మానవ వనరులు అపారం | Human resources are unlimited | Sakshi
Sakshi News home page

మానవ వనరులు అపారం

Published Mon, Aug 28 2017 1:49 AM | Last Updated on Sun, Sep 17 2017 6:01 PM

మానవ వనరులు అపారం

మానవ వనరులు అపారం

సమర్థంగా వినియోగించుకుంటాం
- కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ
పటాన్‌చెరు బీడీఎల్‌లో 5 మెగావాట్ల పవర్‌ ప్లాంట్‌ ప్రారంభం
ఎల్‌ఆర్‌ సామ్‌ క్షిపణి ఇండియన్‌ నేవీకి అప్పగింత
 
సాక్షి, హైదరాబాద్‌: ‘దేశంలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. విదేశాల్లోనూ సత్తాచాటుతున్నవారు ఎంతో మంది ఉన్నారు. ఈ వనరులను దేశాభివృద్ధికి సమర్థంగా వినియోగించుకుంటాం’ అని కేంద్ర రక్షణ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యానించారు. కంచన్‌బాగ్‌లోని బీడీఎల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆదివారం మంత్రి పాల్గొన్నారు. బీడీఎల్, మిథాని రూపొందించిన అధునాతన క్షిపణి (ఎల్‌ఆర్‌ సామ్‌)ను ఇండియన్‌ నేవీకి అప్పగించారు. అలాగే యుద్ధ ట్యాంకర్‌ను రక్షణ శాఖకు అంకితమిచ్చారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ.. ‘సాంకేతిక పరిజ్ఞానంలో మనం దూసుకుపోతున్నాం. పరిశోధనల్లోనూ అదే వేగాన్ని కొనసాగిస్తున్నాం. ఈ రంగాల్లో అపార అవకాశాలున్నాయి. వీటిని యువత సద్వినియోగం చేసుకోవాలి’ అని పిలుపునిచ్చారు.

జనాభా పరంగా పెద్ద దేశాల్లో భారత్‌ ఒకటని.. ఇక్కడ మధ్య, పేద తరగతి వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్నారని, ప్రతి పౌరుడికీ నాణ్యమైన విద్య అందాల్సిన అవసరముందన్నారు. భారత్‌లో సాంకేతిక పరిజ్ఞానానికి కొదవ లేదని, ఇక్కడి ఇంజనీర్లు విదేశాల్లోనూ రికార్డులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. రక్షణ శాఖలో టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగిస్తామని చెప్పారు. బీడీఎల్, మిథాని సేవలు రక్షణ రంగానికి తలమానికంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో రక్షణ శాఖ కార్యదర్శి ఏకే గుప్తా, రక్షణ మంత్రి సలహాదారు జి.సతీశ్‌రెడ్డి బీడీఎల్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉదయ్‌భాస్కర్, డీఆర్‌డీవో చైర్మన్‌ ఎస్‌.క్రిస్టొఫర్, నేవీ వైస్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.  
 
ఓడీఎఫ్‌ను సందర్శించిన జైట్లీ 
సంగారెడ్డి రూరల్‌: సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఎద్దుమైలారం (ఓడీఎఫ్‌) ఆయుధ కర్మాగారాన్ని జైట్లీ సందర్శించారు. అక్కడ అరగంట పాటు గడిపిన మంత్రి.. కర్మాగారంలో తయారవుతున్న యుద్ధ ట్యాంకులను పరిశీలించినట్లు సమాచారం. రక్షణ మంత్రి పర్యటన సందర్భంగా సమాచార సేకరణకు వెళ్లిన మీడియాను ఓడీఎఫ్‌ అధికారులు అనుమతించలేదు. ప్రొటోకాల్‌ ప్రకారం తమను ఓడీఎఫ్‌లోకి అనుమతించాలంటూ మెయిన్‌గేట్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి ఎద్దుమైలారం గ్రామ సర్పంచ్‌ దశరథ్‌ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఓడీఎఫ్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ ఆల్‌ ఇండియా ఓడీఎఫ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మెయిన్‌ సర్కిల్‌ వద్ద కార్మికులు నిరసనకు దిగారు. ఓడీఎఫ్‌ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ ఇంద్రకరణ్, క్యాసారం, ఎద్దుమైలారం, సింగపురం నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. మంత్రిని కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో మెయిన్‌ సర్కిల్‌ వద్ద నిరసనకు దిగారు.  
 
ఇబ్రహీంపట్నం యూనిట్‌లో స్టాటిక్‌ టెస్ట్‌ ప్రారంభం   
ఇబ్రహీంపట్నం రూరల్‌: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ బీడీఎల్‌లో జైట్లీ పర్యటించారు. భారత్‌ డైనమిక్‌ లిమిటెడ్‌ ఇబ్రహీంపట్నం యూనిట్‌లో స్టాటిక్‌ టెస్ట్‌ (జీవాత్మక)ను ప్రారంభించారు. రెండో దశ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. బీడీఎల్‌ ఏర్పాటు చేసిన సైట్‌ లే అవుట్‌ మ్యాప్‌లను అధికారులతో కలసి తిలకించారు. ఇప్పటికే నిర్మాణం చేపట్టిన భవన నిర్మాణాలను పరిశీలించారు.  
 
భానూరులో 15 క్షిపణులు తయారీ.. 
పటాన్‌చెరు టౌన్‌: పటాన్‌చెరు మండల పరిధిలోని బీడీఎల్‌ పరిశ్రమను ఆదివారం జైట్లీ సందర్శించారు. పరిశ్రమలో రక్షణమంత్రి అస్త్ర క్షిపణుల తయారీ ప్రాజెక్టు కార్యాలయాన్ని, కొత్తగా ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు.  10 నుంచి 15 క్షిపణులు భానూరు యూనిట్లో తయారు చేస్తారని, భవిష్యత్తులో 50 క్షిపణులను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రక్షణ రంగంలో దేశాన్ని బలోపేతం చేస్తున్నట్లు వివరించారు. 
 
చింతపండుపై పన్ను మినహాయించండి..జైట్లీని కోరిన దత్తాత్రేయ 
రాష్ట్ర పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న మంత్రి జైట్లీని ఆదివారం సాయంత్రం శంషాబాద్‌ విమానాశ్రయంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కలిశారు. చింతపండుపై గతంలో పన్ను లేదని, జీఎస్టీ అమలుతో ప్రస్తుతం 12 శాతం పన్ను విధిస్తున్నారని, దీంతో వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని జైట్లీకి దత్తాత్రేయ వివరించారు. అలాగే మిర్చి, పత్తి, పసుపు వంటి వాణిజ్య పంటల విషయంలోనూ జీఎస్టీలో ఇబ్బందులొస్తున్నాయని, త్వరగా వీటిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement