open toilet
-
మూత్రం పోశాడని దాడి.. మృతి
నిజాంసాగర్(జుక్కల్): బహిరంగ మూత్ర విసర్జన చేసిన ఓ వ్యక్తిపై దుకాణదారుడు దాడి చేశాడు. దీంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. జుక్కల్ మండల కేంద్రంలో నాల్గు రోజుల కింద జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జుక్కల్ మండలం సావర్గావ్ తండాకు చెందిన ఫవర్ గణపతి(48) అనే వ్యక్తి గురువారం వారాంతపు సంతకు వచ్చాడు. సంతలో కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్లడానికి జుక్కల్ బస్టాండ్‌కు చేరుకున్నారు. ఆటోలు, జీపులు లేక గంటపాటు బస్టాండ్ పరిసరాల్లో నిరీక్షించారు. అదే సమయంలో గణపతికి మూత్రం రావడంతో రోడ్డు పక్కనే ఉన్న దుకాణ సముదాయాల ఆవరణలో మూత్ర విసర్జన చేశాడు. దుకాణం పక్కన మూత్ర విసర్జన చేస్తావంటూ గోపాల్ సేట్ సదరు వ్యక్తిపై దాడి చేశాడు. బలంగా దాడి చేయడంతో గణపతి దుకాణ గోడకు తగిలి కింద కుప్పకూలాడు. స్థానికులు గమనించి గణపతిని చికిత్స కోసం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ గణపతి మృతిచెందాడు. గణపతి కుటుంబీకులతో కలిసి సావర్‌గావ్‌తండా ప్రజలు గోపాల్ సేట్ మెడికల్ వద్ద బైఠాయించారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో అవాంచనీయ సంఘటనలు జరుగకుండా బాన్సువాడ డీఎస్పీ దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. డీఎస్పీ హామీతో సమస్య జఠి లం కాకుండా సద్దు మణిగింది. మృతుడికి భా ర్య, నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జుక్కల్ ఎస్ఐ రఫీయోద్దిన్ తెలిపారు. -
అద్దం ఆలోచన అదుర్స్
బెంగళూరు, (కర్ణాటక): ఉద్యాన నగరిని స్వచ్ఛ నగరిగా మార్చేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితాలు కనిపించడం లేదు. నగర వాసులు ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తుండటంతో వాటిని అడ్డుకోవడానికి పాలికె వినూత్న ఆలోచన చేపట్టింది. బెంగళూరు నగరంలో ఫుట్‌పాత్‌లు, రోడ్లపై నగర వాసులు ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తుండటంతో స్వచ్ఛతను కాపాడటానికి పాలికె ఫుట్‌పాత్ ప్రాంతాల్లో భారీ అద్దాలను (మిర్రర్) అమర్చింది. మూత్ర విసర్జన సమయంలో అద్దంలో కనబడుతుంటే సిగ్గుతోనైనా బహిరంగ మూత్ర విసర్జన మానుకుంటారని ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో నగరంలో బీబీఎంపీ పలు చోట్ల భారీ సైజులో ఉన్న అద్దాలను అమర్చడానికి యత్నిస్తోంది. తాజాగా చర్చ్‌స్ట్రీట్, ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద భారీ అద్దాలను అమర్చింది. నగరంలో పలు చోట్ల మరుగుదొడ్లు అమర్చినప్పటికి బహిరంగ మూత్ర విసర్జన అడ్డుకోవడం సాధ్యం కాలేదు. దీంతో బీబీఎంపీ గోడలకు భారీ అద్దాలను అమర్చి బహిరంగ మూత్ర విసర్జన అడ్డుకోవడానికి వినూత్న పథకంతో ప్రజల్లో మార్పు వస్తుందేమో వేచి చూడాలి. -
పొరపాటున బయట పోస్తే వంద పడుద్ది!
