nss students
-
యువత ‘కర్పూరి’ బాటన సాగాలి: మోదీ
న్యూఢిల్లీ: ఈసారి గణతంత్ర పరేడ్ మహిళా శక్తికి అద్దం పట్టడం ద్వారా ప్రత్యేకతను చాటనుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్సీసీ కేడెట్లు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లతో ఆయన బుధవారం ముచ్చటించారు. ‘‘బిహార్ మాజీ సీఎం దివంగత కర్పూరీ ఠాకూర్ జీవితం గురించి తెలుసుకోండి. ఆయన ఆచరించి చూపిన మానవీయ విలువలను పుణికిపుచ్చుకోండి. ఆయన ఆదర్శాలను జీవితంలో భాగంగా మలచుకోండి. తద్వారా మీ వ్యక్తిత్వం ఆకాశమంత ఎదుగుతుంది’’ అని యువతకు సూచించారు. దేశం ముందనే భావనతో సాగాలని పేర్కొన్నారు. దుర్భర దారిద్య్రంలో జన్మించినా మొక్కవోని కృషి, పట్టుదలతో ఠాకూర్ సీఎం స్థాయికి ఎదిగారని మోదీ చెప్పారు. -
ఎన్ఎస్ఎస్ విద్యార్థులపై సీఐ వీరంగం
సాక్షి, విజయవాడ : ఎంతో ఆహ్లాదకరమైన, భక్తిభావంతో జరగాల్సిన దసరా ఉత్సవాల్లో పోలీసుల తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దుర్గగుడిని తమ చెప్పుచేతల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా నిర్వహించేందుకు పోలీసులు తహతహలాడుతున్నారు. ఇప్పటికే ఉత్సవ కమిటీ సభ్యులపై ప్రతాపం చూపించిన పోలీసులు మంగళవారం ఎన్ఎస్ఎస్ వలంటీర్‌లైన విద్యార్థులపై చూపించడంతో వారు విధులు బహిష్కరించారు. సీఐ కాశీనాథ్ వీరంగం... ప్రధాన ఆలయాన్ని తమ స్వాధీనంలోకి తీసుకోవడానికి పోలీసులు తొలిరోజు నుంచి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వన్‌టౌన్ సీఐ కాశీనాథ్ అక్కడకు వచ్చి వలంటీర్లపై వీరంగం వేశారు. ‘మీకు ఇక్కడేమిటీ పని..? మిమ్మల్ని ఇక్కడ ఉంచింది? ఎవరూ..’ అంటూ పెద్దపెద్దగా అరవసాగారు. దీంతో అక్కడ ఉన్న విద్యార్థినులు ఖిన్నులై తమ కోఆర్డినేటర్‌కు చెప్పారు. కోఆర్డినేటర్ వచ్చి అధికారులు డ్యూటీ చేయమన్నారని చెప్పగా.. ఎవరూ ఆ అధికారులు? వాళ్లనే ఇక్కడకు పిలవండి? ఇక్కడ నుంచి పొండి.. అంటూ గదమాయించారు. మనస్తాపం చెందిన కో–ఆర్డినేటర్లు... సేవాభావంతో అనేక సంవత్సరాలుగా నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన 1,500 మంది విద్యార్థులు పది రోజుల పాటు అమ్మవారి భక్తులకు సేవలు అందిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా అలాగే సేవలు అందించాలని అధికారులు కోరడంతో విద్యార్థులు వచ్చారు. వారిని పోలీసులు మాత్రం చులకనగా చూస్తున్నారు. దీంతో ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్లు తీవ్ర మనస్తాపానికి గురై నొచ్చుకున్నారు. విషయం తెలుసుకున్న వలంటీర్లు విధులు బహిష్కరించి రాజగోపురం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. చివరకు దేవస్థానం అధికారులు సర్ది చెప్పి విధుల్లోకి పంపించారు. గతంలో దూరంగా ఉంచేవారు.. గతంలో దురుసుగా ప్రవర్తించే పోలీసుల్ని దసరా ఉత్సవాలకు దూరంగా ఉంచేవారు. అలాగే వివాదాలకు కారణమైన వారికి మిగిలిన రోజుల్లో కొండపైన విధులు అప్పగించేవారు కాదు. కానీ ఈ ఏడాది ఆ విధంగా జరగకపోవడంతో వారు మరింత రెచ్చిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. -
మూఢనమ్మకాలు విడనాడాలి
ధరూరు : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకు సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మూఢ నమ్మకాలను విడనాడి ముందుకు సాగాలని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ రుక్మిణి అన్నారు. ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరంలో భాగంగా మూడో రోజు మండలంలోని బురెడ్డిపల్లిలో ఆమె విద్యార్థులతో కలిసి ఇంటింటికీ తిరిగి మూఢనమ్మకాలు, బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు. బాలికా చదువులపై ప్రతిఒక్కరూ ముందుండాలన్నారు. బాలికలను బడికి పంపించి అక్షరాస్యతను పెంపొందించేందుకు అందరి సహకారం అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకుని బహిరంగ మలవిసర్జనకు దూరంగా ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొత్తం 250 కుటుంబాల్లో సర్వే నిర్వహించి అన్ని కుటుంబాల ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్నారు. సర్పంచ్ బెనకన్న, విద్యార్థులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలి గద్వాల రూరల్: గ్రామంలో ప్రతిఒక్కరూ పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చి స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలని ఎన్ఎస్ఎస్ యూనిట్–2 ప్రోగ్రాం అధికారి సుందరమూర్తి అన్నారు. ఆదివారం మండలంలోని రేకులపల్లిలో ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. అంతకు ముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ సచివాలయం, ప్రధాన వీధుల్లో ముళ్లపొదలు తొలగించి చెత్తాచెదారాన్ని తొలగించారు. సర్పంచ్ సుజాత, అధ్యాపకులు కృష్ణయ్య, భాస్కర్, వలంటీర్లు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న ఎన్ఎస్ఎస్ శిబిరం
