మా అక్కను దారుణంగా చంపేశారు.. | Police Delayed In Sri Gouthami Murder Case West Godavari | Sakshi
Sakshi News home page

నత్తనడకన దర్యాప్తు

Published Fri, Aug 24 2018 1:04 PM | Last Updated on Fri, Aug 24 2018 1:04 PM

Police Delayed In Sri Gouthami Murder Case West Godavari - Sakshi

మృతురాలు దంగేటి శ్రీగౌతమి ,దంగేటి పావని

‘దంగేటి శ్రీగౌతమిది పక్కా హత్య.. అది యాక్సిడెంట్‌ కాదు.. ఈ కేసులో ఇప్పటివరకూ సజ్జా బుజ్జితో పాటు మరో ఆరుగురిపాత్రను గుర్తించాం. ఈ కేసు దర్యాప్తు ఇప్పటికి సగమే పూర్తయ్యింది. ఇంకా సగం దర్యాప్తు ఉంది’ ఇదీ పాలకొల్లు రూరల్‌ సీఐకె.రజనీకుమార్‌ శ్రీగౌతమి హత్య కేసు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టే ముందు జూన్‌ 26న చెప్పిన మాట. అయితే అప్పటి నుంచికేసులో పురోగతి ఏమీ లేదు. మరి సాక్షాత్తూ పోలీసులే చెప్పిన మిగిలిన సగం దర్యాప్తు ఏమైందనేది అంతులేని ప్రశ్నగా మిగిలింది.

పశ్చిమగోదావరి ,నరసాపురం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీగౌతమి హత్య కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. ఈ కేసు దర్యాప్తుపై పోలీసు చర్యలు నామమాత్రంగాగే ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. యాక్సిడెంట్‌ మాటున పక్కా ప్లాన్‌తో శ్రీగౌతమిని టీడీపీ నేత, మాజీ సర్పంచ్‌ సజ్జా బుజ్జి హత్య చేయించినట్టుగా పోలీసులు తేల్చారు. కేసులో నరసాపురం జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్‌ ఏ–3 నిందితుడిగా ఉండటంతో ఈ హత్యకేసు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో ఈ ఘాతుకం వెనుక మరింత మంది పెద్దలు ఉన్నారనే ప్రచారం సాగింది. దర్యాప్తు సగమే అయ్యిందని పోలీసులు చెప్పడంతో మునుముందు అసలు పెద్దలు తెరమీదకు వస్తారని అంతా అనుకున్నారు. కానీ కేసులో ఇంకెలాంటి ట్విస్ట్‌లకు ఇప్పటి వరకూ పోలీసులు చోటివ్వలేదు. కేసు ప్రారంభం నుంచి ఆరోపణలు ఎదుర్కొన్న పోలీస్‌శాఖపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడులు మళ్లీ పనిచేస్తున్నాయా? లేక కేసు ప్రారంభంలో చేసిన తప్పులను తప్పించుకోవడానికి పోలీసులే కావాలని తూతూమంత్రంగా కేసును మళ్లీ మమా అని అనిపిస్తున్నారా? అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇప్పటి వరకూ పోలీసులు ఏం చేశారు?
2017 జనవరి 15 రాత్రి శ్రీగౌతమి హత్య జరిగింది. కేసును 15 రోజుల్లోనే అప్పటి పోలీసు అధికారులు క్లోజ్‌ చేశారు. యాక్సిడెంట్‌ నుంచి బయటపడ్డ శ్రీగౌతమి సోదరి పావని అది హత్య అని ఎంత మొత్తుకున్నా పోలీసులు పెడచెవిన పెట్టారు. మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు, విద్యార్థులు ఆందోళనలు చేసినా కూడా అది ముమ్మాటికీ రోడ్డు ప్రమాదమేనని పోలీసులు కుండబద్ధలు కొట్టారు. అయితే కేసులో నిందితుడిగా ఉన్న సజ్జా బుజ్జి, ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గం నేతకావడం, స్థానికంగా అదే సామాజికవర్గానికి చెందిన కొందరు బడా వ్యక్తుల అండ ఉండటంతోనే పోలీసులు కేసును పట్టించుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. అయితే అప్పట్లో పోలీసులు అదేమీ పట్టించుకోలేదు. సోదరికి జరిగిన అన్యాయంపై పావని ఒంటరి పోరాటం చేసింది. సీబీసీఐడీని ఆశ్రయించడంతో కథ మలుపు తిరిగింది. సీబీసీఐడీ దర్యాప్తు సాగించి ఇది పక్కా ప్లాన్‌తో చేసిన హత్య అని, ఇందులో ప్రధానంగా సజ్జా బుజ్జితో పాటు మరో ఆరుగురు ఉన్నారని తేల్చారు. ఈ వివరాలను పోలీసులకు అందించారు. దీంతో హడావిడిగా మళ్లీ పోలీసులు కేసును తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏ–1, ఏ–2లుగా ఉన్న టీడీపీ నేత సజ్జా బుజ్జి, బొల్లంపల్లి రమేష్‌లతో పాటు ఏ–3గా ఉన్న నరసాపురం జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్, అతని సోదరుడు బాలం ఆండ్రూలను జూన్‌ నెల 26న అరెస్ట్‌ చేశారు. మరోవారం తరువాత బొల్లంపల్లి రమేష్‌ కారు డ్రైవర్‌ కవురు లక్ష్మణ్‌ను, పథకాన్ని పక్కాగా అమలుచేసి శ్రీగౌతమి ప్రాణాలు తీసిన సందీప్, దుర్గాప్రసాద్‌లను అరెస్ట్‌ చేసి కోర్టుకు పంపారు. నిజానికి ఇక్కడి వరకూ దర్యాప్తు చేసింది సీబీసీఐడీనే. పోలీసులు కనుక్కున్న కొత్త విషయం ఏమీలేదు. ముందు యాక్సిండెంట్‌ అని చెప్పి, తరువాత అది రోడ్డు ప్రమాదంకాదు హత్య అని చెప్పడం తప్ప.

నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందా?
ప్రారంభంలో కేసు దర్యాప్తు పూర్తిగా పక్కదారి పట్టినట్టుగా సీబీసీఐడీ తేటతెల్లం చేసింది. అయినా కూడా ఈ కేసు ప్రారంభ దర్యాప్తులో ఉన్న పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిజానికి పోలీస్‌ శాఖ అందరనీ సస్పెండ్‌ చేస్తుందని భావించారు. ఈ కేసులో పావని పోరాటం కొనసాగుతూనే ఉంది. నరసాపురం సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న సజ్జా బుజ్జితో పాటు మిగిలిన నిందితులకు నిబంధనలకు విరుద్ధంగా సకల సౌకర్యాలు అందుతున్నాయని పావని జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, వారు విచారణ చేయడం కూడా సంచలనం కలిగించింది. ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న కేసులో ఈ నిర్లిప్త ధోరణి కొనసాగడం అనుమానాలకు తావిస్తోంది. సజ్జా బుజ్జిని, ఇతర నిందితులను కాపాడటానికి అదృశ్య శక్తులు ఇంకా పనిచేస్తూనే ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. మరో వైపు పోలీసులు కూడా ప్రారంభంలో జరిగిన తప్పును ఇప్పటి తూతూమంత్రపు దర్యాప్తులో దులిపేసుకుంటున్నట్టుగా కనిపిస్తోందని చెబుతున్నారు.

నిందితులకు హైకోర్టులో చుక్కెదురు
బెయిల్‌ కోసం సజ్జా బుజ్జి ఇతర నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో వారికి చుక్కెదురైంది. నరసాపురం అదనపు జిల్లా కోర్టు బెయిల్‌ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ పిటీషన్‌లో పావని పార్టీగా చేరి తన న్యాయవాది చేత వాదనలు వినిపించింది. దీంతో జస్టిస్‌ బి.వివశంకరరావు సజ్జా బుజ్జి బెయిల్‌ పిటీషన్‌ను కొట్టేసినట్టు పావని చెప్పింది.

పోలీసులపై చర్యలు తీసుకోవాలి
మా అక్కను దారుణంగా చంపేశారు. అప్పటిలో పోలీసులు మా గోడు పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా కలిశాం. ఎవరూ న్యాయం చేయలేదు. చివరకు సీబీసీఐడీ వారు స్పందించారు. ఇప్పుడు కేసు కోర్టులో ఉంది. కోర్టులో మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. కానీ మొదట్లో కేసును పక్కదారి పట్టించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా సజ్జా బుజ్జి వెనుక ఉన్న వ్యక్తులను బయటకు లాగాలి. అప్పుడే మా అక్కకు న్యాయం జరుగుతుంది.              – దంగేటి పావని

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement