నిందితులను కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులు
నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన దంగేటి శ్రీగౌతమి మృతిచెందిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ద్విచక్రవాహన ప్రమాదంలో మృతి చెందిందని అప్పట్లో పోలీసులు ప్రకటించి కేసును మూసివేశారు. అయితే తన అక్క ప్రమాదంలో మృతి చెందలేదని.. ఆమెను రెండో విహాహం చేసుకున్న టీడీపీ నేత సజ్జా వీరవెంకట సత్యనారాయణ(బుజ్జి) హత్య చేశాడనే అనుమానాలున్నాయని శ్రీగౌతమి సోదరి పావని సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. శ్రీగౌతమి చనిపోవడానికి రోడ్డు ప్రమాదం కారణం కాదని, అది పథకం ప్రకారం జరిగిన హత్యేనని పోలీసులు నిర్ధారించి నిందితులను అరెస్టు చేయడం సంచలనం కలిగిస్తోంది. పాలకొల్లు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం సీఐ కె.రజనీకుమార్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. దర్బరేవు గ్రామానికి చెందిన సజ్జా బుజ్జి.. తండ్రి మరణించి తల్లి, సోదరితో కలసి ఉంటున్న శ్రీగౌతమితో పరిచయం పెంచుకున్నాడు.
ప్రేమ పేరుతో రహస్యంగా పెళ్లి చేసుకుని సహజీవనం చేస్తున్నాడు. పెళ్లిని బహిర్గతం చేయమని గౌతమి ఒత్తిడి తేవడంతో దగ్గర బంధువైన బొల్లంపల్లి రమేష్‌తో కలసి శ్రీగౌతమి, ఆమె సోదరి పావని అడ్డు తొలగించుకోవాలని బుజ్జి పథకం పన్నాడు. తన స్నేహితుడైన జెడ్పీటీసీ బాలం ప్రతాప్, బాలం ఆండ్రూ, కిరాయి హత్యలు చేసే వైజాగ్‌లోని పాకాల సందీప్, కడియం దుర్గాప్రసాద్‌తో కలసి యాక్సిడెంట్ మాటున హత్యకు కుట్రపన్నాడు. 2017 జనవరి 18న శ్రీగౌతమి ఆస్పత్రి పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా వెనుక నుంచి కారుతో వెంబడించి ఢీకొట్టారు. ఘటనలో గాయపడిన శ్రీగౌతమి ఆస్పత్రిలో చనిపోగా, పావని తీవ్రంగా గాయపడి తరువాత కోలుకుంది. విచారణలో పలు విషయాలు బహిర్గతమైన నేపథ్యంలో బుజ్జి, రమేష్, ప్రతాప్, ఆండ్రూను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్టు సీఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment