ఓడీఎఫ్ జిల్లాగా తీర్చిదిద్దుదాం
ఓడీఎఫ్ జిల్లాగా తీర్చిదిద్దుదాం
Published Thu, Nov 3 2016 10:45 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
– జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్
కర్నూలు(అర్బన్): కర్నూలును బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్) జిల్లాగా తీర్చిదిద్దుదామని, ఇందులో గ్రామైక్య సంఘాలు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు, బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో పోషించాల్సిన పాత్ర, ఆదాయ పెంపు మార్గాలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సంఘాలు రూరల్ శానిటరీ మార్టుగా మారాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కలెక్టర్ అన్నారు. డీఆర్‌డీఏ కార్యక్రమాల్లో భాగంగా 17 మండలాలకు చెందిన 92 గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇందుకు మండల అధికారులు, ఏపీడీ, ఏరియా కోఆర్డినేటర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈలతో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలకు పెట్టుబడి నిధి కింద రూ.5 లక్షలు మంజూరు చేస్తామని, గ్రామ సంఘాలు ఆ నిధులతో అవసరమైన మెటీరియల్‌ను కొనుగోలు, రింగులు, ఇటుకల తయారీకి వినియోగించుకోవాలన్నారు. నాన్ ఓడీఎఫ్ గ్రామాల్లో వర్క్ ఆర్డర్ ఇచ్చి మరుగుదొడ్ల నిర్మాణాలు జరిగి ఉంటే వెంటనే బిల్లులను చెల్లించాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో జాబ్‌కార్డు కలిగిన వారికి పనులు కల్పించాలన్నారు. డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు డా.సీహెచ్ పుల్లారెడ్డి, వై రామకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ హరిబాబుతో పాటు గ్రామైఖ్య సంఘాల సభ్యులు, ఏపీడీలు, ఏరియా కోఆర్డినేటర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈలు పాల్గొన్నారు.
Advertisement