ఓటేసేందుకు సహాయకులు కావాలి
- మాకు చదువురాదు
– దేశం నేతల ఆధ్వర్యంలో జేసీకి దరఖాస్తు
చేసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు
కర్నూలు(అగ్రికల్చర్): తమకు చదువురాదని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సహాయకులను ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరారు. ఈమేరకు వారు సోమవారం తెలుగుదేశం నేతల ఆధ్వర్యంలో రిటర్నింగ్ అధికారి అయిన జేసీ హరికిరణ్‌ను కలిసి దరఖాస్తు చేసుకున్నారు. శాసనమండలి లోకల్ అథారిటీ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ ఈ నెల 17న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయవచ్చు. అయితే నిరక్షరాస్యులు, అంధులు, బలహీనులు సహాయకుడిని నియమించుకొని ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. ఇది అధికార పార్టీ నేతలకు కలసి వచ్చింది. ఓటర్లు నిజంగా తమ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారో లేదో అనే భయంతో దగ్గరుండి సహాయకుల కోసం దరఖాస్తు చేయించడం గమనార్హం.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు సోమవారమే కావడంతో చదువురాని వారితో పాటు అనుమానం ఉన్న వారికి సహాయకులను నియమింపచేసి వారి ద్వారా తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవాలనే లక్ష్యంతో దేశం నేతలు ఎంపీటీసీలను జేసీ కార్యాలయానికి తీసుకువచినట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్సీ ఓటర్లు మొన్నటి వరకు 1084 మంది ఉన్నారు. వీరిలో నంద్యాల ఎమ్మెల్యే మరణించడంతో ఓటర్ల సంఖ్య 1083కు తగ్గింది. ఇందులో ఎంపీటీసీ సభ్యులు 804 మంది ఉన్నారు. వీరిలోనే చాలామంది సహాయకుల కోసం కలెక్టరేట్‌కు వచ్చారు. నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధి కుటుంబసభ్యులో్ల 18 ఏళ్లు నిండిన వారిని సహాయకులుగా నియమిస్తారు. అయితే దేశం నేతలు కొంత మంది ఎంపీటీసీ కుటుంబ సభ్యులపై అనుమానంతో ఇతరులను సహాయకులుగా నియమించేందుకు దరఖాస్తు చేయించినట్లు తెలుస్తోంది. వీటిపై జాయింట్ కలెక్టర్ విచారణ జరిపి తర్వాత నిర్ణయం తీసుకుంటారు.