శ్రీ గౌతమి కేసును పట్టించుకోరేం
శ్రీ గౌతమి కేసును పట్టించుకోరేం
Published Fri, Feb 3 2017 2:22 AM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM
నరసాపురం : నరసాపురం పట్టణానికి చెందిన యువతి శ్రీగౌతమి మృతి కేసులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. కేసు విచారణ పక్కదారి పడుతున్నా పట్టించుకోవడం లేదని వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసును పునర్విచారణ చేయించి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. నరసాపురం సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీని బుధవారం కలిసి కేసు పూర్వాపరాలను వివరిం చారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా శాఖ కార్యదర్శి వి.మహేష్ మాట్లాడుతూ కేసు దర్యాప్తు సక్రమంగా సాగలేదన్నారు. టీడీపీ నేత సజ్జా బుజ్జి శ్రీగౌతమిని రెండోపెళ్లి చేసుకున్నాడని, ఆయన అధికార పార్టీకి చెందినవాడు కావడంతో కేసును పోలీసులు నీరు గార్చారని ఆరోపించారు. శ్రీగౌతమిని పథకం ప్రకారం హత్య చేసినట్టు ఆమె చెల్లెలు పావని ఎన్నిసార్లు చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రెండో పెళ్లి విషయంపైనా దర్యాప్తు చేయలేదన్నారు. శ్రీగౌతమి తల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ తన కుమార్తెను అన్యాయంగా చంపేశారని కన్నీటి పర్యంతమైంది. కూతురిని పోగొట్టుకున్న తాను ఆ బాధను తట్టుకుంటూనే, న్యాయం కోసం తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయింది. భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నరసాపురం డివిజన్ కార్యదర్శి పొగాకు పూర్ణ మాట్లాడుతూ శ్రీగౌతమి కేసు విషయంలో ఆ కుటుంబానికి దారుణమైన అన్యాయం జరిగిందన్నారు. అధికార పార్టీ నేతలు వెనుక ఉండి రాష్ట్ర స్థాయిలో వ్యవహారం నడిపిస్తున్నారని, అందువల్లే పోలీ సులు ఈ కేసును నీరుగారుస్తున్నారని ధ్వజమెత్తారు. సబ్ కలెక్టర్ సమాధానమిస్తూ ఈ విషయమై డీఎస్పీతో మాట్లాడతానని, అనంతరం కలెక్టర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేవిధంగా తన పరిధిలో అవకాశం ఉన్న చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ ఈదా జోన్సీ, నక్కా ఆనంద్, తిరుమాని విమల పాల్గొన్నారు.
Advertisement