నిర్మల్‌టౌన్ : జ్ఞాన సరస్వతీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్మల్‌రూరల్ మండలంలోని అనంతపేట్ గ్రామంలో చేపట్టిన ఎన్ఎస్ఎస్ శిబిరం ఆదివారం నాటికి రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రం చేశారు. అలాగే మురికినీరును శుభ్రం చేశారు. ఇందులో సర్పంచ్ చింతకింది నర్సయ్య, ఎంపీటీసీ దాసరి పంతులు, వీడీసీ మెంబర్ భీమన్న, కళాశాల ప్రిన్సిపాల్ దత్తాద్రి, అధ్యక్షుడు తుల భోజన్న, అధ్యాపకులు, విద్యార్థులున్నారు. -
స్వచ్ఛంద సేవకులు
వీపనగండ్ల : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలతో కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది. అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తుల సహకారంతో పథకాలు పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇస్తాయన్న విశ్వాసం తక్కువ. కానీ విద్యార్థులు ఐక్యమత్యంతో గ్రామాలు శుభ్రంగా ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయని భావించి సేవా కార్యక్రమాలకు పూనుకున్నారు. స్వచ్ఛంద శ్రామికులు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ద్వారా ఐదు రోజులపాటు గోపల్‌దిన్నెలో శ్రమదానం చేస్తున్నారు. గ్రామంలోని మురుగు కాల్వలు శుభ్రం చేయడం, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, కాలనీలోని వీధుల్లో చెత్తాచెదారం, ముళ్లకంపలు, పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారు. అంతేకాక మరుగుదొడ్ల నిర్మాణంతో కలిగే ఉపయోగాలు, బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల సేవా దృక్పథం చూసిన మంత్రి జూపల్లి కృష్ణారావు విద్యార్థులు పలువురిలో స్ఫూర్తి నింపారని ప్రశంసించారు. యువకులు సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. భాగస్వాములను చేయాలి గ్రామాల్లో నెలకొన్న సమస్యల పట్ల విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి సమాజ సేవలో భాగస్వాములను చేశాం. గ్రామాల ప్రజలు కూడా సమాజం కోసం పని చేయాలన్న దృక్పథాన్నినింపాలని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. విద్యార్థుల చేత ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తున్నాం. – లక్ష్మినారాయణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆనందంగా ఉంది విద్యార్థులు మా గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం అభినందనీయం. గ్రామంలో చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. ప్రభుత్వ పథకాలపై ప్రజలను చైతన్యం చేస్తున్నారు. విద్యార్థుల స్ఫూర్తి తో రానున్నరోజుల్లో అభివృద్ధి పనులు చేపడతాం. – లక్ష్మిదేవమ్మ, ఎంపీటీసీ -
మాకూ రిజర్వేషన్లు ఇవ్వాలి
ఎన్ఎస్ఎస్ వైద్య విద్యార్థుల డిమాండు విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ వెబ్‌సైట్‌ను వీసీ డాక్టర్ టి.రవిరాజు లాంఛనంగా ప్రారంభించారు. వర్సిటీ జాతీయ సేవా పథకం సలహామండలి సమావేశం శనివారం వర్సిటీలో జరిగింది. ఎన్సీసీ విద్యార్థులకు మాదిరిగా తమకు కూడా పీజీ మెడికల్ అడ్మిషన్లలో 1శాతం కోటాను అమలు చేయాలని ఎన్‌ఎస్‌స్ వాలంటీర్లు వీసీని కోరారు. ఆయన స్పందిస్తూ ఇతర రాష్ట్రాలోని యూనివర్సిటీల్లో ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు రిజర్వేషన్ కోటా ఏ విధంగా అమలవుతోందో పరిశీలించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కూడా అమలుచేసేందుకు ప్రభుత్వానికి నివేదిస్తానని హామీ ఇచ్చారు. రాబోయే పుష్కరాల్లో వర్సిటీ తరుపున 500 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను సేవలకు వినియోగిస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ పి.రామచంద్రరావు, రీజినల్ డైరెక్టర్ గోకుల కృష్ణన్, సలహామండలి కార్యదర్శి డాక్టర్ కొల్లి శ్రీకరుణమూర్తి, వర్సిటీ రిజిస్ట్రార్ జి.అనురా«ద, ఫైనాన్స్ అధికారి రమాదేవి, ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం, డాక్టర్ గంగాధర్‌రావు, అర్జునరావు, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ టీఎస్ఆర్ సాయి, డాక్టర్ టి.మురళీమోహన్, డాక్టర్ ఆనందకుమార్, కోటేశ్వరీ, ఎన్ఎస్ఎస్ ప్రొగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ వివేకనంద, ఆదిరెడ్డి, పరదేశినాయుడు, కేవీఎన్ ప్రసాద్ పాల్గొన్నారు.