సాక్షి, సిటీబ్యూరో: సిటీజనులూ..తస్మాత్ జాగ్రత్త. నగరంలో ఎక్కడైనా పొరపాటున బహిరంగ మూత్ర విసర్జనకు పాల్పడ్డారా రూ.100 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే రూ.1000, రోడ్లపై పెద్దమొత్తంలో చెత్త వేస్తే రూ. రెండు వేలు, చెత్తకుండీల్లో బదులు చెత్తకుండీ పక్కన చెత్తవేస్తే రూ.100, నిర్మాణ వ్యర్థాలను బహిరంగంగా రోడ్లపై వేస్తే రూ.10 వేలు, నాలాల్లో వ్యర్థాలు, చెత్త వేస్తే రూ. 10 వేలు చెల్లించాల్సి రావచ్చు. స్వచ్ఛ కార్యక్రమాల అమలులో భాగంగా నిబంధనలు ఉల్లంఘించేవారికి పై జరిమానాలు ఎప్పటినుంచో ఉన్నప్పటికీ అమలు చేయడం లేదు. వచ్చేనెల4వ తేదీనుంచి నెలాఖరువరకు స్వచ్ఛసర్వేక్షన్– 2019 ర్యాంకుల్ని ప్రకటించేందుకు స్వచ్ఛ భారత్మిషన్ ప్రతినిధుల బృందం నగరంలో పర్యటించనున్నందున ర్యాంకింగ్ కోసం జీహెచ్ఎంసీ ఈ జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఎన్ని కార్యక్రమాలు చేసినా.. జీహెచ్ఎంసీలో బహిరంగ మూత్రవిసర్జన నివారణకు జీహెచ్ఎంసీ ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అన్ని సర్కిళ్లలోనూ బహిరంగ మల, మూత్ర విసర్జన ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పించింది. సదరు ప్రాంతాలను తిరిగి పాడుచేయకుండా ఉండేందుకు అక్కడ అందమైన ముగ్గులు, పెయింటింగ్‌లు వేయించడం, మొక్కలు పెంచ డం వంటి కార్యక్రమాలు చేపట్టింది. ప్రత్యేకంగా స్వచ్ఛ వాలంటీర్లను నియమించింది. పెట్రోల్ బంక్‌లు, హోటళ్లలోని టాయ్లెట్లను ప్రజలు వినియోగించుకునేందుకు నిర్వాహకులను ఒప్పించింది. అయినప్పటికీ ఇంకా బహిరంగ మూత్ర విసర్జన తరచూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతినిధుల బృందం రానుండటంతో బహిరంగ మూత్ర విసర్జనచేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. 28 ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు.. ఇందులో భాగంగా నగరంలో 28 ప్రాంతాలను అత్యంత సమస్యాత్మక బహిరంగ మూత్ర విసర్జన కేంద్రాలుగా జీహెచ్ఎంసీ గుర్తించింది. ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది. ఇందుకుగాను ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం, స్వచ్ఛ కార్యకర్తలను నియమించి బహిరంగ మూత్ర విసర్జనను నివారించడంతో పాటు యూరినల్ టాయ్లెట్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. అయినప్పటికీ బాధ్యతారహితంగా వ్యవహరించి బహిరంగ మూత్రవిసర్జన చేసినవారిని గుర్తించి పెద్ద ఎత్తున జరిమానాలు విధించాలని క్షేత్రస్థాయి అధికారులకు కూడా సూచించారు. -
మరుగు కరువు!
రాయచోటి: బహిరంగ మల మూత్ర విసర్జన లేకుండా చేయడానికి అటు ప్రభుత్వం, ఇటు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఏ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఆ సంకల్పం రాయచోటి పట్టణంలో అభాసుపాలవుతోంది. 2005లో పంచాయతీ స్థాయి నుంచి పురపాలక సంఘంగా మార్పు చెందింది. ఈ పట్టణాన్ని 2012లో జాతీయస్థాయిలో మురికివాడలు లేని పురపాలికగా ఎంపిక చేశారు. ఈ విషయం చెప్పుకోవడానికి బాగున్నా పట్టణంలో మల, మూత్ర విసర్జన చేసుకోవడానికి ఒక్క మరుగుదొడ్డి లేదంటే అతిశయోక్తి కాదు. పేరుకు బస్టాండు సమీపంలోని గాలివీడు మార్గంలో ఒక చోట ఉన్నా సిబ్బంది చేతివాటం కారణంగా వాటిని వేరే అవసరాలకు ఉపయోగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో అక్కడ మరుగుదొడ్లు ఉన్నా అవి ఎవ్వరికి కనిపించ వు కాబట్టి లేనేట్లే . అవసరాల రీత్యా నిత్యం పరిసర మండలాలు, గ్రామా ల నుంచి వేల సంఖ్యలో ప్రజలు రాయచోటి పట్టణానికి వచ్చి వెళుతుంటా రు. పట్టణ జనాభా లక్షకు పైమాటే. రెండు గంటల పాటు గడిపే సినిమా హాళ్లల్లో మరుగుదొడ్లు ఉంటాయి. ప్రతి పనికి, వస్తువుకు ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్న మున్సిపాలిటీలో మాత్రం మరుగుదొడ్లను ఏర్పాటు చేయకపోవడం దారుణం. ప్రజలు తమ ఇంట్లో మరుగుదొడ్డి కట్టకపోతే ఇంటి ముందు ధర్నా చేస్తామనే జిల్లా అధికారులకు ఈ వ్యవహారం కనపడలేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేయలేని ఈ పనిని ఎక్కడబడితే అక్కడ కానిచ్చేస్తున్నా రు. ముఖ్యంగా మహిళ పరిస్థితి వర్ణణా తీతం. వస్తువుల కొనుగోళ్లు, విక్రయాల కోసం వచ్చే మహిళలకు మరుగుదొడ్లు కని పించవు. కొన్ని సమయాల్లో మహిళలు తట్టుకోలేక చిన్నపాటి సందు, గొందులను ఆసరాగా చేసుకుని బహిరంగంగా ఉపయోగించుకుంటూ తమ ఆత్మాభిమానాన్ని చంపుకుంటున్నారు. పురుషులైతే పట్టణ పరిధిలో ఉన్న చిన్నపాటి చాటు కనిపించినా బహిరంగ మూత్ర విసర్జనను చేస్తుంటారు. దీంతో పట్టణంలోని రద్దీ ప్రాంతాలైన ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణం, జూనియర్ కళాశాల, డైట్ ప్రాంగణం, నేతాజీ సర్కిల్, గున్నికుంట్ల రోడ్డు, రవి థియేటర్, ఠాణా, మార్కెట్, గాంధీ బజారు లాంటి చాలా ప్రాంతాల్లో బహిరంగ మూత్ర విసర్జన కారణంగా ఆ ప్రాంతాలన్నీ అత్యంత దుర్గంధ భరితంగా తయారవుతున్నాయి. వీటి వల న అనేక వ్యాధుల వ్యాప్తికి బహిరంగ మూ త్ర విసర్జనే కారణమవుతోంది. ఇలాగే కొనసాగితే రాయచోటి మొత్తం మురికివాడగా తయారయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి బహిరంగ మలమూత్ర విసర్జన లేని పట్టణంగా తయారు చేయడానికి అవసరమైన మరుగుదొడ్లను నిర్మించాల్సిన అవసరం ఉంది. వ్యాధులతో భయమేస్తోంది రద్దీ ప్రదేశంలో సినిమా థియేటర్ ఉంది. ప్రతిరోజు వందల సంఖ్యలో మూత్ర విసర్జనకు లోనికి వచ్చేస్తున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా తయారవడంతో పాటు అనేక వ్యాధులు సైతం వ్యాపిస్తున్నాయి. వీరిని వారించడం సిబ్బందికి తలనొప్పిగా మారింది. అయినా మానవతా దృక్పథంతో దీనిని భరించాల్సి వస్తోంది. అధికారులు స్పందించి ప్రజలకు ఉపయోగపడేలా మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి బాగుంటుంది. –జి.కలీమ్, సోనిరాజ్ థియేటర్ యజమాని నిర్మాణానికి నిధులున్నా నిర్మించలేకపోతున్నాం పట్టణంలో మరుగుదొడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమే. మరుగుదొడ్ల నిర్మాణానికి ఏడాది కింద ట నిధులు మంజూరయ్యాయి. ని ర్మించడంలో ఆలస్యం చోటు చేసుకొంటోంది. త్వరలోనే ఠాణా, గాం« దీ బజారులలో నిర్మించే ప్రయత్నాలు చేస్తాం. గాలివీడు మార్గంలో ఉన్న మరుగుదొడ్డిని వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటాం.–ప్రసాద్‌రాజు, కమిషనర్ -
ఓడీఎఫ్ జిల్లాగా తీర్చిదిద్దుదాం
– జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కర్నూలు(అర్బన్): కర్నూలును బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్) జిల్లాగా తీర్చిదిద్దుదామని, ఇందులో గ్రామైక్య సంఘాలు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు, బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో పోషించాల్సిన పాత్ర, ఆదాయ పెంపు మార్గాలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సంఘాలు రూరల్ శానిటరీ మార్టుగా మారాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కలెక్టర్ అన్నారు. డీఆర్డీఏ కార్యక్రమాల్లో భాగంగా 17 మండలాలకు చెందిన 92 గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇందుకు మండల అధికారులు, ఏపీడీ, ఏరియా కోఆర్డినేటర్లు, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈలతో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలకు పెట్టుబడి నిధి కింద రూ.5 లక్షలు మంజూరు చేస్తామని, గ్రామ సంఘాలు ఆ నిధులతో అవసరమైన మెటీరియల్‌ను కొనుగోలు, రింగులు, ఇటుకల తయారీకి వినియోగించుకోవాలన్నారు. నాన్ ఓడీఎఫ్ గ్రామాల్లో వర్క్ ఆర్డర్ ఇచ్చి మరుగుదొడ్ల నిర్మాణాలు జరిగి ఉంటే వెంటనే బిల్లులను చెల్లించాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో జాబ్‌కార్డు కలిగిన వారికి పనులు కల్పించాలన్నారు. డ్వామా, డీఆర్డీఏ పీడీలు డా.సీహెచ్ పుల్లారెడ్డి, వై రామకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరిబాబుతో పాటు గ్రామైఖ్య సంఘాల సభ్యులు, ఏపీడీలు, ఏరియా కోఆర్డినేటర్లు, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈలు పాల్గొన్నారు.