ODF
-
ఆధునిక యుద్ధ ట్యాంకులను పరీక్షించిన ఓడీఎఫ్
కొండాపూర్(సంగారెడ్డి): సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ చెరువులో శనివారం రెండు యుద్ధ ట్యాంకుల ట్రయల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓడీఎఫ్ పరిశ్రమ అధికారులు మాట్లాడుతూ దేశంలో ఇలాంటి ట్యాం కులను చెన్నై, మెదక్‌లోని ఓడీఎఫ్‌లో మాత్రమే తయారు చేస్తారన్నారు. ఒక్కో ట్యాంక్‌లో పది మంది కూర్చునేందుకు వీలుంటుందని తెలిపారు. ఈ యుద్ధ ట్యాంక్‌కు కేవలం పగలు మాత్రమే కాకుండా రాత్రి వేళల్లోనూ ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని, నీటితో పాటు బురద, నేలపై దూసుకుపోతుందని పేర్కొన్నారు. శత్రువులపై దాడి చేసే సమయంలో పెద్దపెద్ద సరస్సులను దాటేందుకు అనువుగా ఈ యుద్ధ ట్యాంకులను తయారు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ బ్రిగేడియర్ నేవిబుట్ట, జాయింట్ కంట్రోలర్ శరవణన్, డిప్యూటీ కంట్రోలర్ బాలషణ్ముగం తదితరులు పాల్గొన్నారు. -
ఏడు రక్షణ సంస్థలు జాతికి అంకితం?
కంది(సంగారెడ్డి): రక్షణరంగ ఉత్పత్తులకు సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు కార్పొరేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణరంగ ప్రముఖుల సమక్షంలో వీటిని జాతికి అంకితం చేశారు. ఢిల్లీలోని డీఆర్డీఓ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారంలో జనరల్ మేనేజర్ అలోక్ ప్రసాద్ ఇతర అధికారులు లైవ్ ద్వారా వీక్షించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, డిఫెన్స్ ప్రొడక్షన్, డిఫెన్స్ మినిస్ట్రీ కింద దేశ వ్యాప్తంగా ఉన్న 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలతో ఈ కొత్త సంస్థలు ఏర్పడ్డాయి. ఈ సంస్థలు సాయుధ దళాలకు సంబంధించి వివిధ రకాల ఉత్పత్తులను సరఫరా చేయనున్నాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (ఎద్దు మైలారం)గ్రోత్ అండ్ గ్లోరీ అనే అశంపై వీడియోను ప్రదర్శించారు. అనంతరం ఎద్దుమైలారం యూనిట్ జనరల్ మేనేజర్ అలోక్ ప్రసాద్, ఏజీఎం శివకుమార్ మాట్లాడుతూ రక్షణ రంగంలో ఏడు కొత్త సంస్థలు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు. కార్పొరేషన్ల ఏర్పాటుతో కార్మికులు, ఉద్యోగుల భవిష్యత్తుకు ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. మరింత పట్టుదలతో పనిచేసి కొత్తరకం ఉత్పత్తులను తయారు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. -
ఓడీఎఫ్ లక్ష్యం నెరవేరిందా?
దేశంలోని గ్రామీణ ప్రాంతాలు బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్)మయ్యాయని బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన చెబుతున్న లెక్కల ప్రకారం దేశంలో గత అయిదేళ్లలో 60 కోట్లమంది ప్రజలకు 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ వివరాలనుబట్టి పశ్చిమబెంగాల్లోని 52 మున్సిపాలిటీలు మినహా దేశమంతా ఓడీఎఫ్ సాధించినట్టే. తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక మోదీ స్వాతంత్య్ర దినో త్సవం రోజున ఎర్రకోట బురుజులపై నుంచి ప్రసంగిస్తూ ‘స్వచ్ఛ భారత్’ బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. 2019లో జరగబోయే మహాత్మా గాంధీ 150వ జయంతి నాటికి ఓడీఎఫ్ సాధించాలని అప్పట్లో మోదీ లక్ష్య నిర్దేశం చేశారు. దీనిపై ఆనాటినుంచీ అన్ని మాధ్యమాల్లో, అన్ని భాషల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. మోదీ తానే స్వయంగా ప్రతి సందర్భంలోనూ దాని గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. అందువల్ల చెప్పుకోదగ్గ ఫలితం కూడా కనబడిందనడంలో సందేహం లేదు. అయితే అది ఓడీఎఫ్ ప్రకటించేంత స్థాయిలో ఉందా అన్న విషయంలోనే అందరికీ సంశయం. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో రెండు ప్రధానాంశాలున్నాయి. అందులో మరుగుదొడ్ల నిర్మాణం ఒకటైతే, ప్రజానీకం ప్రవర్తలో మార్పు తీసుకురావడం రెండోది. మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం భారీయెత్తున నిధులు వ్యయం చేసింది. అయితే ఈ కార్యక్రమంలో ప్రధాన లోపం ఏమంటే, ఇంటి యజమానులు ముందుగా తమకు తాము మరుగుదొడ్లు నిర్మించుకోవాలి. వాటిని తనిఖీ చేసి అవి సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందాక యజమానులకు పంచాయతీలు ఆ నిర్మాణానికైన ఖర్చు చెల్లిస్తాయి. ఒక మరుగుదొడ్డి కోసం కనీసం రూ. 15,000 అవసరమవుతాయి. అంత సొమ్ము సొంతంగా పోగేసుకుని నిర్మించుకోవడం ఎంతమందికి సాధ్యమవుతుంది? ఏమై తేనేం రిజిస్టరైన ప్రతి ఇంటి ఆవరణలోనూ ఇప్పుడు మరు గుదొడ్డి సదుపాయం ఉందని కేంద్రం అంటున్నది. అది జరిగిందనే అనుకుందాం. మరి ప్రజానీకం ప్రవర్తనలో మార్పు సంగతేమిటి? అసలు అది ప్రవర్తనకు సంబంధించిన సమస్యా లేక ఇతరత్రా సమస్యల పర్యవసానంగా ఏర్పడిందా? మరుగుదొడ్ల లెక్కలన్నీ దేశవ్యాప్తంగా 2012లో గ్రామీణ గృహ నిర్మాణ సంస్థలు, గ్రామీణాభివృద్ధి విభాగం పంచాయతీలతో కలిసి సంయుక్తంగా జరిపిన సర్వే ద్వారా వెల్లడైనవే. ఇప్పుడు దాని ప్రాతిపదికనే ఓడీఎఫ్ ప్రకటించారు. అప్పట్లోనే ఎన్నో విమర్శలొచ్చిన ఆ గణాంకాల ప్రాతిపదికగా అంతా సవ్యంగానే ఉన్నదని చెప్పడం సరైందేనా? మన దేశంలో బహిరంగ మల విసర్జన ఏనాటినుంచో ఒక ప్రధాన సమస్యగా ఉంది. మోదీకి ముందు పనిచేసిన ప్రధానులెవరూ దీన్నంతగా పట్టించుకోలేదుగానీ, ఇది తీవ్ర అనారోగ్య సమస్య లకు దారితీస్తోంది. ముఖ్యంగా మహిళలకు చెప్పనలవికాని సమస్యల్ని సృష్టిస్తోంది. పరిశుభ్రత భావన లేకపోవడం వల్లనే జనంలో ఈ అలవాటు పెరిగిందని చెప్పడం పూర్తిగా అవాస్త వమవుతుంది. వారు గత్యంతరం లేక, సిగ్గు విడిచి ఈ అలవాటు కొనసాగించవలసి వస్తున్నది. మరుగుదొడ్లు నిర్మించుకున్నా వాటి నిర్వహణకు అవసరమైన నీరు, ఫ్లష్అవుట్ సదుపాయం వగైరాలు సరిగా లేకపోతే ఆ మరుగుదొడ్లను ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. అలాంటి లోపాలు ఉత్తరప్రదేశ్, ఒడిశా, బిహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నోచోట బయటపడ్డాయి. ఆ మరుగుదొడ్లు నిష్ప్రయోజనంగా పడి ఉండటంతో అనేకచోట్ల వాటిని చిన్న సైజు గోడౌన్లుగా వినియోగించుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో మురికివాడలు అధికం. దుర్భర దారిద్య్రంలో మగ్గుతూ రోజుకూలీపై ఆధారపడేవారు, చిన్న చిన్న పనులతో పొట్టపోసుకునేవారు అనేకమంది వాటిల్లో బతకవలసి వస్తోంది. అలాంటిచోట ఎవరికివారు మరుగుదొడ్లు ఎలాగూ ఏర్పాటు చేసుకోలేరు. కనీసం అందరూ వినియోగించుకోవడానికి నిర్మించిన సామాజిక మరుగుదొడ్లు సైతం సరైన నీటి సదుపాయం లేక అంతంతమాత్రంగా నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు జనం బయటకు పోక తప్పడం లేదు. రాజస్తాన్, బిహార్ వంటిచోట్ల మరుగుదొడ్లు నిర్మిం చుకోకపోతే ఇతరత్రా సౌకర్యాలను ఆపేస్తామని ఒత్తిళ్లు తీసుకురావడం వంటివి చోటు చేసుకున్నాయి. కొన్నిచోట్ల బహిరంగ మలవిసర్జనకు పోతున్నవారిని గేలిచేయడం, అవమా నించడం, బెదిరించడం వంటివి జరిగాయి. రాజస్తాన్‌లోని ఒక గ్రామంలో కేవలం 19శాతం ఇళ్లకు మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయని ఆగ్రహించి ఆ గ్రామానికి విద్యుత్ సదు పాయాన్ని నిలిపేశారు. మొన్నీమధ్య మధ్యప్రదేశ్‌లో నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు బహిరంగ మల విసర్జన చేస్తున్నారని ఆగ్రహించి వారిని కొట్టి చంపిన ఉదంతం బయటికొచ్చింది. ఆ పిల్లల తండ్రి పక్కా ఇల్లు కోసం చేసిన దరఖాస్తును కావాలని పంచాయతీలో కొందరు బుట్టదాఖలు చేశారు. ఆ ఇల్లు దక్కితే తనకు కూడా మరుగుదొడ్డి ఉండేదని, తన పిల్లలు ప్రాణాలు కోల్పోయేవారు కాదని అతడు ఆవేదనపడుతున్నాడు. చిత్రమేమంటే ఆ గ్రామం కూడా ఓడీఎఫ్ జాబితాలో ఉంది. ఇలా సమస్య తీరకపోయినా జాబితాల్లోకెక్కిన గ్రామాలు మరెన్ని ఉన్నాయో? స్వచ్ఛభారత్ కార్యక్రమం నిస్సందేహంగా బృహత్తరమైనది. దాన్ని విజయవంతంగా అమలు చేయగలిగితే ప్రజారోగ్యానికి అదెంతో మేలు చేస్తుంది. ఐక్యరాజ్యసమితి 2030నాటికి ప్రపంచ దేశాలన్నీ సాధించాలంటున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పారిశుద్ధ్యం కూడా ఉంది. అందుకోసం కేంద్రప్రభుత్వం పెట్టిన శ్రద్ధ కూడా మెచ్చదగిందే. అయితే దాని అమలుకు ఎదురవుతున్న సమస్యలేమిటో తెలుసుకుని ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించుకుంటూ పోతే వేరుగా ఉండేది. ఇప్పుడైనా ఇలాంటి లోటుపాట్లను గుర్తించి, మరుగుదొడ్ల నిర్వహణ ఎలా ఉంటున్నదో తెలుసుకుని సరిచేస్తే స్వచ్ఛభారత్ అనుకున్న స్థాయిలో విజయం సాధించడానికి వీలవుతుంది. -
ఆరుబయట మలవిసర్జనకు రూ.1000 కట్టాల్సిందే..
సాక్షి, నిర్మల్: రెంటికి ఆరుబయటకు వెళుతున్నారా..! ఆగండి.. మీ ఇంట్లో ఉన్న మరుగుదొడ్డిని వినియోగించు కోండి.. ఒకవేళ లేకుంటే వెంటనే నిర్మించుకోండి.. లేదంటే ఫైన్ కట్టక తప్పదు. ఇక నుంచి ఆరుబయట మలవిసర్జన చేస్తే రూ.1000 జరిమానా విధించాలని ప్రభు త్వం ఆదేశించింది. ఇది ఒక్కటే కాదు.. మ నం పద్ధతి మార్చుకోకుంటే మరెన్నో ఫైన్లు కట్టక తప్పదు మరి. ఇప్పటి దాకా మనం ఇష్టం వచ్చినట్లు వ్యవహరించినా ఎవరు ఏమీ అనేవారు కాదు. ఒక వేళ ఎవరైన ఏంటీ మీరు అలా చేస్తున్నారని ప్రశ్నిస్తే.. మంచిది.. బాగా సలహా ఇస్తున్నారు... నీకెందుకులే అనే వాళ్లం. ఇక ముందు పారి శుధ్యం విషయంలో, ఆరుబయట మల విసర్జన, చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వినియోగం విషయంలలో అధికారులు కఠినంగా వ్యవహరించనున్నారు. మరుగుదొడ్లను వినియోగించకుంటే రూ.1000 జరిమానా.. చిట్యాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన జరిమానా బోర్డు ఆరుబయట మల, మూత్ర విసర్జనలతో పరిసరాలు ఆపరిశుభ్రంగా మారడంతో పాటు కలుషిత వాతావరణం ఏర్పడేది. దీంతో వ్యాధులు ప్రబలేవి. దీనిని నివారించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. బహిరంగ మలవిసర్జన నిర్మూలన కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తూ మరుగుదొడ్ల నిర్మాణానికి ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు అందజేస్తోంది. దీంతో చాలా గ్రామాల్లో, పట్టణాల్లో ఇప్పటికే మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. అయితే కట్టుకున్న వారిలో చాలా మంది వాటిని వినియోగించడం లేదు. మరుగుదొడ్లు వినియోగించుకోవాలని చాలా సార్లు విన్నవించారు. బహిరంగ మల విసర్జన అరికట్టేందుకు, కట్టుకున్న మరుగుదొ డ్లు వాడుకునేలా ప్రజలకు అవగాహన సైతం కల్పించారు. అయితే ప్రజల్లో ఆశించిన మార్పు రావడం లేదు. ఇంకా అలవాటు ప్రకా రం మల విసర్జనకు ఆరుబయటకే వెళుతున్నారు. దీంతో అట్టి చర్యలకు పాల్పడిన వారికి జరిమానా విధించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. బహిరంగ మలవిసర్జన వెళ్లిన వారిని గుర్తించి, జరిమానాలు విధించాలని పంచాయతీ కా ర్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వారికి రూ. 1000 జరిమానా విధించనున్నారు. చెత్త వేస్తే రూ. 