
న్యూఢిల్లీ: ఈసారి గణతంత్ర పరేడ్ మహిళా శక్తికి అద్దం పట్టడం ద్వారా ప్రత్యేకతను చాటనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్‌సీసీ కేడెట్లు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లతో ఆయన బుధవారం ముచ్చటించారు. ‘‘బిహార్ మాజీ సీఎం దివంగత కర్పూరీ ఠాకూర్ జీవితం గురించి తెలుసుకోండి. ఆయన ఆచరించి చూపిన మానవీయ విలువలను పుణికిపుచ్చుకోండి.
ఆయన ఆదర్శాలను జీవితంలో భాగంగా మలచుకోండి. తద్వారా మీ వ్యక్తిత్వం ఆకాశమంత ఎదుగుతుంది’’ అని యువతకు సూచించారు. దేశం ముందనే భావనతో సాగాలని పేర్కొన్నారు. దుర్భర దారిద్య్రంలో జన్మించినా మొక్కవోని కృషి, పట్టుదలతో ఠాకూర్ సీఎం స్థాయికి ఎదిగారని మోదీ చెప్పారు.