జిల్లాను ఓడీఎఫ్‌గా మారుద్దాం
నెల్లూరు(అర్బన్):
మరుగుదొడ్లను 100శాతం నిర్మించి బహిరంగ మలవిసర్జన(ఓడీఎఫ్) జిల్లాగా నెల్లూరును మారుద్దామని కలెక్టర్ రేవు ముత్యాలరాజు పిలుపునిచ్చారు. స్థానిక దర్గామిట్టలోని కస్తూర్బా కళాక్షేత్రంలో 100శాతం మరుగుదొడ్లు నిర్మించిన 12 మండలాలకు చెందిన సర్పంచ్‌లు, అధికారులకు బుధవారం అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట వేయాలన్నారు. మంచి అలవాట్లు రావాలంటే æ చాలా కాలం పడుతుందన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించి మరుగుదొడ్లను నాసిరకంగా నిర్మిస్తే ప్రజలు మళ్లీ బహిరంగ మల విసర్జనకు అలవాటు పడుతారని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ ఒక్కరూ బహిరంగ మల విసర్జనకు పోకుండా కమిటీ సభ్యులు ప్రజలను నిత్యం చైతన్యవంతులు చేయాలన్నారు. ఆత్మగౌరవం పేరుతో మంచి అలవాట్లను అలవరుచుకునే విధంగా చూడాలన్నారు. మరుగుదొడ్లు నిర్మించడానికి సర్పంచ్‌లు, అ«ధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. ఆత్మగౌరవం జిల్లా కోఆర్డినేటర్ సుస్మిత మాట్లాడుతూ 100శాతం మరుగుదొడ్లు నిర్మించిన గ్రామ సర్పంచ్‌ల అనుభవాలను పంచుకోవడంతో పాటు వారిని సన్మానించేందుకు ఈ సభ ఏర్పాటు చేశామన్నారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం వల్ల కలిగే లాభాలు గురించి తెలిపారు. సభ్యుల అపోహాలను నివృత్తి చేశారు. అనంతరం 100శాతం మరుగుదొడ్లు నిర్మించిన గ్రామాల సర్పంచ్‌లకు కలెక్టర్ ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ పర్యవేక్షక ఇంజనీరు రామిరెడ్డి, టాస్క్ ఫోర్సు అధికారులు పాల్గొన్నారు.