500 కట్టాల్సిందే... పారిశుధ్యం మెరుగుదల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారంతో పాటు చర్యలు చేపట్టింది. పట్టణాల్లో తడి, పొడి చెత్త సేకరణకు ప్రాధాన్యత ఇస్తూ ఇంటింటికీ బుట్టల పంపిణీ చేపట్టింది. వాహనాల ద్వారా ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. అలాగే గ్రామాల్లోనూ చెత్త సేకరణను తోపుడు బండ్లు(పుష్ కాట్స్) ద్వారా చేపడుతున్నారు. ఇలా సేకరించిన చెత్త, చెదారాన్ని గ్రామాల్లోని డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ఇలా చెత్త సేకరణతో రోడ్లపై చెత్తను వేయడం అధికంగా తగ్గింది. కానీ పట్టణాల్లో, గ్రామాల్లో కొందరు ని ర్లక్ష్యంతో ఇంకా ఆరుబయట రోడ్లపై చెత్తను వే స్తున్నారు. ఇలా నిర్లక్ష్యంతో ఇక ముందు ఇలా చెత్తను రోడ్లపై వేస్తే రూ. 500 ఫైన్ చెల్లించక తప్పదు. ఇప్పటికే నిర్మల్ మున్సిపల్ పరిధిలో నలుగురికి జరిమానా విధించారు. అలాగే పలు గ్రామాల్లోనూ దీనిని అమలు చేస్తున్నారు. చెత్త ను ఎక్కడ పడితే అక్కడ వేస్తే తప్పని సరిగా రూ. 500 జరిమానా విధించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించింది. కాగా ఈ జరిమానాను రూ.500నుంచిరూ.వెయ్యి వరకు విధించవచ్చు. మొక్కలను మేసినా.. ప్లాస్టిక్ వేసినా.. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు సంరక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఒక వేళ నాటిన మొక్కలో 85 శాతం బతికించాలి. మొక్కలు బతకకపోతే సంబంధిత అధికారులు, పాలకులపై చర్యలు తీసుకోనుంది. దీంతో అధికారులు, పాలకులు సైతం మొక్కల సంరక్షణకు కఠినంగానే వ్యవహరించనున్నారు. పశువులు, గొర్రెలు మొక్కలను మేసినా.. పాడు చేసినా.. మొక్కకు రూ.500 చొప్పున జరిమానా విధించనున్నారు. అలాగే వినియోగించిన ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, నీటి ప్యాకెట్లు వంటి వాటిని బహిరంగ ప్రదేశాల్లో పారవేస్తే పాలక వర్గం జరిమానా విధించనున్నారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలోని దండెపల్లిలో ఓ వైన్స్ పక్కన ఇష్టారీతిన ప్లాస్టిక్ గ్లాసులు పడేసి ఉండటంతో ఆగ్రహించిన అక్కడి కలెక్టర్ రూ. 30వేలు జరిమానా విధించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించడంతో పాటు అమలు చేశారు. ఇదే తరహాలో జిల్లాలోనూ ప్లాస్టిక్ వినియోగదారులపై కఠినంగా వ్యవహరించనున్నారు. ఇక మనలో మార్పు రాకపోతే జరిమానాలు కట్టక తప్పదు. -
ఓడీఎఫ్ కార్పొరేటీకరణను అడ్డుకుంటాం
సాక్షి, సంగారెడ్డి : దేశ రక్షణ రంగంలో ఎంతో కీలకమైన ఆయుధ కర్మాగారాల (ఓడీఎఫ్)లను కార్పొరేటీకరించడాన్ని అడ్డుకుని ఉద్యోగులకు అండగా నిలుస్తామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఓడీఎఫ్‌లను కార్పొరేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి రూరల్ మండల పరిధిలోని ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారం(ఓడీఎఫ్) వద్ద ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశ చరిత్రలో ఇంతవరకు ఎవరూ తీసుకొని తప్పుడు నిర్ణయాలను కేంద్రం తీసుకొని ఓడీఎఫ్‌ను ప్రైవేటీకరించేందుకు పూనుకోవడం దారుణమన్నారు. 1984లో మెదక్ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పన కోసం దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఓడీఎఫ్‌ను స్థాపించారన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఓడీఎఫ్‌లను కార్పొరేటీకరించేందుకు ప్రయత్నించడాన్ని చూసి ఇందిరాగాంధీ ఆత్మ క్షోభిస్తుందని తెలిపారు. దేశ రక్షణలో కీలకంగా ఉంటూ సైనికులకు అవసరమైన ఆయుధాలను తయారు చేసే ఓడీఎఫ్‌లను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించడం మంచిది కాదన్నారు. ప్రభుత్వపరంగా ఉన్న సంస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాలు, సూచనలతో పార్లమెంట్లో ఓడీఎఫ్‌ల కార్పొరేటీరణను అడ్డుకుంటామని తెలిపారు. ఓడీఎఫ్‌లను రక్షించుకుందాం: ఉద్యోగుల జేఏసీ రాత్రింబవళ్లు కష్టపడి సైన్యానికి అవసరమైన పరికరాలను అందించిన ఆయుధ కర్మాగారాలను కార్పొరేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొని ఓడీఎఫ్‌లను రక్షించుకుందామని ఓడీఎఫ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు తెలిపారు. ధర్నాలో జేఏసీ నాయకులు ఈశ్వర్ ప్రసాద్, జనార్దన్‌రెడ్డి, సుదర్శన్, నరేందర్ కుమార్‌లు మాట్లాడుతూ గతంలో రూ. 45 వేల కోట్ల లాభంతో ఉన్న ఓడీఎఫ్‌లు ప్రస్తుతం రూ.5 వేల కోట్లకు పడిపోయాయన్నారు. ప్రస్తుతం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు. దేశ మొత్తంలో ఉన్న 41 ఓడీఎఫ్‌లను రక్షించుకునేందుకు «ధర్నాలు చేపడుతున్నట్లు తెలిపారు. రక్షణ రంగాన్ని పటిష్టం చేయడంలో కీలకంగా ఉన్న ఓడీఎఫ్‌లను కార్పొరేట్ సంస్థలైన అంబానీ, అదాని, టాటా, బిర్లాలకు అప్పజెప్పేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈ ఓడీఎఫ్‌ల పరిధిలో 60 వేల ఎకరాలు ఉన్న భూమిని ప్రైవేట్ సంస్థలకు తాకట్టు పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్న అప్పటి రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ ఓడీఎఫ్‌లను ప్రైవేటీకరించబోమని రాత పూర్వకంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆర్డినెస్ ఫ్యాక్టరీలను కార్పొరేటీకరించి ఉద్యోగులను ఇబ్బందులు పెట్టే కార్యక్రమానికి పూనుకుందని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయాలను అడ్డుకునేందుకు ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎంపీపీ అధ్యక్షురాలు సరళ పుల్లారెడ్డితో పాటు సీఐటీయూ జిల్లా నాయకులు సాయిలు, రాజయ్య, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఓడీఎఫ్..డబుల్ ప్లస్
సాక్షి, సిటీబ్యూరో: ‘స్వచ్ఛత’ విషయంలో నగరానికి అరుదైన గుర్తింపు లభించింది. స్వచ్ఛభారత్ మిషన్ హైదరాబాద్‌ను ‘ఓడీఎఫ్ (ఓపెన్ డిఫకేషన్ ఫ్రీ) డబుల్ ప్లస్’గా ప్రకటించింది. దేశంలోని ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూర్ వంటి ఏ మెట్రో నగరానికీ ఇలాంటి అవార్డు రాలేదు. నగరానికి ప్రస్తుతం లభించిన ఓడీఎఫ్ డబుల్‌ప్లస్ గుర్తింపు శాశ్వతంగా ఉండేందుకు ప్రజల సహకారం అవసరమని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ కోరారు. దేశంలో ఓడీఎఫ్ డబుల్ ప్లస్‌కు ఎంపికైన మూడు నగరాల్లో హైదరాబాద్‌లోనే ఎక్కువ జనాభా ఉందని, మన జనాభా కోటి కాగా, మిగతా రెండు నగరాలైన ఇండోర్, చండీగఢ్‌ల జనాభా 20 లక్షలపైచిలుకు మాత్రమేనన్నారు. ఈ గుర్తింపు ఎప్పటికీ కొనసాగేందుకు ప్రజలకు తగిన అవగాహన కార్యక్రమాలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇందుకుగాను ఫిబ్రవరి మొదటి వారం నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ అవార్డు ప్రకటన సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆస్కి సహకారంతో గత రెండు నెలలుగా జీహెచ్ఎంసీ, జలమండలి పరస్పర సహకారంతో పనిచేయడం వల్ల ఇది సాధ్యమైందన్నారు. నగరంలో ప్రస్తుతమున్న టాయ్లెట్లు సరిపోవని, మరిన్ని పబ్లిక్ టాయ్లెట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తద్వారా మున్ముందు ఈ ర్యాంక్ కోల్పోకుండా ఉంటామన్నారు. దీంతోపాటు నానో వాహనం ద్వారా ఎలక్ట్రానిక్ మానిటరింగ్ చేయడం ద్వారా ఎక్కడైనా బహిరంగ మూత్రవిసర్జన జరిగితే గుర్తించి, జరిమానా విధింపు వంటి చర్యలు చేపడతామన్నారు. నిబంధనలు పాటించడం, తదితర అంశాలపై ప్రజలకు తగిన అవగాహన ఉంటేనే క్లీన్ అండ్గ్రీన్సిటీ వంటివి సాధ్యమంటూ, అందుకుగాను అవగాహన కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు. నగరంలో 9వేల కి.మీ.ల రహదారులుండగా, ప్రధాన రహదారులపై, బస్టాండ్లు, ఆటోస్టాండ్లు తదితర ప్రాంతాల్లో తప్పనిసరిగా పబ్లిక్ టాయ్లెట్లు ఉండాలన్నారు. వీలైనన్ని ఎక్కువ ప్రదేశాల్లో పబ్లిక్ టాయ్లెట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకుగాను సర్వే నిర్వహిస్తామన్నారు. పెట్రోలుబంకులు, హోటళ్లలోని టాయ్లెట్లను ప్రజలు వినియోగించుకునేందుకు అనుమతించాల్సిందిగా కోరినప్పటికీ ఆశించిన మేరకు ఫలితమివ్వలేదన్నారు. దీన్ని కచ్చితంగా అమలు చేసేందుకు గాను తగిన చర్యల కోసం విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. బహిరంగ మూత్ర విసర్జనను నివారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్నీ వినియోగించుకుంటామన్నారు. బహిరంగ మూత్ర విసర్జనకు పాల్పడ్డవారిపై 617 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నగర జనాభా పెరుగుతున్నందున అందుకనుగుణంగా ట్రెంచ్‌లెస్ టెక్నాలజీతో సివరేజి వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. కలుషిత జలాల నివారణకు భోలక్‌పూర్‌లో రూ.20.8 కోట్లతో కొత్త పైప్లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూ.6వేల కోట్లతో సివరేజి మాస్టర్‌ప్లాన్ నగరంలో సివరేజి వ్యవస్థను మెరుగుపరచేందుకు సీఎస్సార్ ద్వారా కార్పొరేట్ సంస్థల సహకారం పొందనున్నట్లు కమిషనర్ దానకిశోర్ తెలిపారు. సివరేజి ప్లాంట్ల ఏర్పాటు కానీ, నిర్వహణ కానీ చేసేందుకు కొన్ని సంస్థలు ఆసక్తి కనబరిచాయన్నారు. నగరానికి ఓడీఎఫ్ డబుల్‌ప్లస్ లభించడంతో పారిశుధ్య నిర్వహణకు కేంద్రం ప్రోత్సాహక నిధులివ్వనుందన్నారు. గ్రేటర్లో దాదాపు రూ.6 వేల కోట్లతో సివరేజి మాస్టర్‌ప్లాన్ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛభారత్‌కు 250 మార్కులు.. ఓడీఎఫ్ డబుల్‌ప్లస్ గుర్తింపు పొందిన నగరాలకు స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్‌లలో 250 మార్కులు లభిస్తాయి. దీంతో నగరానికి స్వచ్ఛభారత్‌లోనూ మెరుగైన ర్యాంకుకు మార్గం సుగమమైనట్లు అధికారులు పేర్కొన్నారు. తనిఖీల్లో భాగంగా స్వచ్ఛభారత్ మిషన్ ప్రతినిధుల బృందం నగరంలోని 45 పబ్లిక్/కమ్యూనిటీ టాయ్లెట్లను పరిశీలించింది. 18 టాయ్‌లెట్లలోని పరిస్థితుల్ని తనిఖీ చేసింది. వాటిల్లో 12 ఎక్సలెంట్‌గా, 1 చాలా శుభ్రంగా, 5 తగిన విధంగా ఉన్నాయని అభిప్రాయపడింది. గుర్తింపు ఇలా... స్వచ్ఛ భారత్ మిషన్ ఆర్నెళ్లకోమారు తనిఖీలు చేసి ఓడీఎఫ్ నగరాలుగా ప్రకటిస్తుంది. ఒకసారి గుర్తింపు పొందిన నగరాల్లో తిరిగి పరిస్థితులు బాగులేకుంటే ఇచ్చిన గుర్తింపు ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. 2017 డిసెంబర్లో ఓడీఎఫ్ నగరంగా ఎంపికైన హైదరాబాద్ మహానగరం తాజాగా ఓడీఎఫ్ డబుల్‌ప్లస్ నగరంగా ఎంపికైంది. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత నగరాలకు ఓడీఎఫ్, బహిరంగ విసర్జకు జరిమానాలు విధించే నగరాలకు ఓడీఎఫ్ ప్లస్, మానవ విసర్జిత వ్యర్థాలను శాస్త్రీయంగా ట్రీట్మెంట్ చేసే సదుపాయాలుండటంతో పాటు ట్రీట్మెంట్ ప్లాంట్లకు పంపించే సదుపాయాలున్న నగరాలకు ఓడీఎఫ్ డబుల్‌ప్లస్ నగరాలుగా గుర్తింపునిస్తారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా, జలమండలి ఎండీగా దానకిశోరే ఉండటంతో 18 ఎస్టీపీల్లో మానవ విసర్జితాల ట్రీట్మెంట్ సదుపాయాలు కల్పించడంతోపాటు సెప్టిక్‌ట్యాంకుల నుంచి విసర్జితాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉండేందుకు సెప్టిక్ట్యాంకర్ వాహనాలకు లైసెన్సులిచ్చే విధానాన్ని ప్రవేశపెట్టడం తదితర చర్యలు తీసుకున్నారు. దీంతో నగరం ఓడీఎఫ్నుంచి నేరుగా ఓడీఎఫ్ డబుల్ ప్లస్‌గా ఎంపికైంది. -
మరుగేది..!
టేకులపల్లి : మండలంలోని కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో బాలికలకు టాయిలెట్, మరుగుదొడ్లు లేక వారు నానా తంటాలు పడుతున్నారు. ఈ విషయమై సంవత్సర కాలంలో పలుమార్లు సాక్షిలో ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. సుమారు నాలుగు నెలల క్రితమే బాలికలకు టాయిలెట్, మరుగొడ్డి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. నిర్మాణం కూడా మొదలు పెట్టారు. నెల రోజుల్లోనే పూర్తి కావాల్సి ఉండగా నాలుగు నెలలు అవుతున్నా నేటికీ పూర్తి చేయకపోవడం గమనార్హం. రెండు నెలలుగా పనులు జరగడం లేదు. బాలికల పట్ల నిర్లక్ష్యం వీడి వెంటనే నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
భీమిని : భీమిని, కన్నెపల్లి మండలాల్లోని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని డీఆర్డీఏ పీడీ శంకర్ సూచించారు. మంగళవారం ఉదయం భీమిని, కన్నెపల్లి మండలాల్లోని రాంపూర్, కన్నెపల్లి గ్రామాల్లో నిర్మించిన మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. మరుగుదొడ్ల ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. బహిరంగ మలవిసర్జన ఉండకూడదని సూచించారు. ఈ నెల 31లోపు గ్రామాల్లో ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మండల అధికారులకు సూచించారు. సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఆయన వెంట వైస్‌ఎంపీపీ గడ్డం మహేశ్వర్‌గౌడ్, ఇన్చార్జి ఎంపీడీవో రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. -
ఓడీఎఫ్‌కు టైమైంది..!
మోర్తాడ్(బాల్కొండ) : స్వచ్ఛభారత్ అభియాన్‌లో భాగంగా జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ఈనెల 29తో గడువు ముగియనుంది. అక్టోబర్ 2వ తేదీన జిల్లాను ఓడీఎఫ్ (బహిరంగ మల విసర్జన రహిత)గా ప్రకటించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో 87.27శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన నిర్మాణాలు పూర్తిచేసేందుకు జీపీల ఖాతాల్లో జమచేసిన నిధులను 29వ తేదీలోగా ఖర్చు చేయాల్సి ఉంది. ఒకవేళ ఈ నిధులను ఖర్చు చేయకపోతే ఆ నిధులు ప్రభుత్వ ఖజానాకు మళ్లనున్నాయి. దీంతో కొద్దిరోజులే గడువు ఉండడంతో గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని గ్రామాల్లోని లబ్ధిదారులకు అధికారులు సూచించారు. 29లోగా ఖర్చు చేయాల్సిందే.. జీపీ ఖాతాల్లోని ఈ నిధులను ఈనెల 29వ తేదీలోగా ఖర్చు చేయకపోతే ఎంపీడీవో ఖాతాలకు మళ్లించాలని ప్రభుత్వం లీడ్ బ్యాంకు ద్వారా ఆయా బ్యాంకుల శాఖలకు ఆదేశించింది. గ్రామ పంచాయతీ ఖాతాల్లో ఉన్న నిధులతో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయడం, మొదలు పెట్టనివి ప్రారంభించాల్సి ఉంది. ఒకవేళ నిధులు ఖర్చు చేయకపోతే పంచాయతీ ఖాతాల నుంచి ఎంపీడీవో ఖాతాలకు మళ్లిపోనున్నాయి. జిల్లాలోని పాత మండలాల ప్రకారం 19 మండలాల్లోని నిర్మాణాలను పరిశీలిస్తే 99.30 శాతంతో వేల్పూర్ ప్రథమ స్థానంలో నిలువగా 73.77 శాతంతో నవీపేట్ చివరి స్థానంలో ఉంది. లక్ష్యానికి అనుగుణంగా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేస్తే జిల్లాను బహిరంగ మల విసర్జన లేని జిల్లాగా ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి మరికొద్ది రోజులే గడువు ఉంది. ఇప్పటికే గ్రామాలలోని లబ్ధిదారులకు మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులు సమాచారం అందించారు. నిర్మాణం మొదలైన వాటిని పూర్తిచేయడం, అసలే మొదలుపెట్టని వాటిని ఆరంభించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆసరా పింఛన్లకు లింకు.. ప్రభుత్వ ఆసరా పింఛన్లను పొందుతూ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోని వారిని గుర్తించి పింఛన్‌ను నిలిపివేయాలని అధికారులు తపాలా శాఖ ఉద్యోగులకు లేఖ రాశారు. సోమవారం నుంచి పింఛన్లను పంపిణీ చేసే అవకాశం ఉండటంతో మరుగుదొడ్డి నిర్మించుకోని వారికి పింఛన్లు నిలిపివేయనున్నారు. జిల్లాలోని గ్రామాలను ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించడంలో భాగంగా లబ్ధిదారులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకరావడం తప్పడం లేదని అధికారులు అంటున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ఎలాగైనా పూర్తి చేయించాలనే లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు. వందశాతం పూర్తిచేయాలని ఆదేశం.. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వందశాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. నిర్మాణాలు పూర్తి చేయాల్సిన వాటి సంఖ్య తక్కువగా ఉండటం, సమయం కూడా ఎక్కువ లేకపోవడంతో నిరంతరం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయించడానికి కృషి చేస్తున్నాం. – పీవీ శ్రీనివాస్, ఎంపీడీవో, మోర్తాడ్ 87.27 శాతం పూర్తి.. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యం 99,065 కాగా, ఇప్పటివరకు 86,453 నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 7,036 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయి. 5,576 నిర్మాణాలు మొదలు కావాల్సి ఉంది. జిల్లామొత్తంలో 87.27 శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా 12.73 శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.118కోట్ల 87లక్షల 80వేల నిధులను కేటాయించింది. నిర్మాణాలు కొనసాగుతున్నవి, ఇంకా నిర్మాణాలు జరగాల్సిన మరుగుదొడ్ల కోసం గ్రామ పంచాయతీ ఖాతాల్లో రూ.15కోట్ల 13లక్షల 44వేల నిధులున్నాయి. -
మానవ వనరులు అపారం
సమర్థంగా వినియోగించుకుంటాం - కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ - పటాన్చెరు బీడీఎల్‌లో 5 మెగావాట్ల పవర్ ప్లాంట్ ప్రారంభం - ఎల్ఆర్ సామ్ క్షిపణి ఇండియన్ నేవీకి అప్పగింత సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. విదేశాల్లోనూ సత్తాచాటుతున్నవారు ఎంతో మంది ఉన్నారు. ఈ వనరులను దేశాభివృద్ధికి సమర్థంగా వినియోగించుకుంటాం’ అని కేంద్ర రక్షణ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. కంచన్‌బాగ్‌లోని బీడీఎల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆదివారం మంత్రి పాల్గొన్నారు. బీడీఎల్, మిథాని రూపొందించిన అధునాతన క్షిపణి (ఎల్ఆర్ సామ్)ను ఇండియన్ నేవీకి అప్పగించారు. అలాగే యుద్ధ ట్యాంకర్‌ను రక్షణ శాఖకు అంకితమిచ్చారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ.. ‘సాంకేతిక పరిజ్ఞానంలో మనం దూసుకుపోతున్నాం. పరిశోధనల్లోనూ అదే వేగాన్ని కొనసాగిస్తున్నాం. ఈ రంగాల్లో అపార అవకాశాలున్నాయి. వీటిని యువత సద్వినియోగం చేసుకోవాలి’ అని పిలుపునిచ్చారు. జనాభా పరంగా పెద్ద దేశాల్లో భారత్ ఒకటని.. ఇక్కడ మధ్య, పేద తరగతి వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్నారని, ప్రతి పౌరుడికీ నాణ్యమైన విద్య అందాల్సిన అవసరముందన్నారు. భారత్‌లో సాంకేతిక పరిజ్ఞానానికి కొదవ లేదని, ఇక్కడి ఇంజనీర్లు విదేశాల్లోనూ రికార్డులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. రక్షణ శాఖలో టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగిస్తామని చెప్పారు. బీడీఎల్, మిథాని సేవలు రక్షణ రంగానికి తలమానికంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో రక్షణ శాఖ కార్యదర్శి ఏకే గుప్తా, రక్షణ మంత్రి సలహాదారు జి.సతీశ్‌రెడ్డి బీడీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్‌భాస్కర్, డీఆర్డీవో చైర్మన్ ఎస్.క్రిస్టొఫర్, నేవీ వైస్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఓడీఎఫ్‌ను సందర్శించిన జైట్లీ సంగారెడ్డి రూరల్: సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఎద్దుమైలారం (ఓడీఎఫ్) ఆయుధ కర్మాగారాన్ని జైట్లీ సందర్శించారు. అక్కడ అరగంట పాటు గడిపిన మంత్రి.. కర్మాగారంలో తయారవుతున్న యుద్ధ ట్యాంకులను పరిశీలించినట్లు సమాచారం. రక్షణ మంత్రి పర్యటన సందర్భంగా సమాచార సేకరణకు వెళ్లిన మీడియాను ఓడీఎఫ్ అధికారులు అనుమతించలేదు. ప్రొటోకాల్ ప్రకారం తమను ఓడీఎఫ్లోకి అనుమతించాలంటూ మెయిన్‌గేట్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఎద్దుమైలారం గ్రామ సర్పంచ్ దశరథ్ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఓడీఎఫ్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ ఆల్ ఇండియా ఓడీఎఫ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మెయిన్ సర్కిల్ వద్ద కార్మికులు నిరసనకు దిగారు. ఓడీఎఫ్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ ఇంద్రకరణ్, క్యాసారం, ఎద్దుమైలారం, సింగపురం నిర్వాసితులు డిమాండ్ చేశారు. మంత్రిని కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో మెయిన్ సర్కిల్ వద్ద నిరసనకు దిగారు. ఇబ్రహీంపట్నం యూనిట్లో స్టాటిక్ టెస్ట్ ప్రారంభం ఇబ్రహీంపట్నం రూరల్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ బీడీఎల్‌లో జైట్లీ పర్యటించారు. భారత్ డైనమిక్ లిమిటెడ్ ఇబ్రహీంపట్నం యూనిట్లో స్టాటిక్ టెస్ట్ (జీవాత్మక)ను ప్రారంభించారు. రెండో దశ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. బీడీఎల్ ఏర్పాటు చేసిన సైట్ లే అవుట్ మ్యాప్‌లను అధికారులతో కలసి తిలకించారు. ఇప్పటికే నిర్మాణం చేపట్టిన భవన నిర్మాణాలను పరిశీలించారు. భానూరులో 15 క్షిపణులు తయారీ.. పటాన్చెరు టౌన్: పటాన్చెరు మండల పరిధిలోని బీడీఎల్ పరిశ్రమను ఆదివారం జైట్లీ సందర్శించారు. పరిశ్రమలో రక్షణమంత్రి అస్త్ర క్షిపణుల తయారీ ప్రాజెక్టు కార్యాలయాన్ని, కొత్తగా ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. 10 నుంచి 15 క్షిపణులు భానూరు యూనిట్లో తయారు చేస్తారని, భవిష్యత్తులో 50 క్షిపణులను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రక్షణ రంగంలో దేశాన్ని బలోపేతం చేస్తున్నట్లు వివరించారు. చింతపండుపై పన్ను మినహాయించండి..జైట్లీని కోరిన దత్తాత్రేయ రాష్ట్ర పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న మంత్రి జైట్లీని ఆదివారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కలిశారు. చింతపండుపై గతంలో పన్ను లేదని, జీఎస్టీ అమలుతో ప్రస్తుతం 12 శాతం పన్ను విధిస్తున్నారని, దీంతో వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని జైట్లీకి దత్తాత్రేయ వివరించారు. అలాగే మిర్చి, పత్తి, పసుపు వంటి వాణిజ్య పంటల విషయంలోనూ జీఎస్టీలో ఇబ్బందులొస్తున్నాయని, త్వరగా వీటిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. -
అభివృద్ధి మంత్రం...
అభివృద్ధే ఆయన మంత్రం... అదే ధ్యేయంతో∙ఆయన పయనం. అక్రమాలకు ఎక్కడికక్కడ చెక్‌పెట్టి... అనుకున్న లక్ష్యాలు సాధించేందుకే ఆయన గమనం. అక్కడక్కడా అవాంతరాలు వస్తాయి... వాటిని అధిగమించాలి. వెనుకబాటు నుంచి గట్టెక్కించేందుకు సరికొత్త ఆలోచనలతో సాగాలి. అందుకోసం అందరినీ కలుపుకుని పోవాలి... అందరి ఆలోచనలకు పదును పెట్టాలి. అప్పుడే మనమేంటో పదిమందికి తెలుస్తుంది. ఈ లక్ష్యంతోనే సాగుతున్నారు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్. జిల్లా కలెక్టర్‌గా తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన విజయనగరాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకు వెళ్లి తనదైన ముద్ర వేసుకోవాలని పరితపిస్తున్నారాయన. ఇంకా ఆయన మనసులోని భావా లను సాక్షి ప్రతినిధితో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... 2018 మార్చినాటికి సంపూర్ణ ఓడీఎఫ్ 2018 మార్చినాటికి జిల్లాను సంపూర్ణ బహిరంగ మలమూత్ర విసర్జన రహిత(ఓడీఎఫ్) జిల్లాగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇటీవల 100 గంటల్లో 10వేల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి ప్రధాని నుంచి ప్రశంసలు అందుకున్నాం. విజయనగరం పట్టణంలో అపారిశుద్ధ్య సమస్య తీవ్రంగానే ఉంది. నివాస ప్రాంతాల్లో కొంత వరకూ బాగానే ఉన్నా వాణిజ్య ప్రదేశాల్లో చాలా దారుణ పరిస్థితులున్నాయి. నడిరోడ్డుమీద పందులు, ఆవులు, గేదెలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించాల్సి ఉంది. అందుబాటులో ఇళ్లు హౌసింగ్ ప్రాజెక్టులను చేపడుతున్నాం. ఎన్టీ ఆర్ రూరల్, అర్భన్ హౌసింగ్ పథకాలు అమలు చేస్తున్నాం. ఏపీ టిడ్కో ద్వారా లే అవుట్ తయారు చేయిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1.50 లక్షల చొప్పున రూ.3లక్షలు సబ్సిడీ ఇవ్వడంతో పాటు చిన్న ఇన్‌స్టాల్‌మెంట్‌తో మిగతా రూ.6.50లక్షలు బ్యాంకులు రుణం అందిస్తాయి. విజయనగరం, బొబ్బిలి, సాలూరులో ఈ పథకాలు అమలు చేస్తున్నాం. మూడు యూనిట్లలో యూనిట్‌ను బట్టి లబ్ధిదారుల వాటా ఉంటుంది. ఉపాధిలో అక్రమాలను సహించం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్జీఎస్)పై ఎక్కువగా అధారపడ్డ జిల్లా మనది. సీసీ రోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీల భవనాలు, శ్మశానాల నిర్మాణం ఈ నిధులతోనే చేపట్టేందుక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం. మహిళా సమాఖ్యలకు భవనాలు మండల కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. ఉపాధి పనుల్లో అక్కడక్కడా అక్రమాలు జరుగుతున్నట్టు కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో భువన్ అనే పోర్టల్ ద్వారా జియో టాగింగ్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో ఎవరైనా చూడవచ్చు. జరిగినవే మళ్లీ మళ్లీ జరుగుతుంటే గుర్తించే వెసులుబాటు ఉంది. వలసలు లేకుండా చేయాలనే లక్ష్యంతోనే ఉపాధి హామీ పథకం పనిచేస్తున్నందున గ్రామ పంచాయతీ కూడా ఈ విషయంలో పర్యవేక్షణ చేస్తుండాలి. సోషల్ ఆడిట్ కూడా పిరియాడికల్‌గా జరుగుతుంది. అక్రమాలు జరిగితే సర్పంచ్ చెక్‌పవర్ రద్దు చేస్తాం. అధికారులను సస్పెండ్ చేస్తాం. -
ఓడీఎఫ్‌గా జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యం
గాదెలదిన్నె (విడవలూరు): జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చేందుకు ప్రజల సహకారం అవసరమని డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి పేర్కొన్నారు. మండలంలోని గాదెలదిన్నెలో బుధవారం ఆత్మగౌరవ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న గాదెలదిన్నెలో రెండో విడతలతో కేవలం నెల రోజుల వ్యవధిలో 102 మరుగుదొడ్లను నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన సర్పంచ్ శేషయ్యను అభినందించారు. గాదెలదిన్నెలో నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. బహిరంగా మల విసర్జన రహిత గ్రామంగా ఆమోదించడం జరిగిందన్నారు. జిల్లాలో అన్ని గ్రామాలు గాదెలదిన్నెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గ్రామంలోని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాసులు, ఏపీఎం అమరావతి, ఎంపీటీసీ సభ్యులు శారద, తదితరులు పాల్గొన్నారు. -
ఓడీఎఫ్ జిల్లాగా తీర్చిదిద్దుదాం
– జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కర్నూలు(అర్బన్): కర్నూలును బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్) జిల్లాగా తీర్చిదిద్దుదామని, ఇందులో గ్రామైక్య సంఘాలు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు, బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో పోషించాల్సిన పాత్ర, ఆదాయ పెంపు మార్గాలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సంఘాలు రూరల్ శానిటరీ మార్టుగా మారాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కలెక్టర్ అన్నారు. డీఆర్డీఏ కార్యక్రమాల్లో భాగంగా 17 మండలాలకు చెందిన 92 గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇందుకు మండల అధికారులు, ఏపీడీ, ఏరియా కోఆర్డినేటర్లు, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈలతో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలకు పెట్టుబడి నిధి కింద రూ.5 లక్షలు మంజూరు చేస్తామని, గ్రామ సంఘాలు ఆ నిధులతో అవసరమైన మెటీరియల్‌ను కొనుగోలు, రింగులు, ఇటుకల తయారీకి వినియోగించుకోవాలన్నారు. నాన్ ఓడీఎఫ్ గ్రామాల్లో వర్క్ ఆర్డర్ ఇచ్చి మరుగుదొడ్ల నిర్మాణాలు జరిగి ఉంటే వెంటనే బిల్లులను చెల్లించాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో జాబ్‌కార్డు కలిగిన వారికి పనులు కల్పించాలన్నారు. డ్వామా, డీఆర్డీఏ పీడీలు డా.సీహెచ్ పుల్లారెడ్డి, వై రామకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరిబాబుతో పాటు గ్రామైఖ్య సంఘాల సభ్యులు, ఏపీడీలు, ఏరియా కోఆర్డినేటర్లు, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈలు పాల్గొన్నారు. -
అన్ని మున్సిపాలిటీలు ఇక ఓడీఎఫ్
⇒ అక్టోబర్ 2న సీఎం ప్రకటన చేస్తారన్న మంత్రి నారాయణ ⇒ రాష్ట్రంలో 10 సాలీడ్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ విజయవాడ: రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలను అక్టోబర్ 2వ తేదీన ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ (ఓడీఎఫ్) ప్రాంతాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించనున్నారని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. క్వాలిటీ కంట్రోల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం రానున్న మూడు నెలల్లో అన్ని మునిసిపాలిటీలలో పర్యటించి పరిస్థితుల్ని అధ్యయనం చేసి సర్టిఫికెట్లు ఇస్తోందని చెప్పారు. ఈమేరకు ఆయా మునిసిపాలిటీల్లో బహిరంగ మలమూత్ర విసర్జన కట్టడికి చర్యలు చేపట్టినట్లు వివరించారు. విజయవాడ నగరపాలక సంస్థకు ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ సర్టిఫికెట్ ప్రదానం సందర్భంగా కౌన్సిల్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. భారతదేశంలోనే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీలో మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. 2019 నాటికి నూరుశాతం ఓడీఎఫ్ సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించగా మూడేళ్ళు ముందే మనం ఉన్నామన్నారు. సాలిడ్ వేస్ట్ ఎనర్జీ నిర్వహణకు రాష్ట్రంలో 10 ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 110 మునిసిపాలిటీల్లో రోజుకు 7,500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందని, ఎనర్జీ ప్లాంట్స్ ద్వారా 4,300 టన్నుల చెత్తను ఎనర్జీప్లాంట్స్ ద్వారా తగలబెట్టడం జరుగుతోందన్నారు. ఎనర్జీ ప్లాంట్స్‌కు 50 కి.మీ దూరంలో ఉన్న మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించనున్నట్లు పేర్కొన్నారు. క్వాలిటీ కంట్రోల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధి రాహుల్ ప్రతాప్ సింగ్, మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్, తదితరులు పాల్గొన్నారు. -
ఓడీఎఫ్ నియోజకవర్గంగా నందికొట్కూరు
– అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే ఐజయ్య కర్నూలు(అగ్రికల్చర్): బహిరంగ మల విసర్జనలేని( ఓడీఎఫ్) నియోజకవర్గంగా నందికొట్కూరును అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ఐజయ్య ప్రకటించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌ను కలిసి నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించారు. దత్తత తీసుకొని ఓడీఎఫ్ నియోజకవర్గంగా నందికొట్కూరును మార్చవచ్చుకదా అని కలెక్టర్ అనడంతో ఎమ్మెల్యే అందుకు అంగీకరించారు. రానున్న ఏడాదిలోపు నియోజకవర్గాన్ని ఆ మేరకు తీర్చిదిద్దుతానని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ... నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లోని ఎస్సీ కాలనీలు దయనీయంగా ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఉన్నా పట్టించుకోవడంలేదని తెలిపారు. అన్ని ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, కాల్వలు తక్షణం నిర్మించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. అధికారులు తమకు కమీషన్లు వచ్చే పనులు మాత్రమే చేస్తున్నారని, మిగిలిన పనులను పట్టించుకోవడం లేదని వివరించారు. పంచాయతీ రాజ్ అధికారులు, ఎన్ఆర్ఇజీఓస్ అధికారులు బీసీ కాలనీల్లో అభివద్ధి పనుల నిర్వహణపై ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారని తెలిపారు. దామగట్లతో పాటు వివిధ చెరువులను హంద్రీనీవా నీటితో నింపాలని కోరారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రవాసాంధ్రులతో వీడీయో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన చర్చాగోష్టి రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని అకట్టుకుందని తెలిపారు. -
మార్చి నాటికి మరుగుదొడ్ల నిర్మాణం
కలెక్టర్ ముత్యాలరాజు ఆత్మకూరురూరల్: మార్చి నాటికి జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు పిలుపునిచ్చారు. ఆత్మకూరులో బుధవారం నిర్వహించిన డివిజన్ స్థాయి ఆత్మగౌరవం సభలో కలెక్టర్ మాట్లాడారు. 5 నెలల కాలంలో 25 శాతం గ్రామాల్లో నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మిగిలిన 75 శాతం లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నాను. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యసిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యాధులతో ఒక్క మరణం సంభవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డితో కలిసి డివిజన్ పరిధిలో నూరుశాతం మరుగుదొడ్ల లక్ష్యాలను పూర్తి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీ రమణ, డ్వామా పీడీ హరిత, ఆత్మగౌరవం జిల్లా కోఆర్డినేటర్ సుస్మితారెడ్డి, ఆత్మకూరు ఎంపీపీ సిద్దం సుష్మ , ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
అందరి సహకారంతోనే ఘనత
కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు కావలిఅర్బన్: జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితంగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరమని కలెక్టర్ ఆర్ ముత్యాల రాజు పేర్కొన్నారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన ఆత్మగౌరవం సభలో కలెక్టర్ పాల్గొన్నారు. కావలి డివిజన్లో నూరు శాతం మరుగుదొడ్ల లక్ష్యాలను సాధించిన పంచాయతీలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాటికి జిల్లాలోని ఓడీఎఫ్ గ్రామాల్లో నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు. మరుగుదొడ్లపై ప్రజలను చైతన్యం చేసి లక్ష్యాలను సాధించాలని సూచించారు. నూరు శాతం మరుగుదొడ్లను పూర్తి చేసిన గ్రామాలను ఆదర్శంగా తీసుకుని జిల్లాను బహిరంగ మలవిసర్జన రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బీ రామిరెడ్డి, ఆర్‌డబ్లు్యఎస్ ఎస్ఈ ఆర్వీ కృష్ణారెడ్డి, ఆత్మగౌరవం కోఆర్డినేటర్ సుస్మితారెడ్డి, ఆర్డీఓ సీఎల్ నరసింహం, ఎంపీపీ పర్రి మహేశ్వరి, జెడ్పీటీసీ సభ్యులు పెంచలమ్మ, ఎంపీడీఓ ఎల్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాను ఓడీఎఫ్‌గా మారుద్దాం
కలెక్టర్ ముత్యాలరాజు నెల్లూరు(అర్బన్): మరుగుదొడ్లను 100శాతం నిర్మించి బహిరంగ మలవిసర్జన(ఓడీఎఫ్) జిల్లాగా నెల్లూరును మారుద్దామని కలెక్టర్ రేవు ముత్యాలరాజు పిలుపునిచ్చారు. స్థానిక దర్గామిట్టలోని కస్తూర్బా కళాక్షేత్రంలో 100శాతం మరుగుదొడ్లు నిర్మించిన 12 మండలాలకు చెందిన సర్పంచ్‌లు, అధికారులకు బుధవారం అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట వేయాలన్నారు. మంచి అలవాట్లు రావాలంటే æ చాలా కాలం పడుతుందన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించి మరుగుదొడ్లను నాసిరకంగా నిర్మిస్తే ప్రజలు మళ్లీ బహిరంగ మల విసర్జనకు అలవాటు పడుతారని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ ఒక్కరూ బహిరంగ మల విసర్జనకు పోకుండా కమిటీ సభ్యులు ప్రజలను నిత్యం చైతన్యవంతులు చేయాలన్నారు. ఆత్మగౌరవం పేరుతో మంచి అలవాట్లను అలవరుచుకునే విధంగా చూడాలన్నారు. మరుగుదొడ్లు నిర్మించడానికి సర్పంచ్‌లు, అ«ధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. ఆత్మగౌరవం జిల్లా కోఆర్డినేటర్ సుస్మిత మాట్లాడుతూ 100శాతం మరుగుదొడ్లు నిర్మించిన గ్రామ సర్పంచ్ల అనుభవాలను పంచుకోవడంతో పాటు వారిని సన్మానించేందుకు ఈ సభ ఏర్పాటు చేశామన్నారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం వల్ల కలిగే లాభాలు గురించి తెలిపారు. సభ్యుల అపోహాలను నివృత్తి చేశారు. అనంతరం 100శాతం మరుగుదొడ్లు నిర్మించిన గ్రామాల సర్పంచ్‌లకు కలెక్టర్ ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ పర్యవేక్షక ఇంజనీరు రామిరెడ్డి, టాస్క్ ఫోర్సు అధికారులు పాల్గొన్నారు. -
ఓడీఎఫ్‌గా జిల్లాను మార్చాలి
కలెక్టర్ జానకి ముత్తుకూరు: 2017 మార్చి నాటికి నెల్లూరును బహిరంగ మల విసర్జన రహిత(ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ) జిల్లాగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కలెక్టర్ ఎం.జానకి అన్నారు. ఆత్మగౌరవంలో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లకు రెండు రోజుల పాటు పోర్టులోని ఓ హోటల్లో నిర్వహించిన వర్క్‌షాపు ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా జేసీ ఇంతియాజ్‌తో కలసి కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని కష్ణ, తూర్పుగోదావరి, విజయనగరం, నెల్లూరు జిల్లాలను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాలుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 102 పంచాయతీలను ఓడీఎఫ్‌గా ప్రకటించామన్నారు. మిగిలిన 839 పంచాయతీల్లో డిసెంబరు నెలాఖరుకు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. ప్రతి బుధవారం మండల స్థాయి అధికారులు గ్రామాల్లో బస చేసి, మరుగుదొడ్ల నిర్మాణంపై అవగాహన కలిగిస్తున్నారన్నారు. దీని వల్ల అధికారులపై ఒత్తిగి పెరిగిందన్నారు. ఇందుకోసం రెసిడెన్షియల్ ప్రోగ్రాం ద్వారా పోర్టులో శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గించేందుకు యోగా, ధాన్యం కూడా చేయించామన్నారు. ఓడీఎఫ్ పూర్తయిన పంచాయతీల్లో గ్రీన్ చానల్ ద్వారా 48 గంటలల్లో మరుగుదొడ్లకు బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. కష్ణపట్నంపోర్టు, టీపీసీఐఎల్, ఏపీజెన్కో, మీనాక్షి పవర్ ప్రాజెక్టులు, బొల్లినేని ఆసుపత్రి యాజమాన్యం సైతం గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు ముందుకు వచ్చాయన్నారు. కష్ణపట్నంపోర్టు సహకారంతో శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. పోర్లు నిర్వాహకులు ప్రీకాస్ట్ మరుగుదొడ్ల నిర్మాణంపై కసరత్తు చేస్తున్నారన్నారు. జిల్లాను ఓడీఎఫ్‌గా రూపొందించే విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా భాగస్వామ్యం వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పోర్టు ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. కార్యక్రమానికి సహకరించిన వారికి జ్ఞాపికలు అందజేశారు.