నేపాలి వాసి. బగ్లంగ్‌ జిల్లా ధౌలగిరి తాలూకా , సిమ్లాబోట్‌ –2 ప్రాంతానికి చెందిన వాడు. 15వ గూర్కా రెజిమెంట్‌లో 1998 ఆగస్టు 10న సైన్యంలో చేరారు. 2017 మార్చి 26వ తేదీ నుంచి ఒంగోలు సమీపంలోని పెళ్లూరు 34 ఎన్‌సీసీ బెటాలియన్‌లో ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నాడు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మల్లయ్యపేటకు చెందిన గాలి అప్పలనాయుడు (37) 2000 ఏప్రిల్‌ 22న సైన్యంలో చేరారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు 2017 జూన్‌ 7వ తేదీ నుంచి పెళ్లూరులోని 34వ ఎన్‌సీసీ బెటాలియన్‌లో శిక్షణ ఇస్తున్నారు. అప్పలనాయుడు గత పదిరోజులుగా గుంటూరులో జనవరి 26న పరేడ్‌లో పాల్గొనే ఎన్‌సీసీ క్యాడెట్ల ఎంపికకు హాజరయ్యాడు. మంగళవారం మధ్యాహ్నమే ఆయన పెళ్లూరు కార్యాలయంలో రిపోర్టు చేశారు. 72వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునే కార్యక్రమంలో భాగంగా సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. బసంత్‌రాణా, అప్పలనాయుడు జాతీయ జెండా పోల్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే పోల్‌కు తాడు ఏర్పాటు చేసి పైన నిలబెట్టేందుకు యత్నించారు. అయితే కార్యాలయం గేటు ముందు భాగంలోనే ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ ఉంది. దానిపైన తీగల నుంచి  విద్యుత్‌షాక్‌ వచ్చే అవకాశం ఉందని భావించి వాటికి కేబుల్స్‌ కూడా ఏర్పాటు చేయించారు. కానీ మంగళవారం రాత్రి వర్షం పడుతున్న సమయంలో వీరు పోల్‌ను పైకి లేపేందుకు యత్నిస్తుండగా పోల్‌ తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. సిబ్బంది వెంటనే విషయాన్ని కమాండ్‌ ఆఫీసర్‌ సునీల్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వచ్చి ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. డాక్టర్‌ పరిశీలించి అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు నిర్ధారించారు.

జీర్ణించుకోలేకపోయిన క్యాడెట్లు
విషయాన్ని బంధువులకు తెలియడంతో అప్పలనాయుడు రక్త సంబంధీకులు హుటాహుటిన ఒంగోలుకు చేరుకున్నారు. అనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిర్వహించారు. ఎన్‌సీసీ క్యాడెట్లు పెద్ద ఎత్తున రిమ్స్‌ వద్దకు చేరుకున్నారు. తమకు శిక్షణ ఇస్తున్న ఇద్దరు అధికారులు విద్యుత్‌షాక్‌తో మరణించారన్న నిజాన్ని వారు జీర్ణించుకోలేక భోరుమంటూ విలపించారు. ఎన్‌సీసీ అధికారులు, సైనిక అధికారులు అప్పలనాయుడు పార్థివదేహాన్ని ఒక పెట్టెలో ఉంచి దానిపై జాతీయ పతాకాన్ని ఉంచారు. అనంతరం పుష్పగుచ్ఛాలు ఉంచి శోకతప్త హృదయాలతో గౌరవ వందనం చేస్తూ  అప్పలనాయుడుకి నివాళులర్పించారు. తెనాలి కమాండ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ జమీర్, పెళ్లూరు ఎన్‌సీసీ కమాండ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ సునీల్‌ తదితరులున్నారు.

తల్లడిల్లిన చిన్నారి
అప్పలనాయుడు సతీమణితో నివాళి అర్పించేందుకు బంధువులు యత్నించినా ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. దీంతో అప్పలనాయుడు కుమార్తె ఆరేళ్ల చిన్నారి తండ్రి తలభాగం వద్ద దండం పెట్టుకుని కన్నీటి పర్యంతం అయింది. పాపను మహిళా క్యాడెట్లు దూరంగా తీసుకువస్తున్నా డాడీ ..రా డాడీ అంటూ ఆ చిన్నారి పెట్టిన ఆక్రందన ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేసింది. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో అప్పలనాయుడు పార్థివదేహాన్ని శ్రీకాకుళం తీసుకువెళ్లారు. గురువారం అప్పలనాయుడు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బసంత్‌రాణా మృత దేహాన్ని నేపాల్‌ పంపించే విషయంపై అధికారులు గురువారం నిర్ణయం తీసుకోనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement