వలంటీరుగా వచ్చిన విద్యార్థులను పంపించేస్తున్న పోలీస్ అధికారి
సాక్షి, విజయవాడ : ఎంతో ఆహ్లాదకరమైన, భక్తిభావంతో జరగాల్సిన దసరా ఉత్సవాల్లో పోలీసుల తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దుర్గగుడిని తమ చెప్పుచేతల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా నిర్వహించేందుకు పోలీసులు తహతహలాడుతున్నారు. ఇప్పటికే ఉత్సవ కమిటీ సభ్యులపై ప్రతాపం చూపించిన పోలీసులు మంగళవారం ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్‌లైన విద్యార్థులపై చూపించడంతో వారు విధులు బహిష్కరించారు.
సీఐ కాశీనాథ్ వీరంగం...
ప్రధాన ఆలయాన్ని తమ స్వాధీనంలోకి తీసుకోవడానికి పోలీసులు తొలిరోజు నుంచి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వన్‌టౌన్ సీఐ కాశీనాథ్ అక్కడకు వచ్చి వలంటీర్లపై వీరంగం వేశారు. ‘మీకు ఇక్కడేమిటీ పని..? మిమ్మల్ని ఇక్కడ ఉంచింది? ఎవరూ..’ అంటూ పెద్దపెద్దగా అరవసాగారు. దీంతో అక్కడ ఉన్న విద్యార్థినులు ఖిన్నులై తమ కోఆర్డినేటర్‌కు చెప్పారు. కోఆర్డినేటర్ వచ్చి అధికారులు డ్యూటీ చేయమన్నారని చెప్పగా.. ఎవరూ ఆ అధికారులు? వాళ్లనే ఇక్కడకు పిలవండి? ఇక్కడ నుంచి పొండి.. అంటూ గదమాయించారు.
మనస్తాపం చెందిన కో–ఆర్డినేటర్లు...
సేవాభావంతో అనేక సంవత్సరాలుగా నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన 1,500 మంది విద్యార్థులు పది రోజుల పాటు అమ్మవారి భక్తులకు సేవలు అందిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా అలాగే సేవలు అందించాలని అధికారులు కోరడంతో విద్యార్థులు వచ్చారు. వారిని పోలీసులు మాత్రం చులకనగా చూస్తున్నారు. దీంతో ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్లు తీవ్ర మనస్తాపానికి గురై నొచ్చుకున్నారు. విషయం తెలుసుకున్న వలంటీర్లు విధులు బహిష్కరించి రాజగోపురం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. చివరకు దేవస్థానం అధికారులు సర్ది చెప్పి విధుల్లోకి పంపించారు.
గతంలో దూరంగా ఉంచేవారు..
గతంలో దురుసుగా ప్రవర్తించే పోలీసుల్ని దసరా ఉత్సవాలకు దూరంగా ఉంచేవారు. అలాగే వివాదాలకు కారణమైన వారికి మిగిలిన రోజుల్లో కొండపైన విధులు అప్పగించేవారు కాదు. కానీ ఈ ఏడాది ఆ విధంగా జరగకపోవడంతో వారు మరింత రెచ్చిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment