నాన్నకు ప్రేమతో..
నేదునూరికి కుటుంబ సభ్యుల నివాళి
విశాఖపట్నం: కర్నాటక సంగీతంలో ఆకాశమంత ఎత్తుకెదిగారు. సాగరమంత ఖ్యాతిని గడించారు. అర్థ శతాబ్దానికి పైగా తమిళనాట వేల కచేరీలిచ్చి సంగీత ప్రియులను ఓలలాడించారు. రాష్ట్రానికి, దేశానికి కీర్తిని తెచ్చిపెట్టారు. ఆ సంగీత కళానిధి పేరు నేదునూరి కృష్ణమూర్తి. ఏడాది క్రితం కన్నుమూశారు. మంగళవారం ఆ మహనీయుని పేరిట విశాఖ సాగరతీరంలో కర్ణాటక సంగీత భాండాగారాన్ని ప్రముఖులు ప్రారంభించారు. ఆయన కాంస్య విగ్రహాన్నీ ఆవిష్కరించారు. ఆ మహత్కార్యంలో పాలుపంచుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో కుటుంబ సభ్యులు వచ్చారు.
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కుమారుడు పినాకపాణి, కోడలు, విశాఖ ఎంవీపీ కాలనీలో ఉంటున్న కుమార్తె విజయశ్రీ, వారి బంధుగణం వచ్చి వాలారు. తొలుత తండ్రి నేదునూరి విగ్రహావిష్కరణలో, తర్వాత సంగీత భాండాగారం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అతిరథ మహారథులు, అమాత్యులు, ప్రజాప్రతినిధులు అక్కడ నుంచి నిష్ర్కమించాక భాండాగారానికి ఎదురుగా ఉన్న నేదునూరి విగ్రహం వద్దకు వెళ్లారు. నాన్నకు ప్రేమతో పూలమాలలు వేసి నివాళులర్పించారు. చెమర్చిన కళ్లతో కాసేపు అక్కడే గడిపారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా తన తండ్రికి దక్కిన అరుదైన గౌరవాన్ని చూసి ఉప్పొంగిన ఆనందంతో వెనుదిరిగారు.
మా అదృష్టం
నేను అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. మా తండ్రి నేదునూరి పేరిట విశాఖలో కర్ణాటక సంగీత భాండాగారాన్ని ఏర్పాటు చేయడం మా అదృష్టం. సాగరతీరంలో ఆయన సంగీతం అంద రూ విని ఆస్వాదించే అవకాశం కల్పించడం సంతోషకరం. మాకు ఇంతకన్నా ఆనందకరమైనది ఇంకొకటి ఉండదు. నేదునూరి మ్యూజిక్ మ్యూజియం ఏర్పాటుకు సహకరించిన వారందరికీ మా ధన్యవాదాలు.
-పినాకపాణి, నేదునూరి కుమారుడు, అమెరికా
కలకాలం నాన్నగారి సంగీతం
నాన్నగారి సంగీతం కలకాలం నిలవాలని సంగీత ప్రియులు కోరుకుంటారు. ఈ సంగీత భాండాగారం ద్వారా ఆ కోరిక తీరుతుంది. మా మనసులోని భావాలు కార్యరూపం దాల్చడం మా అదృష్టం. ఈ మ్యూజియం ద్వారా మా తండ్రి నేదునూరి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. తక్కువ వ్యవధిలోనే ఈ మ్యూజియం ఏర్పాటు చే సినందుకు కృత జ్ఞతలు తెలుపుకుంటున్నాం.
-విజయశ్రీ, నేదునూరి కుమార్తె, ఎంవీపీ కాలనీ