ఢిల్లీలో ఎన్‌సీసీ క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో డీజీ ఎన్‌సీసీ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చోప్రా
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ను మట్టికరిపించడానికి భారత సైనిక దళాలకు వారం, పది రోజుల కన్నా ఎక్కువ సమయం పట్టదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మూడు యుద్ధాల్లో ఓడిపోయినా పాక్ తీరు మారలేదన్నారు. భారత్‌తో పరోక్ష యుద్ధాలకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రతీ ఏటా జరిగే ప్రధానమంత్రి నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్‌సీసీ) ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మంగళవారం ప్రసంగించారు. పొరుగు దేశాల్లో మతపరమైన మైనారిటీలకు జరిగిన అన్యాయాలను సరిచేసే ప్రయత్నంలో భాగంగానే పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) తీసుకువచ్చామన్నారు. వారికి గతంలో భారత్ ఇచ్చిన హామీని నెరవేర్చేందుకే ఈ చట్టం రూపొందించామని వివరించారు. 1950లో నాటి భారత, పాకిస్తాన్ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, లియాఖత్ అలీల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన సమయంలోనే పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల్లోని మైనారిటీలకు.. వారు కోరుకుంటే భారత్‌కు రావొచ్చని హామీ ఇచ్చామన్నారు.
మహాత్మా గాంధీ కోరిక కూడా ఇదేనని, నెహ్రూ–లియాఖత్ ఒప్పందం ఉద్దేశం కూడా ఇదేనని ప్రధాని తెలిపారు. ‘పొరుగు దేశాల్లో మతవిశ్వాసాల కారణంగా వివక్ష ఎదుర్కొన్న వారికి ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత భారత్‌పై ఉంది. వారికి చరిత్రాత్మక అన్యాయం జరిగింది. ఇప్పటికైనా ఆ అన్యాయాన్ని సరిదిద్ది, గతంలో మనమిచ్చిన హామీని నెరవేర్చాల్సి ఉంది. అందుకే సీఏఏను తీసుకువచ్చాం’ అని వివరించారు. అయితే, దీన్ని కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ‘ఎవరి ప్రయోజనాల కోసం వీరు పనిచేస్తున్నారు? పాక్‌లో మైనారిటీలు ఎదుర్కొంటున్న వేధింపులు వీరికి పట్టవా? ఆ మైనారిటీల్లో ఎందరో దళితులు ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.
పారిశుద్ధ్య ఉద్యోగాల భర్తీ కోసం పాక్ ఆర్మీ ఇచ్చిన ఒక ప్రకటనను మోదీ ఉటంకించారు. ఆ ప్రకటనలో ఆ ఉద్యోగాలకు ముస్లిమేతరులే అర్హులని పేర్కొనడాన్ని ప్రస్తావించారు. పారిశుద్ధ్య ఉద్యోగాలు ముస్లిమేతరులైన దళితులకే ఇవ్వాలన్నది వారి ఉద్దేశమన్నారు. భారత్‌లో అధికారం చెలాయించిన గత ప్రభుత్వాలు పాక్ పరోక్ష యుద్ధాల కుట్రను కేవలం శాంతి భద్రతల సమస్యగా చూశాయన్నారు. గుణపాఠం చెప్పేందుకు సిద్ధమని మన సైనికదళాలు చెప్పినా.. ఆ ప్రభుత్వాలు వెనకడుగు వేశాయన్నారు. గత ప్రభుత్వాలు, కొన్ని కుటుంబాలు కశ్మీర్ సమస్యను సాగదీసి, ఉగ్రవాద వ్యాప్తికి తోడ్పడ్డాయని ప్రధాని ఆరోపించారు. ఇప్పుడు జమ్మూకశ్మీర్ సహా దేశమంతా ప్రశాంతంగా ఉందన్నారు.
గుజరాత్‌పై ప్రశంసలు
ఆలుగడ్డల ఉత్పత్తి, ఎగుమతికి గుజరాత్ ప్రధాన కేంద్రంగా మారిందని సొంత రాష్ట్రంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. గాంధీనగర్‌లో జరుగుతున్న ‘గ్లోబల్ పొటాటో కాంక్లేవ్’ను ఉద్దేశించి మంగళవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. గత దశాబ్దంలో దేశవ్యాప్తంగా ఆలుగడ్డల ఉత్పత్తి 20% పెరగగా, గుజరాత్‌లో 170 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ‘సుజలాం, సుఫలాం’, ‘సౌని యోజన’ తదితర పథకాల వల్ల రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు సైతం నీటి పారుదల సౌకర్యం లభించిందన్నారు. రైతుల కష్టం, ప్రభుత్వ విధానాల కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ కీలక శక్తిగా ఎదిగిందన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment