SRI GOUTHAMI
-
శ్రీగౌతమి కేసు దర్యాప్తు ఏమైనట్టు!
సాక్షి, నరసాపురం(పశ్చిమగోదావరి) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన దంగేటి శ్రీగౌతమి హత్య కేసులో చురుగ్గా వ్యవహరించిన సీఐడీ సీఐ (రాజమండ్రి) శేఖర్‌బాబు నేర పరిశోధనల్లో ప్రతిభకు ఇచ్చే ఏబీసీడీ అవార్డుకు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా బెస్ట్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో ద్వితీయస్థానంలో నిలిచారు. విజయవాడలో సోమవారం జరిగిన కార్యక్రమంలో హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ ఠాగూర్ చేతులమీదుగా శేఖర్‌బాబు అవార్డు అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీగౌతమి కేసును దర్యాప్తు చేసినందుకే శేఖర్‌బాబును ఈ అవార్డు వరించింది. అయితే ఈ కేసును మొదట్లో పక్కదోవ పట్టించిన పోలీసు అధికారులపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ఇంకా సగం దర్యాప్తు మిగిలి ఉందని చెప్పిన పోలీసు అధికారులు, ఇంకా కోర్టులో చార్జ్‌షీట్ ఫైల్ చేయకపోవడంపైనా ఆరోపణలు ఉన్నాయి. మంట కలిసిన పోలీసుల ప్రతిష్ట 2017 జనవరి 18 రాత్రి శ్రీగౌతమి హత్య జరిగింది. కేసును 15 రోజుల్లోనే అప్పటి పోలీసు అధికారులు క్లోజ్చేశారు. ప్రమాదం నుంచి బయటపడ్డ శ్రీగౌతమి సోదరి పావని అది హత్య అని ఎంతమొత్తుకున్నా పోలీసులు పెడచెవిన పెట్టారు. సోదరికి జరిగిన అన్యాయంపై పావని ఒంటరి పోరాటం చేసింది. సీఐడీని ఆశ్రయించడంతో కథ మలుపు తిరిగింది. సీఐడీ సీఐ శేఖర్‌బాబు నేతృత్వంలోని అధికారులు ఇది పక్కా ప్లాన్‌తో చేసిన హత్య అని, ఇందులో ప్రధానంగా సజ్జా బుజ్జితో పాటు మరో ఆరుగురు ఉన్నారని తేల్చారు. ఈ వివరాలను పోలీసులకు అందించారు. దీంతో హడావిడిగా మళ్లీ పోలీసులు కేసును తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏ1, ఏ2లుగా ఉన్న టీడీపీ నేత సజ్జా బుజ్జి, బొల్లంపల్లి రమేష్‌తో పాటు ఏ3 గా ఉన్న నరసాపురం జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్, అతని సోదరుడు బాలం ఆండ్రూలను జూన్ 26న అరెస్ట్ చేశారు. మరోవారం తరువాత బొల్లంపల్లి రమేష్ కారు డ్రైవర్ కవురు లక్ష్మణ్‌ను, పథకాన్ని పక్కాగా అమలుచేసి శ్రీగౌతమి ప్రాణాలు తీసిన సుఫారి హంతకులు సందీప్, దుర్గాప్రసాద్‌ను అరెస్ట్‌చేసి కోర్టుకు పంపారు. నిజానికి ఇక్కడి వరకూ దర్యాప్తు చేసింది సీబీసీఐడీనే. పోలీసులు కనుక్కున్న కొత్త విషయం ఏమీలేదు. శ్రీగౌతమి కేసులో ప్రతిష్ట పోగొట్టుకున్న జిల్లా పోలీసులు దానిని సరిచేసుకునే యత్నం ఏమీచేయకపోవడం విశేషం. ప్రారంభంలో కేసు దర్యాప్తు పూర్తిగా పక్కదారి పట్టినట్టుగా సీబీసీఐడీ తేటతెల్లం చేసింది. ముఖ్యంగా అప్పటిలో నరసాపురం డీఎస్పీ, పాలకొల్లు రూరల్ సీఐ ఇతర దర్యాప్తు అధికారులు అంతా కూడా సజ్జా బుజ్జి సొంత సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో కేసు పక్కదారి పట్టించారనే విమర్శలు ఉన్నాయి. హోంశాఖ మంత్రి చినరాజప్ప చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న సీఐడీ సీఐ శేఖర్‌బాబు చార్జ్‌షీట్ ఇంకా ఎందుకు వేయలేదు? హత్యకేసులో 90 రోజుల్లో చార్జ్‌షీట్ వేయాలి. అసలు శ్రీగౌతమి ప్రమాద కేసును 2018 జూన్ 26న హత్య కేసుగా మార్చారు. 5 నెలలు అవుతున్నా చార్జ్‌షీట్ ఫైల్ చేయలేదు. అంతకుముందు ప్రమాదంగా చెప్పిన అంశంపైనా చార్జిషీట్ ఫైల్ చేయలేదు. సజ్జా బుజ్జిని, ఇతర నిందితులను కాపాడడానికి అదృశ్య శక్తులు ఇంకా పనిచేస్తూనే ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు పోలీసులూ ప్రారంభంలో జరిగిన తప్పును ఇప్పటి తూతూమంత్రపు దర్యాప్తుతో దులిపేసుకుంటున్నట్టుగా కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నరసాపురం సబ్‌జైలులో రిమాండ్ అనుభవించిన నిందితులకు ఇటీవల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చివరికి ఈ కేసు ఏం జరుగుతుందనే అంశం ఆసక్తిగా మారింది. దొరకని ప్రశ్న! ‘సజ్జా బుజ్జితో పాటు మరో ఆరుగురి పాత్రను గుర్తించాం. అయితే ఈ కేసు దర్యాప్తు ఇప్పటికీ సగమే పూర్తయ్యింది’ అని పాలకొల్లు రూరల్ సీఐ కె.రజనీకుమార్ శ్రీగౌతమి హత్యకేసు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టే ముందు గత జూన్‌నెల 26న చెప్పిన మాట ఇది. సాక్షాత్తు పోలీసులే చెప్పిన మిగిలిన సగం దర్యాప్తు ఏమైయ్యిందనేది ఎవరికీ సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. న్యాయం జరిగే వరకూ పోరాటం: పావని మా అక్కను దారుణంగా చంపేశారు. అప్పట్లో పోలీసులు మా గోడు పట్టించుకోలేదు. కేసును పక్కదారి పట్టించిన పోలీసులపై చర్యలు తీసుకోలేదు. ఇది దారుణం. అప్పట్లో మా అక్కను చంపేశారు అంటే చాలా హీనంగా మాట్లాడేవారు. ఈ కేసులో పోలీసులు ఏమీ చేయలేదు. సీఐడీ వారే చేశారు. వారికి అవార్డు రావడం సంతోషమే. హత్య వెనుక ఉన్న వ్యక్తులను బయటకు లాగాలి. -
మా అక్కను దారుణంగా చంపేశారు..
‘దంగేటి శ్రీగౌతమిది పక్కా హత్య.. అది యాక్సిడెంట్ కాదు.. ఈ కేసులో ఇప్పటివరకూ సజ్జా బుజ్జితో పాటు మరో ఆరుగురిపాత్రను గుర్తించాం. ఈ కేసు దర్యాప్తు ఇప్పటికి సగమే పూర్తయ్యింది. ఇంకా సగం దర్యాప్తు ఉంది’ ఇదీ పాలకొల్లు రూరల్ సీఐకె.రజనీకుమార్ శ్రీగౌతమి హత్య కేసు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టే ముందు జూన్ 26న చెప్పిన మాట. అయితే అప్పటి నుంచికేసులో పురోగతి ఏమీ లేదు. మరి సాక్షాత్తూ పోలీసులే చెప్పిన మిగిలిన సగం దర్యాప్తు ఏమైందనేది అంతులేని ప్రశ్నగా మిగిలింది. పశ్చిమగోదావరి ,నరసాపురం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీగౌతమి హత్య కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. ఈ కేసు దర్యాప్తుపై పోలీసు చర్యలు నామమాత్రంగాగే ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. యాక్సిడెంట్ మాటున పక్కా ప్లాన్‌తో శ్రీగౌతమిని టీడీపీ నేత, మాజీ సర్పంచ్ సజ్జా బుజ్జి హత్య చేయించినట్టుగా పోలీసులు తేల్చారు. కేసులో నరసాపురం జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్ ఏ–3 నిందితుడిగా ఉండటంతో ఈ హత్యకేసు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో ఈ ఘాతుకం వెనుక మరింత మంది పెద్దలు ఉన్నారనే ప్రచారం సాగింది. దర్యాప్తు సగమే అయ్యిందని పోలీసులు చెప్పడంతో మునుముందు అసలు పెద్దలు తెరమీదకు వస్తారని అంతా అనుకున్నారు. కానీ కేసులో ఇంకెలాంటి ట్విస్ట్‌లకు ఇప్పటి వరకూ పోలీసులు చోటివ్వలేదు. కేసు ప్రారంభం నుంచి ఆరోపణలు ఎదుర్కొన్న పోలీస్‌శాఖపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడులు మళ్లీ పనిచేస్తున్నాయా? లేక కేసు ప్రారంభంలో చేసిన తప్పులను తప్పించుకోవడానికి పోలీసులే కావాలని తూతూమంత్రంగా కేసును మళ్లీ మమా అని అనిపిస్తున్నారా? అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకూ పోలీసులు ఏం చేశారు? 2017 జనవరి 15 రాత్రి శ్రీగౌతమి హత్య జరిగింది. కేసును 15 రోజుల్లోనే అప్పటి పోలీసు అధికారులు క్లోజ్ చేశారు. యాక్సిడెంట్ నుంచి బయటపడ్డ శ్రీగౌతమి సోదరి పావని అది హత్య అని ఎంత మొత్తుకున్నా పోలీసులు పెడచెవిన పెట్టారు. మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు, విద్యార్థులు ఆందోళనలు చేసినా కూడా అది ముమ్మాటికీ రోడ్డు ప్రమాదమేనని పోలీసులు కుండబద్ధలు కొట్టారు. అయితే కేసులో నిందితుడిగా ఉన్న సజ్జా బుజ్జి, ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గం నేతకావడం, స్థానికంగా అదే సామాజికవర్గానికి చెందిన కొందరు బడా వ్యక్తుల అండ ఉండటంతోనే పోలీసులు కేసును పట్టించుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. అయితే అప్పట్లో పోలీసులు అదేమీ పట్టించుకోలేదు. సోదరికి జరిగిన అన్యాయంపై పావని ఒంటరి పోరాటం చేసింది. సీబీసీఐడీని ఆశ్రయించడంతో కథ మలుపు తిరిగింది. సీబీసీఐడీ దర్యాప్తు సాగించి ఇది పక్కా ప్లాన్‌తో చేసిన హత్య అని, ఇందులో ప్రధానంగా సజ్జా బుజ్జితో పాటు మరో ఆరుగురు ఉన్నారని తేల్చారు. ఈ వివరాలను పోలీసులకు అందించారు. దీంతో హడావిడిగా మళ్లీ పోలీసులు కేసును తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏ–1, ఏ–2లుగా ఉన్న టీడీపీ నేత సజ్జా బుజ్జి, బొల్లంపల్లి రమేష్‌లతో పాటు ఏ–3గా ఉన్న నరసాపురం జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్, అతని సోదరుడు బాలం ఆండ్రూలను జూన్ నెల 26న అరెస్ట్ చేశారు. మరోవారం తరువాత బొల్లంపల్లి రమేష్ కారు డ్రైవర్ కవురు లక్ష్మణ్‌ను, పథకాన్ని పక్కాగా అమలుచేసి శ్రీగౌతమి ప్రాణాలు తీసిన సందీప్, దుర్గాప్రసాద్‌లను అరెస్ట్ చేసి కోర్టుకు పంపారు. నిజానికి ఇక్కడి వరకూ దర్యాప్తు చేసింది సీబీసీఐడీనే. పోలీసులు కనుక్కున్న కొత్త విషయం ఏమీలేదు. ముందు యాక్సిండెంట్ అని చెప్పి, తరువాత అది రోడ్డు ప్రమాదంకాదు హత్య అని చెప్పడం తప్ప. నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందా? ప్రారంభంలో కేసు దర్యాప్తు పూర్తిగా పక్కదారి పట్టినట్టుగా సీబీసీఐడీ తేటతెల్లం చేసింది. అయినా కూడా ఈ కేసు ప్రారంభ దర్యాప్తులో ఉన్న పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిజానికి పోలీస్ శాఖ అందరనీ సస్పెండ్ చేస్తుందని భావించారు. ఈ కేసులో పావని పోరాటం కొనసాగుతూనే ఉంది. నరసాపురం సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న సజ్జా బుజ్జితో పాటు మిగిలిన నిందితులకు నిబంధనలకు విరుద్ధంగా సకల సౌకర్యాలు అందుతున్నాయని పావని జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, వారు విచారణ చేయడం కూడా సంచలనం కలిగించింది. ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న కేసులో ఈ నిర్లిప్త ధోరణి కొనసాగడం అనుమానాలకు తావిస్తోంది. సజ్జా బుజ్జిని, ఇతర నిందితులను కాపాడటానికి అదృశ్య శక్తులు ఇంకా పనిచేస్తూనే ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. మరో వైపు పోలీసులు కూడా ప్రారంభంలో జరిగిన తప్పును ఇప్పటి తూతూమంత్రపు దర్యాప్తులో దులిపేసుకుంటున్నట్టుగా కనిపిస్తోందని చెబుతున్నారు. నిందితులకు హైకోర్టులో చుక్కెదురు బెయిల్ కోసం సజ్జా బుజ్జి ఇతర నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో వారికి చుక్కెదురైంది. నరసాపురం అదనపు జిల్లా కోర్టు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటీషన్లో పావని పార్టీగా చేరి తన న్యాయవాది చేత వాదనలు వినిపించింది. దీంతో జస్టిస్ బి.వివశంకరరావు సజ్జా బుజ్జి బెయిల్ పిటీషన్‌ను కొట్టేసినట్టు పావని చెప్పింది. పోలీసులపై చర్యలు తీసుకోవాలి మా అక్కను దారుణంగా చంపేశారు. అప్పటిలో పోలీసులు మా గోడు పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా కలిశాం. ఎవరూ న్యాయం చేయలేదు. చివరకు సీబీసీఐడీ వారు స్పందించారు. ఇప్పుడు కేసు కోర్టులో ఉంది. కోర్టులో మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. కానీ మొదట్లో కేసును పక్కదారి పట్టించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా సజ్జా బుజ్జి వెనుక ఉన్న వ్యక్తులను బయటకు లాగాలి. అప్పుడే మా అక్కకు న్యాయం జరుగుతుంది. – దంగేటి పావని -
నిందితులకు రాచమర్యాదలా?
-
‘శ్రీగౌతమి’ నిందితులకు జైల్లో రాజభోగాలు
సాక్షి, పశ్చిమ గోదావరి : శ్రీగౌతమి హత్య కేసు నిందితులకు జైలులో సకల సౌకర్యాలు అందిస్తున్నారని ఆమె సోదరి పావని ఆరోపించింది. శ్రీగౌతమి హత్య కేసులో అరెస్టయిన టీడీపీ నేతలు సజ్జా బుజ్జి, జడ్పీటీసీ బాలాం ప్రతాప్‌లకు నరసాపురం సబ్ జైలులో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆమె జైలు శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం పావని ఫిర్యాదు మేరకు అధికారులు జైలులో తనిఖీలు చేపట్టారు. జైలు శాఖ డీఎస్పీ మారుతి రమేష్ దాదాపు రెండు గంటల నుంచి జైలులోని సిబ్బందిని విచారించారు. విచారణ అనంతరం డీఐజీకి నివేదిక సమర్పిస్తామని ఆయన తెలిపారు. -
ఎవరి ఒత్తిళ్లు పనిచేశాయి!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: శ్రీగౌతమి హత్య కేసు పరిశోధించిన తీరుపై సవాలక్ష అనుమానాలు.. అది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య అని అందరూ మొత్తుకుంటున్నా.. ఆ ఘటన చుట్టూ అనేక సందేహాలు రేకెత్తుతున్నా.. పది రోజుల్లోనే దీన్ని ప్రమాద కేసుగా పోలీసులు అటకెక్కించడానికి ఏ ఒత్తిళ్లు పని చేశాయి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో ఏఎస్పీ స్థాయి అధికారిని విచారణ కోసం పంపినా కేసులో ఏ మాత్రం పురోగతి కనిపించలేదు. ఘటన జరిగిన నాటి నుంచి చెబుతున్న ప్రమాద కోణానికే పోలీసులు విచారణను పరిమితం చేశారు. కిందిస్థాయి అధికారి ఇచ్చిన నివేదికనే విలేకరుల సమావేశంలో చదివేసి ఇది వందశాతం ప్రమాదంగానే తేల్చిపారేశారు. విశాఖపట్నానికి చెందిన ఇద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టి చేతులు దులుపుకున్నారు. పావని వాదనను పట్టించుకోని పోలీసులు అయితే ఘటన జరిగి, ప్రమాదంలో తన అక్క శ్రీగౌతమి మృతి చెందిందని తెలిసిన రోజు నుంచీ, ఇది ముమ్మాటికీ హత్యేనని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డ పావని చెబుతూ వస్తోంది. తన అక్కకు టీడీపీ నేత సజ్జా బుజ్జితో వివాహం జరిగిందని, అతని భార్య నుంచి గౌతమి బెదిరింపులను ఎదుర్కొంటుందని ఆరోపిస్తూ వచ్చింది. అయితే ఆమె చెప్పిందంతా అరణ్య రోదనగానే మిగిలింది. పోలీసులు ఇవేమీ పట్టించుకోలేదు. అంతేకాదు గౌతమి చనిపోయిందని తెలియక ముందు.. మొదటి మూడు రోజులూ కూడా పావని తమను కారులో కొందరు వెంబడించారని, కారులోంచి తన చున్నీ పట్టుకుని లాగే యత్నం చేశారని చెప్పింది. సజ్జా బుజ్జితో రహస్య వివాహం, ఇతర విషయాలు పక్కన పెడితే కనీసం టీజింగ్ అంశాలపై కూడా పోలీసులు దృష్టి పెట్టకపోవడాన్ని ఆనాడే ‘సాక్షి’ ప్రశ్నించింది. అయితే తాము సరైన కోణంలోనే విచారణ చేస్తున్నామంటూ ఉన్నతాధికారులు వాదించారు. కేవలం రెండు సెక్షన్లలో నిందితులపై కేసు నమోదు చేసి ఊరుకున్నారు. ప్రమాదంలో శ్రీగౌతమి మృతికి కారణమైనందుకు 304 (ఏ),పావని గాయాలపాలైనందుకు 338 సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఈవ్‌టీజింగ్ కోణాన్నీ పోలీçసులు ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. ప్రజాప్రతినిధులపైనా ఆరోపణలు తన అక్కను సజ్జాబుజ్జి రెండోపెళ్లి చేసుకున్నాడని, అతని భార్య తన అక్కను బెదిరించేదని చెప్పినా, రెండోపెళ్లి ఆధారాలు చూపినా సజ్జా బుజ్జిని కనీసం పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. వారిని ఒక ప్రైవేటు గెస్ట్‌హౌస్‌కు పిలిపించి మాట్లాడి పంపించేయడం వెనుక ఒక ఉన్నత ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును క్లోజ్ చేయించడానికి నరసాపురం, పాలకొల్లు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నట్లు పావని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యేలు ఈ కేసును సక్రమంగా విచారించే దిశగా అధికారులపై ఒత్తిడి తేలేదు. నిందితులంతా తమ పార్టీకి చెందిన వారు కావడంతో ఈ కేసును ప్రమాదంగా మూసేయించేందుకు రాజధాని స్థాయిలో యత్నాలు జరిగాయి. రెండోపెళ్లి చేసుకోవడం నేరమని తెలిసినా, బాధితులు ఫిర్యాదు చేసినా సజ్జా బుజ్జిని అరెస్టు చేసే ధైర్యం కూడా అప్పటి పోలీసు అధికారులు చేయలేకపోయారు. ప్రమాదానికి కారణమైన కారు విశాఖపట్నం నుంచి రావడం, అదే సమయంలో గౌతమి కూడా విశాఖపట్నంలో చదువుతుండటంతో, కోడి పందేలు చూడటానికి వచ్చామని పట్టుబడిన డ్రైవర్, అతని స్నేహితుడు చెబుతున్న అంశాలకు పొంతన లేకపోవడంతో ఇది హత్యేనన్న అనుమానాలు వచ్చాయి. పావని పోరాటం వల్లే.. పావని బతికి బయట పడటం, పట్టు వదలకుండా అన్ని ఆధారాలు తానే సేకరించి డీఎస్పీ నుంచి డీజీపీ కార్యాలయాల వరకు తిరిగి తమకు న్యాయం చేయాలని చేసిన పోరాటం కారణంగానే సీఐడీ దర్యాప్తు చేయడం, వారు తమ వద్ద ఉన్న సాక్ష్యాల ఆధారంగా కేసును ముందుకు తీసుకుపోవడంతో ఈ కేసు హత్య కేసుగా మార్పు చెందింది. ఇప్పటికైనా పోలీసులు పూర్తి సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టకపోతే నిందితులు దర్జాగా బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఏదేమైనా శ్రీగౌతమి కేసు జిల్లా పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసిందనే చెప్పాలి. ఈ వైఫల్యానికి కారకులను గుర్తించి నివేదిక పంపామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని ఎస్పీ ఎం.రవిప్రకాష్ ‘సాక్షి’కి తెలిపారు. నిందితులపై టీడీపీ వేటు గౌతమి హత్య కేసులో అరెస్టయిన నరసాపురం జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్, దర్భరేవు మాజీ సర్పంచ్ సజ్జా బుజ్జి, టీడీపీ దర్భరేవు గ్రామ అధ్యక్షుడు బొల్లంపల్లి రాంప్రసాద్(రమేష్)ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. -
శభాష్ పావని..
శ్రీ గౌతమి కిరాయి హత్య ఉదంతంతో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో టీడీపీ పరువు పూర్తిగా బజారున పడింది. ఈ కేసును పక్కదోవ పట్టించడంలో పోలీసులపై రాష్ట్రస్థాయి నేతల హస్తం ఉందనే ప్రచారానికి బలం చేకూరుస్తూ జరుగుతున్న పరిణామాలు కూడా టీడీపీని గుక్కతిప్పుకోకుండా చేస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు, నర్సాపురం : ఓ యువతిని టీడీపీ నేత సజ్జా బుజ్జి ప్రమాదం మాటున కిరాతకంగా హత్య చేయించడం, సాక్షాత్తు ప్రజాప్రతినిధిగా ఉన్న జడ్పీటీసీ బాలం ప్రతాప్ హత్యలో ప్రధాన పాత్ర పోషించిన సంగతి బట్టబయలు కావడంతో ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. అయితే దీనిని సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా పూర్తిగా నెపాన్ని పోలీసులపై వేసే ప్రయత్నం సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మొదట్లో కేసు విచారణలో పోలీసులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం ఇప్పటికే బహిర్గతమయ్యింది. అప్పట్లో విచారణ అధికారులుగా ఉన్న పోలీసులు తప్పు చేసిన విషయాన్ని ఎవరూ కాదనే పరిస్థితిలేదు. అయితే ఎలాంటి పూర్తిస్థాయి విచారణ లేకుండా కేవలం 10 రోజుల్లోనే పోలీసులు కేసు క్లోజ్ చేసే సాహసం చేశారంటే, వెనుక బడా వ్యక్తులు లేకపోతే అంత ధైర్యం చేసే పరిస్థితి లేదు. ఈ అంశాలను పక్కదారి పట్టిస్తూ అప్పటి పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అప్పటి నరసాపురం డీఎస్పీ, పాలకొల్లు రూరల్ సీఐ, పాలకొల్లు రూరల్ ఎస్సైలపై చర్యలు ఉంటాయని, కేసును డీల్ చేసిన ఏఎస్పీ రత్నకు మెమో జారీ జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదట్లోనే ఈ కేసు విచారణ పక్కదారి పట్టినట్టుగా సీబీసీఐడీఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడమైతే ఖాయంగా కనిపిస్తోంది. తెరవెనుక వ్యక్తులు ఎవరు పథకం ప్రకారం యువతిని హత్య చేసిన సజ్జా బుజ్జి అండ్ కో ఎలాంటి జంకూ లేకుండా తరువాత ఏడాదిన్నర కాలంగా దైనందిన జీవితాన్ని గడిపారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, బ్యాంకాక్ టూర్లకు తిరుగుతూ గడిపారు. పై స్థాయి వ్యక్తుల అండలేకపోతే ఇది సాధ్యంకాదని తెలుస్తోంది. అప్పట్లో విచారణ అధికారులుగా వ్యవహరించిన పోలీసు అధికారులదీ, సజ్జా బుజ్జిది ఒకే సామాజికవర్గం, అదీ సీఎం సొంత సామాజికవర్గం. మంత్రి లోకేష్‌బాబు సిఫార్సులు మేరకే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ప్రచారం మొదటి నుంచీ ఉంది. అయితే బుజ్జి అండ్‌కో ను పైస్థాయి నాయకుల వరకూ తీసుకెళ్లడానికి స్థానికంగా ఉన్న అదే సామాజికవర్గానికి చెందిన ఓ బడా వ్యక్తి సహాయపడినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి మరికొందరి వ్యవహారాలపై సీఐడీ వద్ద సమాచారం ఉందనే ప్రచారం సాగుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు ఇంకా సగమే పూర్తయ్యిందని నిందితులను కోర్టులో ప్రవేశపెట్టే ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఓవైపు ఎన్నికలు రాబోతున్నాయి, ఈ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో రిస్క్ నెత్తిమీద పెట్టుకోవడం ఎందుకనే భావనలో పోలీసులు ఉన్నట్టు ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. అదే విధంగా పోలీసుశాఖ ముందుకెళితే శ్రీగౌతమి వ్యవహారంలో మరికొన్ని కొత్త క్యారెక్టర్లు తెరమీదకు రావచ్చనే ప్రచారం సాగుతోంది. శభాష్ పావని : అక్క చనిపోయింది. తోడుగా ఉన్న తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. తన అక్కది ప్రమాదం కాదని ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో ధైర్యంతో ముందుకెళ్లి పోరాటంలో విజయం సాధించిన పావని చైతన్యానికి అభినందనలు దక్కుతున్నాయి. కేసులో సగంవంతు ఆధారాలను తనే సేకరించి పావని సీబీసీఐడీ అధికారులకు అందించింది. దీంతో సీఐడీ దర్యాప్తు కూడా సులభతర మయ్యిందని చెపుతున్నారు. సీఐడీ లేకపోతే తమకు న్యాయం జరిగేది కాదని పావని పేర్కొంది. పోలీసులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోలేదన్నారు. తన అక్క మృతికి న్యాయం చేయాలని ఎందరినో కోరామని, ఎవరూ దగ్గరకు రానీయలేదన్నారు. బుజ్జి డబ్బులు ఇస్తానని రాయబారాలు కూడా నడిపాడని చెప్పింది. ఓ దశలో నిజంగా తను, అమ్మ ఆత్యహత్య చేసుకోవాలనుకున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ అక్కకు జరిగిన ఘోరానికి న్యాయం జరగాలని కష్టాలు, అవమానాలు దిగమింగి ముందుకెళ్లానని చెప్పింది. తన పోరాటానికి ’సాక్షి‘ అండగా నిలిచిందని కృతజ్ఞతలు చెప్పింది. రాజమండ్రి సీఐడీ సీఐ శేఖర్‌బాబు మేలు మరువలేమన్నారు. -
గౌతమి హత్యకేసుపై స్పందించిన కారుమూరి
సాక్షి, కృష్ణా : రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు భావించిన ఎంబీఏ విద్యార్థిని గౌతమి మృతి కేసు కీలక మలుపుపై వైఎస్సార్సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. గౌతమి ప్రమాదవశాత్తు మరణించలేదని, హత్య కేసును రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని మండిపడ్డారు. బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ గౌతమిది రోడ్డు ప్రమాదం కాదని, ఆమెను కిరాయి హంతకులే బలిగొన్నారని ఆరోపించారు. అటు ఐదు జిల్లాల ప్రజలను మోసం చేసిన వెంకటరాయ చిట్ ఫండ్ పేరుతో వేలాది మందిని మోసగించారని కారుమూరి ఆరోపించారు. బాధితులు ఎన్ని ఆందోళనలు చేసినా ఫలితం మాత్రం శూన్యం అని అన్నారు. ఇంత జరుగుతున్నా వెంకటరాయ ఆస్తులను ప్రభుత్వం అటాచ్ చేయక పోవడం దారణమన్నారు. సొంత పార్టీ నేతలు అయినంత మాత్రాన ఇలా చేస్తారా అని కారుమూరి ప్రశ్నించారు. మోసం చేసిన సంస్థకు సంబంధించిన ఆస్తుల వేలాన్ని కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని, భాదితులకు న్యాయం జరిగేవరకు సీజ్ చేసిన ఆస్తులు అలాగే ఉంచాలని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నా సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఏమి తెలియనట్లు మాట్లాడుతున్నారని అన్నారు. మోస పోయిన వారిలో మొత్తం 12 వేల మంది బాధితులు 5 జిలాల్లో ఉన్నారు. వెంకటరాయ చిట్స్ ఫండ్ డైరెక్టర్లను వెంటనే అరెస్టు చేయాలని కారుమూరి డిమాండ్ చేశారు. -
గంగలో కలిసిన టీడీపీ పరువు..
సాక్షి ప్రతినిధి, ఏలూరు, నర్సాపురం : సంచలనం కలిగించిన శ్రీగౌతమి మృతి కేసులో అసలు రహస్యం బట్టబయలైంది. టీడీపీ నేతలే హంతకులుగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువతి ప్రాణాలు నిలువునా తీశారని తేలిపోయింది. కేసులో ప్రధాన నిందితులైన టీడీపీ నేత సజ్జా బుజ్జి, జడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్‌లతో పాటు మరో ఇద్దరు టీడీపీ నాయకులు బొల్లంపల్లి రమేష్, బాలం ఆండ్రూలను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కేసులో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. 2017 జనవరి 18వ తేదీన శ్రీగౌతమి, ఆమె చెల్లెలు పావని ద్విచక్ర వాహనంపై వస్తుండగా కారుతో గుద్దించి హత్యకు ప్రయత్నించారు. ప్రమాదంలో శ్రీగౌతమి మృతిచెందగా, ఆమె సోదరి పావని రెండు రోజుల తరువాత స్పృహలోకి వచ్చి తన అక్కది హత్యని మొత్తుకుంది. పోలీసులు ఇవేమీ పట్టించుకోలేదు. సాధారణంగా జరిగిన యాక్సిడెంట్ కారణంగానేశ్రీగౌతమి చనిపోయిందని తేల్చిచెప్పి కేసును క్లోజ్ చేశారు. సీఐ నుంచి ఎస్పీ వరకూ ఇదే వాదన వినిపించారు. తరువాత పావని సీఐడీని ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది. ఇది హత్యేనంటూ సీఐడీ తేల్చడంతో, గత్యంతరంలేని పరిస్థితుల్లో పోలీసులు మళ్లీ కేసును తీసుకుని విచారణ జరిపి పథకం ప్రకారం హత్య చేశారని చెప్పుకొస్తున్నారు. మరి మొదట్లో ఎవరి వత్తిడి మేరకు పోలీసులు కేసును పట్టించుకోలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తూతూ మంత్రంగా విచారణ తొలుత శ్రీగౌతమి కేసు యాక్సిడెంట్ అని పోలీసులు తేల్చారు. విశాఖపట్నంకు చెందిన ఇద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. తన అక్కకు టీడీపీ నేతతో వివాహం జరిగిందని, అతని భార్య నుంచి అక్క బెదిరింపులను ఎదుర్కొంటుందని పావని ఆరోపిస్తోంది. పోలీసులు ఇవేమీ పట్టించుకోలేదు. అంతేకాదు అక్క చనిపోకముందు తమను కారులో కొందరు వెంబడించారని, కారులోంచి తన చున్నీ పట్టుకుని లాగే ప్రయత్నం చేశారని చెప్పింది. ఇతర విషయాలు పక్కన పెడితే..కనీసం టీజింగ్ అంశాలపై కూడా పోలీసులు శ్రద్ధ పెట్టకపోవడం అనుమానాలకు తావిచ్చింది. కేవలం రెండు సెక్షన్లలో నిందితులపై కేసు నమోదు చేసి ఊరుకున్నారు. మరోవైపు శ్రీగౌతమికి టీడీపీ నేత సజ్జా బుజ్జితో పెళ్లి అవ్వడంలాంటి విషయాలు పావని వెలుగులోకి తేవడంతో కేసు మరోమలుపు తిరిగింది. ఇది హత్య అని, తెరవెనుక టీడీపీ నేత ఉన్నాడని శ్రీగౌతమి కుటుంబ సభ్యులు ఆరోపించారు. సజ్జా బుజ్జి, అతని భార్యను కూడా పోలీసులు స్టేషన్‌కి కాకుండా, ఓ గెస్ట్‌హౌస్‌కు రప్పించి, విచారణ చేయడం చర్చనీయాంశమయ్యింది. సెల్ ఫోన్ కాల్‌డేటా ఇప్పుడే గుర్తొచ్చిందా ప్రస్తుతం ఎంత క్లిష్టమైన కేసులో అయినా సెల్‌ఫోన్ కాల్‌డేటా కీలకంగా మారింది. కాల్‌డేటా ఆధారంగానే చాలా కేసులను దేశవ్యాప్తంగా పోలీసులు ఛేదిస్తున్నారు. గతంలో అనేక క్లిష్టతరమైన కేసులు పరిష్కరించడంలో చొరవ చూపిన పశ్చిమ పోలీసులు మరి మొదట్లో ప్రమాదం జరిగిన వెంటనే శ్రీగౌతమి ఫోన్ కాల్‌డేటాపై ఎందుకు దృష్టిపెట్టలేదనేది జవాబు లేని ప్రశ్న. సీఐడీ కాల్‌డేటాను ఆధారం చేసుకుని దర్యాప్తు చేస్తేనే కానీ పోలీసులకు ఆ విషయం గుర్తుకు రాలేదంటే నమ్మశక్యం కాని విషయమే. బుజ్జి సీఎం సొంత సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడమే ఇందుకు కారణమనేది మొదటి నుంచి వస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలోనే కేసును మసిపూసే ప్రయత్నం సాగినట్టుగా తెలుస్తోంది. బుజ్జి జిల్లాలో ఎమ్మెల్యేలు, ముంత్రులతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే నేరుగా రాష్ట్ర స్థాయిలో లాబీయింగ్ చేసుకున్నాడనే ప్రచారం ఉంది. ఇప్పుడు విషయం సీఐడీ ద్వారా వెల్లడి కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు రంగంలోకి దిగి చేసిన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. హత్య కేసును తూతూమంత్రంగా విచారణ చేసి మూసివేసిన పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు ఉం టాయనే దానిపై చర్చ సాగుతోంది. అప్పటి పోలీసు అధికారుల తీరు సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. గంగలో కలిసిన టీడీపీ పరువు శ్రీగౌతమి మృతి తరువాత అమె చెల్లెలు పావని పెద్ద పోరాటమే చేసింది. ప్రజా సంఘాలు, ప్రతిపక్ష రాజకీయపార్టీలు, మహిళాసంఘాలు, విద్యార్థులు ఆందోళనలు చేశారు. అదంతా అరణ్యరోదనే అయ్యింది. కేసును 15 రోజుల్లోనే పోలీసులు క్లోజ్ చేశారు. కేసును మూసేసిన వెంటనే ప్రధాన నిందితులు జల్సాలు చేసుకున్నట్టు తెలిసింది. బొల్లంపల్లి రమేష్ ద్వారా మొత్తం నిందితులు బ్యాంకాక్ తదితర దేశాలు తిరిగినట్టు సమాచారం. ఇంత జరిగినా నిందితులంతా టీడీపీ కార్యక్రమాల్లో మామూలుగానే పాల్గొంటూ వచ్చారు. ఇప్పుడు అసలు విషయం బట్టబయలు కాడవంతో స్థానికంగా టీడీపీ పరువు పోయింది. గతంలో ఎంపీపీగా కూడా పనిచేసిన బాలం ప్రతాప్ ఏకంగా ప్రాణాలు తీసే స్థాయికి దిగజారిపోయాడు. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సజ్జా బుజ్జి వ్యవహారంతో టీడీపీ అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయని మరోసారి తేటతెల్లమయ్యింది. పోలీసులు వీరిని అరెస్ట్ చేశారని తెలియగానే, పట్టణంలో ఉన్న వారికి చెందిన ప్లెక్సీలను దేశం శ్రేణులు హడావుడిగా తొలగించాయి. అయితే ప్రాణాలు తీసే ఘాతుకానికి ఒడికట్టిన నేతలపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే. -
మలుపు తిరిగిన శ్రీగౌతమి కేసు
నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన దంగేటి శ్రీగౌతమి మృతిచెందిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ద్విచక్రవాహన ప్రమాదంలో మృతి చెందిందని అప్పట్లో పోలీసులు ప్రకటించి కేసును మూసివేశారు. అయితే తన అక్క ప్రమాదంలో మృతి చెందలేదని.. ఆమెను రెండో విహాహం చేసుకున్న టీడీపీ నేత సజ్జా వీరవెంకట సత్యనారాయణ(బుజ్జి) హత్య చేశాడనే అనుమానాలున్నాయని శ్రీగౌతమి సోదరి పావని సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. శ్రీగౌతమి చనిపోవడానికి రోడ్డు ప్రమాదం కారణం కాదని, అది పథకం ప్రకారం జరిగిన హత్యేనని పోలీసులు నిర్ధారించి నిందితులను అరెస్టు చేయడం సంచలనం కలిగిస్తోంది. పాలకొల్లు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం సీఐ కె.రజనీకుమార్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. దర్బరేవు గ్రామానికి చెందిన సజ్జా బుజ్జి.. తండ్రి మరణించి తల్లి, సోదరితో కలసి ఉంటున్న శ్రీగౌతమితో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో రహస్యంగా పెళ్లి చేసుకుని సహజీవనం చేస్తున్నాడు. పెళ్లిని బహిర్గతం చేయమని గౌతమి ఒత్తిడి తేవడంతో దగ్గర బంధువైన బొల్లంపల్లి రమేష్‌తో కలసి శ్రీగౌతమి, ఆమె సోదరి పావని అడ్డు తొలగించుకోవాలని బుజ్జి పథకం పన్నాడు. తన స్నేహితుడైన జెడ్పీటీసీ బాలం ప్రతాప్, బాలం ఆండ్రూ, కిరాయి హత్యలు చేసే వైజాగ్‌లోని పాకాల సందీప్, కడియం దుర్గాప్రసాద్‌తో కలసి యాక్సిడెంట్ మాటున హత్యకు కుట్రపన్నాడు. 2017 జనవరి 18న శ్రీగౌతమి ఆస్పత్రి పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా వెనుక నుంచి కారుతో వెంబడించి ఢీకొట్టారు. ఘటనలో గాయపడిన శ్రీగౌతమి ఆస్పత్రిలో చనిపోగా, పావని తీవ్రంగా గాయపడి తరువాత కోలుకుంది. విచారణలో పలు విషయాలు బహిర్గతమైన నేపథ్యంలో బుజ్జి, రమేష్, ప్రతాప్, ఆండ్రూను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్టు సీఐ చెప్పారు. -
శ్రీగౌతమిది హత్యే..?
-
బయటపడ్డ టీడీపీ నేత కర్కశత్వం..
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దంగేటి శ్రీగౌతమి యాక్సిడెంట్ కేసు 17 నెలల తరువాత కొత్తమలుపు తిరిగింది. టీడీపీనాయకుల కర్కశత్వాన్ని బట్టబయలు చేస్తూ శ్రీగౌతమిని పక్కా పథకం ప్రకారం హత్యచేసినట్టుగా తేలినట్టు తెలిసింది. అప్పట్లో ఘోరం జరిగిన 15 రోజులకే తూతూమంత్రంగా దర్యాప్తు పూర్తిచేసి ఇది ముమ్మాటికీ రోడ్డు ప్రమాదమేనని తేల్చేసి, హడావిడిగా ఫైల్ మూసేసిన పోలీసులు మళ్లీ కేసును సీబీసీఐడీ రంగప్రవేశంతో పునః విచారణ చేసి హత్యకేసుగా నమోదు చేసినట్టు తెలిసింది. సాక్షి ప్రతినిధి, ఏలూరు, నర్సాపురం: శ్రీ గౌతమి కేసులో టీడీపీ ముఖ్యనేత సజ్జా బుజ్జితో పాటు మరికొందరు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వారిని పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెడతారని తెలుస్తోంది. అప్పట్లో శ్రీగౌతమిది హత్యేనంటూ ఆమె సోదరి పావని, తల్లి అనంతలక్ష్మి ఎందరో నేతలకు తమ గోడు చెప్పుకున్నారు. పోలీసుల కాళ్లావేళ్లా పడ్డారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బుజ్జి టీడీపీ నేత కావడం, పైగా ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎవరూ శ్రీగౌతమి కుటుంబం వైపు కన్నెత్తి చూడలేదు. అప్పటి దర్యాప్తు అధికారులు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కేసును నీరు కార్చేశారని సమాచారం. వివిధ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేసినా ఫలితం లేకపోయింది. జరిగిన ఘోరం నుంచి తీవ్ర గాయాలతో బయటపడ్డ శ్రీగౌతమి సోదరి పావని మాత్రం ధైర్యంగా అక్కకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటానికి సిద్ధపడింది. కేసును నిస్పక్షపాతంగా విచారించి న్యాయం చేయాలని పోలీసు ఉన్నతాధికారులతో పాటుగా సీబీసీఐడీని ఆశ్రయించింది. సీఐడీ జోక్యం చేసుకుని కేసు విచారణ ప్రాథమికంగా చేయడం, కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేయడంతో ఇది హత్యేనని నిరూపణ అయ్యింది. తరువాత మళ్లీ పోలీసులు కేసును తిరిగి విచారణకు చేపట్టడం జరిగాయి. అసలేం జరిగింది 2017 జనవరి 18వ తేదీ రాత్రి 8.30 దాటిన తరువాత పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ పరిధిలోని దిగమర్రు కొత్తోట పంచాయతీ పరిధిలో నరసాపురం–పాలకొల్లు మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆసుపత్రి పనిపై పాలకొల్లు వెళ్ళిన అక్కాచెల్లెళ్ళుశ్రీగౌతమి, పావనిలు యాక్టివాపై నరసాపురం వస్తుండగా, వెనుక నుంచి ఇన్నోవా ఢీకొట్టడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని నరసాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్క శ్రీగౌతమి అర్ధరాత్రి దాటిన తరువాత మృతి చెందింది. చెల్లి పావని మాత్రం రెండు రోజుల తరువాత స్పృహలోకి వచ్చింది. అప్పటి వరకూ మద్యం మత్తులో ఆకతాయిలు వెంబడించి కారుతో ఢీకొట్టారని అనుకున్నారు అంతా. అయితే తెలివిలోకి వచ్చిన పావని అసలు విషయం బయటపెట్టింది. టీడీపీ నేత సజ్జా బుజ్జి తమపై హత్యా ప్రయత్నం చేశాడని చెప్పింది. తన అక్కను బుజ్జి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని అప్పటి వరకూ తన తల్లికి కూడా తెలియని విషయాన్ని బయటపెట్టింది. పెళ్లి ఫొటోలను కూడా విడుదల చేసింది. బుజ్జిని అరెస్ట్ చేయాలంటూ తీవ్ర గాయాలతోనే పోరాటం చేసింది. ఆమెకు మద్దతుగా రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు నిలిచాయి. కానీ అది యాక్సిడెంట్ అని అతి తక్కువ రోజుల్లో పోలీసులు ఫైల్ క్లోజ్ చేశారు. కేసు నీరుగార్చే దిశగా జరుగుతున్న ప్రయత్నాలను వివరిస్తూ అప్పట్లో సాక్షిలో ప్రచరితమైన వరుస కథనాలు కాక పుట్టించాయి. ఇదంతా కుట్రంటూ టీడీపీ నాయకులు ఎదురు దాడికి దిగారు. చివరకు చేసిన ఘోరం బట్టబయలైనట్టుగా తెలుస్తోంది. అనుమానాలు రేకెత్తించిన దర్యాప్తు పోలీసులు కేసు దర్యాప్తు సాగించిన తీరు మొదటి నుంచీ అనుమానాలు రేకెత్తించింది. అప్పట్లో ఏఎస్పీగా ఉన్న రత్న విచారణ చేశారు. సంచలనమైన ఈ కేసులో అనుమానితులుగా ఉన్న సజ్జా బుజ్జిని అతని భార్యను పట్టణంలోని ఓ గెస్ట్‌హౌస్‌కు పిలిచి నామమాత్రంగా విచారణ చేయడం, వెంటనే వారి ప్రమేయంలేదని పోలీసులు తేల్చి చెప్పడంతో సామాజికవర్గాన్ని నేపధ్యంగా ఎంచుకుని బుజ్జికి సీఎం సన్నిహితులు సహాయ పడుతున్నారనే విమర్శలు వచ్చాయి. సీఎం సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గానికి చెందిన ఇద్దరు బడా వ్యక్తులు వ్యవహారం నడిపారనే వార్తలు వచ్చాయి. స్వయంగా లోకేష్‌బాబు కలగజేసుకున్నారనే గుసగుసలు కూడా వినిపించాయి. అనుమానాలకు తావిస్తూ, కేవలం 15 రోజుల్లోనే యాక్సిడెంట్ కేసుగా చెప్పి పోలీసులు కేసు క్లోజ్ చేశారు. విశాఖపట్టణంకు చెందిన పాకాల సందీప్, కడియం దుర్గాప్రసాద్‌లు యాక్సిడెంట్ చేశారని అరెస్ట్ చూపించారు. సందీప్ కొత్తకారు కొనుక్కుని కోడి పందాల కోసం భీమవరం వచ్చాడని తిరిగి వెళ్లేప్పుడు, స్కూటీపై వెళుతున్న గౌతమి, పావనిల వెంటపడి మద్యం మత్తులో ప్రమాదం చేశారని తేల్చారు. దీనిలో ఎలాంటి పొంతనలు లేనప్పటికీ కేసును తొందరగా ముగించారు. ఇక తరువాత పోలీసులు పావని ఆవేదనను పట్టించుకోలేదు. పోనీ పెళ్లయిన వ్యక్తి మా అక్కను రెండో పెళ్లి మోసం చేసి చేసుకున్నాడని పావని పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. సీఐడీ రంగప్రవేశంతో సీన్ రివర్స్ అయితే పావని తన అక్కకు జరిగిన అన్యాయంపై పోరాటం కొనసాగించింది. డీఐజీ, డీజీపీలతో పాటు సీఐడీకి కూడా ఫిర్యాదు చేసింది. దీంతో కొన్ని నెలలుగా రాజమండ్రి సీఐడీ అధికారులు కేసును దర్యాప్తు చేస్తూ వచ్చారు. ఈ దర్యాప్తులో శ్రీగౌతమిది హత్యేనని తేలింది. ఇందులో అమెను రెండోపెళ్లి చేసుకున్న సజ్జా బుజ్జి ప్రమయం ఉన్నట్టుగా తేలినట్టు తెలిసింది. యాక్సిడెంట్ చేసిన వారి ఖాతాలలో రెండుసార్లు పెద్ద మొత్తంలో డబ్బులు వేసినట్లు గుర్తించారు. ఏ ఖాతా నుంచి డబ్బులు పడ్డాయన్న వివరాల తీగ లాగితే డొంకంతా కదిలింది. అంతే కాకుండా నరసాపురం జడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాపం హస్తం కూడా ఉన్నట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సంపాదించినట్టు సమాచారం. దీంతో ఈ కేసును సీఐడీ పూర్తి స్థాయిలో బట్టబయలు చేసే సమయంలో తిరిగి పోలీసులు విచారణకు తీసుకున్నట్టుగా తెలిసింది. బుజ్జితో పాటుగా మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా చెపుతున్నారు. అయితే జడ్జీటీసీని కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే కేసును పూర్తిగా సీఐడీ దర్యాప్తు చేస్తే గతంలో విచారణలో చేసిన తప్పులు బయటకు వస్తాయని తిరిగి పోలీసులే విచారణకు తీసుకుని ముందుకెళుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈసారైనా శ్రీగౌతమి కుటుంబానికి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మా అక్కను చంపిన వారికి శిక్ష పడాలి తను మోసపోయింది. ప్రేమించి, పెళ్ళి చేసుకుంటానని బుజ్జి చెప్పాడు. రహస్యంగా పెళ్ళి కూడా చేసుకున్నాడు. ముందు భార్యకువిడాకులు ఇచ్చేస్తానని, అది అసలు పెళ్ళికాదని చెప్పేవాడు. ఇబ్బంది వచ్చిందని చంపేశాడు. మా కుటుంబానికి అప్పుడు న్యాయం జరగలేదు. కేసును మళ్లీ విచారించే వరకూ న్యాయ పోరాటం చేశాను. మాకు ఇప్పటికైనా న్యాయం చేయాలి. – పావని విచారణలో ఉంది కేసు విచారణలో ఉంది. కొన్ని ఆధారాలతో కేసును మళ్లీ విచారణ చేస్తున్నాము. పూర్తి వివరాలను రెండు, మూడు రోజుల్లో తెలియజేస్తాం. కేసు విచారణలో ఉండగా ఇంతకు మించి వివరాలు చెప్పలేం. విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుంది. – కె.రజనీకుమార్, పాలకొల్లు రూరల్ సీఐ 2017 జనవరిలో ‘సాక్షి’ ప్రచురించిన కథనం మోసగించి రహస్యంగా వివాహం నరసాపురం కోవెలగుడి వీధిలో గత 26 సంవత్సరాలుగా శ్రీగౌతమి కుటుంబం నివాసం ఉంటోంది. దంగేటి నర్శింహారావు, అనంతలక్ష్మిలకు శ్రీగౌతమి, పావని ఇద్దరు కుమార్తెలు. వ్యవసాయ పనులు చేసుకుని జీవించే నర్శింహారావు నడివయసులో మూడేళ్ల క్రితం చనిపోయారు. దీంతో కుటుంబంలో అక్కా, చెల్లి, తల్లి మిగిలారు. శ్రీగౌతమి చదువుల్లో ఫస్ట్. వైఎన్ కళాశాలలో డిగ్రీ, ఎంబీఏ పూర్తిచేసింది. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూనే, మరోపక్క చదువు కొనసాగించేది. బుజ్జి రొయ్యలమేత షాపులో శ్రీగౌతమి తండ్రి పనిచేసేవాడు. తండ్రి వద్దకు వెళ్లే క్రమంలో బుజ్జితో శ్రీగౌతమికి పరిచయం ఏర్పడింది. అప్పటికే పెళ్లయ్యి, పిల్లలున్న బుజ్జి తన అక్కను మోసం చేసి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని పావని ఆరోపిస్తూ వస్తోంది. సివిల్స్‌కు సమాయత్తమవ్వడం కోసం వైజాగ్‌లో ఉంటూ సంక్రాంతి పండుగ నిమిత్తం ఇంటికి వచ్చినపుడు శ్రీగౌతమి ప్రమాదంలో చనిపోయింది. -
శ్రీ గౌతమి కేసును పట్టించుకోరేం
నరసాపురం : నరసాపురం పట్టణానికి చెందిన యువతి శ్రీగౌతమి మృతి కేసులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. కేసు విచారణ పక్కదారి పడుతున్నా పట్టించుకోవడం లేదని వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసును పునర్విచారణ చేయించి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. నరసాపురం సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీని బుధవారం కలిసి కేసు పూర్వాపరాలను వివరిం చారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ కార్యదర్శి వి.మహేష్ మాట్లాడుతూ కేసు దర్యాప్తు సక్రమంగా సాగలేదన్నారు. టీడీపీ నేత సజ్జా బుజ్జి శ్రీగౌతమిని రెండోపెళ్లి చేసుకున్నాడని, ఆయన అధికార పార్టీకి చెందినవాడు కావడంతో కేసును పోలీసులు నీరు గార్చారని ఆరోపించారు. శ్రీగౌతమిని పథకం ప్రకారం హత్య చేసినట్టు ఆమె చెల్లెలు పావని ఎన్నిసార్లు చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రెండో పెళ్లి విషయంపైనా దర్యాప్తు చేయలేదన్నారు. శ్రీగౌతమి తల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ తన కుమార్తెను అన్యాయంగా చంపేశారని కన్నీటి పర్యంతమైంది. కూతురిని పోగొట్టుకున్న తాను ఆ బాధను తట్టుకుంటూనే, న్యాయం కోసం తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయింది. భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నరసాపురం డివిజన్ కార్యదర్శి పొగాకు పూర్ణ మాట్లాడుతూ శ్రీగౌతమి కేసు విషయంలో ఆ కుటుంబానికి దారుణమైన అన్యాయం జరిగిందన్నారు. అధికార పార్టీ నేతలు వెనుక ఉండి రాష్ట్ర స్థాయిలో వ్యవహారం నడిపిస్తున్నారని, అందువల్లే పోలీ సులు ఈ కేసును నీరుగారుస్తున్నారని ధ్వజమెత్తారు. సబ్ కలెక్టర్ సమాధానమిస్తూ ఈ విషయమై డీఎస్పీతో మాట్లాడతానని, అనంతరం కలెక్టర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేవిధంగా తన పరిధిలో అవకాశం ఉన్న చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ ఈదా జోన్సీ, నక్కా ఆనంద్, తిరుమాని విమల పాల్గొన్నారు.